శేషాచలం కొండల్లో ఆందాల రాసి ‘ తుంబురుకోన’
x
తుంబురు కోనలో ఎత్తయిన కొండలు

శేషాచలం కొండల్లో ఆందాల రాసి ‘ తుంబురుకోన’

నాలుగేళ్ల కిందట భూమన్ శేషాచలం కొండల్లోని నక్కి ఉన్న తుంబురు కోనను సందర్శించారు. తుంబురు కోన యాత్ర విశేషాలు ఈ వారం...



- భూమన్*


శేషాచలం కొండల్లో మరొక అద్భతమయిన ప్రదేశం గురించి ఈ వారం చెబుతున్నాను. దానిపేరు తుంబురు కోన. ఈ కొండల్లోని కోనల్లో నన్ను ఇంతగా ఆకట్టుకున్న సుందర ప్రాంతం మరొకటి లేదని చెప్పాలి. భూమిని ఆకాశాన్ని కలపుతున్నట్లు కొండలుంటాయి. వాటి మీద పాతాళంలో ఉన్నట్లు మనం నడుస్తుంటాయి. ఒక అవకాశం రావడంతో 2020 ఆగస్టులో తుంబురు కోనను మా ట్రెక్ సాధ్యమయింది. నాలుగేళ్లయినా ఈ కోన సౌందర్యం పెయింటింగ్ లాగా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది.



శేషాచలం కొండల్లో ఉన్న ఒక అందమయిన తీర్థం తుంబురు కోన. ఈ కోన చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో ఉంది. తిరుపతి సమీపంలోని పాపవినాశనం డ్యామ్ మీదుగా సనకనందన తీర్థం, సలీంద్రబండ, పింగదీసిన మడుగు మీదుగా తుంబురు కోనకు చేరుకోవచ్చు. పాప వినాశనానికి ఏడు కిలోమీటర్ల దూరాన కోన ఉంటుంది.

లేదా తిరుపతి –కడప హైవే మీద మామండూరు, కుక్కల దొడ్డి గ్రామాల నుంచి బయల్దేరి కూడా తుంబుర తీర్థం చేరుకోవచ్చు. ఇదంతా అడవీ మార్గం. సుమారు 14 కి. మీ ఈ అడవిలో ప్రయాణించాల్సి ఉంటుంది.




ద్విచక్ర వాహనాల మీద బయలుదేరాం. తిరపతి నుంచి మామండూరుకు 23 కిలోమీటర్లు, ముప్పావు గంట పట్టింది. మామండూరు దాటి కొంత దూరం వెళ్ళాక ఎడమ వైపు రైల్వే వంతెన వస్తుంది.
వంతెన కింద నుంచి అడవిలోకి మా వాహనాలను మళ్లించాము. దారంతా రాళ్ళు రప్పలు.




చుట్టూ అడవిలో రకరకాల చెట్లు. దారికి ఇరువైపులా మనిషెత్తు పెరిగిన బోద గడ్డి మొక్కలు కనిపిస్తాయి. దారి ఎన్ని మెలికలు తిరిగిందో! ఆ మెలికల్లో గులకరాళ్ల మీద మా వాహనాలు చీమల బారులా సాగుతున్నాయి.


అలా కొంత దూరం పోయాక బండిరుసు వాగు వస్తుంది. పేరు వింతగా ఉంది కదూ.
ఆ వాగులో ఏటి ప్రవాహానికి కొట్టుకిచ్చిన రాళ్ళు, రప్పలు నిండి ఉన్నాయి. పూర్వం వాహనాలేమిటి? ఎద్దుల వాహనాలను అక్కడే ఆపేశాం. ఎద్దుల బండ్లలో ఈ దారినే తుంబురుకు వెళ్ళే వారు.ఈ వాగులో వెళుతుంటే బండిరుసులు విరిగిపోయేవి. అందుకుని దీన్ని బండిరుసు అన్నారు.




ఈ ప్రయాణం మరుపురాని అనుభూతిగా మిగిలిపోతుంది. దారిపొడవునా చెట్లుచేమలు, కొండ శిఖరాలు, సెలయేళ్లు, నీటి మడుగులు, అరుదైన జంతువుల జాడలు కనిపిస్తూ ఉంటాయి.




తుంబురు కోన దారి పోడవునా భూమి ఆకాశాన్ని కలుపుతున్నట్లు ఎత్తయిన కొండులు, వాటి మధ్య నీటి ప్రవాహాలు కనిపిస్తాయి.



తుంబురు కోన


ఇలా కొండ అంచునే ముందుకు సాగుతూ పోవాలి. ఈ మధ్య ఎన్ని ప్రకృతి విచిత్రాలు కనబడతాయో లెక్కలేదు. చివరకు తుంబురు కోనకు చేరకుంటారు. అక్కడ గుహలో ఎవరో వచ్చి పూజలు చేసిన ఆనవాళ్లు కనిస్తున్నాయి. ఒక చోట ఆ రెండు కొండల నడుమ ఇరుక్కున్న బండరాయిని చూడవచ్చు (కిందిఫోటో). అది ఎపుడు కొండమీది నుంచి దొర్లుకుంటూ వచ్చి అక్కడ ఇరుక్కుందో తెలియదు. బండరాయిని కిందికి జారకుండా చేతులు అడ్డుపెట్టి పట్టుకున్నట్లు ఈ దృశ్యం కనిపిస్తుంది. . అదే తుంబురు తీర్థం. ఆ సౌందర్యాన్ని వర్ణించేందుకు మాటలు చాలవు.




ఈ కోన దారి లోయల్లో ఉదయపు నీరెండ బంగారు రంగు తో ఉంటుంది. తర్వాత నారింజ, పసుపు పచ్చ, ఊదా, ముదురు గోధుమ రంగులకు మారుతూ ఉంటుంది. సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడేటప్పుడు ఒకలాగ, అడ్డంగా, పక్కలకు, ఏటవాలుగా పడేటప్పుడు మరో విధంగానూ కాంతిని వెదజల్లుతాయి. సముద్ర మట్టానికి 1200 అడుగుల ఎత్తు నుంచి 3000 అడుగుల ఎత్తుదాకా ఈ పర్వత శ్రేణి సాగుతుంది.


( *భూమన్ ప్రముఖ రచయిత, రాయలసీమ చరిత్రకారుడు, అంతకు మంచి ప్రకృతి ప్రేమికుడయిన ట్రెకర్. అవకాశం దొరికినపుడల్లా శేషాచలం కొండలలో విశేషాలను అన్వేషిస్తూండటం ఆయన వ్యాపకం. తిరుపతి లో ఉంటారు.)

Read More
Next Story