ఒక్క ఐడియా పేదరికానికి పాతరేసింది!
ఎందుకు రా,పొద్దుగూకులూ ఆ ఫోన్ పట్టుకుని వేలాడుతుంటావ్ అని వాళ్లమ్మానాన్న తిట్టేవాళ్లు, మీకర్థం కాదులే అంటూ ఆ కుర్రాడు వెళ్లేవాడు, ఈవేళ రూ.400 కోట్లు సంపాయించాడు
ఆమధ్య ఐడియా వాళ్లది ఓ ప్రకటన వచ్చేది.. ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చవచ్చుననేది ఆ ప్రకటన సారాంశం. పని పాటా లేకుండా ఎందుకురా.. అట్లా ఊరికే ఆ పనికి మాలిన సెల్ ఫోన్ చూసుకుంటుంటావని పెద్దోళ్లు తిడుతుంటారు. అట్లాంటి సెల్ ఫోనే ఆమధ్య ఓ పేదను బిగ్ బాస్ 7 సీజన్ విజేతను చేసింది. ఇప్పుడో యూట్యూబర్ ను కోట్లాధిపతిని చేసింది.
రాజస్థాన్‌లోని ఆజ్మేర్ కు చెందిన ఈ కుర్రాడు ఇప్పుడు సుమారు 4 వందల కోట్లకు అధిపతి. పేదరికం నేర్పిన అనుభవాలు, పాఠాలు, చూటిపోటి మాటలు ఆ కుర్రాడిలో కసిని పెంచితే తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం ఆ కుర్రాడిని ఎక్కడికో తీసుకెళ్లింది. అతని పేరే గౌరవ్ చౌధురి. కిరాణాషాపు మీద వచ్చేది సరిపోక గౌరవ్ తండ్రి సంపాదన కోసం దుబాయ్ వెళ్లాడు. తల్లితో కలిసి ఆ దుకాణం నడుపుతూనే స్కూలుకెళ్లిన గౌరవ్‌కి ఇంటర్ కొచ్చేసరికి స్నేహితుల వల్ల టెక్నాలజీ మీద ఆసక్తి కలిగింది. క్లాస్‌లు మానేసి మరీ తెలిసిన వాళ్ల దగ్గర కోడింగ్ నేర్చుకునేవాడు. ‘కాలేజీ ఎగ్గొట్టి ఏదేదో నేర్చుకుంటున్నా’వంటూ అతని తల్లిదండ్రులు కోప్పడేవారు. ఆ సమయంలో కోడింగ్ గురించి అమ్మానాన్నలకు చెప్పినా అర్థమయ్యేది కాదు.
సామాన్యులకూ అర్థమయ్యేలా..
గౌరవ్ ఆసక్తిని లెక్చరర్లు గుర్తించి ఎలక్ట్రానిక్స్ చదువుకోమని ప్రోత్సహించారు. అతని తండ్రి మాత్రం ఇంటర్ అయ్యాక ఏదో ఒక ఉద్యోగంలో పెట్టొచ్చని కొడుకును దుబాయ్ తీసుకెళ్లాడు. అక్కడ పని చేయడానికి ఇష్టపడని గౌరవ్ చదువు మీద దృష్టి పెట్టి బిట్స్ పిలానీలో మైక్రో ఎలక్ట్రానిక్స్‌లో సీటు సంపాదించి దుబాయ్ క్యాంపస్‌లో చేరాడు. ఆ సమయంలో గౌరవ్‌కి లెక్చరర్లూ, స్నేహితులూ ఆర్థికంగా సాయపడ్డారు. దానికి తోడు పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసి అతను ఫీజులు కట్టుకునేవాడు. 2012లో చదువు పూర్తి చేశాడు. దుబాయిలో చిన్న ఉద్యోగం చేస్తూనే ఓ యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాడు. 2015లో ఉద్యోగం మానేసి ‘టెక్నికల్ గురూజీ’ పేరిట యూట్యూబ్ ఛానల్‌ని ప్రారంభించాడు. దాని ద్వారా మార్కెట్‌లోకి కొత్తగా వచ్చే ఫోన్లూ, ల్యాప్‌టాప్‌లూ, కార్ల గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అర్థం కాని సాంకేతిక విషయాలను సైతం సింపుల్ హిందీలో వివరించడం అతని ప్రత్యేకత. అందుకే గౌరవ్ ఛానల్ జనాల్లోకి త్వరగా వెళ్లింది. క్రమంగా యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబర్లతోపాటు ఆదాయం కూడా పెరుగుతూ వచ్చింది.
2.5 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు..
ప్రస్తుతం రెండున్నర కోట్ల మంది సబ్‌స్క్రైబర్లతో దేశంలోనే అత్యధికమంది చందాదారులున్న టెక్ యూట్యూబర్‌గా గౌరవ్‌కి గుర్తింపు ఉంది. యూట్యూబ్‌లో రోజూ ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తుంటాడు. టెక్నాలజీలో వస్తున్న మార్పులను ప్రతి ఆదివారం వివరిస్తుంటాడు. యూట్యూబ్ ద్వారా ఇప్పటికే దాదాపు రూ.400 కోట్లు సంపాదించిన గౌరవ్ ప్రతినెలా కోటి రూపాయల ఆదాయం కళ్లజూస్తున్నాడు. చిన్నతనంలో తమకు ఏమేమి లేవని ఫీలయ్యాడో అవన్నీ సమకూర్చుకున్నాడు. ఢిల్లీ, దుబాయ్‌ల్లో వందల కోట్ల విలువ చేసే ఇళ్లు కట్టుకున్నాడు. పోర్షే, రోల్స్‌రాయిస్, రేంజ్‌రోవర్, బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, థార్ వంటి విలువైన కార్లు కొనుక్కున్నాడు. ఫోన్లు కూడా ప్రత్యేకంగా ఉండాలని రష్యాలో బంగారు ఐఫోన్లను కస్టమైజ్డ్‌గా తయారు చేయించుకున్నాడు.
ఏమిటితని ప్రత్యేకతంటే...
అందరికంటే భిన్నంగా ఆలోచించడమే గౌరవ్ ప్రత్యేకత. ప్రతి విషయంలోనూ ప్రత్యేకంగా ఆలోచిస్తారు. వన్‌ప్లస్, శామ్‌సంగ్, గూగుల్ సంస్థలు సైతం గౌరవ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించి తమ టెక్నాలజీ వివరాలను అతనితో పంచుకున్నాయి. తమ ఆఫీసుల్లో వీడియో చేసుకోవడానికి గౌరవ్‌కు అనుమతిచ్చాయి. ఆపిల్ సీఈఓ టిమ్‌కుక్‌ను కలవాలని కలగనేవారు ఎందరో ఉంటారు. గౌరవ్ వీడియోలను చూసిన టిమ్ కుక్ స్వయంగా గౌరవ్‌ను కలవాలనుకున్నాడంటే గౌరవ్ రేంజ్ ఏస్థాయిదో ఆలోచించండి. ‘కలలు కనండి.. వాటిని నెరవేర్చుకోవడానికి కష్టపడండి’ అని కదా డాక్టర్ అబ్దుల్ కలాం చెబితే గౌరవ్ దాన్ని చేసి చూపించాడు. చిన్నతనంలో అమ్మ ఒడిలో పడుకుని కన్న కలలన్నింటినీ కృషితో నిజం చేసుకున్నాడు. సక్సెస్ అంటే ఇది కదా. ఫోన్ పట్టుకోగానే సరిపోదు సద్వినియోగం చేసుకోవాలి.