నూరేళ్ళనాటి  భారతి  తొలి సంచిక / Sunday Special
x

నూరేళ్ళనాటి 'భారతి' తొలి సంచిక / Sunday Special

గత శతాబ్ది తెలుగువారి సాహిత్య సాంస్కృతిక కళా పరిశోధనా రంగాల వైజ్ఞానిక ప్రతిభా విశేషాలకు ప్రతీక భారతి మాస పత్రిక. తొలి సంచిక 1924 జనవరిలో వెలువడింది. పరిచయం


(కె. శరచ్చంద్ర జ్యోతిశ్రీ)


"తెలుగు నుడికారంపు సొంపును
తెలుగు కైతల తియ్య(దనము
తెలుగు పలుకుల కలికిపెంపును
తెలిసి పాడవె భారతీ!

తెనుగు బాసకు తొలకరింపగ
తెనుగు రచనలు పల్లవింపగ
తెనుగు మనములు పులకరింపగ
మొనసి పాడవె భారతీ!

నవరసంబులు పొంగి పొరలగ
నవ్యభావము లుల్లసిల్లగ
నవనవోన్మేషము చెలంగగ
తవిలి పాడవె భారతీ!" (మంగిపూడి వేంకటశర్మ)
అంటూ నూరేళ్ళనాడు వెలువడింది ఒక పత్రిక.
భావదాస్య బంధనాలను తెంచుకొని దేశ దాస్య విముక్తిని కాంక్షిస్తూ తెలుగు వైతాళిక గీతం పాడింది. అది నాటి తెలుగు సాహితీ ప్రియుల, సాహితీవేత్తల అభిమాన పుత్రిక. భారతి మాస పత్రిక. గత శతాబ్ది తెలుగువారి సాహిత్య సాంస్కృతిక కళా పరిశోధనా రంగాల వైజ్ఞానిక ప్రతిభా విశేషాలకు ప్రతీక. అనేకానేక భావజాలాల సమరాంగణం భారతి పత్రిక.
అది నేడు చెన్నైగా వ్యవహారంలో ఉన్న నాటి చెన్న పట్నం. 1924 జనవరి నెల (రుధిరోద్గారి నామ సంవత్సరం, పుష్యమాసం) సంచికగా 1923 డిసెంబరు 26వ తేదీన వెలువడింది. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, గాంధేయవాది, ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు, 'దేశోద్ధారక ' అని గాంధీజీ నుండి గౌరవం పొందిన కాశీనాథుని నాగేశ్వరరావు (1867-1938) భారతి మాస పత్రికను తీసుకువచ్చారు. సంపాదకులుగా కాశీనాథుని నాగేశ్వరరావు, అనంతరం నాగేశ్వరరావు అల్లుడు శివలెంక శంభుప్రసాద్, ఆ తర్వాత వారి కుమారుడు శివలెంక రాధాకృష్ణ భారతిని 1991 మార్చి వరకు తీసుకువచ్చారు. గన్నవరపు సుబ్బరామయ్య, తిరుమల రామచంద్ర, విద్వాన్ విశ్వం మరెందరో మహామహులు ఇన్చార్జి ఎడిటర్లుగా పనిచేశారు.
భారతి ప్రారంభ సంచిక 187 పేజీలతో వెలువడింది. ఈ సంచిక మంగిపూడి వేంకటేశ్వర శర్మ రచించిన
"నిరుపమ కల్యాణగుణా
భరణా జనకాభయోగి వందిత చరణా
పురుషార్థభరిత చరితా
కరుణామృతపూరితాత్మ గాంధి మహాత్మా"
అంటూ - గాంధి శతకంతో ప్రారంభమై నండూరి వేంకట సుబ్బారావుగారి
"యెంకీ నాతోటీ రాయే!
‌‌ మన
యెంకటేశరుణ్ణి యెల్లీ సూసొద్దాము
యెంకీ నాతోటీ రాయే!
అనే "తిరుపతి యాత్ర" ఎంకిపాటతో ముగుస్తుంది.
"ప్రతి చాంద్రమాసాదిన ప్రచురింపబడు" అంటూ ఈ పత్రికలో... పత్రికా నిర్వాహకులు చేసిన విన్నపంలో... "తామ్ర శిలా శాసనములును ఇతర శాసనములును,... ఆంధ్రదేశమునగల శిల్పములకును, స్థూపములకును సంబంధించిన వ్యాసములు సచిత్రములుగా బ్రచురింప బడును. ...వాఙ్మయమునకు సంబంధించిన విషయములు యథోచితముగ బ్రచురింపబడును. వాఙ్మయమునకు సంబంధించిన విమర్శనములు, పాటలు, పద్యములు, కథలు, నవలలు, నాటకములు మొదలగువానికి సంబంధించిన వ్యాసము లిందు బ్రకటింపబడును. కథలను చిన్నకథలను నాటకములను వ్రాసి పంపెడువారు వీలైనయెడల జిత్రసహితముగను బంప ప్రార్థితులు." అని కోరారు.
అంతేగాదు, సంపాదకీయం "స్వవిషయం" లో తమ అసలు లక్ష్యాన్ని భావగర్భితంగా వివరించారు.
"కాటుకకంటి నీరు చనుకట్టుపయిం
బడ నేల యేడ్చె?దో
కైటభ దైత్యమర్దనుని గా(దిలికోడల!
యోమదంబ! యో
హాటకగర్భురాణి! నిను నా(కటికిం
గొనిపోయి యల్ల క
ర్ణాటకిరాటకీచకుల కమ్మ ద్రిశుద్ధిగ నమ్ము భారతీ!"
అని మొదలుపెట్టి భారతదేశ పరాధీనతను ప్రస్థావిస్తూ మేధావుల బాధ్యతను వివరిస్తారు. ఆబాధ్యతను భారతి పత్రిక స్వీకరిస్తుందని సారస్వత కళా పరిశోధన రంగాల్లో కృషిచేస్తున్న మేధావులు తమతోడ్పాటును అందివ్వాలని సవినయంగా అభ్యర్థించారు. తమ లక్ష్యాన్ని ఇదిగో ఇలా చెప్పారు.
"పూర్ణ స్వాతంత్ర్యమును గలిగి స్వాధీన భారతి నారాధింపగలిగిననూ కృతివిక్రయభావము పోతరాజుకు సంతాపము గలుగజేసినపుడు <సకల విధములను స్వాతంత్ర్యమును కోల్పోయి ఇపుడు పరాధీనస్థితి యందున్న భారతిని గనుగొనునపుడు గలుగగల సంతాపమునకు మితిమేరలుగలవా?... ...
భారతి దీనదశ ననుభవించు చున్నది. అంగములు శుష్కించినవి. కాంతికళలు పోయినవి. విషమస్థితి గలిగినది. ఈ మహోపద్రవమునందు మునిగితేలుచున్న భారతి నుద్ధరించి శుభస్థితిని గల్పింప వలయు నను సంకల్పము భారత హృదయము నందు గలిగినది. సేవాపరాయణులు పలువిధముల నీ దేవి నారాధించుచూ దివ్యరూప సందర్శనమును జేయగోరుచున్నారు. ఆరాధనా భిలాష యితర రాష్ట్రములందు వలె ఆంధ్రరాష్ట్ర మందును గలదు. ఆ అభిలాషను సఫలము చేయుటకు పత్రికలను ప్రారంభించుచున్నారు. గ్రంథములు వ్రాయుచున్నారు. చిత్తరువులను చిత్రించుచున్నారు. పాటలు బాడుచున్నారు. ఈ ప్రయత్నము లన్నియును భారతిని బ్రత్యక్షము చేయుచు నాత్మవికాసమునకు సాధనంబు లగుచున్నవి. ... ... ఆంధ్రవ్యక్తి పరిణామ మును నిరూపించుట కపారమైన విషయావ గాహనమును జేయుట కాంధ్రలోకము పూనుకొన వలసియు న్నది. ... ... పరిశోధకమండలులు పత్రికలు సాహిత్య సంఘములు చిత్రకళా సంఘ ములు విద్యాలయ ములు విషయసాగర మథనముజేయుచు ఫలప్రాప్తికి సాధనములను విశదము చేయుచున్నవి. ... ...భారతి యందు భాష వాఙ్మయము శాస్త్రములు కళలు మొదలగు విషయములు సాదర భావముతో జర్చించుట కవకాశములు కల్పింపబడును. వాఙ్మయ నిర్మాణమునకు ఇప్పుడు జరుగుచున్న ప్రయత్న ములు పరిస్ఫుటము చేయబడును. శిల్పమునకు చిత్రలేఖనమునకు శాసనములకు సంబంధించిన విషయములు చిత్రములతో సహా ప్రచురింపబడును.
అందుకు తగ్గట్టుగానే ఆ ప్రథమ సంచికలో...
వేటూరి ప్రభాకరశాస్త్రిగారి శివకవులు, వేంకటపార్వతీశ్వర కవుల రవీంద్రుడు - విశ్వభారతి, దేవులపల్లి అప్పల నరసింహం గారి ఆంధ్ర వాఙ్మయమున ఆంగ్ల సారస్వత ప్రభావము, చరిత్ర పరిశోధకులు చిలుకూరి వీరభద్రరావుగారి ప్రాచీనాంధ్రులెవరు? ఆర్యులుకారా?, దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి...
"హృదయముగలంచి, విదలించి, యేర్చి, వెడలు
సాంద్రశోణిత బిందు వర్షమ్ము సుమ్ము!
తావకీనపదసరోజ దళములందు
నిలువని మ్మొక్క వేడి కన్నీటి చుక్క!
కడల( బ్రసరించు నెత్తావి కమ్మదనము(
ద్రావనిమ్మో ప్రభూ, దాని( దనివితీర!"
కన్నీరు కవిత, సౌదామినివారి ప్రణయినీ గీతములు, ప్రసిద్ధ సాహితీవేత్త కురుగంటి సీతారామయ్యగారి వాఙ్మయ సామ్యము, నోరి నరసింహశాస్త్రిగారి జన్మసాఫల్యం, చిలకమర్తి వారి భారవి, ఉమర్ అలీషా కవిగారి ఖురాన్, అండ్ర శేషగిరిరావుగారి పారిజాతా పహరణము - పాత్రపోషణము, కొమర్రాజు లక్ష్మణరావుగారి గణగ విజయాదిత్యుని సాతలూరు శాసనము, బసవరాజు అప్పారావుగారి తాజ్ మహల్, ప్రఖ్యాత చరిత్రకారులు మల్లంపల్లి సోమశేఖరశర్మగారి ప్రణయలీల, కాశీనాథుని నాగేశ్వరరావుగారి కాకినాడపురము, శతావధాని వేలూరి శివరామశాస్త్రిగారి ప్రణణీతము - (టాల్ స్టాయ్ కథ)అనువాదము తదితర రచనలు, మహాత్మా గాంధి, మరికొన్ని వర్ణచిత్రాలు, పముఖ సాహితీవేత్తలు కీ.శే. చెలికాని లచ్చారావు, కీ.శే. వంగూరి సుబ్బారావుస్మృతి గీతాలు వారి చాయాచిత్రాలను ప్రచురించారు. అనంతకాలంలోనూ అదే ఒరవడిని కొనసాగించారు.
కాశీనాధుని నాగేశ్వరరావుగారు తన పత్రికలద్వారా చేసిన కృషిని ప్రసిద్ధ సాహిత్య చరిత్రకారులు ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం 4వ సంపుటిలో ప్రస్తావిస్తూ..."కొన్ని వందలమంది ప్రముఖుల రచనలు ఆంధ్రదేశానికి ఆయన తన పత్రికలద్వారా సమర్పించారు. గురజాడ, గిడుగు, కొమర్రాజు, చిలకమర్తి, పానుగంటి మొదలైన కాకలు తీరిన జ్ఞానవృద్ధుల రచనలు మొదలుకొని శ్రీశ్రీ, కొడవటిగంటి లాంటి కొమ్ములుతిరుగుతున్న కోడెరచయితల చెంగనాల దాకా మూడుతరాల సృజనాత్మక నిర్మాణాలు పంతులుగారు స్థాపించిన పత్రికలవల్లనే అశేష ప్రజానీకానికి అందుబాటులోకి వచ్చాయి. ... ... నండూరి, బసవరాజు, బాపిరాజు, కృష్ణశాస్త్రి, విశ్వనాథ, నాయని, కొడాలి, రాయప్రోలు, జాషువా, నోరి, వేదుల, వేలూరి శివరామశాస్త్రిగారు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు, భమిడిపాటి, మొక్కపాటి, మునిమాణిక్యం ఒకరేమిటి చేవగల రచయితలందరూ పంతులుగారు నెలకొలిపిన ఏదో ఒక ద్వారం గుండా సాహిత్య భవనం లోనికి ప్రవేసించినవారే. శంఖంలో పోస్తే తీర్థం అవుతుందో లేదోగాని ఒకనాడు భారతిలో రచన అచ్చుపడడం నిజంగా పట్టాభిషేకమే. తెలుగునాడులో చెళ్ళపిళ్ళ శిష్యుణ్ణని చెప్పుకొనడం సాహిత్య ఫ్యాషన్ అయితే భారతిలో రాశానని రొమ్ము విరుచుకొని విర్రవీగడం కొండెక్కినంత గొప్ప. భారతి సాహిత్య శిఖరం." అంటారు.
దేశ స్వాతంత్ర్యానికి ఆవల 24సంవత్సరాలు, ఈవల 43సంవత్సరాల మూడు నెలలు మొత్తంగా 67 సంవత్సరాల 3మాసాలు భారతి పత్రిక వెలువడింది.
భారతి మాస పత్రిక తెలుగు సాహిత్యంలో ఆధునిక ధోరణులను ఆహ్వానించింది. భాషా చరిత్ర, సాహిత్య చరిత్ర, శాసన పరిశోధనా వ్యాసాలకు చిత్రకళా రంగానికి అన్నట్టుగానే పెద్దపీటవేసింది.
ఈ సందర్భం గురించి ప్రముఖ పరిశోధకులు, సాహితీవేత్త తిరుమల రామచంద్ర అంటారూ "భారతిలొ రచన ప్రచురితమైతే ఏనుగును ఎక్కినంతగా, గౌరవ డాక్టరేటు లభించినంతగా పొంగిపోయే కాలమది." అలాంటి సమయంలో తనకు భారతితో పరిచయం కలిగిందని చెప్పారు. ఆతర్వాతకాలంలో వారు భారతిలో ఇన్చార్జి సంపాదకులుగా పనిచేశారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 1997లో "భారతి సూచి" పుస్తకాన్ని ప్రచురించింది. 1973 నుండి 1991మార్చి భారతి తుది సంచికవరకూ అందులో వచ్చిన వ్యాసాల వివరాలను పొందుపరిచింది. అందులో తిరుమల రామచంద్ర భారతితో నా అనుబంధం వ్యాసం రాశారు. తన వ్యాసం ముగింపు వాక్యంగా "భారతి సేవను గురించి మాత్రమే వంద సిద్ధాంత గ్రంథాలు వెలువడవచ్చు." అని రాశారు.
భారతి రజతోత్సవాలు, వజ్రోత్సవాల సభలు జరుపుకొంది. ఇప్పుడు ఒక కాలపు చారిత్రక సాక్ష్యంగా నిలిచిపోయింది.Read More
Next Story