
ప్రకృతి మధ్య ఆదివాసీల కఠిన జీవనం
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని గుండాల గ్రామంలో ప్రకృతి అందాల మధ్య జీవిస్తున్న ఆదివాసీలు రహదారి, నీరు, వైద్యం కోసం ఎదుర్కొంటున్న కష్టాల కథ.
అడవులు... కొండలు... జలపాతాల నడుమ ప్రకృతి ఒక ఆకుపచ్చని వర్ణ చిత్రాన్ని గీసుకున్నట్టుగా కనిపించే ఒక ప్రాంతం గుండాల.
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని ఈ ప్రాంతానికి మొదటిసారి వెళ్లినవారికి అది ప్రకృతి సోయగాల సందడిలా అనిపిస్తుంది. ఎత్తైన గుట్టలపై నిలిచిన దట్టమైన అడవులు, వాటి మధ్య నుంచి జారిపడే జలపాతాలు, గాలిలో వినిపించే పక్షుల స్వరాలు ఇవన్నీ కలిసి ఒక మంత్ర ముగ్ధ ప్రపంచాన్ని సృష్టిస్తాయి.
కానీ ఆ అందాల మధ్య జీవిస్తున్న దాదాపు రెండు వేల మంది ఆదివాసీల జీవితం మాత్రం ఇప్పటికీ శతాబ్దాల వెనుకబాటే ఉంది.
ప్రకృతి ఇచ్చిన సంపద అపారం. కానీ అభివృద్ధి మాత్రం ఇక్కడికి చేరలేకపోయింది.
సాహస యాత్రలా మారే గుండాల దారి
గుండాల ప్రాంతానికి మరో ప్రత్యేకత గుండాల జలపాతం. కొండల నడుమ దాగి ఉన్న ఈ జలపాతం ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది. రోంపాపల్లి గ్రామం నుంచి కాలినడకన కొండలు దాటి వెళ్లే మార్గం ఒక సాహసయాత్రలా ఉంటుంది. అడవుల మధ్యుగా సాగిన ఆ దారి ప్రయాణికులకు ఆహ్లాద అనుభూతిని ఇస్తుంది.
ఈ కారణంగా ఇటీవలి కాలంలో గుండాల ప్రాంతం పర్యావరణ పర్యాటక కేంద్రంగా ఎదుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
రేషన్ సరుకుల రాళ్ల దారిలో 8కిలోమీటర్లు నడవాలి
అయితే పర్యాటకులు ఆస్వాదిస్తున్న అదే ప్రకృతి మధ్య జీవిస్తున్న ఆదివాసీలు మాత్రం కనీస సౌకర్యాల కోసం ఇంకా పోరాటమే చేస్తున్నారు.
ఎనిమిది కిలోమీటర్ల నడక
గుండాల గ్రామం ఒక గణాంకం కాదు. అది ఒక జీవన పోరాటం.
ఇక్కడి ప్రజలకు రేషన్ సరుకులు తెచ్చుకోవాలంటే ఎనిమిది కిలోమీటర్లు కాలినడకన కొండ దిగి వెళ్లాలి. ఒక గోలి కావాలన్నా, జ్వరం వచ్చినా అదే దారి పట్టాలి.
వానాకాలం వస్తే పరిస్థితి మరింత దారుణం.
రోగాలు వచ్చినా ఇదే దారిలో కొండ దిగి రావాలి
బురదతో నిండిపోయే మార్గాలు, ఉప్పొంగే వాగులు, జారి పడే కొండరాళ్లు... ఇవన్నీ కలిసి గ్రామస్తుల ప్రయాణాన్ని ప్రమాదకరంగా మారుస్తాయి.
అప్పుడప్పుడు ఒక చిన్న అనారోగ్యం కూడా పెద్ద సమస్యగా మారిపోతుంది.
‘ సర్కారు మా వైపు చూడలేదు...’
గ్రామానికి చెందిన మర్సుకోల అశోక్ తన బాధను ఇలా వ్యక్తం చేశాడు.
‘ఇప్పటివరకు సర్కారు మా వైపు చూడలేదు. ఇక్కడ పనిచేసిన పోలీస్ సార్ పుష్పాల రామారావు కొంత దూరం మొరం రోడ్ వేయించారు. కానీ వానలకు అది కూడా చెదిరిపోయింది. రేషన్ సరుకులు తెచ్చుకోవాలంటే మేము ఇంకా కాలినడకనే వెళ్లాలి.”
అశోక్ మాటల్లో వినిపించిన ఆవేదన అక్కడి పరిస్థితులను అక్షరాలా ప్రతిబింబిస్తుంది. అతను అక్కడ గిరిజన స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి గత 8 నెలలుగా ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదు. అతడికే కాదు , కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 34 మంది టీచర్లకు జీతాలు లేవు. అయినప్పటికీ వారు గిరిజన బిడ్డలకు చదువు చెప్పడం ఆపలేదు.
జీతాలు రాక పోయినా పాఠాలు చెబుతున్న టీచర్ మర్సుకోల అశోక్
‘రోగం వస్తే భయమే ఎక్కువ...’
గ్రామానికి చెందిన రాయి సిడం సోము పటేల్ వైద్య సదుపాయాల లేమిని గుర్తుచేస్తూ ఇలా చెబుతాడు.
‘ఇక్కడ ఎవరికైనా అనారోగ్యం వస్తే ముందుగా భయం మొదలవుతుంది. దగ్గరలో ఆసుపత్రి లేదు. రహదారి లేకపోవడంతో గ్రామం నుంచి బయటకు తీసుకెళ్లడమే కష్టమవుతుంది.’
ఈ మాటలు అక్కడి ఆరోగ్య వ్యవస్థ ఎంత దూరంగా ఉందో తెలియజేస్తున్నాయి.
‘నీళ్ల కోసం తెల్లవారుజామునే క్యూలు...’
గ్రామానికి చెందిన బావి దగ్గరున్న కొట్నాక పత్తుబాయి, తాగునీటి కష్టాలను వివరించారు.
‘నీళ్ల కోసం మేము ఉదయం నాలుగు గంటలకే లేస్తాం. బావి దగ్గర క్యూ ఉంటుంది. ఆలస్యమైతే నీళ్లు దొరకవు. పిల్లలు స్కూల్‌కి వెళ్లాలంటే ముందుగా నీళ్లు తెచ్చుకోవాలి.’
నీరు వంటి ప్రాథమిక అవసరం కూడా ఇక్కడ రోజువారీ పోరాటమే.
ఎన్జీఓలు స్పందించాలి
‘ అసిఫాబాద్ ప్రాంతంలో ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నపుడు గుండాల ప్రాంతాన్ని కాలినడకన వెళ్లి చూశాను. రహదారులు లేక వీరు పడుతున్న కష్టాలు కొంతయినా తగ్గించాలని నా మిత్రుల సహాయంతో కొంత వరకు మట్టి రోడ్డు వేశాం. కానీ అది సరిపోదు.వానలకు గుట్టల మీద నుండి వచ్చే నీటి కోతకు అవి దెబ్బతిన్నాయి. ఎవరైనా ఎన్జీఓలు ముందుకు వచ్చి వీరికి సహకరించాలి. తాగునీటి వసతి కూడా కల్పించాలి’ అన్నారు, ఖమ్మం జిల్లాలో ఎస్.ఐ గా పనిచేస్తున్న పుష్పాల రామారావు.
ప్రకృతి వరాలు... కానీ అభివృద్ధి అడుగులు ఎక్కడ?
గుండాల ప్రాంతం ప్రకృతి సంపదతో నిండిపోయి ఉంది.
జలపాతాలు, అడవులు, కొండలు ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా ఎదగగల సామర్థ్యం కలిగి ఉన్నాయి.
అయితే అదే ప్రాంతంలో నివసించే ప్రజలకు రహదారులు, తాగునీరు, వైద్య సదుపాయాలు వంటి ప్రాథమిక అవసరాలు ఇంకా అందక పోవడం ప్రభుత్వ వైఫల్యం.
పర్యాటక కేంద్రంగా ఎదుగుతున్న ప్రాంతంలో నివసించే ప్రజలు ఇంకా అభివృద్ధి అంచుల్లోనే ఉండటం ఒక నమ్మలేని వాస్తవం.
‘ వానా కాలం వస్తే మాకు నరకమే . కాలినడక తప్ప కనీసం బైక్ వెళ్లడానికి కూడా రహదారి లేదు. ప్రభుత్వ అధికారులకు ఎన్ని సార్లు మెరపెట్టుకున్నా మా గోడు వినరు. ఎన్నికల సమయంలో మాత్రం మా ఓట్ల కోసం ఇక్కడ పోలింగ్ కేంద్రం పెడతారు. మాకు రోగాలు వస్తే చూడ డానికి ఒక్క ఆరోగ్య కేంద్రం కూడా పెట్టరు ’ అని మర్పుకోల రాము, సోయం భూమ్‌రావు ఆవేదనగా చెప్పారు.
అడవిలో దాగిన ఆశ
గంటసేపు తమ కష్టాలను వివరించిన తర్వాత టీచర్ మర్సుకోల అశోక్ చివర్లో ఒక మాట అన్నాడు.
“మా కష్టం ఎవరైనా చూడాలి... వినాలి... స్పందించాలి ”
ఆ మాటల్లో ఆవేదన ఉంది. కానీ అదే సమయంలో ఒక చిన్న ఆశ కూడా ఉంది.
ఎప్పుడో ఒక రోజు ఈ అడవిలో దాగి ఉన్న గుండాల గ్రామం వైపు కూడా అభివృద్ధి దారి తిరుగుతుందేమో అన్న ఆశ.
ప్రకృతి అందాల మధ్య జీవిస్తున్న ఈ ఆదివాసీ గ్రామం కథ ఒక ప్రశ్నను మాత్రం మిగుల్చుతుంది.
పర్యాటకులకు స్వర్గంలా కనిపించే ఈ ప్రాంతం, అక్కడి ప్రజలకు కూడా ఎప్పుడైనా జీవన సౌకర్యాల స్వర్గంగా మారుతుందా?

