మహారాష్ట్ర నుంచి తెలంగాణ దాకా: కవాల్ వైపు జే1 పులి పయనం!
x
తాడోబా పులి తెలంగాణలో సంచారం (అటవీశాఖ సౌజన్యంతో)

మహారాష్ట్ర నుంచి తెలంగాణ దాకా: కవాల్ వైపు జే1 పులి పయనం!

గ్రామాల్లో అలజడి సృష్టిస్తున్న పులి,టెరిటరీ కోసం ఆరాటం


మహారాష్ట్రలోని తాడోబా అడవుల నుంచి తెలంగాణలోకి అడుగుపెట్టిన జే1 పులి రెండు నెలలుగా పలు జిల్లాల్లో సంచరిస్తూ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జగిత్యాల జిల్లా భీమారం మండలంలో మూడు పశువులపై దాడి చేసిన ఈ పులి, సరైన ఆవాసం కోసం ఇప్పుడు కవాల్ టైగర్ రిజర్వ్ వైపు కదులుతోందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.

రెండు నెలల క్రితం మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన పులి శనివారం జగిత్యాల జిల్లా భీమారం గ్రామంలో కనిపించింది. యాదాద్రి భువనగిరి, జనగామ,మేడ్చల్ మల్కాజిగిరి, సిద్ధిపేట, కరీంనగర్, జగిత్యాల,సిరిసిల్ల జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో సంచరించిన పులికి తగిన సురక్షిత ఆవాసం లభించలేదని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అనువైన సురక్షితమైన ఆవాసం లభించక పోవడంతో మళ్లీ పులి కవాల్ అభయారణ్యం వైపు అడుగులు వేస్తుందని టైగర్ ట్రాకర్లు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద మహారాష్ట్ర తాడోబా నుంచి వచ్చిన పులి ప్రయాణం, ఆవాసం పడుతున్న పాట్లపై అటవీశాఖ అధికారులు, టైగర్ ట్రాకర్లు, వైల్డ్ లైఫ్ నిపుణులు, తెలంగాణ టైగర్ సెల్ అధికారులు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు.

అడవిలో పులి జాడ కోసం ట్రాకర్ల పాదయాత్ర

మూడు పశువులపై పులి దాడి

జగిత్యాల జిల్లా భీమారం మండలంలో శనివారం ఉదయం పులి దాడిలో మూడు పశువులు గాయపడ్డాయి. అటవీ అధికారులు పులి పగ్‌మార్క్‌లను సేకరించి గ్రామస్థులను అప్రమత్తం చేశారు.ఈ ఘటనతో ప్రజల్లో భయాందోళనలు చెలరేగాయి.భీమారం మండలం ముత్కురావుపేట గ్రామ శివార్లలోని ఒక పొలంలో స్థానిక రైతు కొన్ని ఎద్దులు, ఆవులను శుక్రవారం రాత్రి కట్టివేశాడు.శనివారం ఉదయం రైతు పొలానికి వెళ్లినప్పుడు పులి దాడిలో మూడు పశువులు గాయపడినట్లు గమనించాడు.స్థానిక గ్రామాధికారి అటవీ అధికారులకు సమాచారం అందించారు. గ్రామస్థులు టైగర్ ట్రాకర్లతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని, పగ్‌మార్క్‌లను పరిశీలించారు.గత రెండు నెలలుగా రాష్ట్రంలో సంచరిస్తున్నపులి పలు జిల్లాల్లో 30కి పైగా పశువులపై దాడి చేసింది. హైదరాబాద్‌ నగరానికి దగ్గరగా వెళ్లి యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి, యాదాద్రి మండలాల్లో పులి సంచరించింది.
మహారాష్ట్ర పులి ఫారెస్టు టెరీటరీని ఏర్పాటు చేసుకునేందుకు తెలంగాణ జిల్లాల్లో సంచరిస్తుందని, దీనికి అనువైన స్థావరం లభించక పోవడంతో అది మళ్లీ కవాల్ అభయారణ్యం వైపు అడుగులు వేస్తుందని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యుడు శ్రీపతి వైష్ణవ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

జే 1 పులి కెమెరా ట్రాప్ చిత్రం

రెండేళ్ల తర్వాత పులి కూనలను బయటకు పంపుతుంది...

ఆడపులి కూనలకు జన్మనిచ్చినప్పుడు, తల్లి పులి తన పిల్లలకు రెండు నుంచి రెండున్నర సంవత్సరాల వయస్సు వచ్చే వరకు అడవిలో తిప్పుతూ ఎలా జీవించాలో నేర్పుతుంది. పిల్లలు స్వతంత్రంగా జీవించడానికి తగినంత పరిణతి చెందిన తర్వాత, తల్లి వాటిని తన భూభాగం నుంచి బయటకు నెట్టివేస్తుంది. దీంతో పెద్ద అయిన పులులు కొత్త అటవీ భూభాగాలను అన్వేషిస్తుంటాయి. దీని ఫలితంగా ఇప్పటికే స్థాపించిన టెరిటరీలో పులులతో ఘర్షణ జరగవచ్చు. తగిన స్థావరం, టెరీటరీ లభించక పోవడంతో ఈ పులి మరింత ముందుకు వెళ్లి కొత్త ప్రాంతాలను అన్వేషిస్తుంది. పులి తన అటవీ భూభాగాన్ని స్థాపించిన తర్వాత, ఇవి కూనలకు జన్మనివ్వడానికి ఆడపులి తోడు కోసం చూస్తాయి.సమీపంలో ఆడ పులి అందుబాటులో లేనప్పుడు, మగ పులి మరింత ఆందోళనగా ఉంటుందని వైల్డ్ లైఫ్ ఓ ఎస్ డీ ఎ శంకరన్ చెప్పారు.

అటవీ గ్రామంలో పులి పాదముద్రలు

వందల కిలోమీటర్ల దూరం పులి ప్రయాణం

మగ పులి వందల కిలోమీటర్ల దూరం ఆడపులిని, ఆవాసాన్ని వెతుక్కుంటూ వెళుతుంది.జాతీయ జంతువు అయిన పులికి అందుబాటులో ఉన్న ఆహార పరిమాణంతోపాటు దాని సొంత ఫారెస్టు భూభాగం, ఆవాసం ఏర్పరచుకుంటుంది. ఒక కొత్త పులి మరొకరి భూభాగంలోకి ప్రవేశించినప్పుడు, అది ఘర్షణలో గెలవాలి లేదా వెనక్కి వెళ్లి ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని టైగర్ ట్రాకర్లు చెప్పారు. మహారాష్ట్ర నుంచి రెండు పులులు రాగా వాటిలో ఒక దాన్ని రాజమండ్రి ప్రాంతంలో అటవీశాఖ అధికారులు బంధించి అడవుల్లో వదిలివేశారు. మరో పులి తెలంగాణ జిల్లాల్లో రోజుకో ప్రాంతంలో సంచరిస్తూ గ్రామాల్లో అలజడి సృష్టిస్తుంది. మహారాష్ట్ర తాడోబా అభయారణ్యం నుంచి వచ్చిన పులిని దాని పాదముద్రలు, కెమెరాట్రాప్ చిత్రాలను బట్టి జే1 (జన్నారం)గా గుర్తించారు.
మొత్తం మీద మహారాష్ట్ర నుంచి ప్రారంభమైన ఈ పులి ప్రయాణం వందల కిలోమీటర్ల దూరం సాగి, ఇప్పుడు కవాల్ వైపు మళ్లుతోంది. సరైన ఆవాసం లభిస్తే అక్కడే స్థిరపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.కవాల్ అడవులు సురక్షిత స్థావరంగా మారితే అది అడవుల్లోనే స్థిరపడే అవకాశముంది. అయితే గ్రామాల సమీపంలో సంచారం కొనసాగుతున్నంతకాలం ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పులి సంరక్షణతో పాటు ప్రజల భద్రతను సమతుల్యం చేయడం అటవీశాఖకు పెద్ద సవాలుగా మారింది.
Read More
Next Story