
గిరిజ 'గిరిగమనం'
గిరిజ పైడిమర్రి 'గిరి గమనం' పుస్తకం ఈ నెల 22, సోమవారం సా. 6 గంటలకు హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ స్టాల్ నెంబర్ 62 లో ఆవిష్కరణ సందర్భంగా...పుస్తకానికి రాఘవ రాసిన ముందుమాట
ట్రెక్కింగ్ అంటే.. సెలఏటి సంగీతాన్ని ఆస్వాదించడం, జలపాతపు హోరులో తన్మయులైపోవడం, కొండలెక్కడం, లోతైన లోయల్లోకి దిగడం, వెన్నెల్లో విహరించడం, ఆటంకాలను అధిగమించి, శరీర దారుఢ్యాన్ని, గుండె ధైర్యాన్ని పెంచుకోవడం, ఊపిరి తిత్తుల నిండా స్వచ్ఛమైన ప్రాణవాయువును పీల్చుకోవడం. ట్రెక్కింగ్ అంటే.. అనంతమైన ప్రకృతి ముందు మోకరిల్లడం, అడవి తల్లి కనురెప్పల నీడల్లో సేదదీరడం.
ఈ మహాద్భుతంలో మహిళలెందుకు పెద్దగా కనిపించడం లేదు!? కనిపిస్తున్నా, అక్కడొకరు, అక్కడొకరు! ఇల్లు, వంటిల్లు మహిళలకు జీవితకాలపు గుదిబండలు. ఇదొక చేదు నిజం. అందుకే ట్రెక్కింగ్ కు మహిళలు దూరమైపోతున్నారు. స్వేచ్ఛగా పుట్టిన మహిళలు, ఇంటిల్లిపాదికీ చేసే వెట్టి చాకిరీ సంకెళ్ళతో బందీలైపోతున్నారు.
వీటిని అధిగమించిన కొద్ది మందైనా ట్రెక్కింగ్ లు, పర్యటనలూ చేస్తూనే ఉన్నారు. తమ కిష్టమైన పనులనూ చేసుకుపోతున్నారు. సాహసికులైన మహిళా ట్రెక్కర్ల లో చెన్నైకి చెందిన వనతి, హైదరాబాదుకు చెందిన గిరిజ పైడిమర్రి మాత్రమే మూడు దశాబ్దాల నా ట్రెక్కింగ్ అనుభవంలో తారసపడ్డారు. ఆరుపదుల వయసు దాటిన గిరిజ గారు ట్రెక్కర్ మాత్రమే కాదు, అసేతుహిమాచలపర్యంతం చుట్టివచ్చిన గొప్ప ధీర వనిత. వారు చేసిన ట్రెక్కింగ్ లు, పర్యటనల్లో సందర్శించిన గుళ్ళు, గోపురాలు, చారిత్రక ప్రదేశాలు, తిరిగిన అడవులు, కొండలు, నదులు, సముద్రాలు, అక్కడ కనిపించిన విభిన్న జీవన శైలులను చూసి అనుభూతి చెంది, ఈ ‘గిరిగమనం’ లో వాటికి అక్షరరూపం ఇచ్చారు.
శేషాచలం కొండల్లోని తుంబురుకు మామండూరు నుంచి, గత ఏడాది(2024) డిసెంబర్ లో దాదాపు నూటా యాభై మంది వరకు ట్రెక్కింగ్ కు వెళ్ళినప్పుడు, గిరిజ గారు, కాంతి గారు కూడా మాతో వచ్చారు. వారం రోజులుగా విడవకుండా పడుతున్న వర్షాలు తగ్గాయి కదా అని ట్రెక్కింగ్ కు బయలుదేరితే, ఊహించని ఉత్పాతంలా అడవి దారులన్నీ ఏరులై పారుతున్నాయి. మోకాలు లోతు ప్రవహిస్తున్న ఆరు ఏర్లను దాటితే, నడుం లోతున ఉధృతంగా ప్రవహిస్తున్న మరో పన్నెండు ఏర్లను దాటడం చాలా కష్టమైంది! బుజాన బరువులు మోస్తూ, ఒకరి చేతులు ఒకరు పట్టుకుని దాటకపోతే ప్రవాహంలో కొట్టుకుపోయే వాళ్ళం. నీళ్ళలో నడిచేటప్పుడు కాలు కాస్త ఎత్తినా, ప్రవాహం మనల్నిపైకి లేపేసి, ఈడ్చుకుపోతుంది. నీళ్ళలో కాళ్ళను ఈడ్చుకుంటూ పోవడం వల్లనే దాటటడం సాధ్యమైంది. పదహారు కిలోమీటర్ల నడకకు పన్నెండు గంటలు పట్టింది. గిరిజ గారికి ఇలాంటి సాహసాలు కొత్త కాదు.
దక్షిణ దేశ అమరనాథ్ గా ప్రసిద్ధి చెందిన సలేశ్వరం ట్రెక్ చాలా సాహసోపేతం. పెద్ద పెద్ద బండరాళ్ళను ఎక్కుతూ దిగడం చాలా కష్టం. రెండు కొండలు ఒకటిగా కలిసిన అద్భుత దృశ్యం, రెండు కొండల నడుమ నుంచి జాలువారుతున్న జలపాతాన్ని చూస్తూ ఎంత అనుభూతి చెందుతామో, కొండ వాలును దాటటడం అంత భారంగానూ ఉంటుంది.
గుణదల కొండకు అయిదుగురు మహిళలతో కలిసి ఎక్కడం గమనిస్తే, ట్రెక్కింగ్ కు వయసు, జెండర్ సమస్యే కాదనిపిస్తుంది. ముప్ఫై ఏళ్ళకే మోకాళ్ళు అరిగి, కూర్చోలేక, కూర్చుంటే లేవ లేక, లేచినా నడవలేక పోతున్న యువత మన చుట్టూ కనిపిస్తూనే ఉంది. అరుపదులు దాటిన గిరిజ గారు ట్రెక్కింగ్ చేయడం ‘‘స్త్రీకి కూడా శరీరం ఉంది, దానికి వ్యాయామం ఇవ్వండి’’ అన్న చలం మాటను గుర్తుకు తెస్తాయి.
కర్నాటకలో ఉధృతంగా ప్రవహిస్తున్న కాళీ నదిలో పడవ ప్రయాణం, యువతతో పోటీపడుతూ పెడలింగ్ చేస్తూ పడవ నడపడం ఎంత సాహసం! యాభై ఏళ్ళు దాటినవారిని అనుమతించమని ఖరాఖండిగా చెప్పినా, కెప్టెన్ ను అభ్యర్థించి, ఈత రాని గిరిజ గారు లైఫ్ జాకెట్ వేసుకుని మరీ నదిలో దూకి, మళ్ళీ బోటెక్కడాన్ని ఏమనాలి!? లోతైన కాళీ నదిలో ప్రవాహాల మధ్య భయం, ఉత్కంఠ, సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేసిన 13 కిలోమీటర్ల ప్రయాణం అది. ఎంత ఆత్మవిశ్వాసముంటే ఇలాంటి సాహసాలకు సిద్ధపడతారు! గోవా పర్యటనలో మైళ్ళ కొద్దీ నడక. దుమికే జలపాతాలు, పరవళ్ళు తొక్కే ప్రవాహాలతో పశ్చిమ కనుమల్లో ప్రకృతి సౌందర్యాలను ఎంతగా ఆస్వాదించారో! అహోబిలానికి ఎక్కేటప్పుడు, దిగే టప్పుడు మాత్రమే కాదు, ట్రెక్కింగ్ లో ఒక్కొక్కసారి చతుష్పాదులై పోవలిసిందే.
కృష్ణానది సముద్రుడిలో సంగమించే హంసల దీవికి వెళ్ళినప్పుడు, ఆ కెరటాలే కాదు, సముద్రానికి పాటు(పోటు) వచ్చినప్పుడు నది వెనక్కి రావడం నిజంగా అద్భుతమే. సముద్రాన్ని ఎప్పుడు చూసినా, అలలు ఎగిసిపడుతూ ఉద్వేగంగా కనిపిస్తుంది. సముద్ర అలలకు భిన్నంగా థార్ ఎడారి అనుభూతులు. అక్కడ వీచే గాలి చేసే సవ్వడి ముందు ఏ గంధర్వగానమూ సాటిరాదంటారు గిరిజ గారు. ఎడారిలో వెన్నెలను తాగితే కానీ ఆ ఎడారి దాహం తీరదు. అరేబియా సముద్రంలో సూర్యోదయాన్ని, థార్ ఎడారిలో సూర్యోదయాన్ని చూడడం ఎంత భిన్నమైన అనుభూతో!
ఎక్కడికెళితే అక్కడి విశేషాలను, అనుభూతులను చెప్పుకుంటూ పోతారు. అరుణాచలం అనగానే తెలుగు వారికి గుడిపాటి వెంకటా చలం గుర్తుకు వస్తాడు. భక్తులకు 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ గుర్తుకు వస్తుంది. కంచికి వెళ్ళగానే మహిళలకు పట్టు చీరలు గుర్తుకు వస్తాయి. కానీ గిరిజ గారికి కంచి పట్టు చీరలు కాదు, ఆ అందాల వెనుక ఉన్న నేత కార్మికుల కష్టం గుర్తుకొచ్చి, గంటకు 5,300 సార్లు అచ్చిమరం కదిలస్తారని చెప్పడంలో వారి శ్రమను గుర్తించడం కనిపిస్తుంది. అలాగే అరుణాచలంలో బేరం చేయకుండా రెండు బొమ్మలు కొనడాన్ని చూసి అమ్మకం దారు ఆశ్చర్యపోతే, ‘‘మీరు చేస్తున్న పనిపట్ల నాకు గౌరవం’’ అని వినయంగా సమాధానం చెపుతారు.
కాశీ అనగానే స్త్రీలకు బెనారస్ శిల్కు చీరలు, మిగతా వారికి గంగా నది ఒడ్డున శవదహనాలు గుర్తుకు వస్తాయి. వాటితో పాటు అక్కడ మితిమీరిన మద్యపానాలూ కనిపిస్తాయి. అండమాన్ జైల్లో బ్రిటిష్ వారు విధించిన క్రూరమైన శిక్షలు మానని గాయాల్లా సలుపుతుంటాయి. సాటి మనుషుల్ని ఇంత దారుణంగా శిక్షిస్తారా? అని ఆశ్చర్యపోతారు. సబ్ మెరైన్ లో కూర్చుని అక్కడి సముద్ర గర్భంలో జరిపిన 45 నిమిషాల ప్రయాణంలో రకరకాల కోరల్స్, విభిన్న వర్ణాల చేపలను చూసి అబ్బురపడిపోతారు. ఇరవై ఏళ్ళ వయసులో చేయాల్సిన ఈ సాహసాలు అరవై ఏళ్ళు దాటాక చేయడం వింతకాక మరేమిటి!
మరో సాహస యాత్ర ఛార్ ధామ్. హిమాలయ ప్రాంతాల్లో ఉన్న యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్ లను చూడడానికి వెళ్ళినప్పుడు పర్వత శిఖరాల అంచులను, జలపాతాల హోరును చూసి పరవశించిపోతారు. ఆ మంచుకొండల్లో ఉన్న మత్తుకు ఫిదా అయిపోతారు. ఖజరహో దేవాలయాలనగానే శృంగార శిల్పాలే నన్నభావన కలుగుతుంది. అలాంటి శిల్పాలు కేవలం పది శాతం మాత్రమే ఉన్నాయని, ఈ దేవాలయ శిల్పాల్లో అద్భుతమైన నాట్య భంగిమలున్నాయని గుర్తు చేస్తారు.
లక్ష ద్వీప్ గురించిన కథనం చాలా ఆసక్తి దాయకం. ఆ దీవి వైశాల్యం ముప్ఫైరెండు చదరపు కిలోమీటర్లేనట! అక్కడి ప్రజలు మాట్లాడే మస్రీ భాష తమిళం, మళయాళం, అరబిక్ భాషల మిశ్రమంగా ఏర్పిడిందంటారు. లక్షద్వీప్ లో మనం లక్షల రూపాయలు వదిలేసినా ఎక్కడికీ పోవట! అక్కడి ప్రజలు అంత నిజాయితీ పరులు. మరి మన దేశంలోని ఇతర ప్రాంతాల్లోనో!? అక్కడ మద్యపానం, ధూమపానం లేదట! అయితే కుటుంబాలు ఎంత వూపిరి పీల్చుకుంటాయో కదా! ఒక రోజు సముద్రంలో ఇసుక దిబ్బలా కనిపించిన చిన్న దీవి కోసం మర్నాడు ఎంత వెతికినా కనిపించలేదు! ఇక్కడ అన్నీ వింతలే! లక్ష ద్వీప్ కాదు, అది విడ్డూరాల ద్వీప్.
ఇస్లామిక్, రాజపుత్రుల వాస్తు శైలిలో నిర్మించిన పురాతన జయసల్మేర్ కోట, అక్కడి భవనాలన్నిటికీ బంగారపు రంగులు వేయడం ఒక విశేషం. రెండవ ప్రతాపరుద్రుడు నిర్మించిన మెదక్ కోట చాలా అపురూపమైంది. కరువు సంభవించిన విపత్కర పరిస్థితి నుంచి ప్రజలను కాపాడడానికి కట్టించిందే మెదక్ చర్చి. ఇది ఆసియాలోనే అతి పెద్ద చర్చిగా ప్రసిద్ధి చెందింది. కాకతీయ రాజులు 13వ శతాబ్దంలో కట్టించిన ఘనపురం ఖిల్లా, 1885లో నిర్మించిన వనపర్తి ప్యాలెస్ వంటి చారిత్రక నిర్మాణాలు ఇప్పటికీ మనం చూడవచ్చు.
పక్షుల లాగా స్త్రీలు కూడా స్వేచ్ఛగా విహరించాలనుకుంటారు. కనీసం పురుషుల్లాగానైనా తిరగాలనుకుంటారు. గిరిజ గారిలా అలా తిరగడం ఎంత మంది మహిళలకు సాధ్యం!?
ఈ పర్యటనల్లో కొన్ని ఆసక్తి కర విషయాలు గమనించారు. గుళ్ళలో పురుషులే పూజారులుగా ఉంటారు. దీనిక భిన్నంగా పచ్చల సోమేశ్వరాలయంలో పూజారిగా చేస్తున్న భర్త మరణించడంతో, అతని భార్య సరోజమ్మ పూజారిగా పనిచేస్తోంది. కొండలు, కోనలు, నదులు, జలపాతాలు, అడవుల్లోకి వెళ్ళి, ఆ ప్రాంత ఆదివాసీలను ‘పల్లె సృజన’ ద్వారా కలవడం గొప్ప అనుభవం. ‘పల్లె సృజన’లో గ్రామీణులు చేసిన అనేక ఆవిష్కరణల గురించి కూడా వివరిస్తారు.
మహారాష్ట్రలోని భిలార్ అనే పుస్తకాల గ్రామంతోపాటు, దేవరాయ్ ఆర్ట్ గ్రామంలో స్వదేశీ కళాకృతులు విజ్ఞాన దాయకం. భిలార్ లోని ప్రతి ఇంట్లో వెయ్యి పుస్తకాలను ప్రదర్శించడం ఆశ్చర్యకరం. మహారాష్ట్రలోని పక్షుల ఆవాస కేంద్రాన్ని సందర్శించారు. మేఘాలయకు వెళితే, మేఘాలలోనే విహ రించినట్టుంటుంది. కాంగేషేర్ జలపాతం, నదిలో పడవ ప్రయాణం, అక్వేరియంలా కనిపించే నదిలో చేపలు, గులకరాళ్ళు; ఎన్ని ప్రకృతి అందాలో! సహజసిద్ధంగా ఏర్పడిన వేర్లతో వంతెనలు, వెదురు వంతనెలు, నీలి రంగు నీటి సరస్సులు, ఇంద్ర ధనస్సు జలపాతం(రెయిన్ బో వాటర్ ఫాల్స్), పెద్ద పెద్ద కొండలకు ఏటవాలుగా కట్టిన వంతెనలు; ఇలాంటి సాహస ప్రయాణాల్లో ఎన్ని ప్రకృతి సోయగాలో! మేఘాలయలో పెళ్ళి అయ్యాక అమ్మాయి ఇంటికే అబ్బాయి వెళ్ళడం ఇల్లరికం కాదు, మాతృ స్వామిక లక్షణం.
‘‘ ప్రశాంత వాతావరణంలో పూల లోయ. మధ్యలో నేను(గిరిజ గారు). చుట్టూ పచ్చని చెట్లు, లోతైన లోయ, ఎత్తైన పర్వతాలు, వాటిని తాకుతూ సాగే మేఘాలు. పైన నీలాకాశం’’ అంటూ హిమాలయాల్లోని నందనవనాన్ని చూసి తన్మయులైపోతారు. ‘‘స్వర్గం ఇంతకంటే అందంగా ఉంటుందా?’’ అని విస్తుపోతారు. ముగ్గురు పర్వతారోహకులు దారి తప్పి, ఆ లోయలో నిద్రించి, తెల్లారి లేచి చూస్తే, చుట్టూ పూలే! దీన్ని చూసి చకితు డైన ఫ్రాంక్ ఎస్. స్మిత్ ‘వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్’ అన్న పుస్తకం కూడా రాశారు. ఈ కథనం చదువుతుంటే మనకు కూడా ‘వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్’ లో విహరించాలనిపిస్తుంది.
క్రీడా స్ఫూర్తిలాగానే ట్రెక్కింగ్ స్ఫూర్తి కూడా ఉంటుంది. ట్రెక్కింగ్ లో కానీ, పర్యటనల్లో కానీ కులం ఉండదు, మతం ఉండదు, జెండర్ తేడా ఉండదు, హోదాలూ ఉండవు. ఒకరికొకరు తెలియకపోయినా పరస్పరం సాయం చేసుకుంటారు. అందరి మధ్య స్నేహం వెల్లివిరిస్తుంది. కనీసం అక్కడైనా కులం, మతం, హోదా, పురుషాధిక్యత, తాము అధికులం వంటి సమస్త సామాజిక వికారాలను వదలకపోతే ఈ ట్రెక్కింగ్ లకు, పర్యటనలకు అర్థమే లేదు. నా అనుభవమే కాదు, గిరిజ గారి అనుభవం రీత్యా కూడా స్త్రీల పట్ల ఎవరూ అభ్యంతరకరంగా వ్యవహరించరు. అలా వ్యవహరిస్తే ట్రెక్కింగ్ స్ఫూర్తికి అర్థమే లేదు. రోజూ వ్యాయామం చేయడం ద్వారా, ట్రెక్కింగ్ కు వెళ్ళి వచ్చినప్పుడు కాళ్ళ నొప్పులు ఉండవు. గిరిజ గారైతే తిరిగి వచ్చాక స్ట్రెచ్చింగ్ ఎక్స్ ర్ సైజులు చేస్తారు. గత పుప్పై నాలుగేళ్ళుగా నేను ఇన్స్ లిన్ తీసుకునే ఇన్స్ లిన్ డిపెండెంట్ డయాబెటిక్ ని. రోజుకు అయిదు సార్లు తీసుకోవలసి వస్తోంది. ట్రెక్కింగ్ లో హైపో గ్లైసీమియా రాకుండా, ఒక రకమైన ఇన్స్ లిన్ ను ఒక పూట మానేస్తాను. గిరిజ గారైతే డయాబెటిస్ కి వేసుకునే ఆ ఒక్క టాబ్లెట్ కూడా మానేస్తారు. హైపోరాకుండా అవసరాన్ని బట్టి కర్జూరాల వంటి కొన్ని అదనపు ఆహారాన్ని దగ్గర ఉంచుకుంటారు. యువతులు కొన్ని ప్రత్యేక సమయాల్లో ట్రెక్కింగ్ లు, పర్యటనలు చేయకపోవడమే మంచిదంటారు గిరిజగారు.
పర్యటనలు, సాహసాలు ఆత్మ విశ్వాసాన్ని పెంచుతాయి. కొండలు, గుట్టలు ఎక్కిదిగడం, మైళ్ళ కొద్దీ నడవడం, చారిత్రక ప్రదేశాలను చూడడం మాత్రమేనా గిరిజ గారు చేసింది! ఆ అనుభూతులకు, అనుభవాలకు, ఆనందాలకు మించిన విభిన్న మానవ జీవన శైలులను ప్రత్యక్షంగా పరిశీలించడం, వారి ఆచారాలను, అలవాట్లను స్వీయానుభవంతో అర్థం చేసుకునే జ్ఞానం ఎన్నిపుస్తకాలు చదివితే అబ్బుతుంది!? వాటన్నిటినీ పొందే ఏకైక మార్గం ఈ పర్యటనలు. ఈ ‘గిరిగమనం’ గొప్ప విజ్ఞానోత్సవం.

