శేషాచలం కొండల్లో గుంజన జలపాతం, చేరుకోవడం ఒక సాహసయాత్ర
x
తాడు పట్టుకుని కొండ నుంచి నీటి గుం డం వద్దకు దిగుతున్న దృశ్యం

శేషాచలం కొండల్లో గుంజన జలపాతం, చేరుకోవడం ఒక సాహసయాత్ర

రెండు కొండల నడుమ జీవనదిలా నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది గుంజన జలపాతం. అక్కడకు చేరాలంటే ఎంతో సాహసం చేయాలి.


రెండు కొండల నడుమ గుంజన ఏరు


రెండు కొండల నడుమ నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది! ఎత్తైన కొండపైనుంచి నిత్యం దుముకుతూనే ఉంటుంది! మా సీమను వరించిన మా నయాగరా ఈ గుంజన!

చెట్లకొమ్మలు, రాళ్ళు, చెట్లకు కట్టిన తాళ్ళు పట్టుకుని లోయలోకి దిగడం, గుంజన ముందున్న గుండంలో మునడం, దాని కిందున్న లోతైన గుండాల్లోకి దూకడం, దుముకుతున్న జలపాతం నుంచే తాళ్ళు పట్టుకుని దిగడం, మళ్ళీ ఆ తాళ్ళు పట్టుకునే ఆ జలపాతానికి ఎదురుగా ఎక్కడం నిజంగా ఎంత సాహసం! ఎంత తెగింపు!గుంజనను పైనున్న మమకారమే మమ్మల్ని అడవిలోకి నడిపించింది.

‘శనివారం, ఆదివారం గుంజనకు వెళుతున్నాం, నైట్ స్టే వస్తారా?’ అడిగాడు మధు. ‘గుంజన’ అనగానే గుండెల్లో ప్రేమ ఎగదన్నుకు వచ్చింది. ఒకరా, ఇద్దరా, పాతికమందిమి! ఒక రాత్రి, రెండు పగళ్ళు అడవి తల్లి చల్లని కనురెప్పల నీడల్లో సేద దీరడానికి గుంజన కొలువుదీరిన శేషాచలం కొండల్లోకి ఇలా దారి తీశాం.

మార్చి 2వ తేదీ, శనివారం ఉదయం పదిగంటలకు తిరుపతి నుంచి బయలు దేరాం. మా ద్విచక్రవాహనాలు జాతీయ రహదారిపై కోడూరు వైపు దూసుకుపోతున్నాయి. కోడూరుకు ఈవల, రోడ్డుకు కుడివైపున ఉన్న గంగరాజు పోడు వైపు సాగుతున్నాం.

రాళ్ళతో నిండిన నదిలాంటి గుంజన ఏరు. వర్షాకాలంలో చూడాలి దీని విశ్వరూపాన్ని. నిండుగా ప్రవహిస్తుంటుంది. ఇరువైపులా అరటి, మామిడి తోటలు. ఉదయం పదగొండున్నరైంది.

రోడ్డు ఎన్ని మెలికలు తిరుగుతోందో, అన్ని మెలికలూ తిరిగాం. ఆ మెలికల్లో మా స్కూటర్లు, మోటారు సైకిళ్ళు తూనీగల్లా సాగిపోతున్నాయి. చివరి గ్రామం పొట్టిరాజు గారి పల్లె. ఆ తరువాత అంతా అడివే. అటవీ శాఖ గేటుదాటుకుని, అడవిలోకి ప్రవేశించాం. ఇరువైపులా రకరకాల చెట్లు, అనేక రకాల మొక్కలు. జాతి వైరం లేకుండా అన్నీ సహజీవనం సాగిస్తున్నాయి. జంతుజాలానికి ఆవాసంగా నిలుస్తున్నాయి.

ఎప్పుడో బ్రిటిష్ కాలంలో అడవిలో వేసిన మట్టి రోడ్లు. దారంతా ఎగుడుదిగుడుగా, రాళ్ళు రప్పలతో నిండిపోయింది. ఇరువైపులా ఎత్తైన చెట్లు. కనుచూపు మేర మానవ నాగరికత ఆనవాళ్ళు కను మరుగవుతున్నాయి. కొండ చిలువ చుట్టేసినట్టు , ఆ రోడ్డు కూడా కొండను చుట్టేసుకుంది. అంతా ఘాటీనే. ఆ ఘాటీ పైనే మా వాహనాలు ఎత్తుకు వెళుతున్నాయి.

ఎంత దట్టమైన అడవి! ఎప్పుడో ఏనుగులు సంచరించిన ఆనవాళ్ళు. ఎండిపోయిన వాటి విసర్జితాలు. భయం లేదు, ముందుకు సాగిపోతున్నాం. ‘నన్ను చూడాలి, నా సౌందర్యానందాన్ని పొందకుండా వెళిపోతే ఎలా? అంటూ ’ మా వాహనాల వేగాన్ని ఎత్తైన కొండ తగ్గించేసింది.

ముందు వెళుతున్న వాహనాలు రేపుతున్న దుమ్ములోనే సాగుతున్నాం. మధ్యాహ్నం పన్నెండున్నరైంది. ఎడమ వైపున గుంజనలోకి దిగే కాలి బాట కనిపించింది. రాత్రి బస చేయాలి కనుక మరో కిలోమీటరు దూరం వెళ్ళాం. ‘దొంగలచెల’ (దొంగల బండ) దగ్గరకొచ్చేశాం.

అడవి లోకి సాగుతున్న నడక

అడవిలోకి సాగుతున్న నడక


మా వాహనాలను అక్కడ నిలిపేసి, సామాను తీసుకుని, ఎడమ వైపు లోయలోకి దిగుతున్నాం. దట్టమైన అడవి. అడవి మధ్యలో నిట్టనిలువుగా లోయలోకి రాళ్ళ పైన దిగుతున్నాం. దూరంగా ఏరు ప్రవహిస్తున్న శబ్దాలు మా చెవులకు సోకుతున్నాయి. అరగంటలో కొండను దిగేశాం. నేలంతా పరుచుకున్న బండ. రెండు కొండల నడుమ గుంజన ఏరు. వర్షాకాలం చూడాలి దీని ఉగ్రరూపం.


గుంజన ఏరు దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవహిస్తోంది. వందల అడుగుల రాతి కొండ పైనుంచి ఈ ఏరే జలపాతమై కిందకు దూకుతుంది. లోయంతా పరుచుకున్న రాతి బండపై మధ్యమధ్యలో లోతైన నీటి గుండాలు. నీటి గుండాలు కనిపిస్తే చాలు మా ట్రెక్కర్లకు పూనకం వచ్చేస్తుంది.


ట్రెక్కర్లు ఈదులాడే నీటి గుండం


మధ్యాహ్నం ఒంటిగంటవుతోంది. ఎండ చుర్రు మంటోంది. చెట్లకింద బ్యాగులు పెట్టిసి ఒకరొకరు నీటి గుండంలోకి దూకుతున్నారు.


తొలుత బయలుదేరింది అంతా ఇరవై మందిమే. కొందరు తమిళనాడు నుంచి వచ్చి చేరారు. వయసులో పన్నెండేళ్ళ పవన్ అందరికంటే చిన్న వాడైతే, వయసులో అందరి కంటే నేను పెద్ద వాణ్ణి. అంతా ఇరవై నుంచి నలభై ఏళ్ళ వాళ్ళే. అయినా అంతా పిల్లలైపోయారు.

మాలో ఇద్దరు యువకులకు ఈతరాదు. ‘మేం ఉన్నాం కదా దిగండి’ అన్నాడు మధు. భయపడుతూ భయపడుతూ లోతులేని చోట దిగారు.
భయానికి, ఈతకు పొత్తు పొసగదు. భయం పోతేనే ఈతొస్తుంది. ఈతొస్తేనే భయం పోతుంది.

ఈ మూల నుంచి ఆ మూల వరకు దగ్గరుండి ఈత కొట్టించాడు. నాలుగ్గంటల్లో కాళ్ళు, చేతులు ఆడిస్తూ నీటిపైన తేలాడడం నేర్పించాడు. లోతైన గుండంలోకి రాకపోయినా, కాళ్ళు అందే చోటు లోనే ఈత కొట్టారు. మిగతా అంతా గుండంలోకి దూకుతున్నారు.

హైదరాబాదు నుంచి వచ్చిన పన్నెండేళ్ళ పవన్ నీటి గుండంలో చేపపిల్లే. అంతా ఉభయచరాల్లా తయారైపోయారు. గుండం పైకెక్కి ఆ తడిగుడ్డల్తోనే తెచ్చుకున్న తిండిని ఆవురావురు మంటూ అరగంటలో తినేశాం.


రెండు కొండల నడుమ గుంజన ఏరు


మళ్ళీ నీటిగుండంలోకి దూకేశాం. ‘దూకేయమంటే దూకేస్తానే నీ కోసం’ అన్న చరణం గుర్తుకొచ్చింది. నిట్టనిలువునా దూకడం, తల కిందులా డై కొట్టడం, నీళ్ళలోనే లోఈత ఈదడం, ఎన్ని జల విన్యాసాలు! ఎన్ని సరదాలు! నీళ్ళలోనే ఎన్ని కబుర్లు!


ఎవరెక్కువ సేపు లోఈత కొడతారో పోటీ. నా వరకు నేను పజ్జెనిమిది సెంకండ్ల వరకు నీళ్ళలో ఊపిరి బిగబట్టాను. మళ్ళీ లోఈతలో పాతిక సెంకడ్ల వరకు ఊపిరి బిగబట్టగలిగాను. అంతే.. అంతకు మించి ఊపిరి బిగబట్టడం నా వల్ల కాలేదు. యువకులతో నేనక్కడ పోటీ పడతాను!

నీళ్ళలో ఉంటే కాలం తెలియడం లేదు. సాయంత్రం అయిదున్నరవుతోంది. పడమటి గాలి వీస్తోంది. గాలి తో వచ్చిన చల్లదం తాకుతోంది. సూర్యుడు పడమటి వైపునకు పయనమయ్యాడు. గుండంలోంచి పైకి లేచేశాం.


గుంజన ఏరు మధ్య లో లోతుగా ఉన్న నీటి గుండం


గుండం పై నెక్కి, విశాలమైన బండపైన గుడారాలు వేసుకున్నాం. చీకటి పడకముందే ఎండిన దుంగలను, కట్టె పుల్లలను ఏరు కొచ్చాం. దుంగలను రాతి గాడిలో పడేశాం. వంటలు మొదలయ్యాయి. మాలో ఇద్దరు ముగ్గురు నలభీములయ్యారు. రాత్రి ఏడు గంటల సమయంలో డీఎఫ్ఓ (జిల్లా అటవీ అధికారి) సతీష్ సహా మరో అయిదుగురు వచ్చి మాతో చేరారు.


కొండను ఆనుకుని మా పక్కనే ఏరు ప్రవహిస్తోంది. ఎంత రొద చేస్తోందో. ఆ రొదతో పోటీపడుతూ తరగని మా కబుర్లు. గత ఏడాది అక్టోబర్లో గుంజనకు వచ్చాను. ఈ మధ్యలో మా ట్రెక్కింగ్ బృందం రెండు సార్లు వచ్చి వెళ్ళింది. పుస్తకం పనిలో పడి గుంజనను మరిచాను. ఈ నాలుగు నెలల ట్రెక్కింగ్ విరామంలో గుంజనను చూడక మొహం వాచినట్టైంది.

చీకటి పడుతోంది. ఆకాశంలో మేఘాలు అతి మెల్లగా కదులుతున్నాయి. చుక్కలు ఒకటొకటిగా వస్తున్నాయి. చురుక్కు మనే ఎండ, వీచే చల్లని పడమటి గాలి, కొండల మాటుకు వెళ్లిపోయే సూర్యుడు, కదులుతున్న మేఘాలు, చీకట్లో మమ్మల్ని పలకరిస్తున్న చుక్కలు, ఒకటొకటిగా మా ముందు నిదానంగా క్యాట్ వాక్ చేసి వెళ్ళి పోతున్నాయి. రాళ్ళ మధ్యనే ఒక కొయ్యను నిలబెట్టి, చార్జింగ్ లైట్లు బిగించారు. ఆరు బయటే ఆ వెలుగులో అంతా కలిసి భోజనాలు ముగించారు. నీటి గుండంలో నాలుగున్నర గంటలు ఈదే సరికి శరీరం అలిసిపోయింది. కళ్ళు మూతలు పడుతున్నాయి. నా వరకు నేను గుడారంలోకి దూరేశాను.


చలి మంట ముందు ప్రకృతి ప్రియులు


చలి మొదలైంది. గుడారాల మధ్యలో చలిమంట వేశారు. రాత్రి పదిగంటల వరకు కబుర్లు చెప్పుకుని అలసిపోయి, మా బృందం సభ్యులు ఒకరొకరుగా విశ్రమిస్తున్నారు. రాత్రంతా ఏరు రొద చేస్తూ, తన సొదలు వినిపిస్తోంది. అతిథుల్లా ఎప్పుడో వచ్చి పలకరించే మేం, దివారాత్రులూ మాట్లాడే ఏరు. నిద్రపోతున్నానే కానీ, ఏరు వినిపించే సంగీతం మదిని తాకుతూనే ఉంది. జోల పాడుతూనే ఉంది.


తెల్లవారు జామునే మెలకువ వచ్చేసింది. చలి విపరీతంగా ఉంది. అప్పటికే కొందరు చలిమంట ముందు కూర్చున్నారు. చలిమంట ముందు ఎంత వెచ్చగా ఉంది! ఒక పక్క చలి, మరొక పక్క వేడి. చలివేడి మేలుకలయికలాంటి వింత అనుభూతి.

తెలతెలవారుతోంది. ఏటికి ఇరువైపులా అడవి ఎంత అందంగా ఉందో ! ఎంత నిర్మలంగా ఉందో ! పక్షుల పలకరింపుల తో తెల్లారింది. తయారు చేసిన అల్పాహారం తేనేశాం. ‘ప్యాకప్ ’ అన్నాడు మధు. గుడారాలు పీకేసి, సామాను సర్దేసి, బుజానకేసుకుని వచ్చిన దారినే కొండ ఎక్కడం మొదలు పెట్టాం.


గుంజన ఏరు మధ్య గుడా రా లు


ఇది వరలో వచ్చినప్పడు ఏరు ప్రవహిస్తున్న వైపే, ఏరు వెంటే నడుచుకుంటూ వెళ్ళి, ఏరు దుమికే దగ్గర కొండెక్కి, దాని పైనుంచి లోయలోకి దిగే వాళ్ళం. ఈ తడవ వచ్చిన దారినే కొండ ఎక్కి మా వాహనాల వద్దకు చేరాం.


మా వాహనాలను మరో కిలో మీటరు దగ్గర ఆపేసి లోయలోకి దిగడం మొదలు పెట్టాం. దట్టమైన అడవి. అడవిలో పెరిగిన బోద మధ్యలో సన్నని నడక దారి. నడవడం వల్ల ఏర్పడిన అనేక దారులు. ఏ దారెటుపోతుందో తెలియదు. ‘ఫాలోమీ’ అన్నాడు దళపతి మధు అంటే, ఉపదళపతులు కార్తీక్, శ్రీ హరి అందరినీ ఒక దారిన నడిపించారు.

కొంత దూరం వరకే కాస్త ఏటవాలుగా సాధారణ నడక. అక్కడి నుంచి లోయలోకి నిట్ట నిలువునా దిగడం మొదలు పెట్టాం. గంజన జలపాతపు హోరు వినిపిస్తోంది. పక్కనున్న చెట్లను, కొండ అంచులను పట్టుకుని దిగుతున్నాం. పక్కన పట్టు లేని చోట కాళ్ళు జారతాయి. చెట్లు లేని దగ్గర పై నుంచి చెట్టుకు తాళ్ళు కట్టి, కిందకు వేలాడేశారు. ఆ తాళ్ళు పట్టుకుని వెనక్కి వెనక్కి దిగుతున్నాం.

దూరంగా గుంజన జలపాతపు హోరు చెవులకు సోకుతోంది. ఒకరికొకరి సాయంతో పెద్ద రాతి బండపైనుంచి కిందకు దిగాం. ఎదురుగుండా గుంజన జలపాత మహాదర్శనం. మా పాతిక మందినీ పలకరిస్తున్న హోరు. ఎత్తైన కొండ పైనుంచి దుముకుతోంది.

చుట్టూ కొండలు, మధ్యలో గుంజన. కొండ కింద ఉన్న లోతైన గుండంలో పడి ముందుకు రొద చేస్తూ సాగుతోంది. నీటి ముత్యాలను విరజిమ్ముతోంది. గుంజనకు ఇరువైపులా ఉన్న కొండలు తమ బాహువులను చాచి ఆహ్వానిస్తున్నాయి.

'గుంజనా నీ నెత్తిపైన కదలాడే మేఘాలు దూర తీరాల నుంచి వచ్చే సందేశాలను ఎలా మొసుకొస్తుంటాయో చూడు! అడవి తల్లి నిను అక్కున చేర్చుకుంది. పక్షులూ నిను పలకరిస్తుంటాయి. గంజనా.. అడవి అందాల మధ్య నువ్వొక విశ్వ సౌందర్యానివి. ఎంత సొగసే నీది. నీలోకి దూకేయాలని ఉంది’.

ముందు కింద ఉన్న గుండాలను చూసొద్దామన్నాడు మధు. ఏట వాలుగా ఉన్న రాతి బండ పైన కూర్చుని కిందకు పాకుతున్నాం. గుంజన నుంచి వచ్చిన జలపాతం మా పక్కనుంచే గలగల మంటూ మా తోపాటే కిందకు దూకుతోంది. కాదు కాదు, మేమే ఆ గలగలల వెంట పాకుతూ సాగుతున్నాం. జలపాతం కనుమరుగవుతోంది.


గుంజన జల పాతం దిగువన ఉన్న అతి పెద్ద రెండవ నీటి గుండం


కింద మరొక అతి పెద్ద నీటి గుండం. ఆ గుండంలోకి జలపాతం దుముకుతోంది. మేం కూడా రాతి కొండ పైనుంచి లోతైన గుండంలోకి దూకుతున్నాం. తలెత్తి చూస్తే గుండాన్ని గుండ్రంగా చుట్టుముట్టిన రాతి కొండ ఆకాశాన్ని తాకుతున్నట్టుంది. ఈదుకుంటూ కాస్త ముందుకు వెళితే, నీటి మధ్యలోనే తేలాడుతున్నట్టున్న రాతిగుట్ట లాంటి అతి చిన్న రాతి కొండ. చుట్టూ నీళ్ళు, మధ్యలో తలెత్తి లేచిన రాతి బండపై ప్రకృతి ప్రియులు.


గతంలో ఇక్కడి వరకే వచ్చాను. మా వాళ్ళు మాత్రం దీని అంతు చూశారు. రెండవ గుండం దాటాక, మళ్ళీ బండ. ఆ బండ పక్కనుంచి కొంత వరకు కొండ ఎక్కాం. కొండ అంచునే జాగ్రత్తగా నడుచుకుంటూ, పాక్కుంటూ అర్ధచంద్రాకారంలో దాన్ని చుట్టుచుట్టాం. అక్కడి నుంచి కిందకు దిగాలి. చాలా కష్టంగా ఉంది. తాళ్ళు కట్టి కిందకు వదిలారు. ఆ తాడును కూడా మధ్యమధ్యలోకట్టారు.


జల పా తా నికి ఎదురుగా తాడు పట్టుకుని ఎక్కు తున్న వైనం.


తాడు సాయంతో జాగ్రత్తగా కిందకు దిగుతుంటే, మధ్యలో యశ్వంత్, కార్తీక్, శ్రీహరి, భరత్ ఒక్కొక్కరిని జాగ్రత్తగా కిందకు దించారు. పక్కనే పై నుంచి దుముకుతున్న జలపాతం. ఆ జలపాతం కాస్త ముందుకు సాగి, నిట్టనిలువుగా ఉన్న రాతి కొండ పైనుంచి కింద ఉన్న పెద్ద నీటి గుండంలోకి దుముకుతోంది. జలపాతం కింద ఉన్న పెద్ద బండ రాయికి నాలుగు వరుసల తాడు కట్టి, జలపాతం వెంట కిందకు జారవిడిచారు.


తమిళనాడుకు చెందిన ఒక మహా ట్రెక్కర్ ఆ తాడుపట్టుకుని దిగుతూ గుండంలోకి దూకాడు. ఆ మహా గుండంలోఈదుకుంటూ,ఈదుకుంటూ ఆవలి గట్టుకు వెళ్లిపోయాడు. ఒకరొకరూ తాడుపట్టకుని జలపాతం వెంట దిగుతున్నారు. ‘నేను దిగగలనా?’ అన్న సందేహం కలిగింది. ఒక సాహసం చేద్దాం అనుకున్నా. జీవితంలో ఇంతకు మించిన సాహసం ఏముంటుంది?

జి.ఆర్. మహర్షి రాసిన ‘నెమలి కన్ను’ పుస్తకంలో ఈత గురించి కథనం ఒకటుంది. పిల్లలకు రామిరెడ్డి ఈత నేర్పుతుంటాడు. ఒక పిల్లవాడు భయపడుతుంటే ‘దూకు..ఈత రాని వాడు సస్తే ఏమీ? బతికితే ఏమి?’ అంటాడు. పిల్లవాడు దూకేస్తాడు. ఈత వచ్చేస్తుంది. అది గుర్తుకొచ్చి ధైర్యం వచ్చేసింది. ఇంత మంది తాడుపట్టుకుని దిగుతున్నప్పుడు నేనెందుకు దిగలేను?

జలపాతం జాలువారుతున్న బండ పై నుంచి వేలాడేసిన తాడుపట్టుకుని, అటొక కాలు, ఇటొక కాలు వేసి వెనక్కి వెనక్కి దిగుతున్నాను. జలపాతం చిమ్మిన నీళ్ళు నా ముఖాన పడుతున్నాయి. బండకున్న పాచి వల్ల కాళ్ళు జారుతాయేమోనని భయపడ్డాను. ఎంత గొప్ప అనుభూతి. జీవితంలో మరెప్పుడూ ఈ అవకాశం దొరకదు. ఈ సాహసమూ చేయలేను.

గుండంలోకి దిగేసి ఆవలకు ఈదుకుంటూ వెళ్ళాను. ఇదెలా ఉందంటే వైతరిణీ నదిని దాటినట్టుంది. వైతరిణీని దాటితే కానీ స్వర్గానికి వెళ్ళడం సాధ్యం కాదని పౌరాణికుల భావన. మొత్తానికి గుండాన్ని ఈది, ఈత స్వర్గపు అంచులను చూశాను. ఎంత పెద్ద గుండం. అంత దూరం ఈదడం కూడా కష్టమైపోయింది.

ఒక పక్క చలి, మరొక పక్క ఎండ వేడిమి. చలి, వెచ్చదనాల సమ్మళితం. శరీరం అలిసిపోయి, నిద్రతో కళ్ళ మూతలు పడుతున్నాయి. కొందరు పక్కనే ఉన్న రాళ్ళెక్కి గుండంలోకి దూకుతున్నారు. అప్పటికే అలసిపోయాను. ఆసాహసం చేయలేదు. మళ్ళీ ఈదుకుంటూ ఆవలికి వెళుతున్నాను. బలం చాలడం లేదు. పక్కనే ఉన్న కొండ అంచుల వరకు వెళ్ళి, కాసేపు దాన్ని పట్టుకుని సేద దీరాను.

మళ్ళీ జలపాతం దగ్గరకు వెళ్ళి, అదే తాడును పట్టుకుని పైకి ఎక్కాను. ఒకరొకరు వచ్చేస్తున్నారు. జలపాతం పక్కనే ఉన్న కొండకు వేలాడేసిన తాళ్ళు పట్టుకుని ఆ నలుగురి సాయంతో కొండ ఎక్కేశాను. కొండ అంచునే జాగ్రత్తగా పాకుతూ, నడుస్తూ రెండవ గుండం దగ్గరకు వచ్చేశాను. ఆ గుండం కూడా ఈదుకుని ఒక్కొక్కరి సాయంతో పైకి ఎక్కాం. కూర్చుని దేకుతూ వచ్చిన కొండను వంగి నడుచుకుంటూ గుంజన జలపాతం దగ్గరకు వచ్చేశాం.

ఎప్పటి లాగే గుంజన హోరెత్తుతోంది. గుంజనలోకి మా వాళ్ళంతా మళ్ళీ దూకారు. అది మమ్మల్ని వదలడం లేదు. మేం దీన్ని వదిలినా, దాని జ్ఞాపకాలు మమ్మల్ని వదలడం లేదు. ఈ జీవ జలపాతం పైన ఎదలో కూడుకట్టుకున్న మమకారం ఎక్కడికి పోతుంది ! గుంజన ముందే ఇల్లు కట్టుకునుంటే ఎంత బాగుణ్ణు. సాహసికులకు మాత్రమే దర్శనమిచ్చే గుంజనే నిజంగా అతి పెద్ద సాహసి.

ఎన్ని నీటి గుండాలను తనలో ఇముడ్చుకుందో ! గుంజనకు ఈ భూమికున్నంత వయసుంటే, ఈ భూమి ఉన్నంత కాలమూ అది ఉంటుంది. మధ్యాహ్నం పన్నెండున్నరవుతోంది. గుంజన హోరుముందే భోజనాలు ముగించుకున్నాం. అరగంటైనా నడుం వాలిస్తే తప్ప నడవలేం అనుకు న్నాను. మళ్ళీ మధు ‘ప్యాకప్’ అనేశాడు. మళ్ళీ లోయలోంచి కొండెక్కుతూ, మళ్ళీ కలుస్తానంటూ గుంజనకొక నమస్కారం పెట్టా.

గుంజన ముందు ప్రకృతి ప్రియులు

గుంజన ముందు ప్రకృతి ప్రియులు


వచ్చిన దారినే తాళ్ళు పట్టుకుని కొడెక్కాం. వచ్చేటప్పుడు ఎంత ప్రయాస పడ్డామో, వెళ్ళేటప్పుడూ అదే ప్రయాస. పైకి ఎక్కేసరికి మధ్యాహ్నం రెండైంది. ఇక్కడ నుంచి పితృ గళ తీర్థం వెళదామన్నాడు మధు. ఇక్కడి నుంచి గంట నడకే. శరీరంలో ఓపిక లేదు. ఒక దణ్ణం పెట్టేశాను. అంతా పితృ గళ వైపు సాగారు. నా స్కూటర్ను మరొకరికి ఇచ్చేసి, డీఎఫ్ఓ వాహనంలో తిరుగు ప్రయాణమయ్యాను. ఇంటికొచ్చేసరికి మధ్యాహ్నం మూడున్నర.


తిరుపతి నుంచి గంగ రాజు పోడు వరకు 45 కిలోమీటర్ల వరకు వాహనా ల్లో సాగా లి. అక్కడి నుంచి దొంగల చెలకు దాదాపు 12 కిలోమీటర్లు వాహనా ల్లోనే వెళ్లచ్చు. అక్కడి నుంచి గుంజన జలపాతం వద్దకు లోయ లోకి కనీసం నాలుగు కిలోమీటర్లు నడకతో. తిరుపతి నుంచి దొంగల చెల వరకు రెండున్నర గంటలు, అక్కడి నుంచి లోయ లోకి మరో రెండు గంటలు పట్టింది.

గుంజన హోయల గురించి విన్నప్పుడు, ఒక్క సారైనా దాన్ని చూడాలనుకుంటాం. చూస్తే దానిలో మునకేయాలనుకుంటాం, తడిసి ముద్దవ్వాలనుకుంటాం. దాని అనుభవాల ముందు మోకరిల్లాలనుకుంటాం. ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు. గుంజన దరి చేరాలంటే ఎంత సాహసం కావాలి! ఎంత తెగింపు కావాలి!

"పట్టాకు కాళ్ళు దులుపుకుని లోనికి వచ్చే ముందు నీ అహాన్ని కూడా దులుపుకుని వచ్చెయ్" అంటాడు గుల్జార్ ( గీతాంజలి అనుసృజన). అలాగే గుంజనను వది లి వచ్చేసేటప్పుడు అన్ని అహాల అవశేషాలను అక్కడ దులుపుకుని వచ్చేశామ్ .


Read More
Next Story