ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటోలది శ్రమదోపిడిలో అత్యున్నత స్థాయి
ఆర్థిక శాస్త్ర వేత్త ప్రొఫెసర్ జ్యోతి రాణితో ఇంటర్వ్యూ - 2
"ఊబర్, ఓలా టాక్సీ సర్వీసు లక్షల మందికి అందుతోంది. ఊబర్ ఒక కారు కూడా కొనుక్కోదు. ఒక డ్రైర్ ను ఏర్పాటు చేసుకోదు. ఊబర్ కు కానీ, ఓలాకు కాని చెపితే కారో, ఆటోనో మన ముందుకు వచ్చేస్తుంది. ఊబర్ ఆటోలున్నాయి. స్థానికంగా తిరగడానికి మనం బుక్ చేస్తే వస్తుంది. మెయింటెనెన్స్ అంతా డ్రైవర్ దే. నయాపైసా పెట్టుబడి, ఏ రిస్కు లేకుండా కార్మికుడిని దోపిడీ చేసే వ్యవస్థ ఇది." అంటారు ప్రముఖ ఆర్థిక శాస్త్ర వేత్త ప్రొఫెసర్ తోట జ్యోతి రాణి జర్నలిస్టు రాఘవ శర్మకు ఇచ్చిన ఇంటర్వూలో
ప్రశ్న : వ్యవసాయరంగం సంక్షోభంలో ఉన్న ఈ సమయంలో ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి? గ్రామాల నుంచి పట్టణాలకు ఏ మేరకు వలసపోతున్నారు? పట్టణాల్లో వీరికి ఉపాధి అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? ఈ అసంఘటిత రంగ కార్మికుల పరిస్థితి ఎలా ఉంది?
జ్యోతి రాణి : 2001 నాటికి గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్ళే వలస కార్మికులు 30 కోట్ల మంది ఉన్నారు. సంవత్సరానికి కనీసం 20 లక్షల నుంచి 30 లక్షల వరకు పట్టణాలకు వలస పోతున్నారు. ఈ విషయాన్ని కోవిడ్-19 బట్ట బయలు చేసింది. వలసపోయిన వారంతా ఎలా బతుకుతున్నారు? అసంఘటిత రంగంలో పనిచేసే వారి విషయంలో ఏ యజమానికి బాధ్యత ఉంటుంది? వీరికి సంక్షేమ పథాకాలు లేవు, హక్కులు లేవు. కోవిడ్ లాక్ డౌన్ ప్రకటించిన తరువాత వందల కిలోమీటర్లు నడుచుకుంటూ తమ సొంత గ్రామాలకు వెళ్ళి పోయారంటే అసంఘటిత రంగంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టమవుతోంది.
మన వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. గ్రామీణ రంగం దారుణంగా ఉంది. వలస వచ్చిన కార్మికులు పట్టణాల్లో రోజు కూలీలుగా పనిచేస్తున్నారు. చదువుకున్న వారు యూనివర్సిటీలో దినకూలీలుగా పనిచేసేవారు ఎక్కువయ్యారు. ఔట్ సోర్సింగ్ (Outsourcing) ఎక్కువైంది. ప్రపంచ వ్యాప్తంగా 2008లో ఆర్థిక సంక్షోభం వచ్చాక పరిస్థితి ఇంకా దుర్భరమైంది. యాప్ కంపెనీల ద్వారా పనిచేసే గిడ్ వర్కర్ల వ్యవస్థ ఏర్పడింది. గంటల చొప్పున కూడా కాదు. పని ఉంటేనే వేతనం. రోజంతా పని ఉండదు. పని ఉంటేనే ఆ పని ఉన్నమేరకు డబ్బులు. ఈ పద్ధతిలో వారిని పార్టనర్స్ ఉంటారు. సరిగా డెలివరీ చేస్తున్నారా లేదా చూస్తారు. 32 ఏళ్ళ లోపు వారినే అపాయింట్ చేసుకుంటున్నారు. వారికి చాలా తక్కువ రెమ్యూనిరేషన్.
స్విగ్గి, జుమాటో లో పనిచేస్తున్న గిగ్ వర్కర్లు (Gig Workers) ఆర్డర్లను అందచేయడానికి టిఫిన్ బాక్స్, బైక్ అన్నీ ఆ వర్కరే సమకూర్చుకోవాలి. యజమానికి ఏ బాధ్యత లేదు. అన్నీకూడా గిడ్ వర్కరే చూసుకోవాలి. కార్మికుల కొచ్చే ఏ శ్రేయస్సు లేదు. ఎప్పుడు పని దొరుకుతుందా అని ఎదురుచూస్తాడు. ఫోన్ వచ్చిన 30 సెకండ్ల లోపు ఆమోదం తెలపాలి. రోజంతా సెల్ పుచ్చుకుని చూసుకోవాలి. తక్కువ పని ఇచ్చినా తప్పదు. స్వేచ్చగా చేస్తున్నాడంటే ఎలా? ఇందులో శ్రమ దోపిడీ అత్యున్నత స్థాయి కి చేరుకుందని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంటోంది.
ఊబర్, ఓలా టాక్సీ సర్వీసు లక్షల మందికి అందుతోంది. ఊబర్ ఒక కారు కూడా కొనుక్కోదు. ఒక డ్రైర్ ను ఏర్పాటు చేసుకోదు. ఊబర్ కు కానీ, ఓలాకు కాని చెపితే కారో, ఆటోనో మన ముందుకు వచ్చేస్తుంది. ఊబర్ ఆటోలున్నాయి. స్థానికంగా తిరగడానికి మనం బుక్ చేస్తే వస్తుంది. మెయింటెనెన్స్ అంతా డ్రైవర్ దే. నయాపైసా పెట్టుబడి, ఏ రిస్కు లేకుండా కార్మికుడిని దోపిడీ చేసే వ్యవస్థ ఇది.
గ్రామాల నుంచి వచ్చే వలస కార్మికులే ఇందులో ఎక్కువ. వీరి బలహీనతను ఉపయోగించుకుంటారు. అంతా శ్రమ దోపిడీ. ముఖ్యంగా అసంఘటితరంగంలో స్వయం ఉపాధి మహిళలు. ఇది అత్యంత దయనీయమైనదిగా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చెపుతోంది.
మీ ఇంట్లో మీరే పనిచేయండి. మేం టార్గెట్ ఇస్తాం. యజమానికి ఏ బాధ్యతా ఉండదు. ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహించాలి!? ఒక అధ్యయనం ఏం చెపుతోందంటే మూడవ ప్రపంచదేశాల్లో ఏ వస్తువు ఎక్కడి కెళుతుందో కార్మికులకు తెలియదు. యజమానికి ఎలాంటి బాధ్యత లేదు. వర్కర్ బాధ్యత యజమానికి లేదు. పల్లెల్లో బతకలేక, బ్రతుకు తెరువు కోసం పట్టణానికొస్తే ఎంత దయనీయంగా బతుకుతున్నారో స్పష్టంగా చెప్పలేం.
భూములన్నిటినీ గుత్త పెట్టుబడిదారులకు బదిలీ చేయడానికే అమృత రైల్వే స్టేషన్లు వచ్చాయి. రైల్వే స్టేషన్ల చుట్టూ ఉన్న స్థలమంతా గుత్త పెట్టుబడిదారులకు అప్పగించేయడం. ఇదివరలో పల్లెల నుంచి పట్టణాలకు వస్తే గుడిసెలు వేసుకునే వారు. కామన్ ల్యాండ్ లేకపోతే వీరంతా ఎక్కడుండాలి? మెజారిటీ ప్రజల జీవన విధ్వంసం ఎలా ఉంటుందో చూడండి. నగర అభివృద్ధిలో బ్యూటిఫికేషన్ పేరుతో మురికి వాడల్లో వారిని కూడా వెళ్ళగొడతారు. మెజారిటీ ప్రజలకు బతుకు లేకుండా చేసే పరిస్థితి ఏర్పడుతోంది. తాత్కాలికంగా ఉండాల్సిన పనికి ఆహార పథకం 40 ఏళ్ళుగా ఇంకా కొనసాగుతోంది.
ప్రశ్న : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఎంత మటుకు సత్ఫలితాలనిచ్చింది? పేదలకు ఏమైనా ఊరట కలిగించిందా?
జ్యోతి రాణి : నిజానికి 1960 దశకంలో రెండవ పంచవర్ష ప్రణాలిక అయిపోయాక మూడవ పంచవర్ష ప్రణాలికలో 'దేశంలో పెరుగుతున్న పేదరికం' పేరుతో దండేకర్ రాత్ ఒక పుస్తకం రాశారు. ఈ పుస్తకం ద్వారా చాలా పెద్ద చర్చ జరిగింది. ప్రణాలికల రూపకల్పనలో వక్రీకరణ ఉండడం వల్ల పేదరికం పెరిగింది.
నాలుగు, అయిదు పంచవర్ష ప్రణాలికల్లో సంపన్న వర్గం నుంచి సంపదను పేదవర్గానికి బదిలీ చేయాలనుకున్నారు. ఎట్లా బదిలీ చేయాలో తెలియదు. ఆ స్పష్టత లేదు. పేదరికం పెరుగుతోందంటే, పనికి ఆహారపథకం 1980లలోనే వచ్చింది. తాత్కాలిక ఉపాధి కోసం పనికి ఆహార పథకం మొదలైంది. ప్రభుత్వాలు మారినప్పుడు అదే లక్ష్యంతో పేరు మారినా కొనసాగుతున్నాయి.
తాత్కాలికంగా ఉండాల్సిన పనికి ఆహార పథకం 40 ఏళ్ళుగా ఇంకా కొనసాగుతోంది. అంటే వ్యతిరేక దిశగా మన అభివృద్ధి కొనసాగుతోందనే కదా! గ్రామీణ వలసలను ఆపడానికి సంవత్సరానికి కుటుంబానికి 100 రోజులు పనికల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ పథకం మొదలైంది. వేతనాల కేటాయింపు స్థిరంగా ఉంటుంది. ఎక్కువమంది వస్తే కూలి తగ్గిపోతుంది.
కుటుంబానికి 100రోజుల పని కల్పించాలన్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు వస్తే ఒక్కొక్కరికి 50 రోజుల చొప్పునే పని వస్తుంది. ఈ పథకానికి కేటాయింపులు కూడా చాలా తక్కువ. ఈ పథకం ఇంకా కొనసాగుతోందంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఆలోచించండి. యువత ఈ పనిని పట్టించుకోవడం లేదు. వీరు తిండికి లేక పనిచేస్తుంటే, ఆ కూలి డబ్బులు కూడా బకాయి పెట్టడం దుర్మార్గం.
ఈ పథకం ద్వారా గ్రామీణ మౌలిక సదుపాయాలు ఏమైనా కల్పించారా? ఈ పథకాన్ని ఆధిపత్య వర్గాల ప్రయోజనాలకు ఉపయోగిస్తారు. వీరికి జీతాలు సరిగా లేవు. పనులు సరిగా ఇవ్వరు. ఈ పథకంలో అనేక లోపాలున్నాయి. ఈ పథకం మీద ఆధారపడి వలస పోకుండా ఉంటారనే గ్యారంటీ లేదు. గ్రామీణ పేదలు వలస పోతున్నారు. ఇది గ్యారంటీ ఇచ్చేపథకం కాదు. గ్రామీణ పేదలను వలసపోకుండా ఈ పథకం ఆపడం లేదు. దీన్నినమ్ముకున్న వారు ఎవరూ లేరు.
ప్రశ్న :ఆంధ్ర ప్రదేశ్ బాగా పర్ఫార్మ్ చేస్తోందని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెపుతోంది. తెలంగాణా రిచ్చెస్ట్ స్టేట్ అని, విదేశీ పెట్టుబడులు కూడా కుప్పతెప్పలుగా వచ్చాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెపుతోంది. రాష్ట్రాల ప్రగతికి, ఉద్యోగాలకు సంబంధం లేదా?
జ్యోతి రాణి : ప్రగతి అని దేనిని అనుకుంటున్నారు? ప్రజలందరూ గౌరవ ప్రదమైన ఉపాధులతో, ఆత్మాభిమానంతో బతికితేనే కదా ప్రగతి అంటారు! తొలుత జాతీయాదాయం పెరిగితేనే ప్రగతి అన్నారు. తలసరి ఆదాయం పెరిగితేనే ప్రగతి అన్నారు. ఆర్థికఅసమానతలు తీవ్రంగా పెరుగుతున్న సమయంలో జాతీయాదాయం, తలసరి ఆదాయం ప్రగతిని ప్రతిబింబించ లేవు. ఆ దృష్ట్యా చూసినట్టయితే గౌరవ ప్రదమైన ఉపాధి కల్పన గత 20 సంవత్సరాలుగా ఏమైనా జరిగిందా? రెగ్యులర్ ఉద్యోగాలు ఏమైనా కల్పించారా? కార్మికులకు సంక్షేమం లేదు, ఉద్యోగం పోదన్న గ్యారంటీ లేదు. ఇప్పుడు టెంపరవరీ ఉద్యోగాలే జీవనో పాది కదా. మెజారిటీ ప్రజలకు విద్య, వైద్యం అందుబాటులోకి రావాలి కదా!
'గ్లోబలైజేషన్ కు వికృత ముఖం ఉంటుంది. అది మానవ జీవితాలను విధ్వంసం చేస్తుంది. పరిస్థితిని కొంచెమైన మానవీయం చేసుకోవాలంటే విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలో ఉండాలి' అని 1990లోనే అమర్త్య సేన్ అన్నారు. ప్రైవేటు రంగమే ఉండకూడద ని అమర్త్య సేన్ అంటారు.
అటువంటప్పుడు గ్లోబలైజేషన్ వికృత రూపానికి కొచెంమైన మానవీయ ముఖం రావాలంటే విద్య వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. అందరికీ విద్య, వైద్యం అందుబాటులోకి రావాలి. అవి ప్రైవేటు రంగంలో ఉండకూడదు. ఆక్స్ఫార్డ్ రిపోర్టు కూడా అదే చెపుతోంది. వర్ధమాన దేశాలలో పరిస్థితులు రోజు రోజుకూ దారుణంగా తయారవడానికి విద్యవైద్య రంగాలు కార్పొరేటీకరించడం వల్లనే.
ప్రశ్న: 'మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా' అని మన ప్రధాని అంటున్నారు. ఇందులో వాస్తవం ఏమైనా ఉందా? పదడాంబికాలేనా? దేశంలో తయారీ రంగం ఎలా ఉంది?
జ్యోతి రాణి : ఇవ్వన్నీ పదడాంబికాలేనండి. అన్నీ మేక్ ఇన్ ఇండియాలో భాగమే. మీరు ఎక్కడైనా అమ్ముకోండి కానీ, భారత దేశంలో తయారు చేయండి. ఈ నినాదాన్ని 2014 సెప్టెంబర్లో మొదలుపెట్టారు. దీని లక్ష్యాలు తయారీ రంగం వృద్ధి రేటును 2022 నాటికి 7 శాతం నుంచి 12-14 శాతానికి పెంచాలి. తయారీ రంగం వాటాను స్థూల జాతీయోత్పత్తిలో 15 నుంచి 25 శాతానికి పెంచాలి. తయారీ రంగంలో అదనంగా 100 మిలియన్ల ఉద్యోగాలు కల్పించాలి.
ఈ లక్ష్యం వల్ల వచ్చే విదేశీ పెట్టుబడులు సాంకేతికతను బదిలీ చేయవు. ఇవి వస్తే స్వదేశీ ప్రైవేటు పెట్టుబడులను వెళ్ళగొట్టడానికే. టెక్నాలజీ బదిలీ ఉండదు. విదేశీ పెట్టబడులతో సాంకేతికత బదిలీ కాదు. అక్కడి కాలం చెల్లిన టెక్నాలజీని ఇక్కడికి బదిలీ చేస్తారంతే.
విదీశీ పెట్టుబడుల కోసం భూములను, అన్ని చట్టాలను సరళీకరిస్తున్నారు. 2016లో న్యూ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట సీ కోడ్ ను తెచ్చారు. విదేశీ పెట్టబడులు ఇక్కడి నుంచి తేలికగా వెళ్ళిపోవడానికి ఈ చట్టం తెచ్చారు. మేక్ ఇండియా లక్ష్యాల్లో భాగంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని చాలా చట్టాలు సరళీకరించారు. విదేశీ పెట్టుబడులపైన ఇదివరలో చాలా ఆంక్షలు ఉండేవి. కీలకమైన 25 రంగాలను గుర్తించి, 100 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి నిచ్చారు. ఇన్స్యూరెన్స్, రైల్వేలలో విదేశీ పెట్టుబడులకు అనుమతిం చారు.
రక్షణ రంగంలో కూడా విదేశీ పెట్టుబడులకు అనుమతించారు. రక్షణ రంగాన్ని విదేశీ పెట్టుబడులకు అప్పగించడమంటే ఇక రక్షణ రంగం దేనికండి!? ఇన్సూరెన్స్, రైల్వే లలో విదేశీ పెట్టుబడులను అనుమతిచ్చారు వాటికి పన్ను రాయ తీలు చాలా ఇచ్చారు. 29 నెంట్రల్ చట్టాలను 4 లేబర్ కోడ్ లుగా కుదించారు. శ్రమ దోపిడీని చట్టబద్దం చేయడం, కార్మికుల హక్కులను, సంక్షేమాన్ని రద్దు చేయడం దీనిలో మఖ్యం.
కార్మికులు చాలా పోరాటాలు చేసి 8 గంటల పనిదినాన్ని సాధించుకున్నారు. మనకు లాక్ డౌన్ తరువాత మే 2020 ఆత్మనిర్భర భారత్ ప్రకటించారు. 20లక్షల 97 వేల కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ ప్యాకేజిలో ప్రస్తుత ప్రభుత్వం పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూర్చితేనే ఉత్పత్తి పెరుగుతుందని, దేశ మంతా బాగుంటుందనే తప్పుడు దృక్పథంతో దీన్ని అమలు చేసింది.
పెట్టుబడిదారులను ప్రోత్సహించాలంటే కార్మికుల హక్కులను రద్దు చేయాలి. లేబర్ కోడ్లలో పనిగంటలనేది లేదు. కొన్ని రాష్ట్రాలలో పనిగంటల పరిమితి ఉండదు. పనిగంటలను యజమాని- కార్మికుడు కలిసి నిర్ణయించరు. యజమానే నిర్ణయిస్తాడు. యజమాని ఎంత పని చేయమంటే కార్మికుడు అంత పనిచేయాలి.
కనీస వేతనం కోసం అనూప్ సత్పతి కమిటీని 2019లో కేంద్రం నియమించింది. ఈ కమిటీ కనీస వేతనాన్ని రోజుకు 375 రూపాయలుగా నిర్ణయించింది. నెలకు 9,750 రూపాయలకు తగ్గకుండా ఉండాలని ఈ కమిటీ సిఫారసు చేసింది. దాన్ని కూడా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు.
కనీస వేతనాన్ని 176 రూపాయల నుంచి 178 రూపాయలకు పెంచింది. అంటే రెండు రూపాయలా పెంచడం! ప్రజల జీవితాలు ప్రభుత్వాలకు హ్యాస్పదంగా తయారయ్యాయి. ఇది చాలా నికృష్టవేతనం. కమిటీ సూచించిన కనీస వేతనంలో సగం కూడా లేదు. జెండర్ ప్రాతిపదికగా వ్యత్యాసాలు లేవంటోంది. మనిషిని ఇది చావు దిశగా నడపడమే కదా! నికృష్టవేతనంలో జెండర్ సమానత్వాన్ని సాధిస్తామా?
అగ్నిపథ్ స్కీంలో 2022 జూన్ లో ప్రవేశ పెట్టారు. కేవలం 4 ఏళ్ళ కోసం దీనిలో శిక్షణ నిచ్చి సైనికులుగా తయారుచేస్తారు. ఎంతో ఆశపడి వచ్చినయువకులు 4 ఏళ్ళ తరువాత ఏం చేయాలి!? తరువాత కార్పొరేట్ శక్తుల దగ్గర సెక్యూరిటీ గార్డులుగా పనిచేయాలా!? ఇది చాలా దుర్మార్గం కాదా.
మేక్ఇన్ ఇండియాలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి వారికి ఎన్నో పన్ను రాయితీలు ఇచ్చింది. 2017-18 కేంద్ర బడ్జెట్లో కార్పొరేట్ పన్నును 35 శాతం నుంచి 23 శాతానికి తగ్గించింది. కొత్త కార్పొరేట్ సంస్థలకు పన్నును 15 శాతంగా కార్పొరేట్ పన్నును తగ్గించడం వల్ల 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరానికి కోల్పోయిన నష్టం 6.27 లక్షల కోట్లు రూపాయలు. వీరి లక్ష్య సాధన ఏమైంది? లక్ష్య సాధన తయారీ రంగం వృద్ధిరేటు ఏడాదికి 7 శాతం నుంచి 12-14 శాతం వరకైనా పెంచాలనుకున్నారు. కానీ తయారీ రంగం వృద్ధిరేటు 7 శాతంకంటే తగ్గిపోయింది.
స్థూల జాతీయోత్పత్తిలో తయారీ రంగం వాటా 15 నుంచి 25 శాతానికి పెంచాలనుకుంటే 2023లో 15.6 శాతానికి మాత్రమే పెంచారు. కేవలం .6 శాతం పెంచడానికి ఇన్ని రాయితీలా? తయారీ రంగంలో దక్షిణాసియా దేశాలతో సమానం కావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, అది సాధించలేదు. మనకు ఉద్యోగ కల్పన అదనంగా 100 మిలయన్లని చెప్పుకున్నారు. 2016-17 నుంచి 2020-21 మధ్య తయారీ రంగంలో అదనంగా ఉద్యోగాలు 24 మిలియన్లు. ఇందులో కోవిడ్ విపత్తు వల్ల కోల్పోయిన ఉద్యోగాలు 11 మిలియన్లు.
మేక్ ఇన్ ఇండియా వల్ల విదేశీ పెట్టుబడులు బాగా పెరిగాయి. ఇవి 2014-15లో 45.15 బిలియన్ అమెరికన్ డాలర్లకు వచ్చాయి. అయితే 2021-22 నాటికి విదేశీ పెట్టుబడులు 83.60 అమెరికన్ బిలియన్ డాలర్లకు పెరిగాయి. కానీ ఉద్యోగ కల్పన పెరగలేదు. తయారీ రంగం వృద్ధి రేటు పెరగలేదు. తయారీ రంగం వాటా పెరగలేదు. అట్టర్ ఫెయిల్యూర్. ఎగుమతుల మీద ఆధారపడే పరిశ్రమల్లోనే ఈ విదేశీ పెట్టుబడులు ప్రవేశించాయి. మనవాళ్ళు అనేక రాయితీలు ఇస్తున్నారు కదా! విదేశాల నుంచి వచ్చే రాయల్టీల మీద టెక్నాలజీనిపరిమితిని తొలగించేశారు. దిగుమతి చేసుకుంటారు.
ఎగుమతులలో మన దేశీయ విలువ జమచేసే భాగం పెరగాలి కానీ తగ్గింది. మేక్ ఇన్ ఇండియా వల్ల అసెంబ్లింగ్ యూనిట్లు మాత్రమే వచ్చాయి. గ్లోబల్ వ్యాల్యూ చైన్ (ప్రపంచవిలువ గొలుసు) గురించి చెప్పుకోవాలి. గ్లోబల్ విలువ గొలుసులో అత్యధిక ప్రతిఫలం వచ్చే ప్యాకేజీలు ఆధిపత్య దేశాల గుప్పెట్లో ఉంటాయి. ఇక మధ్య స్వల్ప ప్రతిఫలాలు ఉండే అసెంబ్లింగ్ యూనిట్ల వంటివి వర్ధ మాన దేశాలకు తరలిస్తారు. వర్ధమాన దేశాలలో ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా, ఏ రిస్కూ తీసుకోకుండా ఆధిపత్య దేశాలు ఆధిపత్య వర్గాలు లాభం సంపాదించుకోవడానికి గ్లోబల్ విలువ గొలుసు ఒక శక్తి వంతమైన సాధనంగా రూపొందింది.
మన వాళ్ళు తక్కువ జీతాలతోనే చేస్తారు. వాళ్ళకు పంపిస్తే వాళ్ళ బ్రాండ్ నేమ్ వేసుకుని అమ్ముకుంటారు. మనం రెండు వేలకు చేసిస్తే, అదే వస్తువును లక్షరూపాయలకు మనకే అమ్ముతారు. డిజైన్ వారిదే, బ్రాండ్ నేమ్ వారిదే. తయారీ మాత్రం మనది. ఇది చాలా దుర్మార్గం. మేక్ఇన్ ఇండియా వల్ల అసెంబ్లింగ్ యూనిట్లు మాత్రమే వచ్చాయి.
Next Story