మంచుకొండల మధ్య పారాగ్లైడింగ్‌..
x
హిమాచల్ ప్రదేశ్

మంచుకొండల మధ్య పారాగ్లైడింగ్‌..

ప్రకృతి చాలా విచిత్రమైంది. ఎప్పుడు ఏమి చేస్తుందో, ఎలా మురిపిస్తుందో ఊహించనలివి కాదు.


ప్రకృతి చాలా విచిత్రమైంది. ఎప్పుడు ఏమి చేస్తుందో, ఎలా మురిపిస్తుందో ఊహించనలివి కాదు. మూడు వారాల కిందట జల ప్రళయంతో కకావికలమైన అందాల హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుతం ప్రకృతి ప్రేమికులతో కళకళలాడుతోంది. కిక్కిరిసిన జనంతో కిలకిలలాడుతోంది. కొత్త జంటలతో ఊసులాడుకుంటోంది.

ఏమిటీ హిమాచల్ ప్రత్యేకతంటే....

30 పర్వత రాజ్యాలతో ఏర్పాటు అయిన ప్రాంతం హిమాచల్ ప్రదేశ్. హిమం అంటే మంచు. 60 లక్షల జనాభా. యాబై అయిదు వేల 658 చదరపు కిలోమీటర్ల వైశాల్యం, 50 ఏళ్ల చరిత్ర ఉన్న రాష్ట్రం. అటువంటి హిమాచల్ ప్రదేశ్ వరదల నుంచి కోలుకుని ప్రస్తుతం పర్యాటకంలో ఆరితేరింది.

ఎక్కడుందంటే...

భారత దేశంలోని వాయువ్య ప్రాంతంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ కు తూర్పున టిబెట్బే, ఉత్తరాన వాయువ్య జమ్మూ కాశ్మీర్, నైరుతిన పంజాబ్, దక్షిణాన హరియాణ, ఉత్తర ప్రదేశ్, ఆగ్నేయాన ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి.

1971 జనవరి 25న ఏర్పాటు...

హిమాచల్ ప్రదేశ్ 1971 జనవరి 25న భారతదేశ 18వ రాష్ట్రంగా ఏర్పడింది. రాష్ట్ర రాజధాని సిమ్లా. ముఖ్య నగరాలలో ధర్మశాల, కులు, మండి, చెంప, డల్హౌసీ, మనాలి. వాస్తవానికి ఇవన్నీ పర్యాటక కేంద్రాలు. ప్రేయసి ప్రేమికుల మనసుదోచే అందాల క్షేత్రాలు. రాష్ట్రంలో చాలా ప్రాంతం పర్వత మయం. ఎటు చూసినా కొండలు, ఎత్తైన పర్వతాలు, లోతైన లోయలు, మనసు దోచే నిలువెత్తు ఫర్ వృక్షాలు, చేయెత్తి అందుకునేంత ఎత్తులో ఉండే నీలి మేఘాలు ఈ రాష్ట్ర ప్రత్యేకత. దక్షిణాన సుందర పర్వత శ్రేణులు ఈ రాష్ట్ర అందచందాలను ఇనుమడింప జేస్తాయనడంలో సందేహమే లేదు.

ప్రేమికుల స్వర్గం ఈ స్టేట్...

రాష్ట్రంలోని ప్రధాన నదులు సట్లెజ్, బియాస్. సట్లెజ్ నది మీద కంద్రౌట్ బిలాస్పూర్ వద్ద ఉన్న బ్రిడ్జ్ ఆసియాలో కెల్లా ఎత్తైన వంతెనల్లో ఒకటి అంటే ఆశ్చర్యం లేదు. అటువంటి హిమాచల్ ప్రదేశ్ ను సిమ్లా అందాలను చూసేందుకు జనం ఎగబడుతున్నారు సిమ్లా కొత్తజంటకు హనీమూన్ అంటే ఆశ్చర్యం లేదు సిమ్లా వెళ్లి హనీమూన్ గడిపి మనాలి వెళ్లి పారాగ్లైడింగ్ చేసి ధర్మశాల వెళ్లి బౌద్ధ క్షేత్రాలను చూసి డల్హౌసీ వెళ్లి గ్లైడింగ్ తో పాటు అనేక సాహస కృత్యాలు చేయడం ఓ అందమైన అనుభవం. కులుమనాలి పారా గ్లైడింగ్ కు పెట్టింది పేరు. ఎత్తైన కొండ ప్రాంతం నుంచి పారాగ్లైడింగ్ చేయడం అంటే అదో అందమైన అనుభూతి. ప్రేయసి ప్రేమలకు చాలా పెద్ద పండుగ లాంటిది.

పర్యాటకులతో కళకళ...

పర్యాటకుల తాకిడితో హిమాచల్‌ప్రదేశ్ కళకళలాడుతోంది. సిమ్లా, మనాలి, కసోల్‌లో ఇంకా టూరిస్టుల రద్దీ తగ్గలేదు. క్రిస్మస్‌, ఇయర్‌ ఎండింగ్, న్యూఇయర్‌ వేళ హిమాచల్‌ప్రదేశ్‌కు పర్యాటకులు పోటెత్తారు. దీంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఈ వారంతా ఇదే పరిస్థితి ఉంటుందంటున్నారు.

న్యూ ఇయర్ వేడుకల వేళ పెరిగిన రద్దీ...

క్రిస్మస్‌, న్యూఇయర్‌ సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల నుంచి కొండ ప్రాంతానికి ప్రజలు తరలి వస్తున్నారు. దీంతో ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన సిమ్లా, మనాలి, కసోల్‌ తదితర ప్రాంతాల్లో వాహనాల రద్దీ నెలకొంది. కేవలం మూడు రోజుల్లోనే వేల సంఖ్యలో వాహనాలు సిమ్లాలోకి ప్రవేశించినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

అత్యంత పొడవైన టన్నెల్ ఇక్కడే...

ప్రపంచంలోనే అత్యంత పొడవైన రోహ్‌తంగ్‌లోని అటల్‌ టన్నెల్ గుండా మూడు రోజుల్లో 55 వేల కంటే ఎక్కువ వాహనాలు సిమ్లాలోకి ప్రవేశించినట్లు అధికారులు వెల్లడించారు. ఓ వైపు పొగమంచు, మరోవైపు వేల సంఖ్యలో పర్యాటకుల రాకతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పర్యాటకుల తాకిడి పెరగడంతో సిమ్లా పూర్తిగా సందడిగా మారింది. అక్కడి పార్కింగ్‌ ప్రాంతాలన్నీ పూర్తిగా నిండిపోవడంతో పర్యాటకులు తమ వాహనాలను రోడ్లపైనే పార్కింగ్‌ చేశారు. మరోవైపు నూఇయర్ వేడుకల కోసం మరో మూడు, నాలుగు రోజుల్లో లక్షకు పైగా వాహనాలు సిమ్లాలోకి ప్రవేశించే అవకాశం ఉందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు.

Read More
Next Story