బ్లౌజ్ ధరించే హక్కుకోసం ఎంత పోరాటం జరిగిందో...
x

బ్లౌజ్ ధరించే హక్కుకోసం ఎంత పోరాటం జరిగిందో...

మనకు తెలియని మన కథ...



అవును నిజం, మహిళల వక్షోజాల మీద కూడా పన్ను విధించారు. అంతేకాదు, మగవాళ్ల మీసాల మీద కూడా పన్ను విధించారు. ఇదెక్కడో జరగలేదు. భారతదేశంలోనే. అందునా కేరళ ప్రాంతంలోని ట్రావన్కోర్ సంస్థానంలో.

ఈ రాజ్యం చాలా నిరంకుశమయిన రాజ్యం. ఈ నిరంకుశత్వం కులతత్వం నుంచి రావడమే ఆశ్చర్యం. ఇక్కడ సుమారు నూరు రకాల పన్నులను కొన్ని కింది జాతుల ప్రజలు చెల్లించాల్సి వచ్చేది. ఇందులో వక్షాజాల పన్ను, మీసాల పన్ను, గుడిసె పన్ను, పనిముట్ల పన్ను, పెంపుడు జంతువుల( అవు, బర్రె, కుక్క) మీద పన్ను, నగలు ధరించడం మీద పన్ను, పండుగల జరుపుకోవడం మీద పన్ను. ఇలా పన్ను బారిన పడని వస్తువంటూ ఆ సంస్థానంలో లేదు.

ట్రావన్కోర్ అనేది బ్రిటిష్ ఇండియాలోని 550 సంస్థానాలలో ఒకటి. శరీరం మీద ఎంత బట్ట ధరించే దాన్ని బట్టి జాతుల హోదా నిర్ణయించిన సంస్థానం అది. శరీరం మీద వస్త్రం పెరిగితే హోదా పెరుగుతుంది. వస్త్రం తగ్గి, ఆచ్ఛాదన లేని శరీరం పెరిగే కొది హోదా దిగజారుతుంది. అది ఉన్నత కులాల వారికి నువ్వు ఎన్ని అడుగుల దూరాన ఉండాలో నిర్ణయిస్తుంది. దీనిని అధిగమించాలంటే భారీగా పన్నుకట్టాలి. ఇలా వచ్చిందే బ్రెస్ట్ టాక్స్.

ఈ వక్షోజాల మీద పన్ను చాలా కాలం కొనసాగింది. ఈ పన్నును అక్కడ మూలాకరం (Mulakkaram) అని పిలుస్తారు. హిందూ మతంలోని నిమ్నజాతుల మీద, అవర్ణ ప్రజల మీద ఈ టాక్స్ విధించే వారు. అంటే ఈ జాతుల స్త్రీలు నడుము దాకా మాత్రమే వస్త్రం ధరించాలి. వక్షోజాలమీద బ్లౌజ్ లేదా ఉత్తరీయం ధరించరాదు. దరిస్తే పన్ను చెల్లించాలి.

అయితే, పదహారో శతాబ్దంలో గల్ఫ్ దేశాలనుంచి ముస్లింలు రావడం, అదేవిధంగా సిరియన్ క్రైస్తవులు రావడం వల్ల కొంత కింది కులాల వాళ్లు ఇస్లాంలోకి, క్రైస్తవంలోకి మారారు. ముస్లిం, క్రైస్తవులతో పాటు మతం మార్చుకున్న వారికి ఈ కట్టుబాటు వర్తించదు. ఎందుకంటే వారి కొత్త మతం శరీర పైభాగాన్ని నగ్నంగా ఉంచడాన్ని అంగీకరించదని ఈ ప్రభుత్వం గుర్తించింది. ఇలా మతం మారిన వాళ్లు పన్ను బారిన పడకుండా తప్పించుకున్నారు.

మిగతా హిందూ నిమ్న జాతుల మహిళలంతా కట్టుబాటు దాటితే పన్ను కట్టాల్సి వచ్చేంది. ఫలానా మహిళ తక్కువ కులం అని చెప్పడానికి రవికెలు ధరించకుండా నగ్నంగా వక్షోజాలను ప్రదర్శించడం జరిగేది. నాడార్లు, తియ్యాలు (Thiyyas), ఎళావా (Ezhalava)కులాలు ఈనియమాలకు బలయ్యాయి. ఈ మూడు కులాలు నిమ్నజాతుల్లయ్యేందుకు కారణం ఏంటంటే వీళ్లంతే నాటి కేరళ సమాజం బయటనుంచి వచ్చారు.

వీరికి ట్రావన్కోర్ లో అసరిస్తున్న సాంఘిక నిర్మాణంలో వీరికిచోటు లేదు ఉదాహరణకు, నాడార్లు తమిళనాడు నుంచి వచ్చారు. అలాగే తీయ్యా, ఎళావ కులాల వారు కల్లు గీత కులాలు. వీరు సిలోన్ నుంచి వలస వచ్చారు. అందువల్ల వీళ్లకు నాటి ట్రావన్కోర్ సమాజంలో చోటు దొరక లేదు కాబట్టి వాళ్లు వెలికులాలు (outcastes)అయ్యారు.

ఈ విషయం ప్రజలందరికి తెలియాలంటే వీరంతా కట్టుబాట్లు పాటించాలి. మగవాళ్లు మీసాలు పెంచరాదు. మహిళలు వక్షోజాలను కప్పుకోరాదు. బంగారు ఆభరణాలు ధరించరాదు. బ్రాహ్మణేతరులతో కూడా పెద్ద కులాలన బడే వారికి ఆభరణాలు ధరించే అర్హత ఉన్న అది కేవలం వెండికి మాత్రమే పరిమితం.

ఈ కులతత్వం భరించలేక ఈ మూడు కులాల వాళ్లు కట్టుబాట్లు తప్పించుకునేందుకు ఇతర మతాల్లోకి మారారు. నాడార్లు ఎక్కువగా క్రైస్తవం స్వీకరించారు. మిగతా రెండు కులాల మత మార్పిడి పెద్దగా అనుసరించక కట్టుబాట్లతోనే బతుకుతూ వచ్చారు. ఇలా వక్షోజాల మీద ఎలాంటి ఆచ్ఛాదన లేని మహిళలను మూలచ్చి (Mulachi) అని పిలుస్తారు.

ఈ కట్టుబాటుకు వ్యతిరేకంగా చాలా పోరాటం సాగింది. కొంతకాలం మౌనంగా, మరికొంత కాలం బహిరంగంగా ఈ పోరాటం సాగింది. ఇందులో మౌన పోరాటానికి ప్రతీకగా నంగెళి అనే మహిళనిలబడుతుంది. నంగెళి వక్షోజ పన్నును ధిక్కరించింది. ఆమె చేర్తాల గ్రామంలో ఉండే ఎళావ కులానికి చెందింది. ఒక రోజు ఆమె ఇంటికి టాక్స్ కలెక్టర్ వచ్చాడు. తన నిరసన తెలియచేసేందుకు ఆమె తన వక్షోజాలను కత్తితో నరికి అరిటాకు మీద పెట్టి టాక్స్ కలెక్టర్ కు ఇచ్చి రక్త స్రావంతో చనిపోయింది. ఈ ధిక్కారమే చివరకు ఈ పన్నును రద్దు చేసేందుకు దారి తీసిందని చెబుతారు.




ఈ వ్యవస్థ మీద డాక్టర్ ఫ్రాన్సిస్ బ్యూక్యానన్, యోహానెస్ న్యూహాఫ్ లాంటి వారు దీని మీద సమగ్రంగా రాశారు. కోరమాండెల్ (Coromandel: A Personal History of South India) అనే పుస్తకంలో చార్లెస్ ఎలెన్ (Charles Allen) వివరంగా రాశారు.

నెంగళి గురించి ఆ మధ్య బిబిసి కూడా ఒక సంచలన కథనం రాసింది. నెంగళి వూరు చేర్తాలకు వెళ్లి బిబిసి ప్రతినిధి ఆమె గురించి, ఈ దురాచారం గురించి సమగ్రంగా అందించారు. నెంగళి త్యాగానికి గుర్తుగా ఆవూరుని ఆ రోజుల్లో మూలచ్చిపరంబు అని పిలిచేవారట.

తిరుగుబాటు వచ్చే నాటికి ట్రావెన్కోర్ జయంతన్ శంకరన్ అనే నంబూద్రి ప్రధాన మంత్రిగా ఉండేవారు. ఈ పన్నుకు వ్యతిరేకంగా తిరుగుబాటులో ఆయన పదవీచ్యుతుడయ్యాడు. ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వేలాయుధన్ చంపకారమన్ థంపి (వేలు థంపి దాళవ) ప్రధానిగా నియమితుడయ్యాడు. అయినా సరే, పరిస్థితి మార లేదు. 1859 జూలై 26 అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్ సర్ చార్సెస్ ట్రెవిల్యాన్ ( Sir Charles Trevelyan) జోక్యం చేసుకుని ఒక రాజాజ్ఞ (Royal Proclamation) విడుదల చేయించి కులాలతో నిమిత్తం లేకుండా మహిళలంతా వక్షోజాలాను కప్పుకోవచ్చని చెప్పారు. అంటే కేరళలోని అట్టడుగు కులాల మహిళలకు రవికె ధరించే స్వేచ్ఛ కేవలం 180 సంవత్సరాల కిందటే వచ్చిందన్నమాట.

ఈ మధ్యలో ఏం జరిగిదంటే...

వేలు థంపి దళవా బ్రిటిష్ వాళ్లు మీద తిరుగుబాటు చేశాడు. భారతదేశంలో తొలినాళ్లలో జరిగిన బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లలో ఇదొకటి. నాయర్ సైనికులను సమీకరించి ఆయన తిరుగుబాటు చేశాడు. అయితే, ఆధునిక ఆయుధాలున్న బ్రిటిష్ వాళ్లని ఎదరించలేకపోయాడు. చివరకు మన్నాడి లోని కాళీ గుడిలో దాక్కున్నాడు. బ్రిటిష్ సేనలు చుట్టుముడుతున్నాయి. వాళ్ల చేతిలో చావడం కన్నా ఆత్మహత్యనయమనుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆయన బాస్ అయిన ట్రావన్ కోర్ సంస్థానాధిపతి రాజా బలరామ వర్మ బ్రిటిష్ వారి ఆజ్ఞమేరకు ఆయన భౌతిక కాయాన్ని త్రివేండ్రం కు తెప్పించి ఊరి బయట ఉరివేయించాడు. ఈ నీచానికి బ్రిటిష్ ప్రభుత్వ అనుమతి లేదు. స్థానికంగా తీసుకున్న నిర్ణయం.

నాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్ మింటో దీనిని అంగీకరించలేదు. ఇది చాలా అసహ్యకరమయిన చర్యని, మానవతకు, నాగరికతకు మచ్చ అని చెప్పి దీనికి కారణమయిన మద్రాస్ రెసిడెంట్ కర్నల్ మెకాలేని ఉద్యోగం నుంచి తీసేశాడు. ఇలా 1857 కు మందే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి వారిలో థంపి ఒకరవుతారు.

రాజా బలరామ వర్మ 1810 లో చనిపోయారు. ఆయనకు మగ సంతానం లేదు. దీనితో కుటుంబంలో సింహాసనం కోసం పోటి మొదలయింది. అయితే, ఆయన మేనకోడలు రాణి గౌరిలక్ష్మి బాయి ( రాజా చెల్లెలి కూతురు) సింహాసం అధిష్టించేందుకు బ్రిటిష్ రెసిడెంట్ కర్నల్ జాన్ మన్రో సహకరించారు. తర్వాత 1811లో ఈ సంస్థానానికి మన్రో దివాన్ కూడా అయ్యారు. ఒక మహిళ రాణి అయినా సంస్థానంలో పన్నులు భారం తగ్గలేదు. కర్నల్ మన్రో పన్నులు విధించినా కొంత విచక్షణ ప్రదర్శించాడు. కొన్నిరకాల పన్నులు తొలగించాడు. పన్ను కలెక్టర్ల జ్యుడిషియల్ అధికారాలు తీసేశాడు. 1815లో ఎళావ, నాడార్ రైతులకు చాలా హక్కులు కల్పించాడు. 1812లో రాణిని ఒప్పించి సిరియన్ క్రైస్తవుల లాగానే క్రైస్తవం స్వీకరించిన నాడార్ మహిళలు రవికె (Kuppayam)ధరించవచ్చని ఉత్తర్వులు ఇప్పించాడు. అంతేకాదు, హిందూ దేవాలయాలకు క్రైస్తవులు పన్నులు చెల్లించే విధానాన్ని రద్దు చేయించాడు.

1813లో రాణికి కుమారుడు పుట్టాడు. అయితే, 1815లో రాణి చనిపోయింది. కుమారుడు రాజా కార్తీక తిరునాళ్ రామ వర్మ యువరాజయ్యాడు. ఆసమయంలో మరొక మార్పు వచ్చింది. రాణి చనిపోయే ముందు మన్రో తన దివాన్ పదవికి రాజీనామా చేశాడు.

ఈ మధ్యన ట్రావన్కోర్ సంస్థానంలో కుల ఉద్రికత్త మొదలయింది. నాడార్ క్రైస్తవ మహిళలకు రవికె ధరించేందుకు అనుమతి ఇవ్వగానే నంబూద్రిలు ఆగ్రహించారు. వారు రవికె ధరించిన మహిళల మీద దాడి చేయడం మొదలుపెట్టారు. ఇది చిలికి చిలికి పెద్ద వాన అయింది. 1858లో నిమ్న కులాలు వాళ్లు రవికె హక్కు కోసం పెద్ద తిరుగుబాటు చేశారు. 1857లో తిరుగుబాటుతో ఉక్కిరిబిక్కిరి అయిన బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ట్రావన్కోర్ తిరుగుబాటు తలనొప్పి నుంచ బయటపడాలనుకుంది. ఈ తిరుగుబాటు పేరు చన్నార్ తిరుగుబాటు (Channar Revolt). నిమ్నకులాల వారిని శాంతింప చేసేందుకు మద్రాస్ రెసిడెంట్ సర్ చార్లెస్ ట్రెవిల్యాన్ రంగంలోకి దిగాడు. సంస్థానంలో ఏకులానికి చెందిన మహిళయినా రవికె ధరించవచ్చు, తనకు ఇష్టమయిన నగలు వేసుకోవచ్చని రాకుమారుడిచేత రాజాజ్ఞ ఇప్పించాడు. అంతవరకు తక్కువ కులాల మహిళలు రవికె ధరించడమే కాదు, బంగారు నగలు వేసుకోవడం కూడా నిషేధం.


Read More
Next Story