గ్యాంగ్స్ ఆఫ్ బెంగళూరు... నవల సమీక్ష
నేరగాడు నిజాయితీగా ఆటోబయాగ్రఫీ రాస్తే ఎలా ఉంటంది? ’గ్యాంగ్స్ ఆఫ్ బెంగుళూరు’ లాగా ఉంటుంది. ఇది ప్రతి గ్యాంగ్ కి, ప్రతి వూరికి వర్తించే విశ్వజనీన రచన
-డా.పాండు కామ్టేకర్
ఒక మనిషి తన బాల్యములో ప్రవర్తనా లోపాలు ( behavioral issues ) , యుక్త వయస్సులో వచ్చే సంక్షోభాలు ( adolescence crisis ) , అప్పుడు వచ్చే ఉద్వేగ పరంపరలు ( emotions ) తదితరాల ప్రభావం సమాజాభివృద్ధి ( social development )ని , మానవ వికాసాభివృద్ధి ( development )ని వివిధ స్థాయిలలో అతని వ్యక్తత్వాన్ని ఎలా తీర్చి దిద్దుతాయో " గ్యాంగ్స్ ఆఫ్ బెంగళూరు " విశదంగా చెబుతంది. ఈ పుస్తకములో రచయిత అగ్ని శ్రీధర్ తన నిజ జీవిత చీకటి ప్రపంచంలో ( under world ) తాను చూసిన అంశాలను చక్కగా , అందరిని అబ్బుర పరిచే విధంగా విశదీకరించారు. ఇది మామూలు సంప్రదాయ నవల కాదు. ఏ మాత్రం కాల్పనికథ ( romanticism ) కు తావు లేకుండా ఎంతో భిన్నం గా ఈ కథ సాగుతుంది. నాయకుడు , ప్రతి నాయకుడు, నవలా ప్రేమలాంటి జుగుప్సాకరమైన వర్ణనలతో పాఠకులను ఆకట్టుకునే ఏ జిమ్మిక్కుల ప్రయోగం ఇందులో ఉండదు. జీవిత ప్రవాహం లాగనే ఈ నవల్లో కూడా ఎన్నో పాత్రలు వస్తుంటాయి, పోతుంటాయి.అయినప్పటికీ పాఠకులకు ఆకట్టుకుని , ముందు ముందు ఎలా జరుగుతుందో, ముగింపు ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ రేకెత్తిస్తూ ఏక బిగిగా కథ సాగుతూ ఉంటుంది.
కథలోకి వద్దాం:
మొదట, న్యాయ విద్య అభ్యసించి , న్యాయవాది కావాలని అగ్ని శ్రీధర్ బెంగళూరుకు వస్తాడు. ఈ క్రమములో తన తమ్మునిపై ఒక ఒక రౌడీ మాపియా దాడీ చేస్తుంది. ఈ సంఘటనతో శ్రీధర్ మాపియ నాయకుడి ( కొత్వాల్ రామచంద్ర ) పై పగ పెంచుకుంటాడు. ప్రతీకారం తీసుకోవాలనుకుంటాడు. ఈ ప్రయత్నములో భాగంగా ఎన్నో సంఘటనలు , ఎన్నో నేరాలను , వివిధ నేరాలలో రాటుదేలిన మనస్తత్వం గల వ్యక్తుల ప్రవర్తనల తీరు తెన్నులను రచయిత చాలా గొప్పగా మనకు పరిచయం చేస్తాడు. అతడి సమాచార సేకరణ ఒక పెద్ద శాస్త్రీయ , అపరాధ పరిశోధను మించి ఉంటుంది.
అందులో “ వాసు " ఒక పాత్ర. పెద్ద ధనవంతుని కొడుకైన వాసు చిన్నప్పుడు ఊటీ , కోడై కెనాల్ లలో ధనవంతులు చదివేటువంటి ఒక పాఠ శాలలో తండ్రి చేర్పిస్తాడు. అక్కడ బడి నుండి 10-15 కి మీ దూరం నడుచుకుంటూ పారిపోతాడు. అతన్ని భరించలేక యాజమాన్యం వెదికి తీసుకు వచ్చి తల్లి దండ్రులకు అప్పగిస్తుంది. అతన్ని తండ్రి ఫాక్టరిలో తనకు సహాయం చేయుటకు పెట్టుకుంటాడు. ఇక్కడ బాగానే పని చేస్తాడు. కాని ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు. కొడుకుని దారికి తెచ్చేందుకు తండ్రి ఒక మాఫియా లీడర్ సాయం తీసుకుంటాడు. అతడు వాసుని బెదిరించి చికాకు పరుస్తాడు. అప్పటి నుండి ఆ మాఫియా లీడర్ మీద పగ పెంచుకుని రౌడీలతో సహవాసం మొదలుపెడతాడు. ఇక్కడ తండ్రి చేసిన ఒక పొర పాటుతో కొడుకు పెడ దారిన పడుతాడు. ఈ క్రమములో శ్రీధర్ , బచ్చన్ , శెట్టి , లాంటి వారితో చేతులుకలుపుతాడు. కొత్వాల్ హత్యలో బాగస్వామి అవుతాడు. అంతే గాదు ఇతడు చిన్నప్పటి నుండి మొండి గాను ( stubborn ) గా , జిద్దు ( temper tantrum ) , అతి దుడుకు , దూకుడు ( impulsivity ) , రాజీ లేని తనం ( rigid ) , సామాజిక విలువలకు , నైతిక విలువలకు లెక్కచేయని మధ్యస్థ దిగువ మూర్తి మత్వ లక్షణాల ( borderline personality traits ), దుడుకు మూర్తి మత్వ ( impulsive personality traits ) లక్షణాలను ప్రదర్శిస్తూ ఉంటాడు.
ఈ లక్షణాలు కాకుండా చాలా మందికి శరీరమును దృఢముగా ( body build ) ఉంచుకునుటకు అధిక శ్రద్ధ , ఏ మాత్రం అవకాశం దొరికినా తన శక్తిని , తన పోరాట పటిమను ( fighting skill ) చూపించు కోవాలని గాఢమైన తపన , తనను చూసి అందరు బయపడాని , అందరిలో తాను మేటి ( Centre of attraction ) గా ఉండాలనే బలమైన కోరిక లాంటి హిస్టీరియోనిక్ మూర్తి మత్వ ( histrionic personality )లక్షణాలు తరుచుగా కనిపిస్తాయి.
ఏదో తమాషాగా, ఒక సాహసకృత్యం ( adventure ) చేయాలనే ఉత్సాహంతో ఒక కొంత మంది కుర్రవాళ్ళు ఒక పిసినారి ధనవంతుని ఇంటిపై రాళ్ళు రువ్వి చికాకు పరిచి అమిత ఆనందం పొందే విధానము యుక్త వయస్సులో ( adolescent ) ఎంత సంక్లిష్ట దశనో , ముందు ముందు జీవన దశలలో దాని ప్రభావం ఏ మెరకు ఉంటుందో కళ్ళకు కట్టినట్లు నవలలో గ్రహిస్తాము. బాల్యం నుండి మనస్సులో ( unconscious mind ) లో ఎక్కడో పేరుకు పోయిన అసంతృప్తి ఏదో ఒక సంఘటన వలన ముఖ్యంగా తన ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిన సంఘటన ద్వారా బయట పడుతాయనే విషయం ఇందులో చూడవచ్చు. ఇది మానవ విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలు బల పరిచిన విషయమే.
కొంత మంది కుర్రాళ్ళు వామ పక్ష భా వాలను వల్లే వేస్తూ బంది పొట్లను , దొంగలను కూడా విప్లవకారులని సమర్థించే తీరు, హోటళ్లు , ధనవంతులు దోపిడిదారులని భావిస్తూ , ఒక హోటలుకు పొయి బాగా తిని అతి తక్కువ బిల్ ఇచ్చి , గొడవ చేసి , సోషలిజం మీ పెద్ద ఉపన్యాసమివ్వటం , హాస్టల్ లో ప్రాంతీయ తత్వం పరంగా రెండు గ్రూపులుగా విద్యార్థులు విడి పోయి అధిపత్యము కొరకు తగవులు పెట్టుకోవడం మనకు తెలిసిందే , ఆయా గ్రూపులకు బయటి రౌడీలు మద్దతు ఇవ్వడం , ఆ గ్రూపులకు బాగా రాజకీయ నాయకులు అండ దండలు, మద్దతు ఇచ్చి ఎలా పెంచి పోషిస్తూ ఉంటారో... ఈ నవల్లో చిత్రీకరించిన తీరు అమోఘం.
నేరాలు చేసే వాళ్ళు ఎలాంటి నేరాలను ఎంపిక చేసుకుంటారు , ఎలాగా పథక రచన ( planning ) చేస్తారు , దాని అమలు చేయు విధానములు కూడా చాలా తెలివిగాను , విచిత్రముగాను ఉంటాయి. అందులో ఒకటి దొంగ నోట్ల వ్యాపారం. అసలు దొంగ నోట్లు ఉండనే ఉండవు. కాని ఉంటాయని భ్రమ కల్పించి , ప్రచారం చేసి , ఒకడు నకిలీ నోట్ల సూట్ కేసు తో వస్తాడు. ఇంకోకడు అసలీ నోట్ల సూట్ కేసుతో వచ్చి , సూట్ కేసులు మార్చుకునే సమయములో సరిగ్గా ఒక పోలీస్ వచ్చి సూట్ కేసులు పట్టుకుంటాడు. వాళ్ళు ఇరువురు తలా ఒక దిక్కు పారిపోతారు. ఈ పోలీస్, ఆ దొంగ నోట్లు సరఫరా చేసే వ్యక్తి అంతాఒక ముఠాగా ఏర్పడి పథకం ప్రకారం చేసే సమిష్టి నేరం (Organized Crime ) . ఇంకోకడు ఎలెక్ట్రిక్ మరియు ఎలక్ట్రానిక్ పరకరాల మెకానిక్ షాప్ పేరుకే పెట్టి నడుపుతుంటా. అతడు మాత్రం పెద్ద హోటల్లో గది అద్దెకు తీసుకుని ఒక పెద్ద కంపెనీ ఉద్యోగి మాదిరి సూట్ బూట్ తో ఒక మంచి సూట్ కేసు పట్టుకుని దిగుతాడు. ఆ సూట్కేసులో స్క్రూ డ్రైవర్లు , లెంచిలు లాంటివి మాత్రమే ఉంటాయి. అతడు ఆ హోటల్ గదిలో దిగి ఆ గదిలోని ఎలెక్ట్రిక్ పరికారాలలో గల లోపలి స్పేర్ పార్ట్స్ తీసుకుని మరునాడు మెల్లగా హోటల్ కాలి చేసి పోతాడు. తరువాత వాటిని ఎక్కడో అమ్ముకుంటాడు.
ఇదిలా ఉండగా ఇంకోకడు పాత వస్తువులు సరసమైన ధరకు కొంటా మని వార్తా పత్రికలో ప్రకటన ఇస్తాడు. ఇల్లు మారే వారు , ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళను ఇతడు టార్గెట్ చేస్తాడు. వారు పోను చేసి పిలుస్తే ఇతడు ఒక ట్రాలీ తీసుకుని , ఒక పెద్ద కంపెనీ ప్రతినిధి వేషంలో వెళ్ళి , బేరం ఎక్కువ చేయకుండా అతి ఎక్కువ ధరకు బేరం కుదుర్చుకుని చెక్ తో పేమెంట్ ఇస్తాడు. క్యాష్ కావాలని అంటే తమది పెద్ద కంపెనీ అని , అన్నీ చెక్ తోనే పేమెంట్ చేస్తుందని నమ్మించి నకిలీ చెక్ ఇచ్చి వస్తువులు తీసుకుని ఉడాయిస్తాడు. ఇంకొక గ్యాంగ్ ప్రేమికులను టార్గెట్ చేసి ఒంటరిగా ఉన్న వాళ్ళను పట్టి అమ్మాయిలను రేపు చేయడం వారి వద్ద డబ్బులు దోసుకోవడం చేస్తారు , ఎందుకు అంటే “ ప్రేమికులు ఎవరు కూడా పోలీసులకు పిర్యాదు చేయరు. ప్రేమంత రహస్యంగా సాగే చాటు మాటు వ్యవహారం " అని సర్ది చెబుతారు. వీటితో పాటు ఎందరో పాత్రలుగా ప్రత్యక్షమవుతారు. వాళ్ళ గురించి కూడా తన నిశిత పరిశీలనతో వర్ణిస్తాడు అందు కొన్ని ముఖ్యమైనవి చూద్దాం.
కొత్వాల్ రామచంద్ర : ఇతడు ఎవరిని నమ్మడు. ఇతడు గెరిల్ల యోధుని మాదిరి ఎక్కడ తింటాడో , ఇక్కడ పడుకుంటాడో ఎవరికి తెలియదు , అతని ఇల్లు ఎక్కడ ఉంది , అతని కుటుంబ సబ్యులు ఎవరు , వారు ఏలాంటి వారు , వారు ఎక్కడ ఉంటారు తధితర విషయాలు ఎంతటి నమ్మకస్తునికి కూడా తెలియదు. అతని కనుక్కొనుటకు ఒక ఉన్నత స్థాయి పోలీస్ బృందానికి ముప్పు తిప్పలు అయ్యింది. ఇతనికి కొన్ని మూఢ నమ్మకాలు కూడా ఉన్నాయి , తినగానే ప్లేటు వెంటనే తీసివేయాలి. చిన్న గోడవలలో తల దూర్చ వద్దు , తిథి , వార నక్షత్రాలు , వర్జ్యం , అష్టమి , అమావాస్య , పున్నమి లాంటి మొదలైన సమాచారము కచ్చితమైనది ఉంటుంది. అతడు ఎప్పుడు ఒంటరిగా ఉండదు. ఎవరో ఒకరు నమ్మకస్తుడు తోడు ఉండాలి. అతని గ్యాంగ్ మనుషుల బాగోగులను పట్టించుకొనడు. ఎంతో ముందు చూపుతో ఉండే ఇతడు తన వెంట వాళ్ళే తన పట్ల తీవ్ర అసంతృప్తి ఉన్నారని గ్రహించక , వారి చేతిలో సునాయాసంగా చనిపోతాడు.
శీతల శెట్టి : తడు కొత్వాల్ కు కుడి భుజం లాంటి వాడు. కొత్వాల్ చేసే అన్నీ విషయాలలోనూ , పనులలో కూడా వెన్నంటి వుండీ చాలా నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఇతనికి కలిగిన ఏ ఇబ్బందిని కొత్వాల్ సరిగ్గా పట్టించుకోలేదు. అందు వలన ఇతనికి కొత్వాల్ మీద లోలోపల మిక్కిలి అసంతృప్తి , కోపం పేరుకుపోయి ఉంటుంది. అవకాశం దొరికితే కొత్వాల్ చంపాలని మనుస్సులో ఉండేది. ఇతడు ఒంటరిగా ఉన్నప్పుడు శ్రీధర్ తదితరులతో తన గోడు వెల్ల గక్కుతుంటాడు. ఏమాత్రం మద్యం తాగినను విచక్షణ కోల్పోయి రహాస్యములను బయటికి చెప్పేవాడు. చివరికి ఇతడి నోటి దురుస్సు వల్లే కొత్వాల్ ను తొందరగా హతమార్చ వలసి వచ్చింది.
వరద : ఇతడు కూడా దుడుకు స్వభావమే కలవాడు. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అనే రకం. ఇతడు కూడా రెండు పెగ్గుల మద్యముకే విచక్షణ కోల్పోయే వాడు. కయ్యానికి కాలు దువ్వటం. తాగితే ఏ రహస్యమైన వెల్ల గక్కడం ఇతని నైజం. ఇతడు శెట్టితో తరుచుగా చీటికి మాటికి తగాదా పడటం , దానిని శ్రీధర్ సర్దిచెప్పటం. కొత్వాలుకు వ్యతిరేకంగా తాము మాట్లాడింది ఎక్కడ బయట పెట్టి అందరి ఇబ్బందుల పాలు చేస్తారో అనే బయం చేత తొందర తొందరగా కొత్వాల్ ను హతం చేస్తారు. వారి భావాలు భిన్నగా ఉంటాయి. అందులో కొన్నింటిని చూద్దాం. ఒకరు “ మనము దాడిచేసి తీవ్రంగా గాయపర్చి జీవితాంతం బాధను పడుతూ మరిచి పోకుండా ఉండాలి. ఎందుకంటే చనిపోతే హత్య నేరానికి బెయిలు దొరకదు. అంతే కాదు సాక్ష్యం ఉంటే యావజ్జీవ శిక్ష పడుతుంది. అదే హత్య యత్నం అయితే బెయిలు దొరుకుతుంది. ” అని వారు ఎంత జాగ్రత్తగా నేర్పుగా ఆలోచిస్తారో తెలుస్తుంది."
ఇంకొకసారి ఒకరు ‘‘దాడి చేయడానికి కచ్చితమైన కారణం ఉండాల్సిన అవసరం లేదు " అని చెప్పుతాడు. ఇంకొక సారి ఒకరు “ అన్ని దానాల కంటే ఏ దానము గొప్పదని అడిగితే అందరు చెప్పే అన్న దానం లాంటివి చెప్పితే కాదు " నిదానం “ అని ” చెప్పుతారు. దీని వల్ల వారిభావాలు తెలివి తేటలు అంచనా వేయవచ్చు. ఇంకొక సందర్భములో " ప్రతి రౌడీ కూడా తాను చేయబోయే దాడి ఏ ఒక్క కారణం చేత నైనా ఆగిపోతే బాగుంటుంది మనుస్సులో అనుకుంటారు ” అని చెప్పుతాడు. ఇంకొకసారి ఒక ఆటో వాడితో గొడవ పెట్టుకుంటూ ఉంటే ఒక నాయకుడు " చిన్న విషయాలలో మనం తలా దూర్చ రాదు " అని తన వారికి హితవు చెప్పుతాడు. అంతే గాక ఇందులో జయరాజుపై హోటల్ లో సామూహికంగా జరిగిన దాడి తీరు తెన్నులు , జయరాజుతో కలిసి కొత్వాల్ హత్య గురించి మాట్లాడిన ముందు రోజే , కోత్వాల్ తో కలిసి శ్రీధర్ బెంగళూరులో పోతుంటే జయరాజు వెంబడించటం , మూడు సార్లు వెంట్రుక వాసిలో దాడి నుంచి తప్పించుకోవడం , ఎవరు, ఏ వర్గమో తెలియని పరిస్తితి. ఒకవైపు జయరాజు కొత్వాలును చంపడానికి ప్రయత్నిస్తుండగా, మరొక వైపు కొత్వాల్ జయరాజును చంపాలని పథకం. ఇద్దరి మధ్య ఇరుక్కున్న శ్రీదర్ బృందం ఇంకో వైపు .ఇలా త్రిముఖ ( triangular ) వ్యూహాలతో కథ సాగుతుంది.
ఎవరూ ఎవరిని నమ్మని పరిస్థితులు:
కొత్వాల్ ను చంపకుంటే జయ రాజు మనుషులు వదలరు , తన పైననే కుట్ర చేశావని కొత్వాలు వదలడు. పోలీసులకు చెప్పితే ఈ ఇద్దరు తనని వదలరు. అయినా సరే, ఆగిపోరాదు, ముందుకు పోవాలసిందే. ఈ సందిగ్ధములో ఒక రోజు రాత్రి తాము రహస్యముగా తల దాచుకున్న తోటలోనే గుట్టు చప్పుడు కాకుండా కేవలం ఒక నిమిషం వ్యవధిలోనే కొత్వాల్ ను హతం చేయడంతో ముగుస్తుంది ఈ కథ.
ఇందులో 50 ఛాప్టర్లు ఉన్నాయి. ప్రతి చాప్టర్ ఒక కేసు స్టడీ. ప్రతి చాప్టర్ లో ఎన్నో పాత్రలు. వివిధ పట్టణ సామాజిక పరిస్తితులు. బెంగళూరు వీధులన్ని , మలుపులు , రోడ్లు తదితరములను క్రమ పద్ధతిలో వర్ణిస్తున్న తీరు మన కళ్ల ముందు ఉంచాడు. దీనిని టీచర్లు , తల్లి దండ్రులు , మోటివేషన్ స్పీకర్లు , సైకాలజిస్టులు , రాజకీయ నాయకులు , పోలీసులు మొదలు కొని అన్ని వర్గాల వారు చదివి మానవ సమాజాన్ని , సమాజిక , ఆర్థిక , రాజకీయ , మానసిక పరిస్థితులు మనిషిని ఎలా అధో పాతాళానికి తీసుకు పోతాయో తెలుసుకుని జీవితాన్ని సరి దిద్దుకునే అవకాశాన్ని ఇచ్చిన అగ్ని శ్రీధర్ కు, చక్కగా దానిని తెలుగులో అనువాదం చేసిన సృజన్ , భిన్నమైన పుస్తకాలను ప్రచురించే అన్వేక్షి ప్రచురణ సంస్థకు అభినందనలు..
( డాక్టర్ పాండు కామ్టేకర్, క్లినికల్ సైకాలజిస్ట్. వరంగల్ , తెలంగాణ )