
కామ్రేడ్ సురవరం జీవితంలో మర్చిపోలేని ఆ 2 సంఘటనలు..
ఒకప్పటి సమైక్యవాది. నేటి తెలంగాణ వాది. ఓ జాతీయ పార్టీని నడిపిన తెలుగు వాడు.. సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం ఆగస్టు 22న హైదరాబాద్ లో మరణించారు.
చిన్ననాడే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యమబాట పట్టారు. ఖాకీల కాఠిన్యాన్నీ చూశారు. కవుల లాలిత్యాన్నీ ఆస్వాదించారు. మంచి చదువరి. ఉత్తమ వక్త. ఒకప్పటి సమైక్యవాది. నేటి తెలంగాణ వాది. ఓ జాతీయ పార్టీని నడిపిన తెలుగు వాడు.. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి. ఆగస్టు 22న రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్ లో మరణించారు.
....దేశానికి స్వాతంత్య్రం సిద్దించి పదేళ్లయింది. స్కూలుకు బ్లాక్ బోర్డులు, చాక్ పీసులు, నోటు పుస్తకాలు ఎందుకివ్వరని పదిహేనేళ్లు కూడా నిండని ఓ బాలుడు... నిలదీశాడు. ఆ బాలుడి నినాదం కర్నూలు జిల్లా విద్యాశాఖను కదిలించింది. ప్రతి పాఠశాలకు నల్లబోర్డులు ఏర్పాటు చేయించింది. అతనే నేటి సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి. ఆ స్కూలే కర్నూలులోని మున్సిపల్ హైస్కూలు, 1957లో జరిగిన ఈ సంఘటన అధికార యంత్రాంగాన్ని మునికాళ్లపై నిలబెట్టింది.
సుధాకర్ రెడ్డి 1942 మార్చి 30న సమరయోధుల ఇంట జన్మించారు. ఆయన తండ్రి వెంకట్రామిరెడ్డి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. తల్లి ఈశ్వరమ్మ. ఇద్దరు సోదరులు, ఒక సోదరి, మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు మండలం కంచుపాడు స్వగ్రామం. సురవరం హైస్కూలు విద్యను కర్నూలులోనే పూర్తి చేశారు. ఉస్మానియా కళాశాలలో బీఏ చదివారు. 2067లో హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లా (న్యాయవాద) కోర్సులో చేరారు. అప్పటికే కమ్యూనిస్టు రాజకీయాలతో ఉన్న అనుబంధం కారణంగా 19 ఏళ్లకే ఏఐఎస్ఎఫ్ కర్నూలు టౌన్ కార్యదర్శిగాను, 1960లో జిల్లా కార్యదర్శిగా ఎదిగారు. ప్రతి విద్యార్థికి చదువు, పోరాటం.. రెండు కళ్లని చెప్పే సురవరం జీవితంలో రెండు మరచిపోలేని సంఘటనలు ఉన్నాయి.
అందులో ఒకటి బ్లాక్ బోర్డుల ఉద్యమమైతే, మరొకటి 1962లో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరిగిన 62 రోజుల నిరవధిక సమ్మె. ఆయన నాయకత్వంలోనే జరిగింది. ఆ తర్వాత ఆయన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అయ్యారు. ఆ మరుసటి ఏడాది జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శి పదవిని రెండుసార్లు నిర్వహించిన సురవరం ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షునిగానూ పనిచేశారు.
1972లో ఏఐవైఎస్ జాతీయ అధ్యక్షునిగా ఉంటూ పలు అంతర్జాతీయ నదస్సులకు ప్రాతినిధ్యం వహించారు. ఈ కాలంలో జై ఆంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా చురుగ్గా పనిచేశారు. కొచ్చిన్ లో జరిగిన సీపీఐ 9వ జాతీయ మహాసభలో జాతీయ కౌన్సిల్ కి ఎంపిక అయ్యారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు మకాం మార్చిన సురవరం పార్టీ రాష్ట్ర వ్యవహారాలలో క్రియాశీలకమయ్యారు. 1974 ఫిబ్రవరి 19న బీవీ విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఏఐటియూసీ నాయకురాలిగా ఉన్నారు.
ప్రొఫైల్
పేరు- సురవరం సుధాకర్ రెడ్డి
తల్లిదండ్రులు: ఈశ్వరమ్మ, వెంకట్రామిరెడ్డి
పుట్టిన ఊరు: కొండ్రావ్ పల్లె
స్వగ్రామం- కంచుపాడు, మానవపాడు మండలం, ముహబూబ్నగర్ జిల్లా
చదువు- బీఏ, ఎల్ఎల్ బీ
భార్య- డాక్టర్ బీవీ విజయలక్ష్మి
పిల్లలు- ఇద్దరు కుమారులు
నిర్వహించిన పదవులు: పార్లమెంటు సభ్యుడు సహా అనేకం
ఎన్నికల ప్రస్థానం...
1985లో తొలిసారి, 1990లో రెండోసారి కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 1994లో కర్నూలు జిల్లా డోన్ నుండి ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డిపై పోటీకి దిగారు. అసెంబ్లీకి వరుసగా మూడుసార్లు ప్రయత్నించి విఫలమైన సురవరం 1998లో నల్లగొండ లోకసభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఈ కాలంలోనే పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా పనిచేశారు. ఎంపీగా ఉంటూ పార్టీ కార్య దర్శి పదవిని నిర్వహించిన వ్యక్తి కూడా సురవరమే.
2000వ సంవత్సరంలో చంద్రబాబు సర్కార్ విద్యుత్ చార్జీలు పెంచినప్పుడు జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. బషీర్బాగ్ ఘటనలో లాఠీ దెబ్బలు తిని ఆస్పత్రి పాలయ్యారు.
2004 ఎన్నికల్లో నల్లగొండ నుంచి రెండోసారి ఎన్నికై... కార్మిక శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘ చైర్మన్ గా పనిచేశారు. చండ్ర రాజేశ్వరరావు తర్వాత సీపీఐకి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయిన రెండో తెలుగు వ్యక్తి సురవరమే.
(ఈ వ్యాసం నేను గతంలో రాసింది. సాక్షి దినపత్రిక సౌజన్యంతో)
Next Story