అందరికీ ఆరోగ్యం ‘అందని ద్రాక్ష’ కాకూడదు...
x
Image source: NGObox

అందరికీ ఆరోగ్యం ‘అందని ద్రాక్ష’ కాకూడదు...

డాక్టర్లు అంటే మందులు రాయటం, అపరేషన్లు చేయటం మాత్రమే కాదు, ఇంకా చాలా చేయాలంటున్న గ్లోబల్ పీపుల్స్ హెల్త్ మూవ్మెంట్ అర్జెంటీనా సమావేశం విశేషాలు

ఆరోగ్యం అందరికీ మానవ హక్కుగా వుండాలని వాదిస్తూ, దానికై కృషి చేసే గ్లోబల్ పీపుల్స్ హెల్త్ మూవ్మెంట్ (People’s Health Movement: PHB) 2000 నుండి అంతర్జాతీయ స్థాయిలో సమావేశాలు నిర్వహించి ఈ సమస్యను ప్రపంచం దృష్టికి తెస్తున్నది. 2024 లో అర్జెంటీనాలో జరిగిన పిహెచ్బీ ఐదవ ప్రపంచ సమావేశానికి ఒక విశేషం. అక్కడ సమావేశమయిన వందలాది మంది ఆరోగ్య కార్యకర్తలు ఆరోగ్య ఉద్యమాన్ని ఇతర ప్రగతిశీల సామాజిక ఉద్యమాలతో ఏకం చేయటానికి అంకితం కావాలని ప్రతిపాదించారు. పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాద సంక్షోభాలను ఎదుర్కోవడానికి సమూల మార్పు కోసం ఒక విస్తృత కూటమిని ఏర్పాటు చేయడమే తమ లక్ష్యం గా ప్రకటించారు.

పీపుల్స్ హెల్త్ అసెంబ్లీ

2000 లో మొదటి పీపుల్స్ హెల్త్ అసెంబ్లీ తరువాత స్థాపించబడిన పిహెచ్ఎమ్ ఆరోగ్యాన్ని ప్రాథమిక మానవ హక్కుగా భావించే కార్యకర్తల, సామాజిక ఉద్యమాల, సంస్థల ప్రపంచ వేదికగా రూపుదిద్దుకుంది. ఇది సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహిస్తుంది . అందరికీ సమానమైన అవకాశాలు కల్పించే ఆరోగ్య వ్యవస్థల కోసం కృషి చేస్తుంది. పీపుల్స్ హెల్త్ మూవ్మెంట్ (పిహెచ్ఎం) అనేది ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి అట్టడుగు స్థాయిలో పనిచేస్తున్నఆరోగ్య కార్యకర్తలు, పౌర సమాజ సంస్థలు, విద్యా సంస్థలు కలిసి ఏర్పరచుకున్న ప్రపంచ నెట్వర్క్. పిహెచ్ఎమ్ ప్రస్తుతం 70 కి పైగా దేశాలలో శాఖలు కలిగి ఉంది, ఇది దక్షిణాసియా (భారతదేశం, బంగ్లాదేశ్, శ్రీలంక), ఆఫ్రికా (దక్షిణాఫ్రికా), పసిఫిక్ (ఆస్ట్రేలియా), దక్షిణ అమెరికా (బ్రెజిల్, ఈక్వెడార్), మధ్య అమెరికా (ఎల్ సాల్వడార్, నికరాగ్వా, గ్వాటెమాలా), ఉత్తర అమెరికా (యుఎస్ఎ, కెనడా), ఐరోపా (ఇటలీ, స్విట్జర్లాండ్, యుకె, గ్రీస్) వంటి అనేక దేశాలలో చాప్టర్లను కలిగి ఉంది.

ఐదవ పీపుల్స్ హెల్త్ అసెంబ్లీ ఐదు ప్రధాన అంశాలపై దృష్టి సారించింది.1. అనారోగ్యానికి కారణమవుతున్న యుద్ధం, దురాక్రమణ , బలవంతపు మానవ వలసల ను ప్రతిఘటించడం ; 2.పూర్వీకుల, ప్రజాదరణ పొందిన సంప్రదాయ ఆరోగ్య పరిరక్షణా జ్ఞానాన్ని వినియోగం లోకి తేవడం,3. ఆరోగ్యంలో లింగ న్యాయం;4. ఆరోగ్య వ్యవస్థల్లో మార్పు; 5. పర్యావరణ ఆరోగ్యం కోసం కృషి చేయడం. ఆరోగ్య హక్కుల పోరాటాన్ని పునరుజ్జీవింప జేయడానికి వందలాది మంది ఆరోగ్య కార్యకర్తలు ఈ ఐదవ ప్రపంచ సమావేశం నిర్వహించారు.

'మా అసెంబ్లీ నడిబొడ్డున ప్రజా ఉద్యమాల శక్తి ఉంది. పోరాటంలో ముందంజలో ఉన్న వారి అభిప్రాయాలను వినడం మా సామూహిక స్ఫూర్తిలో వేడిని రేకెత్తిస్తుంది, అందరికీ ఆరోగ్యం వైపు చేసే మా ప్రయాణానికి ప్రోత్సాహాన్నిఇస్తుంది. సంఘీ భావాన్ని గుర్తు చేస్తుంది" అని ప్రారంభోత్సవంలో ఆర్గనైజింగ్ కమిటీ ప్రకటించింది.

అర్జెంటీనా ప్రభుత్వం తీవ్రమైన నయా ఉదారవాద విధానాలను విధించడం వల్లనూ, పాలస్తీనాపై కొనసాగుతున్న ఇజ్రాయిల్ మారణహోమ యుద్ధం కారణంగాను ఈ అసెంబ్లీ కొన్ని చిక్కులను ఎదుర్కొంది. అనేక ప్రతినిధి బృందాల ప్రయాణాన్ని క్లిష్టతరం చేసింది. గాజా లోని ఆరోగ్య వ్యవస్థపై ఇజ్రాయెల్ దాడుల తీవ్ర ప్రభావాలను ప్రముఖ ఉద్యమకారుడు పాలస్తీనా ప్రతినిధి ముస్తఫా బర్ఘౌటి వీడియో లింక్ ద్వారా తమ అభిప్రాయాలు వివరించారు.”ఈ రోజు, ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలు పాలస్తీనా ప్రజలకు వారి విషాదంలో సంఘీభావంగా నిలుస్తున్నారు. యుద్ధాన్ని ఆపడానికి, వారి హక్కులకు మద్దతు ఇవ్వడానికి మా ప్రజలతో కలిసి పోరాడుతున్నారు. ప్రపంచంలోని అన్ని స్వేచ్ఛాయుత గొంతులు సమర్థిస్తున్న మా పక్షాన మీరు నిలబడాలని మేము కోరుతున్నాము" అని ఆయన పిహెచ్ఎం అసెంబ్లీని కోరారు.

అమానుష యుద్దాలు ప్రజల ఆరోగ్యాన్ని ఎలా దెబ్బ తీస్తాయో పాలస్తీనాలో చూడవచ్చు. 2023 చివరి రోజులకే ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో, గాజాలో 32 ప్రాథమిక సంరక్షణ కేంద్రాలు, 11 నీటి పారిశుద్ధ్య కేంద్రాలు, 205 విద్యాసంస్థలు దెబ్బతిన్నాయి. 35 పెద్ద ఆసుపత్రుల్లో 18 పూర్తిగా ధ్వంసమయ్యాయి. యుద్దం ఆసుపత్రులు, క్లినిక్ లు, వైద్య సరఫరా కేంద్రాలతో సహా ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను విధ్వంసం చేసింది. 69 ఆరోగ్య కేంద్రాలు, 24 అంబులెన్సు లు నాశనమయ్యాయి.46 మంది వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

సంవత్సర కాలం లో దాదాపు 42,000 మంది మరణించారు. యుద్ధం యొక్క ప్రధాన బాధితులు గాజా, వెస్ట్ బ్యాంక్, ఇప్పుడు లెబనాన్ లోని పౌరులు, మహిళలు, పిల్లలు; 16,705 మంది పాలస్తీనా పిల్లలు మరణించారు 4,000 మంది పిల్లలు, 1,750 మంది మహిళలు తో సహా 20,000 మందికి పైగా గాయపడ్డారు. 14 లక్షలకు పైగా నిర్వాసితులు అయ్యారు. ఇంధన కొరత కారణంగా 21 ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు అంతరాయాలను ఎదుర్కొన్నాయి. ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలపై దాడుల వల్ల ప్రతిరోజూ 166 అరక్షిత ప్రసవాలు జరుగుతున్నాయి.

ప్రతి 15 నిమిషాలకు ఒక బిడ్డ గల్లంతవుతున్నాడు. ఆరోగ్య కార్యకర్తలు, పరికరాలు, మందులు, సరఫరాల కొరత ఆరోగ్య సేవలను ప్రభావితం చేస్తున్నది. ప్రజల ఆదాయం తగ్గిపోవటంతో ఆరోగ్యం కోసం ఖర్చు చేయలేకపోతున్నారు. బాధితుల్లో 70% మంది పిల్లలు, మహిళలు, వృద్ధులు. గాజా లో 50% కుటుంబాలు ఆహార కొరతతో బాధపడుతున్నాయి. ఇది బలహీనమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చింది. దాని సామర్థ్యాన్ని తగ్గించింది. పర్యవసానంగా, పడకలు, పరికరాలు, మందుల కొరత ఉంది, అందువల్ల వైద్య నిపుణులకు అత్యవసర సేవలను అందించడం సవాలుగా మారింది, అందుకే పిహెచ్ఎమ్ యుద్ద వ్యతిరేకతను తన ప్రధమ ప్రాధాన్యతగా స్వీకరించింది.

బొలీవియా నేషనల్ డైరెక్టర్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ వివియన్ కామాచో పాశ్చాత్య వైద్య వ్యవస్థల్లో స్వదేశీ దృక్పథాలను, అవసరాలను ఏకీకృతం చేయాలని నొక్కి చెప్పారు. "ప్రజల జీవితాలు సాంస్కృతిక స్థితిస్థాపకతకు సంబంధించినవని గుర్తించాలి. సంప్రదాయ వైద్యం, పూర్వీకుల వైద్యం అంటే వలసవాదానికి, మనపై ప్రయోగించిన హింసకు, మన భూభాగాల ఆక్రమణకు, మన ప్రజల ఊచకోతకు వ్యతిరేకంగా జరిగిన లోతైన చారిత్రక సాంస్కృతిక ప్రతిఘటన గా కూడా అర్ధం చేసుకోవాలి” అని ఆమె అన్నారు.

గ్వాటెమాలలోని వినాక్ పొలిటికల్ మూవ్మెంట్కు చెందిన సోనియా గుటెరెజ్"స్త్రీవాద సంఘీభావం మనల్ని పరస్పర మద్దతు చట్రంలోకి తెస్తుంది" అన్నారు, అందరికీ ఆరోగ్య మన్న లక్ష్యానికి దోహదం చేయడానికి మహిళల పోరాటాల సామర్థ్యాన్ని హైలైట్ చేశారు. మహిళల విముక్తి కోసం, ప్రజల విముక్తి కోసం చారిత్రక అణచివేత నుంచి మనల్ని మనం విముక్తం చేసుకోవాలన్నారు.

అటువంటి విముక్తిని సాధించడానికి మార్గం స్త్రీవాద పోరాటాల ప్రస్తుత విజయాలకు ప్రాతినిధ్యం వహించే ఒక ఉమ్మడి సామాజిక ఉద్యమాన్ని నిర్మించడం అని ఆమె పిలుపునిచ్చారు. ఇప్పటికే ఉన్న సంఘీభావం, ఐక్యత పునాదులపై ఆ ఉద్యమం నిర్మించబడుతుంద ఆమె ఆశాభావం ప్రకటించారు.

బ్రెజిల్ కు చెందిన మాథస్ ఫాల్కావో మాట్లాడుతూ ఈ అసెంబ్లీ సమస్యలను చర్చించడమే కాకుండా ఆరోగ్యం కోసం ప్రయాణంలో విజయవంతమైన పోరాటాలను చేపట్టిందని పేర్కొన్నారు. బ్రెజిల్ లో 70, 80 దశకాల్లో జరిగిన ఆరోగ్య సంస్కరణ అనే ప్రక్రియ ద్వారా ఆరోగ్య సంరక్షణకు సార్వత్రిక ప్రాప్యత వ్యవస్థను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ఈ విజయాలు ప్రజాపోరాట ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఒక ఉదాహరణ అని అన్నారు.

అందరికీ ఆరోగ్యం సాధించడానికి మరింత పోరాటం, ఐక్యత అవసరం

పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాద సంక్షోభాలను ఎదుర్కోవడానికి సమూల మార్పుల ఆవశ్యకతను నొక్కిచెబుతూ, భాగస్వామ్య ప్రక్రియ ద్వారా అభివృద్ధి చెందిన కార్యాచరణ అవసరం అన్న పిలుపుతో సభ ముగిసింది ఈ అసెంబ్లీ ప్రకటించిన ఉమ్మడి అవగాహనా పత్రం పెట్టుబడిదారీ విధానం సృష్టించిన ఉత్పత్తి విధానాన్ని, వినియోగాన్ని, జీవన విధానాన్ని మార్చే సమూలమైన మార్పు మాత్రమే దోపిడీ, వినాశకర ధోరణులను తిప్పికొట్టగలదని పేర్కొంది. కొత్త వ్యవస్థ ప్రజల సార్వభౌమాధికారం, స్వయం నిర్ణయాధికారం, దేశాల మధ్య సమానత్వం, సహకారం, సంఘీభావం, శాంతిపై ఆధారపడి ఉండాలని తాము విశ్వసిస్తున్నామని, ప్రజల నియంత్రణ, జీవనావసరాల యాజమాన్యాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని వివరించింది.

"బహుళజాతి కంపెనీల, సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వ్యవస్థను ఒక కొత్త అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థగా మార్చడం సామాజిక ఉద్యమాలు, ప్రగతిశీల రాజకీయ పార్టీలు, జాతీయ-రాజ్యాల ఉమ్మడి చర్య ల ద్వారాను వారి మధ్య సంఘీభావం ద్వారాను మాత్రమే జరుగుతుంది. అంటే ఈ ప్రపంచంలో మంచి మార్పుల కోసం, అందరికీ ఆరోగ్యం కల్పించే పోరాటంలో కూడా వర్గపోరాటం కీలక పాత్ర పోషిస్తుందని పీపుల్స్ హెల్త్ మూవ్మెంట్ భావిస్తోంది. .

ఆరోగ్యం, విద్య, వ్యవసాయ శాస్త్రం, ఆహారం, శక్తి, శ్రమలో ప్రగతిశీల సంస్కరణలతో సహా ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక పరివర్తనను నడిపించే జాతీయ ప్రక్రియల అవసరాన్ని కాల్ టు యాక్షన్ నొక్కి చెబుతుంది. ఈ సంస్కరణలు అన్యాయమైన అసమానతలను తగ్గించడం లేదా తొలగించడం మరియు పర్యావరణపరంగా స్థిరమైన ఆర్థిక వ్యవస్థను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీనిని సాధించడానికి, నయా ఉదారవాదం మరియు సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కోవటానికి స్థానికంగా తగిన పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి పిహెచ్ఎమ్ కంట్రీ సర్కిల్స్ కమ్యూనిటీలతో కలిసి పనిచేస్తాయి.

ఆరోగ్య ఉద్యమాన్ని ఇతర అభ్యుదయ సామాజిక ఉద్యమాలతో ఏకం చేయడం, కొత్త అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ సామాజిక వ్యవస్థను స్థాపించడానికి ఒక విస్తృత ఫ్రంట్ ను సృష్టించడం దీని లక్ష్యం. ఈ కొత్త అంతర్జాతీయ ఆర్థిక క్రమాన్ని ప్రోత్సహించే రాజకీయ పార్టీలు మరియు రాష్ట్రాలతో పొత్తులను కోరాలని కూడా పిహెచ్ఎమ్ లక్ష్యంగా పెట్టుకుంది.

‘ది స్ట్రగుల్ ఫర్ హెల్త్: మెడిసిన్ అండ్ ది పాలిటిక్స్ ఆఫ్ అండర్ డెవలప్ మెంట్’ రెండవ ఎడిషన్ కు సహ-రచయిత. పీపుల్స్ హెల్త్ మూవ్మెంట్ యొక్క గ్లోబల్ స్టీరింగ్ కౌన్సిల్ సభ్యుడు విమ్ డి సి యుకెలైర్; పీపుల్స్ హెల్త్ డిస్పాచ్ హెల్త్ రిపోర్టర్, పీహెచ్ఎం యూరప్ రీజినల్ కో-ఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్న అనా వ్రాకర్ లు రూపొందించిన వ్యాసం లో ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు. డాక్టర్లు అంటే మందులు రాయటం , అపరేషన్లు చేయటం అని భావించే మన లాటి సమాజాలలో వైద్య సేవ రంగం ఒక గురుతరమైన, సామాజిక, క్రియాశీల పాత్ర పోషించ వలసిన అవసరాన్ని పీపుల్స్ హెల్త్ మూవ్మెంట్ ఎత్తి చూపుతోంది. అంతేకాదు సామాజిక ఉద్యమాలలో ఆరోగ్య పరిరక్షణ ఉద్యమం ఒక అనివార్యమైన భాగం కావలసిన అవసరాన్ని కూడా నొక్కి చెబుతోంది.

"సమానత్వం, పర్యావరణ హిత సుస్థిర అభివృద్ధి, శాంతి గల మెరుగైన ప్రపంచం - అందరికీ ఆరోగ్యకరమైన జీవితం వుండే ప్రపంచం ఈ ఉద్యమ దార్శనికతకు కేంద్ర బిందువు; సమస్త జీవరాశులను, వైవిధ్యాన్ని గౌరవించే, అభినందించే, అనుసరించే ప్రపంచం; వ్యక్తుల ప్రతిభ సామర్థ్యాలను ఒకరినొకరు సుసంపన్నం చేయడానికి వీలు కల్పించే ప్రపంచం; మన జీవితాలను తీర్చిదిద్దే నిర్ణయాలకు ప్రజల గొంతులు మార్గనిర్దేశం చేసే ప్రపంచం...” నిర్మించటం ఈ ఉద్యమ లక్ష్యం.

సామాజిక అభ్యుదయ వాదులైన తెలుగు ప్రాంతాల వైద్యులు, ప్రజలు ఈ దిశలో ఉద్యమాలను పరిపుష్టం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వ్యాసం అందిస్తున్నాను.


Read More
Next Story