లవ్ జిహాదీ లేదు.. వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు...
రాహుల్ హిందువు, మొబీన ముస్లిం. కులం లేదు, మతం లేదు. లవ్ జిహాదీ లేదు.. నెల్లూరులో నిన్న ఆదివారం వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు.
కట్నాలు లేవు, కానుకలు లేవు. పురోహితుడి పెళ్ళి మంత్రాలు లేవు, భాజా భజంత్రీలూ లేవు. చివరికి పూల దండలు కూడా లేవు. నెల్లూరులోని ఎంజీకె కన్వెన్షన్ హీల్ లో ఆదివారం ఉదయం పదకొండు గంటలకు రాహుల్, మొ బీనా ఆదర్శ వివాహం జరిగింది. తిరుపతి ఐఐటీ లో పీహెచ్ డీ చేస్తున్న రాహుల్, నెల్లూరు డీకేడబ్ల్యు కళాశాలలో లెక్చరర్ గా చేస్తున్న మొబీనా అందరి సమక్షంలో భార్యభర్తలయ్యారు.
మన దేశంలో కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు జరగడం ఇదేమీకొత్త కాదు. కాకపోతే ఎక్కడ మతాంతర వివాహం జరిగినా, ప్రస్తుతం మతోన్మాదులు వచ్చి విరుచుకు పడుతున్నారు. ‘లవ్ జిహాదీ’ పేరుతో ముస్లిం యువతులు హిందూ యువకులను తమ బుట్టలో వేసుకుని, తీవ్రవాదులుగా మారుస్తున్నారని తెగ ప్రచారం చేస్తూ, రాజకీయాల కోసం మైనారిటీ వ్యతిరేకతను పెంచిపోషిస్తున్నారు. వారిపై లేని పోని ఆరోపణలు చేసి కేసులు కూడా పెడుతున్నారు. ఈ ధోరణి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉన్నదని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరులో ఆదివారం మతాంతర వివాహం బంధుమిత్రుల మధ్య ఆనందోత్సాహాలతో నిరాటంకంగా జరిగిపోయింది.
రాహుల్, మొబీనా ఇద్దరూ ఏఐడీఎస్ఓ లో పనిచేస్తున్నారు. గత కొంతకాలం క్రితం వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. అభ్యుదయ భావాలున్న మొబీనా నాన్న అల్లా బక్ష్ బీఎస్ఎన్ఎల్ లో ఏవోగా రిటైరయ్యారు. మొబీనా అమ్మ ఫరీద గృహిణి. రాహుల్ , మొబీనా పెళ్ళి చేసుకుంటామని చెపితే ఆనందంగా అంగీకిరించారు. సాఫ్ట్ వేర్ రంగంలో చేస్తున్న వీరి పెద్ద కుమార్తె అమీనా కూడా తిరుపతి జిల్లా ఎస్ యూ సీ ఐ బాధ్యుడిగా చేస్తున్న హరీష్ ని రెండేళ్ళ క్రితం ఇలాగే మతాంతర వివాహం చేసుకున్నారు. వాళ్ళిద్దరూ ఆనందంగా ఉన్నారు. ఒక ఆడబిడ్డ తల్లి దండ్రులకు ఇంతకంటే ఏం కావాలి?
రాహుల్ తండ్రి వెంకట్రాయుడు ప్రొద్దుటూరులోన ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో లెచ్చరర్ గా చేస్తున్నారు. తల్లి సరిత గృహిణి. మొబీనాని పెళ్ళి చేసుకంటానని రాహుల్ చెప్పగానే వెంట్రాయుడు, సరిత దంపతులు కాస్త వెనుకాడారు. బంధువులు దూరమవుతారనే తప్ప, వ్యతిరేకించడానికి వారికి వేరే కారణం లేదు. రాహుల్ పట్టుబట్టేసరికి పెద్ద వ్యతిరేకత చూపకుండానే ఈ పెళ్ళికి అంగీకరించారు.
పెళ్ళికి అనుసంధాన కర్తగా వ్యవహరించిన బసవరాజు పెళ్ళి కుమారుడు, పెళ్ళి కుమార్తెను వేదికపైకి ఆహ్వానించారు. ఒకరొకరూ వచ్చి వారిని అభినందించారు. అందరికంటే ముందు మొబీనా తల్లిదండ్రులు అల్లాబక్ష్, ఫరీద వచ్చి నవ దంపతులను అభినందించారు. తరువాత రాహుల్ తల్లిదండ్రులు వెంకటరాయుడు, సరిత వచ్చి అభినందించారు. పెళ్ళికి ఆమోదించడం వెనుక ఉన్న తమ ఇబ్బందులను, సంసిద్ధతను చెప్పారు. మతాంతర వివాహానికి బంధువులు, స్నేహితులు ఏ మనుకుంటారోనని తొలుత పిలవ డానికి వెనుకాడినా, తరువాత పిలిచేశారు. ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదు. ఆనందంగా అంగీ కరించారు. రాహుల్ తరపు వారు, మొబీనా తరపు వారు వచ్చి వారిని అభినందించారు.
సోషలిస్టు యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా(ఎస్ యూ సీ ఐ) కేంద్రకమిటీ సభ్యులు ఫ్రొఫెసర్ శ్రీధర్ మాట్లాడుతూ ‘మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటె నిలిచి వెలుగును’ అన్న గురజాడ దేశ భక్తిగీతంలోని చరణాన్ని గుర్తు చేశారు. ఉన్నత భావాలు రావాలంటే శాస్త్రీయంగా పనిచేయాలన్నారు. ఉభయులు పరస్పరం గౌరవించుకుని, అర్థం చేసుకుని దగ్గరయితే ప్రేమగా మారి పెళ్ళి చేసుకోవచ్చని అన్నారు. ఎస్ యూ సీ ఐ ఆంధ్రప్రదేశ్ బాధ్యులు అమరనాథ్, రాష్ట్ర నాయకులు గోవిందరాజులు, సీపిఐ ఎంఎల్ రాష్ట్ర నాయకులు జె.కిషోర్ బాబు, కొండమ్మ తదితరులు నూతన దంపతులును ఆశీర్వదించారు.
తిరుపతి నుంచి వచ్చిన పౌరచైతన్య జిల్లా అధ్యక్షులు వాకా ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఏ.ఎన్.పరమేశ్వరరావు, సాహితీ వేత్త సాకం నాగరాజు, పౌరచైతన్య జిల్లా గౌరవాధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ రాఘవ, పుస్తక ప్రియుడు కాళయ్య, మోహన్ తదిరులు కూడా నూతన దంపతులను అభినందించారు. ఈ ఆదర్శ వివాహం ఒక సుహృద్భావ వాతావరణం లో జరిగింది. రాహుల్, మొబీనా మిత్రులు అనేక మంది వచ్చి అభినందించారు. ఈ ఆదర్శ వివాహం నూతన యువతీ యువకులకు స్ఫూర్తి దాయకమవుతుందనడంలో సందేహం లేదు. లవ్ జిహాదీ వంటి ఉడత బెదిరింపులకు భయపడవలసిన అవసరం లేదని ఈ వివాహం సందేశమిస్తోంది.
కాళిదాసు పురుషోత్తంతో కబుర్లు
సాహితీ వేత్త, పరిశోధకులు, బహుగ్రంథ కర్త కాళిదాసు పురుషోత్తం(83) ను తిరుగుప్రయాణంలో తిరుపతి బృందం కలిసింది. నెల్లూరు వెళుతున్నప్పుడే ఫోన్ చేసి ‘మిమ్మల్ని కలవవచ్చా?’ అని అడిగాను. మేం మీ ఇంటికి వచ్చి కలుస్తామంటే చాలా ఆనందపడిపోయారు. ‘‘మీరు ఎప్పుడైనా రండి. మీ కోసం ఎదురుచూస్తుంటాను’’ అన్నారు.
వెంకటగిరి జమిందారులకు వ్యతిరేకంగా రైతు పోరాటాన్ని లేవదీసిన పొణకాకనకమ్మ గురించి ‘కనకపుష్యరాగం’ అంటూ కాళిదాసు పురుషోత్తం అద్భుతమైన గ్రంథం రాశారు. పొణకాకకమ్మ పెన్నానది తీరాన పల్లెపాడు ఆశ్రమాన్ని నిర్మించి, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధపోరాటం చేసేయువకులకు శిక్షణ నిప్పించేది. తారువాత గాంధీజీని నెల్లూరుకు తీసుకొచ్చి పల్లెపాడు గాంధీ ఆశ్రమాన్ని ప్రారంభింప చేసిన సందర్భంగా, జాతిపాత ప్రభావంతో అహింసా పద్ధతిలో స్వాతంత్ర్యోద్యమానికి తన సర్వస్వం అర్పించిన త్యాగశీలి. ఆ యోధురాలి గురించి కాళిదాసు పురుషోత్తం రాసిన కనకపుష్యరాగం చాలా ప్రసిద్ధి చెందింది. సర్వోదయ కాలేజీ ప్రిన్సిపాల్ గా చేసిన ఆయన, జమిందారీ వ్యవస్థ గురించి, వాటి పతనం గురించి, ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల గురించి, నిర్బంధాల గురించి గుర్తు చేశారు. డెబ్బై అయిదేళ్ళ స్వాతంత్ర్యానంతర పరిపానకు ఇప్పటికీ ఆయన ప్రత్యక్ష నిలువెత్తు సాక్షి.
Next Story