తెలంగాణ చరిత్రలోకి ఒక రోజు హెరిటేజ్ టూర్...
x
చాయా సోమేశ్వరాలయం,పానగల్లు, నల్గొండ జిల్లా

తెలంగాణ చరిత్రలోకి ఒక రోజు హెరిటేజ్ టూర్...

నల్గొండ జిల్లా పచ్చల సోమేశ్వర ఆలయంలో శిల్పకళతో పాటు అబ్బుర పరచిన మరో విషయం సరోజనమ్మ. ఆమె ఆలయ అర్చకురాలు.


తరతరాలుగా వచ్చిన భారతీయ వారసత్వ సంపదను కాపాడుకున్నప్పుడే ఆ దేశ సంస్కృతి పదిలంగా ఉంటుంది. దానికి ప్రభుత్వాలూ పౌర సమాజం కూడా బాధ్యత తీసుకోవాలి. దీనికి మొదట వారసత్వ సంపద గురించి స్పృహకలిగించాలి. దీనికి పర్యటనలు ఒక మార్గం. చాలా చోట్ల ఈ విలువైలన వారసత్వ సంపద అంతరించి పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటూ ఉంది. ఇది పూర్తిగా కనుమరుగు కాకముందే వీలునుబట్టి వీలైనన్ని చారిత్రక ప్రదేశాలను చూసి రావాలనే ఉద్దేశంతో ఒకరోజు హెరిటేజ్ టూర్ ను విహంగ (Vihanga) ఏర్పాటు చేసింది.

యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (YHAI) సంస్థలో అంతర్భాగమైన మహిళా యూనిట్ విహంగ. విహంగ అంటే రెక్కలు కలిగినది. పక్షి అని వ్యుత్పత్తి అర్థం. స్త్రీలకు పక్షులలాగా స్వేచ్ఛగా ప్రయాణించాలనే కోరిక అంతర్లీనంగా ఉంటుంది. కానీ అవకాశాలు తక్కువ. ఆ లోటును భర్తీ చేయడానికే YHAI హైదరాబాదు మహిళా యూనిట్ గా రెండు సంవత్సరాల క్రితం యాభై మంది జీవిత సభ్యులతో విహంగ ఏర్పడింది. ఈనాడు 110 మంది జీవిత సభ్యులతో ఎంతోమంది తాత్కాలిక సభ్యులతో విహంగ విరాజిల్లుతోందంటే మహిళలకు ప్రయాణాలపట్ల ఉన్న మక్కువ తెలుస్తోంది. శైశవం లోనే విహంగ విదేశాలు, హిమాలయాలు చుట్టేసి వచ్చింది. వీలునుబట్టి చిన్నవో పెద్దవో ప్రయాణాలు చేయడానికి మహిళలకు మార్గం సుగమం చేస్తోంది విహంగ. దీనితో స్త్రీలలో ఆనందాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఆరోగ్యాన్ని పెంచుతోంది.

ఈసారి నల్గొండ జిల్లాలోని చారిత్రక కట్టడాలను పురాతన దేవాలయాలను దర్శించి రావాలని విహంగ సభ్యులము బయలుదేరాము. ఏర్పాట్లు అన్నీ విహంగ చేసింది. ఒక్కరికి ₹ 1200/ మాత్రమే. భిన్న ప్రాంతాల నుంచి పది మంది మహిళలు రెండో శనివారం ఉదయం బయలుదేరాము. ముందుగా నల్గొండ జిల్లాలోని పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నాము. దీనికి చెరువుగట్టు అని మరో పేరు కూడా ఉన్నది.

ప్రతి అమావాస్యకు వేలాది మంది భక్తులు ఇక్కడకు వచ్చి నిద్ర చేస్తారట. చాలా శక్తివంతమైన ప్రదేశమని వాళ్ళ నమ్మకం. హైదరాబాదు నుంచి సుమారు 80 కిమీ దూరంలో ఉన్నది. ఈ మధ్యనే కొండ పైదాకా రోడ్డు మార్గం వచ్చిందట. మేము వాహనాన్ని పార్కింగ్ లో పెట్టి అక్కడనుంచి ముందుగా కోనేరుకు వెళ్ళాము. కోనేరు లో నీళ్ళు శుభ్రంగా ఉన్నాయి. చాలా చక్కగా మెయింటేన్ చేస్తున్నారు. మూడు పెద్ద బండరాళ్ళతో కూడిన గుహలో శివలింగం ఉన్నది.

నేను ఇక్కడ స్థల పురాణాల కథల జోలికి పోను. ఆ ఎత్తైన మూడు బండ రాళ్ళ పైకి ఎక్కడమే ఇక్కడ అడ్వెంచర్. ఆలయ యాజమాన్యం ఏర్పాటు చేసిన ఇనప మెట్లు ఉన్నాయి. అడ్వెంచర్ చేసే వాళ్ళకు మధ్యలో కొంత దూరం కొండ రాళ్ళ మధ్యలోనుంచి మరో పెద్ద బండరాయిని ఎక్కి వెళ్ళవచ్చు.



ఇద్దరు మినహా మేమందరం పైకి వెళ్ళాము. కళ్ళకు విందు. కనుచూపుమేరా పచ్చదనం. చుట్టూ కొండలు. అల్లంత దూరాన చిన్న చెరువు. దాని వల్లనే చెరువుగట్టు అనే పేరు వచ్చి ఉంటుంది కాబోలు. సహజమైన ఆక్సిజన్ ను ఊపిరితిత్తుల నిండా నింపుకొని కిందకు దిగాము. మధ్య దారిలో మరో అడ్వెంచర్. రెండు బండరాళ్ల మధ్య ఉన్న చిన్న సందులో నుంచి దూరి అటువైపు వెళ్ళడం. అందరూ అక్కడ నిలబడి ఆసక్తిగా చూస్తున్న వాళ్ళే తప్ప లోపలకు వెళుతున్న వాళ్ళు ఎవరూ లేరు.

నాకు లోపలనుంచి ఉద్వేగం ఉన్నఫళంగా ఉబికి వస్తోంది. లోపలికి వెళ్ళాలని మనసు ఆరాట పుడుతోంది. గతంలో అడుగు మందం మాత్రమే గ్యాప్ ఉన్న మెదక్ జిల్లా కూచన పల్లి వెంకటేశ్వర గుహాలయం లోకి దొల్లుకుంటూ వెళ్లిన అనుభవం నాకుంది. ఇక్కడ మాత్రం అడ్డంగా నిల్చొని లోపలికి వెళ్ళాలి. అంతే తేడా... లోపలికి వెళ్ళాలనే నా ఆసక్తిని టీం లీడర్ కు చెప్పాను. ఆమెకు కూడా అడ్వెంచర్స్ చేయడం చాలా ఇష్టం. మేమిద్దరమే మరోసారి వచ్చి ఈ అడ్వెంచర్ చేయాలని గట్టిగా అనుకొని కొంత నిరాశతోనే తిరుగుముఖం పట్టాము. అదే ప్రాంగణంలో ఉన్న మరికొన్ని చిన్న చిన్న గుహాలయాలను చూసుకొని తిరిగు ప్రయాణమయ్యాము.


పచ్చల సోమేశ్వరాలయం


అక్కడి నుంచి మా ప్రయాణం మరో హెరిటేజ్ టెంపుల్ పచ్చల సోమేశ్వరాలయానికి. ఆ ప్రాంగణంలోకి అడుగుపెడుతూనే ఆ కళా కౌశలానికి ఆశ్చర్య పోయాను. ఇంత గొప్ప చారిత్రక ప్రదేశాలు హైదరాబాదుకు అతి సమీపంలో ఉండడం మరో ఆశ్చర్యం. ప్రతిరోజు ఈశ్వరునికి పచ్చల హారం తో అర్చన జరిగేదట. అందుకని పచ్చల సోమేశ్వరుడు అనే పేరు వచ్చిందట. పానగల్లును రాజధానిగా చేసుకొని పాలించిన చోళరాజైన ఉదయాదిత్యుడు ఈ ఆలయాన్ని క్రి. శ. 12. వ శతాబ్దంలో నిర్మించాడు. గర్భగుడికి ఎదురుగా ఉన్న మంటపంలోని నాలుగు స్తంభాలపైన పురాణ కథలను గమనించవచ్చు. క్షీరసాగర మథనం, రామాయణం, భారతం మొదలైన పురాణ కథల శిల్పాకృతలు చూపరులను దృష్టి మరల్చనివ్వవు.


ఆలయం లోపలి భాగం


ఇక్కడ శివలింగానికి బ్రహ్మసూత్రాలు ఉండడం ప్రత్యేకం. ఈ గుడిలో పని చేసే ఎలుగు రాములమ్మ ప్రత్యేకంగా మా దృష్టిని ఆకర్షించింది. కారణం ఆమె అక్కడి శిల్పకళను వచ్చిన వారికి ఎంతో ఆసక్తితో చూపిస్తుంది. అక్కడి శిల్పకళా రహస్యాలను విడమర్చి మరీ చెపుతుంది.




ప్రాంగణం మొత్తం తిప్పి చూపించి ప్రతి దానిని శ్రద్ధగా వివరిస్తుంది. అంతే కాదు చక్కగా పాటలు కూడా పాడుతుంది. ఆ పక్కనే మ్యూజియం కూడా ఉన్నది. మహమ్మదీయ రాజుల దండ యాత్రలలో శిథిలమైన శిల్పాలను చూపించి కన్నీరుపెట్టుకుంది. గుడి ప్రాంగణంలో ఉండే చారిత్రాత్మక బావిని పూడ్చి వేసారని, ప్రాంగణంలోని కొంత స్థలం ఆక్రమణకు గురైందని బాధను వ్యక్తం చేసింది. మానసికంగా ఆ ప్రాంతాన్ని ఆమె ఎంత సొంతం తీసుకుందో అర్థమై ఆశ్చర్యపోయాను. ఆ ఆలయంలో నన్ను అబ్బుర పరచిన మరో విషయం సరోజనమ్మ.. ఆమె ఆలయ అర్చకురాలు. ఆమెను పలుకరించగా... సుమారు అరవై ఏళ్ళ క్రితం తమ కుటుంబం ఆ గ్రామానికి వచ్చి స్థిర పడిందనీ తనకు ఇద్దరు కుమారులనీ వారు హైదరాబాదులో అర్చకత్వంలో స్థిర పడ్డారని చెప్పింది. తన భర్త కాలం చేసినప్పటినుంచీ ఆ గుడిలో అర్చకత్వం చేస్తున్నానని చెప్పింది.

తాను అర్చకత్వ బాధ్యతలు నిర్వహించడానికి కారణమైన ఒక కథను చెప్పింది. తన భర్త మరణించాక తాను శ్రీశైలం వెళ్ళినప్పుడు.... అక్కడ అమ్మవారికి జరుగుతున్న పూజాకార్యక్రమాల పట్ల పుణ్య స్త్రీని కానని దూరంగా ఉన్నప్పుడు ఎవరో ఒక స్వామీజీ తనను పిలిచి నువ్వు పార్వతీదేవి అంశతో జన్మించావు, కాబట్టి అర్చకత్వ బాధ్యతలు స్వీకరించమని ఆదేశించాడని చెప్పింది. నేటికీ మన దేశంలో స్త్రీలు పూజారులుగా ఉన్న ఆలయాలు తక్కువే. అక్కడక్కడ గిరిజన ఆలయాలలో ఉత్తర భారతంలో కొన్ని చోట్ల మాత్రమే మహిళా అర్చకులు కనిపిస్తారు. దక్షిణ భారతదేశంలో ఇలాంటి ఆలయాలలో అర్చకులుగా స్త్రీలు లేరనే చెప్పాలి. అర్చకత్వంలో కూడా స్త్రీలది ద్వితీయ స్థానమే. చాలా చోట్ల ఏర్పాట్లు మహిళలు చేస్తే ప్రధాన పూజలు పురుషులు చేస్తారు. ఆ ఆలయంలో కూడా తన అర్చకత్వాన్ని అంగీకరించని సందర్భాలలో తన మనుమడు చేస్తాడని చెప్పింది. ఏది ఏమైనా అర్చకత్వ బాధ్యతలతోపాటు ఆలయ సంరక్షణా బాధ్యతలను కూడా నిర్వహిస్తున్న సరోజనమ్మను ప్రశంసిచాలి.

భోజనాలు ముగించుకొని నల్గొండ సమీపాన ఉన్న పానగల్లు గ్రామంలోని ఛాయా సోమేశ్వరాలయానికి బయలుదేరాము. పదిహేను ఇరవై నిమిషాలలో అక్కడికి చేరుకున్నాము. ఎండ తీవ్రత బాగానే ఉంది. ఆలయం ముందు భాగంలో కోనేరు ఆకర్షణీయంగా ఉన్నది.



కోనేరు చుట్టూ పచ్చిని చెట్లు. కోనీటిలో ఈదులాడుతున్న బాతులగుంపు మా అలికిడికి ఒడ్డుకు చేరింది. ఈ ఆలయం కూడా పదవ శతాబ్దంలో చోళరాజు నిర్మించింది. నిర్మాణ శైలి కాకతీయుల నిర్మాణ శైలిని పోలి ఉన్నది. మూడు ఆలయాలు పక్కపక్కనే ఉంటాయి. ఒకదానిలో దత్తాత్రేయుడు ఉన్నాడు. మరోదానిలో కొంచం లోతున సోమేశ్వరుడు ఉన్నాడు. మరో ఆలయం ఖాళీగా ఉన్నది. ఇక్కడ లభించిన ప్రతాప రుద్రుడి శాసనం వలన కాకతీయులు కూడా ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేసినట్లు తెలుస్తోంది.


ఆలయ స్తంభాల కుడ్యాల పైన రామాయణ భారత శివపురాణ ఘట్టాలు అందంగా చెక్కబడి ఉన్నాయి. మహమ్మదీయల దండయాత్రల వలన అవి చాలా వరకు ధ్వంసం కావడం విచారకరం. ఆ గుడిలో ఒక ప్రత్యేకత ఉన్నది. అది పగలంతా గర్భగుడిలోని గోడపైన పైన ఆలయంలోని స్తంభం నీడ పడడం. అందుకే ఛాయాసోమేశ్వరాలయం అనే పేరు వచ్చింది. ఛాయ అంటే నీడ అని అర్థం. ఈ నీడ ఒకేచోట స్థిరంగా ఉంటుంది. అయితే ఈ నీడ ఎక్కడ నుంచి ఎలా పడుతుందనే విషయం చాలా కాలం వరకు ఎవరికీ తెలియలేదు.

ఇటీవల కాలంలో ఈ రహస్యాన్ని కనిపెట్టారు. సూర్యాపేటలోని వెంకటేశ్వర పి జి కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ గా పనిచేస్తున్న శేషగాని మనోహర్ గౌడ్ రాత్రింబవళ్ళు ఆ ఆలయంలో బస చేసి, ఎన్నో ప్రయోగాలు చేసి ఆ మిస్టరీని ఛేదించారు. ప్రధాన ఆలయానికి ఇరువైపులా మరో రెండు ఆలయాలు ఉంటాయి. ఇందులో ఒక ఆలయం ఖాళీగా ఉన్నది. ఆ కాలంలోనే ఈ ఆలయాన్ని భౌతిక శాస్త్రం ప్రకారం థియరీ ప్రకారం పరీక్షేపణ కాంతి ఆధారంగా నిర్మించారు. అంటే కాంతిని దారి మళ్లించి ఒక నీడను గర్భగుడిలో పడేలా చేయడం. మన పూర్వీకులు రికార్డు చేయలేదు కాని ఇలాంటి శాస్ట్రీయ అంశాలు మన చారిత్రక కట్టడాలలో ఎన్నో కనిపిస్తాయి. వాటిని మన పూర్వీకులు రికార్డు చేసి వుంటే బాగుండేది.


అక్కడ నుంచి మేము రుద్రమదేవి మరణ ధ్రువీకరణ ప్రదేశానికి వెళ్ళాము. కాకతీయ వంశం పేరు వింటూనే ఎవరికైనా ముందుగా స్ఫురించే పేరు రాణీ రుద్రమదేవి. ఈనాటికీ పురుషాధిక్యత కొనసాగుతున్న నేపథ్యంలో ఆ కాలంలో పురుషాధిక్యతను ఊహించలేము. ఒక స్త్రీ తమను పాలించడాన్ని సహించలేని సామంత రాజులు ఆమెకు సహకరించక పోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అయినప్పటికీ 1262 నుంచి 1289 దాకా 27 ఏళ్ళపాటు ఆమె దిగ్విజయంగా పరిపాలించినట్లు చరిత్ర చెపుతోంది. చందుపట్ల శాసనం లభించే వరకూ ఆమె మరణానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు పెద్దగా లేవు. ఆమె 1289 లో సామంత రాజైన అంబటి దేవుడు చేసిన మాయోపాయం వలన అక్కడ మరణించినట్లు చరిత్ర చెపుతోంది. ఆ ప్రదేశాన్ని చూసి స్త్రీలుగా మేమూ స్ఫూర్తి పొందాము. పురుషాధిక్య సమాజంతో పోరాడి గెలవడానికి ఆమె ధైర్యం లో కొంచమైనా మాకు రావాలని గట్టిగా అనుకున్నాము. ఫోటోలు తీసుకొని ఉదయ సముద్రం వైపుగా కదిలాము.


చోళ రాజైన ఉదయాత్యుడి పేరు మీదుగానే ఈ తటాకానికి ఉదయ సముద్రం అనే పేరు వచ్చి ఉంటుంది. ఇది సముద్రం కాదు. పెద్ద సరస్సు అనే అర్థంలో ఈ పదం వాడి ఉంటారు. నల్గొండ జిల్లాలో లక్షలాది ఎకరాలకు సాగునీరు, జిల్లా ప్రజలకు తాగునీరు అందిస్తూ ఉదయ సముద్రం రిజర్వాయర్ నల్గొండ ప్రజలకు ప్రాణదాత అయింది.

తరువాత మేము పిల్లలమర్రి గ్రామానికి వెళ్ళాము. అంత చిన్న గ్రామంలో నాలుగు పురాతన దేవాలయాలు ఉండడం విశేషం. ముందుగా మేము ఎరుకేశ్వరాలయం లోనికి వెళ్లాము. దీనిని క్రీ. శ. 1208 లో నిర్మించినట్లు చరిత్ర చెపుతోంది. ఇది కాకతీయులకు సామంతులైన రేచర్ల రెడ్డి రాజులలో ఒకరైన బేతిరెడ్డి భార్య ఎరుకసాని నిర్మించిన ఈశ్వరాలయం. అందుకే దీనికి ఎరుకేశ్వారాలయం అనే పేరు వచ్చిందని చెపుతారు.


ఎరుకేశ్వరాలయం, పిల్లలమర్రి

శివలింగం ఒక వైపుకి ఒరిగి ఉన్నది. కారణం అడుగగా భూకంపం వచ్చినప్పుడు అలా పక్కకు వంగిందని పూజారి సంతోష్ చెప్పాడు. గర్భగుడి ముఖ ద్వారానికున్న శిలాతోరశణం శిల్ప సౌందర్యం మాటలకందనిది. ఆలయాన్ని బయట నుంచి పరిశీలించి చూసినప్పుడు స్తంభాలు కొన్ని ఒక వైపుకి కొంచం వంగి ఉండడం గమనించాము. నిర్మాణం ఓరుగల్లులోని వెయ్యి స్తంభాల గుడిని పోలి ఉంటుంది. దాదాపు అన్ని శివాలయాల్లో శివ లింగానికి ఎదురుగా నంది ఉంటుంది.


కానీ ఇక్కడ గర్భగుడి ముందు ఉన్న నాలుగు స్తంభాల మధ్యలో నంది కి బదులుగా వృత్తాకారంలో ఉన్న నాట్య వేదిక ఉండడం విశేషం. ఆ రోజుల్లో నటరాజుకు నాట్యంతో అర్చన చేయడం ఆనవాయితీ కావచ్చు. నంది ఆలయ గోపురం పైన ఉంటుందని చెప్పాడు పూజారి. ఆలయ బాహ్య నిర్మాణం సున్నపు రాయీతో ఉన్నది. గర్భగుడి ఎదుట ఉన్న మంటపం స్తంభాలు నల్లరాతితో ఉన్నాయి. వాటిపైన శిల్ప సౌందర్యం చూసిచీరవలసిందే... అక్కడికి అతి సమీపంలో ఉన్న చెన్నకేశవకాలయం మేము వెళ్ళేటిప్పటికీ మూసి ఉన్నది. బయట నుంచే చూసాము. కృత్రిమ రంగులతో సహజ సౌందర్యాన్ని కోల్పోయింది.

నామేశ్వరాలయం శాసనం, పిల్లలమర్రి

దానికి చేరువలోనే పార్వతీ నామేశ్వరాలయం ఉన్నది. దానిని రేచర్ల కుటుంబీకుడైన నామిరెడ్డి నిర్మించినట్లు తెలుస్తోంది . ఆ ప్రాంగణంలో మరోవైపు త్రికుటేశ్వరాలయం ఉన్నది.

త్రికూటేశ్వరాలయం, పిల్లలమర్రి

ఆలయంలో మూడువైపులా మూడు గర్భ గుడులు వాటిలో శివలింగాలున్నాయ. అందుకే దానికి ఆ పేరు వచ్చి ఉంటుంది. అదే ప్రాంగణంలో ఒక శాసనం కూడా ఉన్నది. నాలుగింటిలో ఇది అతి పురాతనమైనది. 14వ శతాబ్దంలో అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్రలలో ఈ దేవాలయాలు పాక్షికంగా ధ్వంసమైనట్లు చరిత్ర చెపుతోంది.


ఇక్కడి మహిళ గైడ్ తో...

అప్పటికే సాయంత్రమైంది. హైవే మీదకొచ్చి మంచి టీ తాగి తిరుగు ప్రయాణమయ్యాము. మా ప్రణాళిక ప్రకారం ఉదయం 7.30 నిమిషాలకు హైదరాబాదులో బయలుదేరి రాత్రి 9.30 గంటల వరకు తిరిగి చేరుకోవాలి. మహిళలు ఆర్గనైజ్ చేసుకునే ప్రయాణాలలో సమయ పాలన ఉంటుందని నిరూపించాము. రుద్రమదేవి మరణ ప్రదేశాన్ని చూడడం, ఒక మహిళ (ఎరుక సాని) నిర్మించిన పురాతన దేవాలయాన్ని దర్శించడం, మరో ఆలయంలో మహిళా గైడును, మహిళా పూజారిని కలుసుకోవడం వలన విహంగ ఏర్పాటు చేసిన మా ప్రయాణం అనుకోకుండా ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.

.


Read More
Next Story