ఐదు అంచెల వ్యవసాయం అదరహో
x
అరకు సమీపంలోని గంజాయి గూడలో కొర్రా బారిక అర ఎకరంలో వ్యవసాయ క్షేత్రం ( ఏరియల్‌ షాట్‌ )

ఐదు అంచెల వ్యవసాయం అదరహో

ఫైవ్ లేయర్ విధానం తో ఏడాదంతా ఏదో ఒకటి అమ్ముకోవచ్చు. నేల కూడా సేఫ్ అంటున్న అన్నదాతలు


ఉదయం ఆరు గంటలకు అరటి పండ్లు , బ్రెడ్‌ బిస్కట్లు తీసుకొని అరకు లో బయలు దేరాం. కొండ వాలులో మెట్ల సాగును చూస్తూ ఇద్దరు రైతులను కలిసి డుంబ్రిగుడ మండలం లో పెదలబుడు పంచాయితీలో ఉన్న గంజాయి గూడా చేరుకునే సరికి మధ్యాహ్నం 2 దాటింది. తెచ్చుకున్న పండ్లు ,బ్రెడ్‌ మధ్యలోనే అయిపోయాయి. ఒక చిన్న లోయలోకి మలుపు తిరిగి చుట్టూ పనస ,సీతాఫలం,అరటి చెట్ల మధ్య ఉన్న వ్యవసాయ క్షేత్రం దగ్గర ఆగాం.

సిల్వర్‌ ఓక్‌ చెట్టులా ఎత్తుగా బలంగా ఉన్న సవర ఆదివాసీ యువకుడు కొర్రా బారిక ఎదురొచ్చి తన తోటలోకి తీసుకెళ్లాడు. ఆయన భార్య అరటాకుల్లో పనస తొనలు, మామిడి పండు ముక్కలు తెచ్చి మాకిచ్చారు.

తోటలో పండిన సపోటాలు చూపిస్తున్న రైతు కొర్రా బారిక

‘ ఈ పూటకు మనకు ఇదే లంచ్‌ ’ అన్నాడు మతో ఉన్న ఎన్జీఓ మిత్రుడు సన్నీ.

ఆహారం తీసుకున్నాక తోటల వైపు వెళ్లాం.

‘ ఈ పద్ధతిలో ఈ రైతు భూమిలోపల , భూమి పైన నుంచి ఆకాశం దాకా దిగుబడి ఇచ్చే, ఐదు రకాల పంటలను వేశాడు. ప్రతి పద్ధతి వేర్వేరు సూర్యకాంతి, నీటి అవసరాలకు అనుగుణంగా ఉంటుంది.’ అని పంటల విధానం పరిచయం చేశాడు మాతో ఉన్న వాసన్‌ ఎన్జీఓ మిత్రుడు నరిసింగరావు.

‘ ఇదంతా అర ఎకరం.ఐదు రకాల పంటలు వేశాం.’ అంటూ తోటను చూపించి ప్రతీ పంటను దాని వల్ల వచ్చే ఆదాయం వివరించాడు కొర్రా బారిక.

‘ మొదటి పంట పొడవైన చెట్లు. మామిడి, సపోటా, కొబ్బరి, సీతాఫలం లాంటి చెట్లను నాటాం. రెండో పంటగా అరటి, బొప్పాయి, జామ, నేరేడు వేశాం. మూడో పంటగా పసుపు, అల్లం, మిరప, కాఫీ లాంటి వాణిజ్య పంటలు.

నాలుగో పంటగా నేలపై పెరిగే కూరగాయలు, బచ్చలికూర, పాలకూర, వంకాయ, బీన్స్‌ .

తోటల మధ్య తోటకూరతో మహిళా రైతు

ఐదో పంటగా నేలలోపల పెరిగే వేరుశనగ, బంగాళదుంప, కంద, క్యారెట్‌ వేశాం. ఇవి నేల సారాన్ని మెరుగుపరుస్తాయి.’ అన్నాడు రైతు.

వనరుల సమర్థ వినియోగం

ఈ ఐదు అంచెల విధానంలో

ఒక పొరలో నీడ ఉంటే, మరో పొర సూర్యకాంతిని పొందుతుంది.

నీరు, నేల పోషకాలు, వాతావరణాన్ని ప్రతి స్థాయిలో సమర్థంగా ఉపయోగించుకోవడం వలన తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి సాధ్యమవుతుంది. నేలలో తేమ ఎక్కువకాలం నిల్వ ఉండి నీటి అవసరం తగ్గుతుంది.

రైతులు చెబుతున్న అంచనాల ప్రకారం, అర ఎకరంలో ఈ పద్ధతిని పాటిస్తే

అన్ని సీజన్లలో పండే కొండ మామిడి చెట్ల మధ్య కొర్రా బారిక

సగటున అన్ని పంటల మీద అర ఎకరాకు 1,70,000 ఆదాయం వస్తుంది అంటాడు బరిక. కూరగాయల మీద ప్రతీ వారం ఆదాయం వస్తుంది, పండ్ల మీద ఏడాదికి ఒక్క సారి ఆదాయం అందుకోవచ్చు.

‘ ఈ ప్రాంతంలో పదిమంది రైతులు ఇదే విధానం అనుసరిస్తున్నారు.

ఒక పంట ముగిసేలోపు మరో పంట దిగుబడి ఇస్తుంది.

ఉదాహరణకు, కూరగాయలు ప్రతి నెల ఆదాయం ఇస్తే, పసుపు లేదా అల్లం సంవత్సరానికి ఒకసారి పెద్ద లాభం ఇస్తాయి.

దీంతో రైతులకు నిరంతర ఆదాయం లభిస్తుంది. ’ అన్నారు వాసన్‌ ప్రతినిధి సన్నీ.ఈయన అరకు ప్రాంతంలో రైతులు ఆదాయం పెంచే నూతన వ్యవసాయ విధానాల పై శిక్షణ ఇస్తున్నారు.

ఫైవ్‌ లేయర్‌ ప్రయోజనాలు

భూమి, నీరు, వాతావరణం సమర్థ వినియోగం,నేల సారాన్ని కాపాడటం,

కుటుంబ ఆహార భద్రతతో పాటు అదనపు మార్కెట్‌ ఆదాయం,

ఒక పంట విఫలమైనా, ఇతర పంటల ద్వారా నష్ట నివారణ జరుగుతుంది.

అప్పులు లేవు ఆదాయం బాగుంది

‘‘ఒకే పొలంలో ఐదు రకాల పంటలు పెంచడంతో నాకు ఏడాదంతా ఏదో ఒకటి అమ్ముకునే అవకాశం దొరుకుతుంది. నేల కూడా మృదువుగా, జీవంతో మారింది.

చిన్న కమతం, తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితో ఆనందంగా ఉన్నాం.

రైతులు జీవితాంతం సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా?

అర ఎకరంలో ఐదు రకాల పండ్లు, కూరగాయలు పెంచండి చాలు. ’ అని ముగించాడు కొర్రా బారిక.

Read More
Next Story