
వెళ్ళే ముందు చెప్పవా?
నేటి మేటి కవిత
ఎందుకలా హఠాత్తుగా వెళ్ళిపోయావు?
ఈ వెళ్ళిపోవడం అనేది
ఎంత దుర్మార్గమైంది?
కఠినమైనది?
నిష్క్రమణ ఎంత హృదయం లేనిది?
ఒంటరై..
ఒంటరిగా వెళ్ళిపోవడం?
ఆశలు పెంచి ..
హఠాత్తుగా కూల్చేసి వెళ్లిపోవడం?
మొదటిసారో.. కడసారో
చూసుకోవడానికి ఒక క్షణం కూడా
ఇవ్వకుండా వెళ్ళిపోవడం
ఎంత అన్యాయం?
**
సరే... అది నీ ఇష్టమే
కానీ స్వాగతమో వీడ్కోలో
చెప్పాలనుకుంటాను కదా?
ఇన్ని పారిజాతాలు కాకపోయినా
నీకు చాలా ఇష్టమైన
కొన్ని మోదుగ పూలనైనా
నీ దారిలో చల్లుతూ,
అలా నిన్నో సారి ఇష్టంగా..
నీ నిష్క్రమణని కష్టంగా
చూసుకునే దాన్ని కదా?
*
నువ్వేదో చెప్పదలుచుకున్నావు.
నీకు తెలుసు నువ్వీ భూమి మీద
కొన్ని రోజుల అతిథివి మాత్రమే అని.
అందుకే ఇన్నాళ్ళూ
భద్రంగా దాచుకున్నదేదో
భూమికి పంచేశావు.
నక్షత్రాల్లాంటి కొన్ని మాటల్ని
ఆకాశానికి ఇచ్చేశావు
అయినా మాకు తీసుకోవడమే రాలేదు.
ఇవ్వడమసలే తెలీలేదు!
నీ నిశ్శబ్దాన్ని మేం అర్థం చేసుకోలేదు.
అవి నీ మాటలని తెలుసుకోలేదు!
*
ఇంత పని చేశావేంటి?
వెన్నెలలో వద్దులే,
పగటీలోనూ వద్దు
నువ్వు నిశివి కదా!
కొద్ది నిశీధిలో నైనా..
పోతూ పోతూ
ఇంత చుక్కలా అయినా
నువ్వు నా వైపు చూడాల్సింది.
నన్ను నువ్వూ, నిన్ను నేనూ
ప్రేమిస్తున్నట్లు సాక్ష్యమిచ్చే
చూపులు కావా అవి చెప్పు?
నా వైపలా రాకుండానే..
అలా చూడకుండానే
చివరి వీడ్కోలు
చెప్పకుండానే వెళ్ళిపోతే .,
నువ్వింకా ఈ భూమ్మీద మొలక గానో..
నిశీధి ఆకాశంలో అరుణ తారలాగో
మెరుస్తూ ఉన్నావన్న నిరీక్షణలో..
ఆశ పడుతూ ఇలా ఇక్కడే
నిలబడిపోయేదాన్ని కదా!
మన కలయికని శాశ్వతంగా వాయిదా వేశావు!
ఎంత నిర్దయివి నువ్వు?
నేనిప్పుడు ఎటు పోవాలో చెప్పు?
నీకంటే నాకు ఎక్కువ ఎవరినీ లోకంలో చెప్పు?
మనం మళ్లీ కలిసే తావు
ఎక్కడుందో చెప్పన్నా పోవాల్సింది!
అయ్యో..
నువ్వు వెళ్ళిపోయే ముందర
ఒక వీడ్కోలు సంకేతమైనా ఇవ్వాల్సింది!
*గౌతమీ మాసుల, నిశి,నిశీధి కోసం
Next Story