బొప్పాయి,తులసి, పసుపు సబ్బులు!
x
అలొవెరా, ఇతర రకాల సబ్బుల తయారీలో గిరిజన మహిళలు

బొప్పాయి,తులసి, పసుపు సబ్బులు!

విదేశాల్లో ఆదివాసీ ఉత్పత్తులు!


వేప,తులసి, వెదురు, ఇప్పపూవు,బొప్పాయి పండు తో చేసిన సబ్బులు, వీటితో పాటు అలొవీరా షాంపూ, సజ్జ , జొన్న బిస్కట్లు, భద్రాచలం అడవుల్లో సేకరించిన తేనె. ఇవన్నీ తెలంగాణ ఆదివాసీలు తయారు చేసిన ఉత్పత్తులు. ఈ స్వచ్ఛమైన గిరిజన ఉత్పత్తుల విలువ నేడు దేశ.విదేశాలకు వ్యాపించింది. దీని వెనుక ఆదివాసీ ఆడవాళ్ల పట్టుదల, శ్రమ ఉంది. ఆ కథ తెలుసుకోవాలంటే భద్రాచలం అడవుల్లోకి వెళ్లాలి.

భద్రాచలంలో ఒక వ్యవసాయ కూలీ విజయలక్ష్మి. టెన్త్‌ వరకే చదివింది. అసంఘటిత రంగం నుండి సంఘటితర రంగం వైపు మళ్లడం కోసం తనతో పాటు పదిమంది మహిళలను కలుపుకొని దమ్మక్క జెఎల్‌జి గ్రూప్‌గా ఏర్పడి, ఐటిడిఎ వాళ్లను కలిశారు. ‘ ఎంతకాలం కూలీ పనుల మీద బతకాలి? స్వయం ఉపాధికి మార్గం చూపండి ’ అన్నారు. భవిష్యత్‌ పట్ల వారి నిబద్ధతను అర్ధం చేసుకున్న అధికారులు సబ్బుల తయారీలో ట్రైనింగ్‌ ఇచ్చారు. మార్కెటింగ్‌ మెలకువలు నేర్పారు. ఇపుడు విజయలక్ష్మి తన టీమ్‌తో కలిసి భద్రాచలంలో యూనిట్‌ నిర్వహిస్తున్నారు. అలోవిరాతో 5రకాల సబ్బులు,షాంపూ తయారు చేస్తున్నారు.

‘దమ్మక్క జెఎల్‌జి’ గ్రూప్‌ మహిళా సభ్యులు

‘ రేపు కూలి దొరుకుతుందా? పిల్లలకు రెండు పూటలు అన్నం పెట్టగలమా?’ అనే ఆందోళనతో ఒకప్పుడు తన చిన్న ఇంట్లో కూర్చుని గడిపిన విజయలక్ష్మి, ఇప్పుడు తన బృందంతో కలిసి అరుదైన ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందటమే కాదు, విదేశాలనుండి కూడా ఆర్డర్స్‌ వస్తున్నాయి. భద్రాచలంలో మొదలైన ఆమె ప్రయాణం అంతర్జాతీయ స్ధాయికి ఎదగడం వెనుక తనతో పాటు పది మంది గిరిజన మహిళల కృషి, పట్టుదల ఉంది. ఇదంతా సాఫీగా జరగ లేదు. అడవి దారుల్లాగే వారి జీవన ప్రయాణం కూడా ఎగుడుదిగుడులుగా సాగింది.

రోజూ కూలీ నుంచి సుస్ధిర ఆదాయం వైపు...

టెన్త్‌ వరకు మాత్రమే చదివిన విజయలక్ష్మి, భర్తతో పాటు వ్యవసాయం, కూలీ పనులకే పరిమితమయ్యారు. ప్రతిరోజూ కష్టపడి పనిచేసినా, చాలీచాలని ఆదాయం. పిల్లల చదువు, కుటుంబ భారం అన్నీ భుజాలపై మోసేది. ఈ నేపథ్యంలో ‘ఇలా జీవితమంతా కూలీ చేస్తూ గడపకూడదు. స్వయం ఉపాధి సాధించాలి’’ అనే ఆలోచన ఆమెకు కలిగింది.

ఆ ఆలోచనను వాస్తవం చేయడానికి, విజయలక్ష్మి తన ఊరికే చెందిన పది మంది గిరిజన మహిళలను కలుపుకొని ‘దమ్మక్క జెఎల్‌జి’ గ్రూప్‌గా ఏర్పాటయ్యారు. ఒక రోజు ధైర్యం చేసి నేరుగా ఇంటిగ్రేటెడ్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ ( ITDA ) అధికారులను కలిసారు. ‘మాకు ఉపాధి మార్గం చూపించండి, ఏదైనా వ్యాపారం చేసేందుకు సహకరించండి’ అని అడిగారు.

అడివిలో పెరిగే అలొవెరా తో తయారు చేసిన షాంపూ తో విజయలక్ష్మి

నైపుణ్య శిక్షణ తొలి అడుగు

ఆ మహిళల పట్టుదల చూసిన అధికారులు వారి అభ్యర్థనను నిర్లక్ష్యం చేయలేదు. వెంటనే వారిని హైదరాబాద్‌కు పంపించి రాజేంద్రనగర్‌లో 2018లో 3 నెలల పాటు సబ్బులు, షాంపూల తయారీ శిక్షణ ఇప్పించారు. కొత్తగా నేర్చుకున్న ఆ నైపుణ్యం, వారి జీవితానికి కొత్త దిశను చూపింది.

‘‘ 2019లో భద్రాచలం జిసిసి( Girijan Co-operative Corporation ) గోడవున్‌లో యూనిట్‌ మొదలైంది. పెట్టుబడి 25లక్షలు దీనిలో 30 శాతం మా గ్రూప్‌ సభ్కులు భరించాం , మార్కెటింగ్‌, బ్రాండిరగ్‌లో ఐటిడిఏ మాకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మా ఉత్పత్తుల మార్కెటింగ్‌ అంతా జిసిసి తీసుకుంది. వాళ్లు తెలంగాణ రాష్ట్రంలోని ఆశ్రమ పాఠశాలల విద్యార్ధులకు పంపుతారు.

సబ్బుల తో పాటు ఇతర ఇతర ఉత్పత్తులు చూపుతున్న విజయలక్ష్మి

ఏపీ ,తెలంగాణ, తమిళనాడు తో లండన్‌కి కూడా మా ఉత్పత్తులు వెళ్తున్నాయి.

భద్రాచలం ఐటిడిఎ మ్యూజియంలో , రామాలయంలో స్టాల్స్‌ ఏర్పాటు చేశాం. హైదరాబాద్‌లోని శిల్సా రామం పక్కనే ఉన్న ఇందిర మహిళాశక్తి బజార్‌ లో 5వ నెంబర్‌ స్టాల్‌లో మా ఉత్పత్తులన్నీ లభ్యం అవుతాయి’ అన్నారు విజయలక్ష్మి.

మొదట్లో చిన్న స్థాయిలో ప్రారంభమైన ఈ యూనిట్‌ ఇప్పుడు నెలకు ప్రతీ సభ్యురాలికి అన్ని ఖర్చులు పోనూ 15 నుండి 20 వేల రూపాయల ఆదాయం వస్తోంది తులసి, నిమ్మ, నారింజ, అలొవేరా మిశ్రమాలతో అరుదైన సబ్బులు తయారు చేసి మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

సబ్బుల తో పాటు ఇతర ఇతర ఉత్పత్తులు చూపుతున్న విజయలక్ష్మి

ప్రభుత్వ ప్రోత్సాహం

వీరి కృషిని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2,00,000 సబ్బులను కొనుగోలు చేసి గిరిజన గురుకుల విద్యార్థులకు సరఫరా చేస్తోంది. ఈ ఒక్క ఒప్పందమే వారికీ నిరంతర ఆదాయాన్ని హామీ ఇస్తోంది.

సబ్బులతో పాటు, తమ ప్రాంత గిరిజన మహిళలు తయారు చేస్తున్న ఇప్పపువ్వు, తేనె, మిల్లెట్‌ బిస్కట్లు కూడా విక్రయిస్తూ, వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నారు. ఒకప్పుడు కేవలం వ్యవసాయ కూలీలుగా ఉన్న మహిళలు, ఇప్పుడు వ్యాపార వేత్తలుగా మారారు.

పిల్లలకు ఉన్నత చదువులు

ఈ మార్పులో ముందడుగు వేసిన విజయలక్ష్మి, ఇప్పుడు తన ఇద్దరు పిల్లలను ఉన్నత విద్యలో చదివిస్తున్నారు. ‘‘కష్టపడి పనిచేస్తే మా వంటి పేద మహిళలకు మెరుగైన జీవితం సాధ్యమేఅని ఈ ప్రయాణంలో తెలుసుకున్నాం. మా పిల్లలు మాతో పోలిస్తే మెరుగైన జీవితం గడపాలి’’ అనేది విజయలక్ష్మి సంకల్పం.

రాష్ట్రపతి మెచ్చిన ‘ట్రైబల్‌ బ్లిస్‌’ ఉత్పత్తులు

2019లో ప్రారంభమైన వీరి పరిశ్రమనుండి తయారు అయ్యే ఉత్పత్తులను ‘ట్రైబల్‌ బ్లిస్‌’ అనే బ్రాండ్‌తో మార్కెట్‌ చేస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా వీరి ఉత్పత్తులను ప్రశంసించారు! ఈ మహిళలు ప్రకృతి వనరులతో ఆయుర్వేదిక్‌ సబ్బులను తయారు చేస్తున్నారు. ఇవి కేవలం సబ్బులు కాదు, వారి సంస్కృతి, ఆరోగ్యం మరియు స్వావలంబనకు చిహ్నాలు! వీరి చేతుల్లో ఉత్పత్తి అయిన ప్రతి సబ్బులో ఒక అరుదైన విశేషం ఉంది.

శిల్పారామం పక్కనే ఉన్న ఇందిరామహిళాశక్తి భవన్‌లో స్టాల్‌

1, నీమ్‌ తులసి సబ్బు : వేసవిలో చర్మ సమస్యలతో బాధపడేవారికి ఇది మేలు చేస్తుంది. అడవిలోని నీమ్‌, తులసి ఆకులను సేకరించి, ఈ సబ్బును తయారు చేశారు. ఇది చర్మం పై కలుషితాలను తొలగిస్తుంది.ముఖ్యంగా, మొటిమలను నివారిస్తుంది.

2, పసుపు కొమ్ముల సబ్చు : దీనిలో పసుపును ఉపయోగించి, తయారు చేశారు. ఇది మొటిమలను తగ్గిస్తుంది, మచ్చలను తొలగిస్తుంది, చర్మం రంగును మెరుగుపరుస్తుంది.

3, అలోవెరా సబ్బు : అటవీలో పెరిగే అలోవెరా మొక్కల నుండి ఈ సబ్బులు తయారు చేస్తున్నారు. అలోవెరాలో మాయిశ్చరైజింగ్‌, యాంటీఆక్సిడెంట్‌ గుణాలు ఉన్నాయి. ఈ సబ్బు చర్మాన్ని తడిగా ఉంచుతుంది, ఎండ నుండి కాపాడుతుంది.

వీటితో పాటు నారింజ, బొప్పాయి, వెదురు, ఇప్పపూవు తో సబ్బులు తయారు చేస్తున్నారు.

ఫెడరల్‌ తెలంగాణ ప్రతినిధితో విజయలక్ష్మి

ఈ ‘ట్రైబల్‌ బ్లిస్‌’ సబ్బులు పరిశుభ్రమైన వాతావరణంలో ప్లాంట్‌ బేస్డ్‌, కెమికల్‌ ఫ్రీ మరియు ఎకో-ఫ్రెండ్లీగా తయారు చేశామని విజయలక్ష్మి అంటున్నారు.

( సోప్స్‌తో పాటు జొన్న,రాగి, సజ్జ, బిస్కట్లు, తేనె, ఇప్పపూవు కూడా వీరి దగ్గరున్నాయి. కావాల్సిన వారు, హైదరాబాద్‌లోని శిల్పారామం పక్కనే ఉన్న ఇందిరామహిళాశక్తి భవన్‌లో 5వ నెంబర్‌ స్టాల్‌కి వెళ్లవచ్చు. మరిన్ని వివరాలకు ఈ నెంబర్లు సంప్రదించండి: 6301047267)

Read More
Next Story