ఆ..మల్లెలమ్మే వాడు!
x

ఆ..మల్లెలమ్మే వాడు!

నేటి మేటి కవిత


కాల్చి పడేసే మండుటెండలో..

వీధి మలుపులో

వడలిన మల్లెతీగలా

వేసవి మల్లెలు అమ్మేవాడు

ఆ పూలమ్మేవాడు!

తాను కాలిపోతున్నా

ఎందుకో చిరుగా నవ్వుతూ ఉంటాడు.

పూలు కొనే గాజుల చేతులకి

మల్లె పూల పొట్లాలని

అందిస్తూ ఉంటాడు.

సాయంత్రం అయిన వెంటనే..

తనకు తానే

మల్లెల అత్తరు బుడ్డీలా మారిపోతాడు.

దహించే సూర్యుణ్ణి పక్కకి జరిపి

రాతిరి చంద్రుణ్ణి..

తాపం తీర్చే చల్లని వెన్నెలనీ

తలుచుకోక ఏం చేస్తాడు ?

తనఆకాశంలో

ఒకేసారి

సూర్య చంద్రుల్ని వెలిగించుకునే

మాంత్రికుడు ఆ పూలమ్మేవాడు!

పూల బుట్ట ఖాళీ అయ్యాక..

సూర్యుణ్ణి ఆర్పేసి..

మిగిలిన ఆ కాసిన్ని మల్లెలను

నక్షత్రాలుగా మార్చి

ఆకాశంలోకి విసిరేసి ఇంటికెళ్ళిపోతాడు


Read More
Next Story