GST తగ్గింపు సరే, కనీస మద్దతు ధరల మాటేమిటి ?
x

GST తగ్గింపు సరే, కనీస మద్దతు ధరల మాటేమిటి ?

తెలంగాణా వ్యవసాయ రంగంలో సమస్యలను పరిష్కరించడానికి నిజంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చేయాల్సి ఉంటుంది?

Click the Play button to hear this message in audio format

మోదీ నేతృత్వం‌లోని కేంద్ర ప్రభుత్వం GST శ్లాబుల్లో మార్పులు చేయడం వల్ల, దేశంలోని రైతులందరికీ గొప్ప మేలు జరిగినట్లు చెప్పుకుంటున్నది. రైతులపై, పశు పోషకులపై ఏ మేరకు పన్నుల భారం తగ్గినా మనం స్వాగతించాల్సిందే కానీ, ఇదే అన్ని సమస్యలకు పరిష్కారం అని భావించడం పొరపాటు.

వ్యవసాయం ఇతర వృత్తుల లాంటిది కాదు. ఆకాశం క్రింద, ఎలాంటి రక్షణలు లేని బహిరంగ ప్రదేశంలో జరిగే కార్యకలాపం ఇది. ఈ రంగంలో సమస్యలు అత్యంత సంక్లిష్టమైనవి. లోతైనవి. ఒక్క పథకం తోనో, ఒక్క విధానం తోనో పరిష్కారం అయ్యే సమస్యలు కావివి. ప్రతి అడుగు లోనూ, ప్రతి మలుపు లోనూ ప్రత్యేక చొరవ, ప్రత్యేక ప్రణాళిక తో కూడిన చర్యలు అవసరమవుతాయి. అందుకే చర్చను కేవలం GST చుట్టూ తిప్పకూడదు.

GST పాత శ్లాబ్ ప్రకారమే అమలయితే రైతులపై పడే భారం ఏమిటో చూద్దాం:

1. రసాయన ఎరువులపై GST : ఇప్పటి వరకూ వ్యవసాయ సంబంధిత పోషక ఆధారిత ఎరువులైన నత్రజని, ఫాస్పరస్, పొటాష్ ఎరువులపై, ఇతర కాంప్లెక్స్ ఎరువులపై 5 శాతం GST ఉండింది. వ్యవసాయేతర రసాయన ఎరువులపై 18 శాతం ఉండేది. ఇప్పుడు తాజా GST శ్లాబ్ ప్రకారం కూడా వ్యవసాయ సంబంధిత రసాయన ఎరువులపై 5 శాతమే GST ఉంది.

2. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర CACP సంస్థకు పంపిన నివేదిక ప్రకారం తెలంగాణాలో 2024-2025 ఖరీఫ్ సీజన్ లో వరి సాగులో ఒక హెక్టారుకు (156+396+152+1300+3960+1520+1625) మొత్తం 9109 రూపాయల విలువైన రసాయన ఎరువులను రైతులు వినియోగించారు. అంటే ఎకరానికి రసాయన ఎరువుల వినియోగం విలువ 3688 రూపాయలన్నమాట. దీనిపై రైతులు ఒకవేళ 5 శాతం GST ప్రభుత్వానికి చెల్లిస్తే ఎకరానికి రైతు చెల్లించే GST 184.4 రూపాయలన్నమాట.

3. ఇదే నివేదిక ప్రకారం 2024 -2025 సంవత్సరం ఖరీఫ్ సీజన్ లో వరి సాగులో హెక్టారుకు విత్తన శుద్ధికి మరో 513 రూపాయలు, పురుగు విషాల కోసం మరో 13,210 రూపాయలు (అంటే మొత్తం 513+13210=13723 రూపాయలు) కూడా ఖర్చు చేశారు. అంటే ఎకరానికి సుమారు 5861 రూపాయలు రసాయన పురుగు ,కలుపు విషాల కోసం ఖర్చు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ఒకవేళ కేంద్ర ప్రభుత్వ శ్లాబుల ప్రకారం రైతులు 18 శాతం GST చెల్లిస్తే, GST గా 1055 రూపాయలు కేంద్రానికి చెల్లిస్తారన్నమాట.

4. రైతులు వినియోగించే విత్తనాలపై ఎలాగూ GST లేదు. కాబట్టి రైతులపై పడే అదనపు భారమేదీ లేదు.

5. రైతులు వ్యవసాయంలో వినియోగించే డీజిల్, పెట్రోల్ ఎలాగూ GST పరిధిలోకిరావు. వీటిపై ఇతర కేంద్ర, రాష్ట్ర పన్నులు ఉంటాయి. గతంలోనూ, ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం తాను విధించే పన్నులను, సెస్ ను మినహాయించలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగ్గించలేదు. కాబట్టి వీటిపై పన్నుల భారాన్ని రైతులు ఇప్పటికీ మోస్తున్నట్లే.

6. అంటే పాత GST శ్లాబ్ ప్రకారమైనా, కొత్త GST శ్లాబ్ ప్రకారమైనా రైతులపై పడే GST భారం ఎకరానికి (184+1055) 1239 రూపాయలు.

7. రైతులు వ్యవసాయ యంత్రాలు కొనుగోలు చేసినప్పుడు కూడా ఇప్పటి వరకూ 18 శాతం GST చెల్లించే వారు. అది తప్పకుండా రైతులకు భారంగా ఉండేది. ప్రస్తుతం దానిని 5 శాతానికి తగ్గించారు. ఖచ్చితంగా అది రైతులకు వెసులుబాటే. కానీ ఇందులో అసలు సమస్యను అర్థం చేసుకోవాలి. ఒక రైతు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి బోరు వేసుకున్నాడు, మరో 7 లక్షలు ఖర్చు పెట్టి ట్రాక్టర్ కొనుక్కున్నాడు . మరో రెడ్ను లక్షలు ఖర్చు పెట్టి పొలంలో షెడ్డు వేసుకున్నాడు అనుకోండి. అంటే అప్పు చేసి మొత్తం 10 లక్షలు ఖర్చు పెట్టి తన వ్యవసాయం కోసం మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నాడు అనుకుంటే, సహజంగా రైతు ఏమి ఆశిస్తాడు. ఇంత ఖర్చు పెట్టి వ్యవసాయం చేస్తున్నప్పుడు, తాను పండించిన పంట ధర నిర్ణయం సమయంలో వాటిని ఖర్చుగా లెక్కించి, ఆ పెట్టుబడి రికవరీ అయ్యేట్లుగా కనీస మద్దతు ధర నిర్ణయించాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా?

కానీ కేంద్ర ఖర్చుల, ధరల నిర్ణాయక కమిషన్ వ్యవసాయంలో రైతు చేసే ఈ పెట్టుబడి ఖర్చు మొత్తాన్ని కానీ, కనీసం దానికయ్యే వడ్డీ విలువను కూడా ఉత్పత్తి ఖర్చుల లెక్కలోకి తీసుకోదు. ఇతర ఏ రంగాలలో పెట్టుబడి పెట్టి వ్యాపారం ఉత్పత్తుల MRP నిర్ణయించినా, వీటన్నిటినీ పరిగణనలో పెట్టుకుంటారు. అసలు రైతు వ్యవసాయానికి ఉపయోగించే స్వంత భూమికి ఒక్క రూపాయి కూడా విలువ ఇవ్వదు. ఒక వైపు ధరల నిర్ణయం సమయంలో రైతులకు ఇంత అన్యాయం చేస్తూ, వ్యవసాయ ఉపకరణాలపై మాత్రం GST తగ్గించామని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఘనంగా చెప్పుకోవడం మోసం కాదా ?

GST కి బయట రైతులు ఇతర రూపాలలో నష్ట పోతున్నది ఎంత ?

1.తెలంగాణా లో సగం గ్రామీణ జనాభాకు సెంటు భూమి లేదు. లేదా తగినంత భూమి లేదు. ఫలితంగా రాష్ట్రంలో 36 శాతం మంది రైతులు కౌలు వ్యవసాయం చేస్తున్నారు. కానీ కౌలు రైతులకు గుర్తింపు లేదు. కౌలు రైతులకు పి.ఎం కిసాన్, రైతు భరోసా పథకాలు అమలు కావడం లేదు. అంటే కౌలు రైతులు ఎకరానికి సంవత్సరానికి నికరంగా 12,000 రూపాయల రైతు భరోసా పెట్టుబడి సహాయాన్ని కోల్పోతున్నారు.కేంద్రం అందించే 6,000 రూపాయల సహాయాన్ని కూడా అదనంగా నష్ట పోతున్నారు .

2.తెలంగాణా రాష్ట్రంలో మెజారిటీ రైతులకు బ్యాంకుల నుండీ ప్రతి సంవత్సరం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు అందడం లేదు. కౌలు భూమికి అసలు బ్యాంకు రుణాలే అందడం లేదు. అంటే వారికి పంట రుణాలపై జీరో శాతం వడ్డీ పథకం అమలు కావడం లేదన్నమాట . ఫలితంగా రైతులు నెలకు రెండు లేదా మూడు రూపాయల వడ్డీతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుండీ ఋణం తెచ్చుకుంటున్నారు.

3.ఉదాహరణకు వరి సాగు చేయడానికి బ్యాంకులు ఎకరానికి 45,000 రూపాయల స్కేల్ ఆఫ్ ఫైనాస్ ఋణం నిర్ణయించాయి. నిజానికి ఈ రుణానికి వడ్డీ లేదు. కానీ బ్యాంకులు రుణాలు ఇవ్వక పోవడంతో, రైతులు ఇదే మొత్తాన్ని నెలకు 3 రూపాయల వడ్డీపై బయట నుండీ ఋణం తీసుకుంటే, దానిపై 6 నెలలకు 8,100 రూపాయల వడ్డీ చెల్లించాలి.ఆ మేరకు ఇది రైతులపై అదనపు భారమే. రైతులకు నష్టమే.

4.పంటల ధరల నిర్ణయంలో కూడా రైతులకు మోసమే జరుగుతుంది. డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసినట్లుగా సమగ్ర ఉత్పత్తి ఖర్చులను లెక్కించి , దానిపై 50 శాతం లాభం కలిపి కనీస మద్దతు ధరలను నిర్ణయించాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ సూత్రాన్ని పాటించకుండా పంట సాగు ఖచు కు కుటుంబ శర్మ విలువను కొంత జోడించి, దానికి 50 శాతం కలిపి ( A2 + FL+ 50 శాతం) కనీస మద్దతు ధరలను నిరంయిస్తున్నది. ఫలితంగా తెలంగాణాలో రైతులు ప్రతి సీజన్లో ప్రతి ఎకరానికి వేల రూపాయలను నష్టపోతున్నారు.

5.ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం 2025-2026 లో వరి ధాన్యం సాగుకు అంచనా వేసిన సమగ్ర ఉత్పత్తి ఖర్చు (C2) కి 50 శాతం లాభం కలిపి వరికి క్వింటాలుకు 3135 రూపాయలు కనీస మద్దతు ధరగా నిర్ణయించాల్సి ఉండగా, ఈ సంవత్సరం ప్రకటించిన కనీస మద్దతు ధర కేవలం 2369 రూపాయలు మాత్రమే. ఫలితంగా ఎకరానికి 21.79 క్వింటాళ్ళు ధాన్యం దిగుబడి పొందే రైతు ఎకరానికి కనీసం 16 ,694 రూపాయలు నష్ట పోతున్నాడన్నమాట.

కేంద్ర ప్రభుత్వం 2025-2026 లో పత్తి సాగుకు అంచనా వేసిన సమగ్ర ఉత్పత్తి ఖర్చు (C2) కి 50 శాతం లాభం కలిపి వరికి క్వింటాలుకు 10,076 రూపాయలు కనీస మద్దతు ధరగా నిర్ణయించాల్సి ఉండగా, ఈ సంవత్సరం పత్తికి ప్రకటించిన కనీస మద్దతు ధర కేవలం 7710 రూపాయలు మాత్రమే. ఫలితంగా ఎకరానికి 6.85 క్వింటాళ్ళు పత్తి దిగుబడి పొందే రైతు కనీసం 16 ,195 రూపాయలు నష్టపోతున్నాడన్నమాట.

కేంద్ర ప్రభుత్వం 2025-2026 లో మొక్క జొన్న సాగుకు అంచనా వేసిన సమగ్ర ఉత్పత్తి ఖర్చు (C2) కి 50 శాతం లాభం కలిపి మొక్క జొన్న క్వింటాలుకు 2928 రూపాయలు కనీస మద్దతు ధరగా నిర్ణయించాల్సి ఉండగా, ఈ సంవత్సరం మొక్క జొన్న కు ప్రకటించిన కనీస మద్దతు ధర కేవలం 2400 రూపాయలు మాత్రమే. ఫలితంగా తెలంగాణా లో ఎకరానికి 23.22 క్వింటాళ్ళు మొక్క జొన్న దిగుబడి పొందే రైతు కనీసం 12,262 రూపాయలు నష్టపోతున్నాడన్నమాట.

6.తెలంగాణా రాష్ట్రంలో మిగిలిన పంటలు పండించే రైతులు కూడా, ఇలాగే కేంద్ర ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధరల నిర్ణయంలో చేస్తున్న మోసాల వల్ల ప్రతి సీజన్ లో వేలాది రూపాయలు నష్ట పోతున్నారు. దీనిని సవరించకుండా, కేవలం GST తగ్గింపు గురించి మాట్లాడడం మోసం మాత్రమే.

7.పంట నష్ట పరిహారం ఎకరానికి 10,000 రూపాయలు కౌలురైతులకు అందడం లేదు. అసలు రాష్ట్రంలో 2020 నుండీ పంటల బీమా పథకాలు అమలు కాక, రైతులు ప్రతి సంవత్సరం వేలాది రూపాయల విలువైన పంటలను కోల్పోతున్నారు. తీవ్రంగా నష్ట పోతున్నారు. దీని గురించి మాట్లాడకుండా, కేవలంGST తగ్గింపు గురించి గొప్పలు చెప్పుకోవడం అన్యాయం కదా ?

తెలంగాణా వ్యవసాయ రంగంలో సమస్యలను పరిష్కరించడానికి నిజంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చేయాల్సి ఉంటుంది?

రైతులు వ్యవసాయం చేయడానికి - ముఖ్యంగా పంటలు పండించడానికి, పశువుల పోషణకు అనేక రకాల వనరులు అవసరం. ముఖ్యంగా రైతుల చేతుల్లో స్వంత సాగు భూమి ఉండాలి. లేదా భూమిని ఇతరుల నుండీ కౌలుకు తీసుకోవాలి. తక్కువ ధరలకు నాణ్యమైన విత్తనాలు కావాలి. దుక్కి దున్నడానికి , భూమిని సాగు యోగ్యం చేయడానికి పశువులు, లేదా యాంత్రిక పరికరాలు కావాలి. స్వంత పెట్టుబడి, లేదా వడ్డీ లేని, తక్కువ వడ్డీతో అందే పెట్టుబడి కావాలి.

పంటలకు ఎంతో కొంత సాగు నీరు కావాలి. కోతలు లేని, నాణ్యమైన విద్యుత్ సరఫరా కావాలి. రసాయన లేదా సేంద్రియ ఎరువులు, సస్య రక్షణ విషాలు లేదా జీవ రసాయన కషాయాలు కావాలి. ప్రకృతి వైపరిత్యాలతో పంటలు నష్టపోయినా తట్టుకోవడానికి పంటల బీమా పథకాలు కావాలి. పండించిన పంటలకు న్యాయమైన ధరలు దక్కాలి. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం సమగ్ర ఉత్పత్తి ఖర్చులను లెక్కించి, కనీస మద్దతు ధరలను ప్రకటించి, ఆ ధరలకు చట్టబద్ధత కల్పించాల్సి ఉంటుంది.

సాగు భూముల వరకూ సరైన రోడ్లు, రవాణా సాధనాలు, కావాలి. గ్రామాలలో పండిన పంటలను దాచుకోవడానికి గిడ్డంగులు, శీతల గిడ్డంగులు కావాలి. తాము పండించిన పంటలను రైతులు, ఇతర ఉత్పత్తిదారులు బల్క్ లో అమ్మేసుకోకుండా, ప్రాసెసింగ్ చేసి అమ్ముకోవడానికి అవసరమైన ప్రాసెసింగ్ యూనిట్లు కావాలి.

పశువులకు అవసరమైన మేత భూములు, స్థానిక పంటలు, వనరులతో నడిచే దాణా యూనిట్లు, పశువులకు వైద్య శాలలు అవసరం. తాజా కూర గాయలు, పండ్లు, పాలు, చేపలు, గుడ్లు, మాంసం లాంటి వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులను ప్రాసెస్ చేయడానికి, నిల్వ చేసి నేరుగా వినియోగ దారులకు, లేదా బయట మార్కెట్ కు సరఫరా చేయడానికి సమగ్రమైన కోల్డ్ చైన్ ఏర్పడాలి.

ఈ పనులన్నీ ఒక క్రమ పద్ధతిలో, ప్రొఫెషనల్ గా చేయడానికి, రైతులకు, కూలీలకు, గ్రామీణ యువతకు అవసరమైన శిక్షణలు కూడా అవసరముంటుంది. మనుషుల, ఇతర జీవ జాతుల ఆరోగ్యాలను, మొత్తంగా పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్న రసాయన వ్యవసాయానికి భిన్నంగా, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం, ఉత్పత్తి పద్ధతుల వైపు రైతులను ఒప్పించి, నడిపించాల్సి ఉంటుంది. వాతావరణంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని, స్థానిక సాగు భూముల పొందిక ఆధారంగా పంటల ప్రణాళిక చేయాల్సి ఉంటుంది. ఇందు కోసం ముందుగా గ్రామీణ స్థాయిలో నిజమైన సాగు దారులను, ఇతర ఉత్పత్తి దారులను గుర్తించవలసి ఉంటుంది. దీర్ఘ కాలికంగా ఇవన్నీ సవ్యంగా సాగడానికి రైతు సహకార సంఘాలు, వాటికి శిక్షణ పొందిన డైరెక్టర్స్ , CEO లు అవసర ముంటుంది.

పైన చెప్పిన అన్ని అంశాలూ, నిర్దిష్ట కాల పరిమితిలో జరిగితే నిజంగా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ మెరుగు పడుతుంది. ఇందుకోసం ప్రతి సంవత్సరం తగినంత బడ్జెట్ కేటాయింపులు కూడా అవసరమవుతాయి. ఇవన్నీ జరగాలంటే, రాజకీయ, సామాజిక నిబద్ధత కలిగిన ప్రభుత్వ విధాన నిర్ణయాలు, ప్రభుత్వ సిబ్బంది సహకారం ఉండాలి. ఇవన్నీ చేయకుండా, ఏ ప్రభుత్వమైనా తమకు తోచినట్లు వ్యవసాయ రంగాన్ని నడపాలనుకుంటే, వ్యవసాయ కుటుంబాల సంక్షోభం భవిష్యత్తులోనూ కొనసాగుతుంది.

ఇవన్నీ మళ్ళీ, ఎందుకు ప్రత్యేకంగా చెప్పవలసి వచ్చిందంటే, ప్రభుత్వాలు ఇలాంటి సమగ్ర దృష్టితో కాకుండా, కొన్ని అర కొర చర్యలతో, అపసవ్య పద్ధతులతో , అన్యాయమైన విధానాలతో వ్యవసాయ రంగాన్ని నడపాలని భావిస్తున్నాయి. వ్యవసాయ రంగ విధానాలు రూపొందించే టప్పుడు, బడ్జెట్ కేటాయింపులు చేసేటప్పుడు, కొత్త పథకాలు ప్రవేశ పెట్టేటప్పుడు సామాజిక న్యాయం, పర్యావరణ దృక్కోణం, రాజకీయ , సామాజిక నిబద్ధత అసలు ఉండడం లేదు.

ఇవన్నీ ప్రభుత్వాలకు అవగాహన లేక జరుగుతున్నదని అనుకోవడానికి వీల్లేదు. అలా ఎవరైనా భావిస్తే అది రాజకీయ అపరిపక్వత మాత్రమే. లేదా ప్రభుత్వాల నిజ స్వభావాన్ని అర్థం చేసుకోక పోవడం మాత్రమే. ప్రధాన రాజకీయ పార్టీలు ఏవైనా, ఏ స్థాయి ప్రభుత్వాలైనా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బాగు కోసం ఆలోచించడం కాకుండా, భూమి లాంటి సహజ వనరులను సులువుగా కాజేయడానికి, లక్షలాది మంది చిన్న, సన్నకారు రైతుల చేతుల్లో ఉన్న ఆ వనరులను కొద్ది మంది ధనవంతుల చేతుల్లోకి మళ్ళించడానికి, వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పతులు చవకగా, మార్కెట్ శక్తులకు అందించడానికి వీలుగా డిజైన్ చేయబడిన విధానాలు ఇవి.

ప్రజలకు, పశువులకు అవసరమైన ఆహార ఉత్పత్తుల స్థానంలో , పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకులను సరఫరా చేసే కేంద్రాలుగా గ్రామీణ ప్రాంతాలను మార్చడం, అవసరమైన చవక కూలీలను గ్రామాల నుండీ బయటకు తెచ్చి, నగరాలకు, పట్టణాలకు, పరిశ్రమలకు సరఫరా చేయడం ఈ విధానాల ప్రధాన లక్ష్యంగా ఉంది.

ప్రభుత్వాలు తలుచుకుంటే, పైన ప్రస్తావించిన చాలా సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఉంది. కాకపోతే, కార్పోరేట్ అనుకూల అజెండాను ప్రజలపైకి తోయకుండా, ప్రజలు, పర్యావరణం కేంద్రంగా అభివృద్ధి నమూనాను అమలు చేయవలసి ఉంటుంది. కొన్ని కొత్త చట్టాలను చేయాల్సి ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఇప్పటికే ఉన్న చట్టాలను అమలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అమలు చేస్తున్న కొన్ని పథకాలకు మార్గ దర్శకాలను మార్చవలసి ఉంటుంది. బడ్జెట్ లో మరిన్నినిధులను కేటాయించాల్సి ఉంటుంది. ఇవేవీ చేయకుండా కేవలం GST చుట్టూ చర్చను తిప్పడం, కేవలం పి.ఎం కిసాన్ చుట్టూ గొప్పలు చెప్పుకోవడం కేంద్ర ప్రభుత్వానికి తగదు.

అత్యంత అసంఘటితం గా ఉండే వ్యవసాయ రంగంలోని ప్రజలు , ఇతర గ్రామీణ ప్రజలు సంఘటితం కాకుండా, తమ స్థానిక అవసరాల ప్రాతిపదికగా నిర్దిష్ట డిమాండ్లు చేయకుండా, రాజకీయ పార్టీలకు, కుల మతాలకు అతీతంగా సమిష్టిగా పోరాడకుండా, ప్రభుత్వాలు వాటంతటవే , వ్యవసాయ రంగం, గ్రామీణ ప్రజలు ఎదుర్కుంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తాయని భావించలేము.

Read More
Next Story