
40 యేళ్ల కింద పాఠకులను కుదిపేసిన ‘అనుక్షణికం’
వడ్డెర చండీదాస్ పాత నవల కొత్త సమీక్ష...
నాలుగు దశాబ్దాల కిందటి మాట. స్వాతంత్ర్యం పొందిన తరువాత జమీందారులు , జాగీర్దారుల భూస్వామ్య వ్యవస్థలు రద్దుఅయ్యాయి. వాటి తాలూకు వాసనలు , వాటి అవశేషాలు ఇంకా అక్కడక్కడ చింత చచ్చిన పులుపు చావలేదన్నట్టు కనిపిస్తాయి. వారి కుటుంబాల నుండి వచ్చిన పిల్లలు కొంత మంది అనేక రంగాల్లో అప్పుడప్పుడే స్టిర పడి నిలదొక్కుకుంటున్నారు. ఇక, వ్యాపార, వాణిజ్య , పారిశ్రామిక రంగాల నేపథ్యం నుండి వచ్చిన పిల్లలు మరొకవైపు. కూడా అగ్ర కుల , ఉన్నత సామాజిక వర్గాల వారే. ఆర్థికంగా చాలా మెరుగైన కుటుంబ నేపథ్యం నుంచి నుండి వచ్చినవారే. వారి ద్వంద ప్రవర్తన (dichotomic), ఆలోచన విధానాలు విభిన్న పరిస్థితులలో విభిన్న పరిసరాలలో విభిన్న సందర్భాలలో ఎలా ఉంటాయి? బాగా ప్రసిద్ది చెందిన విశ్వ విద్యాలయాలలో హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వ విద్యాలయం ఒకటి .
అక్కడ వీరు ఉన్నత చదువులు చదివే క్రమంలో పలు ఆసక్తికరమయిన పరిణామాలు సంభవించాయి. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ , సామాజిక, ఆర్థిక రంగాలలో పెను మార్పులు వస్తున్నాయి. వామ పక్ష, జాతీయ వాద, నియంతృత్వ , రాచరిక , భూస్వామ్య , ప్రజాస్వామ్య దోరణులపై విస్తృత ప్రభావం తారాస్థాయి చేరిన సమయం అది. వీటితో పాటు 1970-1980 మధ్య కాలంలో భారత దేశంలో అత్యసర పరిస్థితికి ముందూ, వెనక జరిగిన చాలా పెద్ద రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాలన్నింటిని మేళవిస్తూ ఒక రాజకీయ, సామాజిక , ఆర్థిక మానసిక సంఘర్షణ కోణంలో చూపిస్తూ పిడుగులాగ ఊడిపడిన సుదీర్గ నవల రచన ‘అనుక్షణికం’ (1985). దీనిని వడ్డెర చండీదాస్ అనే శ్రీవేంకటేశ్వర విశ్వ విద్యాలయానికి చెందిన తత్వ శాస్త్ర ఆచార్యులు రాశారు. కథాకాలం 1971-1980. రచనా కాలం 1979-1981. ఇది అప్పుడు ఎంతో దుమారం లేపి , పలు విమర్శలు , ప్రతి విమర్శలతో ఎంతో మందిని ఆకట్టుకున్నది. అంతే కాదు ఒక వార్తా పత్రిక పాఠకుల సంఖ్యను గణనీయంగా పెంచింది. అంతటి కలకలం సృష్టించిన ఆ నవలను 2026 లో ఒకసారి పరిశీలన చేస్తే ఎలా ఉంటుంది. ఆ ప్రయత్నమే ఈ వ్యాసం.
నవలంతా శ్రీపతి అనే విద్యార్థి చుట్టూ తిరుగే కథ. ఇతడు ఒక మధ్య తరగతి భూ స్వామి కొడుకు. అతడు ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఉన్నత చదువులకు వస్తాడు. అతనితో పాటు అటు ఎగువ కాని, ఇటు మధ్య తరగతి కాని ఎంతో మంది కూడా ఆ క్యాంపస్ లో ఉంటూ చదువుకుంటాంటారు. అతడు, అతని తో పాటు ఉండే అందరి చుట్టూ కథ తిరుగుతుంది. దానితో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల వర్ణన కళ్ళకు కట్టినట్టు మనకు చూపెట్టుతాడు.
అంతే గాక అత్యవసర పరిస్థితి (1975-1977) కాలంలో భావజాలం మీద ఇందిరా గాంధీ ఎలా కఠినంగా వ్యవహరించింది? భారత రాజ్యాంగంలోని 356, 358 తదితర అధికరణాలను ఉపయోగించి లేదా దుర్వినియోగ పరిచి అత్యవసర పరిస్థితి అమలు చేసిన తీరు ఎలా ఉంది? ఆమె , ఆమె కొడుకు సంజయ్ గాంధీ ఎలా నియంతృత్వ విధానాలు అవలంభించినప్పుడు అందరు ఆమెను ఎలా ఒంటరి చేశారు? తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఎలా పరాజయం పాలు అయ్యింది? జనతా ప్రభుత్వం ఎలా మూన్నాళ్ళ ముచ్చటగా కుప్ప కూలింది? జయప్రకాష్ నారాయణ్ సంపూర్ణ విప్లవ నినాదం, అతని మరణం. తదితర విషయాలపైన అప్పుడు జనం ఎలా స్పందించారు? ఈ పరిణామాలను నవలలోని పాత్రల ద్వారా చండీదాసు చాలా గొప్పగా వివరించారు. విద్యార్థి సంస్థ ఎన్ ఎస్ యు ఐ , విప్లవరచయితల సంఘం లాంటి ధిక్కార స్వరాలు , రాజకీయ పార్టీలతో వాటికి ఎలాంటి సంబంధాలు ఉండేవి అనే అంశాలను కూడా పాత్రలద్వారా చిత్రీకరణ చేసినాడు. ఇందిరాగాంధీ అందరిని ఎలా అణిచి వేసినా అందరు మళ్ళీ ఆమె దగ్గరకుఎలా వెళ్లారు? ఇలా ఎన్నో లోతైన విషయాలు ఉన్నాయి. మొదట అందులో కొన్ని పాత్రలు చూద్దాం ..
ఒక చోట ‘తార’ పాత్ర చిత్రీకరణలో తన తాహతుకు మించిన కోరికలతో బర్తను వంచించి చెడు తిరుగుళ్ళు తిరుగుతుంది. ఆ క్రమంలో మొదట ఇంద్రారెడ్డి , అటు పిమ్మట సూర్య ప్రకాష్ లాంటి మల్టీ మిలియనీర్ , స్మగ్లింగ్ ముఠా వలలో పడి వంచనకు గురిఅవుతుంది. తనను అందరు వాడుకుంటున్నారని , తాను కూడా వంచనను తట్టుకొనలేక , పలువురి ప్రేమ బూటకమని గ్రహించి ఎవరికి చెప్పుకోలేని స్థితిలో రైలు కింద పడి ఆత్మ హత్య చేస్కుంటుంది. ఇందులో అత్యధిక స్థాయి హిస్టీరియానిక్ మూర్తి మత్వా(histrionic personality) లక్షణాలు కనబడుతాయి. ఒక వ్యక్తి అసంతృప్తి , అవసరాలు రాబోయే పరిణామాలను లెక్క చేయకుండా చేయించే పనులు ఇక్కడ గలవు .
ఇంకొక చోట “అనంత రెడ్డి -స్వప్న” కథలో ఎంతో గాఢంగా సుదీర్గంగా ప్రేమించి విదేశాలలో ఉన్నత చదువులు చదివి వచ్చిన అనంత రెడ్డిని పెళ్లి చేసుకుంటుంది “స్వప్న”. తన భర్తను లైంగికంగా ఉత్తేజ పరుచడంలో తీవ్రంగా ప్రయత్నించి ఓడిపోతుంది. భర్తతో శారీరక సంబంధం ఒకటి మాత్రమే జీవిత పరమార్థం కాదంటూ , మానసిక సంబంధానికి కట్టుబడి భర్తకు దైర్యం చెప్పి , తాను మాత్రం కుంగి(depression) పోయి చివరకు భర్త ఒడిలో కన్ను మూసే , స్వచ్చమైన ప్రేమను చిత్రీకరించిన తీరు మనస్సును కదిలిస్తుంది. ఇక్కడ వివాహానంతరం వచ్చే ఇబ్బందులు (post-marital issues), మానసిక లైంగిక జబ్బులు(psycho-sexual disorders) కలిగినప్పుడు ఎవరికి చెప్పుకోలేక మధన పడిన తీరు ఇక్కడ ఉంది.
మరొ క చోట “వెంకటావధాని” తను ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకునేందుకు తండ్రి ఒప్పుకోడు. అందుకు కోపంతో తన ప్రేయసిని మాయ మాటలు చెప్పి లాడ్జ్ కి తీసుకునిపోయి వేశ్యగా చిత్రీకరించి అవమాన పరుస్తాడు. అది తెలిసుకున్న ఆమె తండ్రి కిరాయి గుండా చేత అతని కాళ్లు విరగొట్టిస్తాడు. తనకు కావలసినది దక్కకుంటే మనిషి విచక్షణ కోల్పోయి ఎంత దారుణానికి ఒడి గట్టుతాడో అనడానికి రచయిత ఈ పాత్రలో తెలియజేస్తాడు. ఇందు మధ్యస్థ స్తాయి మూర్తి మత్వ లోపం(borderline personality disorder), సంఘ వ్యతిరేఖ మూర్తి మత్వ లోపం(anti-social personality disorder) కూడా కొంత కనబడుతుంది
ఇంకొక చోట “రవి -గంగి” ఎపిసోడ్ లో రవి తల్లి చనిపోతే మేన మామా చేరదీసి చదివించుతాడు. తన బిడ్డను పెళ్లి చేసుకోమని అంటే వద్దని మామా గారి ఇంటినుండి బయటికి వెళ్ళి ఒక మురికి వాడలో చిన్న గుడిసెలో ఉంటాడు. చిన్న ఉద్యోగంతో మొదలు పెట్టి నిజాయితిగా ఉంటూ ఎక్కడా ఇమడక అతి సామాన్యులు నివసించే కార్మిక వాడలో ఒక చిన్న గుడిసెలోకి మకాం మారుస్తాడు. అక్కడ అందరి మన్ననలు పొంది, స్వాంతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి శాసన సభ్యునిగా గెలిచి, తరువాత మంత్రి వరకు ఎదుగుతాడు. అక్కడే గుడిసెలలో ఉన్న నిరుపేద యువతి “గంగి” ని పెళ్లి చేసుకుంటాడు. ఆ మురికి వాడలో ఉన్నప్పుడు ఎంతో నైతికత గలిగిన గంగి , ఆస్తి, పదవి , డబ్బు వచ్చిన తరువాత చెడు తిరుగుళ్ళు తిరుగుతుంది. ఆర్థిక , రాజకీయ పరిస్థితులు మనిషి మానసిక స్థితిని ఎలా ప్రభావితం చేస్తుందో తద్వారా నైతిక విలువలు మంచి, చెడు , ఎలా ఒక దానితో ఒకటి కలగ పులగం అవుతాయో తెలియ జేస్తాడు.
ఇలా ఇంకొ దగ్గర ఎన్నో చెడు తిరుగుళ్ళు తిరిగిన రంగా రెడ్డి “ నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది. కాని శీలవతి(origin) కావాలి కదా, ఒక పెద్ద మనిషి ఇంకా కాని చిన్న పిల్లను పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందని” శ్రీ పతిని అడిగే తీరు శుద్దబుద్ధిమంతుడు వలె కనిపించే మనిషి మనస్తత్వం ఎలా ఉంటుందో నిక్కచ్చిగా , పచ్చి నిజాలను రచయిత చెప్పుతాడు.
చెడు అలవాట్లు తిరిగి, ఒకసారి దొరికి పోయి, దెబ్బలు తిన్న ఒక యువకుడు , తాను పెళ్లి చేసుకున్న తరువాత భార్యను నిరంతరం అనుమానించే మానసిక రోగము(paranoid schizophrenia )తో భార్యను ఎలా బాధ పెట్టుతాడో , భార్య ఎంత మానసిక క్షోభ అనుభవిస్తుందో మానసిక జబ్బు గల వ్యక్తి ప్రవర్తన లక్షణాలు వర్ణించిన తీరు చాలా బాగుంది.
ఒక వేశ్య “ కస్తూరి” తీవ్ర జ్వరంతో ఉన్న ఒక మగవాడికి చేసిన సేవలు, చుట్టూ పక్కల వాళ్ళ అవమానాలు సహించిన మానవతా (humanistic -existentialistic)విలువల చిత్రీకరణ చాలా లోతుగా ఉంటుంది.
ఇది కథ గాదు. కథానికల సంపుటి కాదు. ఒక నిర్దిష్ట నాంది , ప్రస్తావన ముగింపు లాంటివి లేవు. ఇందులో అది, మధ్య, అంత్యం లాంటివి మచ్చుకైనా కనిపించని లోతైన భావన కలిగిన రచన. ఒక పాత్రకు ఇంకొక పాత్రకు సంబంధమున్నట్ల కనిపిస్తూనే , ఏ సంబంధం , సందర్భం లేకుండా సాగుతుంది. కాని అందులోని వర్ణన , శిల్పం , తాత్విక వైరాగ్యతలు , జుగుప్సాకరమైన అశ్లీల వర్ణనలు మితిమీరి ఉన్నప్పటికీ అనుక్షణం పాఠకుని ఆలోచింప చేస్తుంది.
ఇందులో చాలా చోట్ల అతి వర్ణణ(over emphasis) చేసినట్లు ఉండగా , కొన్ని చోట్ల నిరాశ , శూన్యవాద(nihilistic) ఉన్నట్టు ఉంటుంది. ఇంకా కొన్ని చోట్ల అత్యుత్సాహంగా (manic)కూడా ఉన్నట్టు , కొన్ని చోట్ల కుంగుబాటు (depressive)గా ఉన్నట్టు భావన కలుగుతుంది. ఇంకా కొన్ని చోట్ల పట్టు-విడుపు(flexible )గా ఉంటూనే , కరుడు గట్టిన మొండి తనం(rigidity) గల ద్వంద్వధృవ (bipolar) లక్షణాలు ఉన్నట్టు స్పష్టంగా ఉంటాయి. కొన్ని చోట్ల అత్యున్నత మానవతా (humanistic) విలువలు గాను , కొన్ని చోట్ల తప్పని పరిస్థితిలో రాజీపడే తత్వం (existentialistic) అంశాలు కూడా చోటు చేసుకుంటాయి.
ప్రాథమిక అవసరాలు తీర్చుకునే దశలో అత్యధిక నైతిక విలువలకు కట్టు బడి ఉండడం, అటు తరువాత దశలో అత్యధిక ఆశతో ఎంతో గొప్పగా నైతిక విలువలకు కట్టుబడ్డ వాళ్ళే , మళ్ళీ నైతికతకు నీళ్ళో దిలి , అతః పాతాళానికి దిగజారిపోవటం. పరిస్థితుల ప్రభావానికి ఎంత లోతుకు దిగజారినప్పటి వారిలో కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని మానవతా విలువలు ఉంటాయని విషయాలను అర్థం చేసుకోలేని సంక్లిష్ట సందర్భాలను తనదైన శైలిలో ప్రతిబింబించే ప్రయత్న బాగా చేశారు.
యోగి వేమన మేడి పండు విప్పి అందులో అన్నీ పురుగులు ఉంటాయని చెప్పితే , మన చండీదాసు గారు ఆ పురుగులతో పాటు షడ్రుచులు, అవలక్షణాలు , సలక్షణాలు కలిగిన విషయాలు కూడా మేడిపండుకు ఉంటాయని తేట తెల్లం చేశాడు. అందుకే పలువురి చేత ఘాటుగా విమర్శలు ఎదుర్కొన్నప్పటికి ,అదే స్థాయిలో ప్రశంసలు కూడాఅందుకుంది. చేతన , అచేతన , పూర్వ చేతన , ఉపచేతన అన్ని స్థాయిల్లోని మనస్సు రూపాలను, కోణాల్లో (Dimention) చూపెట్టే ప్రయత్నం చేశాడు.
తర్క శాస్త్ర మౌలిక సూత్రాల ప్రకారం జరిగిన ఏ విషయమైన ఆయా నిర్దిష్ట స్థితి(State), ఆయా నిర్దిష్ట కాలం(Time), ఆయా నిర్దిష్ట ప్రదేశం(Space), ఆయా నిర్దిష్ట సందర్భం( Context) వద్ద తాత్కాలిక ఒక పరిణామ దశ గానే చూడాలి. ఆ దృష్టి తోనే నిర్ణయాత్మక(Non-judgmental) రహితంగా , గత పరిస్థితులను సాక్షి భూతంగా, సమత( Equanimity) భావముతోనే ఈ పుస్తకం చదవాలి .
అంతా చదినిన తరువాత ఇంతకు రచయిత ఏమి చెప్పదలుచుకున్నాడో అర్థం చేసుకోవడం కొంత కష్టమే. కథ ఎక్కడ పోతుందో తెలియదు ఆలోచనల పరంపర ( Train of thought) లాగా ఉండీ , కొన్ని సార్లు ఎక్కడెక్కడో పోయి దారి తప్పినట్టు (Derailment) లాగా సాగుతుంది. డార్విన్ జీవ పరిణామ సిద్దాంతంలాగా వ్యక్తులు, వ్యక్తిత్వాలు , ఆలోచనలు, రాజకీయ పార్టీల దొరణులు అన్నీ కూడా నిరంతరం మార్పు చెందేవే అనే స్పురణ కలిగిస్తాడు . జీవాభివృద్ది మాత్రమే కాదు. సమాజంలోని అన్నీ విలువలు , రాజకీయ ధోరణులు, మనస్తత్వాలు అన్నీ నిరంతరం పరిణామం చెందుతాయి. ఇవి అన్ని కూడా అగ్ర, మధ్య , అధమ, అతి అధమ, ఉన్నత వర్గాలు, ఉన్నత స్థాయి, మధ్య స్థాయి , అధమ స్థాయి లాంటి వాటికి అన్నింటికీ అతీతమే..
చివర “ క్షణం వెనక క్షణం ముందు క్షణం లోన క్షణం కింద క్షణం పైన క్షణం పక్క క్షణం క్రితం క్షణక్షణం, క్షణికం; క్షణిక క్షణిక క్షణంలో పుట్టుకే గిట్టుకలా అసలు ఆరంభమే అవనట్లుగా, గిట్టుకే పుట్టుకలా అసలు అంతమే ఆవనట్లుగా; క్షణక్షణాల క్షణికాల, క్షణిక క్షణికాల క్షణం;
అంతలోనే అంతమయ్యే క్షణికాల దొంతర, యెంతకీ అంతమవని దొంతర క్షణికాల, విశ్వాంతర్ల్పా విత సంకీర్నక్షణికాలు అంతలోనే అంతమయ్యే యెంతకీ
అంతమవని నిరంతర క్షణికం అనుక్షణికం,” అంటూ నవలని ముగిస్తాడు.
ఈ విషయాలు ఎందరో చెప్పినప్పటికి ఇంత పచ్చిగా, ముక్కుసూటిగా నిర్మొహమాటంగా, నగ్న సత్యంగా చెప్పిన తీరు అమోఘం ...

