ఒక హత్య, ఒక వార్త, ఒక స్ఫూర్తి
తాగు బోతు భర్త చేతిలో కూతురు హతమయినపుడు ఒక అమ్మమ్మ ప్రదర్శించిన తెగువ ఇది...
-అవిజ వెంకటేశ్వరరెడ్డి
అవి నేను కర్నూలులో మెడికల్ రెప్రజెంటేటివ్ గా పని చేస్తున్న రోజులు. 1997 ఫిబ్రవరి 15. ఆ రోజున వృత్తిరీత్యా ద్రోణాచలం క్యాంప్ వెళ్తున్నాను. ఎక్కాల్సిన బస్ కోసం వెయిట్ చేస్తూ బస్టాండ్ లో కూర్చుని ఈనాడు దినపత్రికను తిరగేస్తున్నాను. ఒక చోట నాలుగే నాలుగు సెంటీమీటర్ల వార్త నా కంట పడింది. కర్నూలు డేట్ లైన్ ఉన్నందున అది నేను చదవకుండా ఉండలేకపోయాను.
“ మహిళ దారుణ హత్య " ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని , పేరు నిర్మల అని వార్త సారాంశం. తీరా చూస్తే అది మా ప్రక్క వీధిలోనే జరిగిన సంఘటన. మరొకసారి ఆసక్తిగా చదివా. పక్కవీధిలో ఉండే నిర్మల ఎవరై ఉంటారు బాగా ఆలోచించాను. ఆ అమ్మాయి మా యింటికి తరచూ వచ్చే సంజమ్మ చిన్న కూతురేనన్న విషయం స్పష్టమై నిర్ఘాంత పోయాను. కూలినాలి చేసుకునే బతికే ఈ సంజమ్మతో నాకు చిత్రమయిన అనుబంధం వుంది. నా పెళ్లికి దోహదం చేసిన వ్యక్తి ఆమె.
సంజమ్మ చాలా గొప్ప మనిషి , అరుదైన వ్యక్తిత్వం , ఆత్మాభిమానం మెండుగాగల స్త్రీ. పిల్లలు పిన్న వయసులో వుండగానే తన భర్త అకాలమరణం చెందాడు. అయినా సరే ముగ్గురు ఆడపిల్లలను, ఒక కొడుకును పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసింది. వాళ్లిక సొంతంగా స్థిరపడతారని భావిస్తూ ఉంది. అలాంటి సమయంలో ఈ ఘోరం జరిగింది.
అల్లుడు తాగుబోతు. అతగాడు డబ్బుల కోసం భార్యను వేధించే వాడు. ఆమె సాధ్యమయినంతవరకు డబ్బు ఇవ్వకుండానే వుండేది. దీనితో భార ్య మీద పగ పెంచుకున్నాడు. ఒక రోజు మిట్టమధ్యాహ్నం అత్త ఇంటికి వచ్చాడు. అక్కడే కూతరు చెట్టుకింది పిల్లలను ఒంటి మీదే ఎక్కించుకుని ఆడిస్తూ ఉంది. ఆమె దగ్గిరకన మెళ్లిగా వచ్చి కత్తి పోడిచేసి పారిపోయాడు. అదే వార్త. ఈ దారుణమైన విషయం నాలుగు సెంటీమీటర్ల వార్త అటు ప్రభుత్వాన్ని కాని యిటు సమాజాన్ని కాని కదిలించలేని వార్త.
మరుసటి రోజు క్యాంపు నుంచి వచ్చాక ఒక జర్నలిస్టు మిత్రుడితో ఈ విషయం ప్రస్తావించాను. వారెంతో సహృదయంతో స్పందించి వెంటనే “ అమ్మ చెట్టు కూలిపోయింది ఆదుకోండి " అంటూ ఓ పెద్ద వ్యాసం ప్రచురించి బహుళ ప్రచారం కల్పించారు. ఈ వార్త ‘ వార్త’ దినపత్రికలో రాసింది జింకా నాగరాజు అనే జర్నలిస్టు. అవార్తకి కదిలించేలా శీర్షిక పెట్టింది లక్మణ్ రావు అనే సబ్ ఎడిటర్ అని తెలిసింది తర్వాత.
అది మొదలు ఓ వారం దాక వివిధ రూపాలలో ఆ వార్తను ప్రచురించి జిల్లా అధికారుల , ప్రజల దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం చేత ఓ యింటి పట్టాను , ప్రజల నుండి మరికొంత సొమ్మును విరాళాల రూపంలో సేకరించి ఆ చిన్నారులను ఆదుకోవడంలో ఆజర్నలిస్టు చొరవ చూపారు. ఆయన, కృషి అభినందనీయం. ఆ వార్తకు ప్రజలు ఎంత స్పందించారంటే, నంద్యాల ఒక ప్రభుత్వ కాలేజీలో పనిచేస్తున్న ఒక లెక్చరర్ ఆ పిల్లలను పెంచుకునేందుకు ముందుకు వచ్చారు. అప్పటికలెక్టర్ రాజేశ్వర్ తివారీని కూడా సంప్రదించారు. ఇలాగే మరికొందరు పిల్లలను దత్తత తీసుకునేందుకు ఆసక్తి చూపారు. ఆదోనిలోని హైస్కూలు పిల్లలు డబ్బు పిల్లలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. అయితే, "కూతురు చనిపోయింది. అల్లు డు హంతకుడయ్యాడు. కనీసం ఈ పిల్లలనైనా నాతో ఉంటే బాగుంటుంది. నేనెవర్వరికి దత్తత ఇవ్వను నేను పెంచిపెద్ద చేస్తాను" అని సంజమ్మ పట్టు బట్టింది. అదే మాట మీద నిలబడి వాళ్లని పెంచి పెద్ద చేసింది. డబ్బుకోసం పిల్లలని అమ్ముకుంటున్న పేదరికం సమాజంలో ఉంది. సంజమ్మ నాలుగు డబ్బులు తీసుకుని ఆ పిల్లలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చిన వారికి అప్పగించి చేతులు దులిపేసుకోవచ్చు. సంజమ్మ ఆ పనిచేయలేదు. ఎన్నికష్టాలొచ్చినా పిల్లలను తనే పెంచి పెద్ద చేయాలని నిర్ణయించుకుంది.
ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే అరవై సంవత్సరాల వయస్సులో ఎంతో కొంత భద్రతా జీవితం , సామాజిక బలం , మిత్ర సంపద వున్న నాకే అభద్రతాభావం , మనవరాలు , మనవడు , కుమారులు ఎట్లా బ్రతుకుతారోనని ఆందోళన , భయం ఆవహించినప్పుడు చటుక్కున వీరు గుర్తుకొచ్చారు. ఒక్కసారి మూడు దశాబ్దాల వెనక్కి వెళ్ళాను. చెంప పెట్టులాంటి వీరి జీవితం జీవన సంగ్రామం ఈ నిర్మమ యుద్ధంలో వాళ్ళ అమ్మమ్మ శ్రీమతి సంజమ్మ వ్యాన్ గార్డులా ముందుండి విజేతలను చేసిన తీరు నన్ను సిగ్గుపడేలా చేసింది.
ఇప్పుడు ఆ ఇర్వురు పిల్లలు ( అక్క, తమ్ముడు ) పెరిగి పెద్ద అయి పిజి దాకా చదువుకుని ఉద్యోగిస్తూ సుఖజీవనం గడుపుతున్నారు. వృత్తిరీత్యా ఎన్నో పర్సనాలిటీ డెవలప్ మెంట్ క్లాసులకు హాజరైన నేను , మరెన్నో వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదివిన నేను , మరెంతో కొంత నాకు వామపక్ష భావాలు , ఉద్యమాలలో పాల్గొన్న నేను ఇంత బేలగా ఆలోచించడం హాస్యాస్పద మనిపించింది. 27 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన గుర్తుకొచ్చి పిల్లల యింటికి వెళ్ళి స్ఫూర్తిని పొంది రీజువెనేట్ అయి వచ్చాను.
కొసమెరుపు : అప్పటికే ( 1997 నాటికి ) 60 సంవత్సరాల నిండిన సంజమ్మగారు పిల్లలను దత్తత తీసుకుంటామంటే ససేమిరా యివ్వనన్నారు. నా బిడ్డను యీ పిల్లల్లో చూసుకుంటానని తీగకు కాయ బరువా అని చెప్పి ఎంతో శ్రమకోర్చి పిల్లలను పెంచి పెద్ద జేసి , ప్రయోజకులను చేసిన సంజమ్మకు మరోసారి ప్రణమిల్లుతూ పాఠకుల కోసం ఆ పిల్లల నాటి , నేటి ఫోటోలు జతచేస్తూ ఈ బృహత్కార్యంలో ప్రధాన పాత్ర వహించిన జింకా నాగరాజుగారికి , విరాళాలు పంపిన నాటి మిత్రులకు మరో మారు కృతజ్ఞతలు తెలుపుకుంట.