చింత విచిత్రాలు, ఊరు ఆఫ్రికా, పేరు పర్షియన్, ఊరించింది తెలుగోళ్లని
x
చింతకాయలు

చింత విచిత్రాలు, ఊరు ఆఫ్రికా, పేరు పర్షియన్, ఊరించింది తెలుగోళ్లని

చింత చిగురు పచ్చడి నుంచి చింతచిగురు చికెన్ దాకా తెలుగు వాళ్లు చేయని చింత ప్రయోగం లేదు. చింత ఎందరి ఇంటి పేరుగా మారలేదూ, ఇంతకీ చింత సంగతేమిటి?


చింతపండులేకపోతే, తెలుగు భోజనం రసహీనం మవుతుంది. చింతకాయతో తెలుగు ఇల్లాళ్లకు, తెలుగు నాలుకకి ఉన్న అనుబంధం అంతా ఇంతాకాదు. అందుకే చింతకాయ ఊరు పేరు చిత్రమయిన చరిత్ర తెలసుకోవాల్సిందే.



- విజయలక్ష్మి శ్రీరాముల


చింత ను శాస్త్రీయంగా ట్యామరిండస్ ఇండికా (Tamarindus Indica) అని పిలిచినా, నిజానికి దాని మూలం ఆఫ్రికా ఖండం. అయితే, పాకిస్తాన్, ఇండియాలలో బాగా పెరుగుతుంది. ప్రపంచమంతా కూడా వ్యాపిస్తూ ఉంది. ఉనికేమో ఆఫ్రికాది. పేరేమో అరేబియా నుంచి తెచ్చుకుంది, ప్రాచుర్యం పొందిందేమో ఇండియాలో, అందునా ఊరించింది తెలుగు వాళ్లని. చింత చిగురు పచ్చడి నుంచి చింతచిగురు చికెన్ దాకా తెలుగు వాళ్లు చేయని చింత ప్రయోగం లేదు.

ట్యామరింగ్ అనే Tamar -I- Hind అనే మాటల నుంచి వచ్చింది. Tamar అంటే ఖర్జూరం అని అరబిక్ లో అర్థం. Hind అంటే ఇండియా. రెండిని భారతదేశానికి ఖర్జూరం వంటిదని ( Dates of India) అని పర్షియన్లు భావించారు. అదే ట్యామరిండ్ అయి కూర్చుంది.

ఎన్ సి షా చింత చరిత్ర, వ్యాప్తి, ప్రయోజనాల మీద సమగ్రమయిన పరిశోధన చేసి గొప్ప వ్యాసాన్ని ఏషియన్ అగ్రి హిస్టరీ (Asian Agri-History) చింత విచిత్రాల గురించి చక్కగ రాశారు.

చింతపండు అక్బర్ కాలంలో అమ్ బ్లీ అనే వాళ్లని ఆయన ప్రస్తావించారు. చరిత్రలో చింత ప్రస్తావన గురించి షా వ్యాసంలో చాలా ఆసక్తి కరమయిన సమాచారం ఉంది. కొంతమంది చింతను అశుభంగా భావిస్తారు. ఆఫ్రికన్లు చింతను మనం వేప చెట్టును పూజించినట్లు పూజిస్తారు.చింత మీద వరుణదేవుడుంటాడని మైయన్మార్ ప్రజలు విశ్వసిస్తారని షా రాశారు.

భారతదేశానికి ఎలా వచ్చింది

ఈ మొక్క భారతీయం కాదని, బయటి నుంచి వచ్చిందని డి. బ్రాండిస్ (Sir Dietrich Brandis) అనే వృక్ష శాస్త్రవేత్త 1906లో చెప్పారు. తర్వాత కె వొ రికీ అనే మరొక వృక్ష శాస్త్రవేత్త ఈ మొక్కని భారతదేశంతో పాటు బర్మాకి చాలా కాలం కిందట అరబ్ వర్తకులు పరిచయం చేశారని రాశాడు.

అయితే, అరేబియా దేశాలలో ఇది పెరగదు. మరి వారికెలా వచ్చిందనే ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి ఆయనేం చెప్పారంటే, అరేబియన్ వర్తకులు రెండు రకాలు. ఒకరేమో భూ మార్గంలో వచ్చే వాళ్లు, రెండో వాళ్లు సముద్ర మార్గంలో వచ్చే వాళ్లు. సముద్రంలో ద్వారా వచ్చే వాళ్లు ఆఫ్రికన్ ఆహారాన్ని తీసుకు వచ్చి భారతదేశంలో వదిలారనేది ఒక ధియరీ. మరొక ధియరీ ప్రకారం, అరబ్బుల కంటే ముందు ఇధియోపియన్ మర్చంట్స్ భారతదేశంలో వర్తకం చేసేవారు. చాలా కాలం చెడిపోకుండా ఉండే స్వభావం ఉన్నందున వారు ఆహారంగా దీనిని సముద్ర ప్రయాణంలో తీసుకువెళ్లే వాళ్లు. అలా వారి ద్వారా ఇది ఆఫ్రికానుంచి భారతదేశానికి వచ్చిఉంవచ్చని కొంత మంది పరిశోధకులు చెబుతున్నారని ఎన్ సి షా రాశారు. అయితే ఇది ఎపుడు జరిగింది? చరక సంహితలో ఆమ్లగా వర్ణించిన పండు చింతయే నని చెబుతారు కొంతమంది. ఆయుర్వేద గ్రంథం చరక సంహిత క్రీ. శ 123-150 నాటిది. ఇలాగే అమరకోశంలో కూడా తింతిడి, చింకా, అమ్లికా అనే పేర్లతో చింత ప్రస్తావన వుంది. ఇలాగే తింతిడి, తింతిడిక్, వృక్ష ఆమ్ల అనే సంస్కృతపేర్లు కూడా చింతకు ఉన్నాయి.

చింతకి ఎందుకింత పాపులారిటి? దాంట్లో ఏమున్నాయి?

చింతపండులో 50 శాతం షుగర్ ఉంటుంది.అయితే దీనిని చింతకు పులుపు నిచ్చే టార్టారిక్ యాసిడ్ డామినేట్ చేస్తుంది. టార్టారిక్ యాసిడ్ కు తీవ్రమయిన అమ్లగుణలుంటాయి. టార్టారిక్ యాసిడ్ (20 శాతం) చింతలో సమృద్ధిగా లభిస్తుంది. చింతపండులో ఇంకా టెర్పీన్స్,ఫినైల్ ప్రొపనాయిడ్స్, మిథైల్ శాలిసిలేట్ వంటి ఎసెన్సియల్ అయిల్స్ కూడా ఉన్నాయి. చింత పండు, చిగురు, పూలు విత్తనాలలో లేనివంటూ ఏమీలేవు.

ప్రొటీన్లు, మినరల్స్, కార్బొహైడ్రేట్స్; కాల్సియమ్,మెగ్నిషియమ్, ఫాస్ఫరస్, ఐరన్, కాపర్, మాంగనీస్,జింక్, కెరొటీన్, రిబోఫ్లేవిన్, నియాసిన్,విటమిన్ సి, ఎసెన్సియల్ ఎమైనో యాసిడ్స్... ఇలా ఎన్నో ఉన్నాయి.

దీని గొప్పదనం గురించి ఇక చదవండి:

మనం ఆరు రుచుల్లో ఒకటైన పులుపునకు పర్యాయపదంగా చింతను భావిస్తాం. చింత చిగుళ్ళు, ఆకులు, పూలు, కాయలు, పళ్ళు ఒకటేమిటి చింతచెట్టుకు ఒళ్ళంతా పులుపే. అందుకేనేమో 'చింత చచ్చినా పులుపు చావద'ని సామెత.

వార్ధక్యం పైబడినా చిలిపి వలపు తలపులు వీడని వ్యక్తిని మనం 'వాడికి చింత చచ్చినా పులుపు చావలేద'ని అంటాం. పులుపు రసికతకూ, వగరు పొగరుకూ సంకేతాలు. చింత చిగురులో పులుపుతో పాటు కొంత వగరు కూడా ఉంటుంది. వగరూ పొగరూ గల చిన్నదాన్ని చింతచెట్టు చిగురుతో పోలుస్తూ మన కవులు గీతాలు రాస్తారందుకే. 'చింతలు పూస్తే సిరులకు కొదవలేద'నే లోకోక్తి ఏమేరకు శాస్త్రీయమో కాని, వరి ధాన్యం నూర్పిళ్ళు పూర్తయి, పంట డబ్బు చేతికి అంది, రైతుల ఇళ్ళన్నీ సిరులతో కళకళలాడే సమయంలోనే చింతచెట్లు పూస్తాయి. నేడు మామిడి పిందెల అంచులున్న ఆభరణాలున్నట్లే, ప్రాచీన కాలంలో చింతాకు ఆకారంలో అంచులుండే ఆభరణాలు కూడా ఉండే ఉంటాయి. అందుకే భద్రాచల రామదాసు 'సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము, రామచంద్రా!' అంటాడు.

పేరూ... తీరూ...

చింతను సంస్కృతంలో 'చించా' అనీ, 'తింత్రిణీ' అనీ, 'ఆమ్లికా' అనీ అంటారు. చింతపండు నోట్లో వేసుకుంటే నోరు చిమచిమ అంటుంది కనుక దీనికి 'చించా' అనే పేరూ, నోట్లో వేసుకోగానే నీళ్ళూరతాయి కనుక 'తింత్రిణీ' అనే పేరూ, పుల్లగా ఉంటుంది కనుక 'ఆమ్లికా' అనే పేరూ వచ్చాయి. దీని సంస్కృత పేరు 'చించా' నుంచే తెలుగు శబ్దం 'చింత' ఏర్పడింది. 'ఆమ్లికా' నుంచే 'ఆమ్లీ', 'ఇమ్లీ' ఏర్పడ్డాయి. హైదరాబాద్‌లో మహాత్మాగాంధి బస్‌స్టేషన్ నిర్మించక ముందు అక్కడ ఒక చింత తోపు (ఇమ్లీ బన్) ఉండేది. అందుకే దాన్ని నేటికీ ఇమ్లీ బన్ బస్‌స్టేషన్ అంటారు. తమిళంలో దీన్ని 'పుళి' అనీ, 'అమిళం' అనీ అంటారు. మన అభిమాన వంటకం పుళిహోర (దాన్నే మనం పులిహోర, పులిహార అంటున్నాం) ఈ పేరు పుళి నుంచి ఏర్పడినదే. ప్రఖ్యాత ఇటాలియన్ వృక్ష శాస్త్రజ్ఞుడు అయిన యాండ్రియాస్ సీజాల్పిని (క్రీ.శ. 1519-1603) పేరిట ఏర్పరచిన సీజాల్పినియేసీ(Caesalpiniaceae) కుటుంబానికి చెందిన వృక్ష మిది.

ఎక్కడిదీ చింత?

ఆఫ్రికాలోని సవానాలు అనే గడ్డి మైదానాలు చింతచెట్టు తొట్టతొలి జన్మస్థలమని శాస్త్రజ్ఞుల నిర్ధారణ. అయితే ఇది భారతదేశంలోకి చరిత్ర పూర్వయుగాల్లోనే ప్రవేశించిందని వారి భావన. అందుకే దీన్ని భారతదేశపు వృక్షంగానే భావించి, వృక్ష వర్గీకరణలోనే దీని శాస్త్రీయ నామాన్ని 'ఇండికా' (భారతీయ వృక్షం) అనే అన్నారు. భారతదేశాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు మార్కోపోలో క్రీ.శ. 1298లో దీనిని 'టామరింది' అన్నాడు. 'చింతల', 'చింతా', 'చింతకాయల', 'చింతకింది' మొదలైన తెలుగువాళ్ళ ఇళ్ళపేర్లు, చింతపల్లి, చింతలపూడి, చింతకాని, చింతమోటు, చింతల్లంక, రెంటచింతల, ముచ్చింతల, చింతూరు, చింతకొమ్మదిన్నె మొదలైన తెలుగు గ్రామ నామాలు చింతకూ తెలుగు వారికీ అనాదిగా ఉన్న అనుబంధానికి ప్రత్యక్ష సాక్ష్యాలు.

హంపి రాజధానిగా పాలించిన శ్రీకృష్ణదేవరాయలు (పాలనా కాలం 1509-30) తాను రాసిన 'ఆముక్త మాల్యద' కావ్యంలోని 'గురుగుం జెంచలి' అని మొదలయ్యే పద్యం (4-134)లో వర్షాకాలంలో రెడ్లు గురుగు, చెంచలి, తుమ్మి, లేత తగిరిశ ఆకులు మొదలైన ఆకు కూరలకు తింత్రిణీ పల్లవోత్కరము (చింత చిగురు ఎక్కువగా) కలిపి, నూనెతో పొరటిన కూరను ఆవిరి మీద ఉడికిన పొట్టి ఆరుకుల (అదోరకం తృణధాన్యం) అన్నంలో కలుపుకు తిని పొలం వెళ్ళేవారని రాశాడు.

చింతపండును దక్షిణ భారతదేశంలో ఎక్కువ వాడినా, మిగిలిన ప్రాంతాల్లోని ప్రజలకు అది బొత్తిగా తెలియందేమీ కాదు. మధ్యభారతానికి చెందిన 'మానసోల్లాస' అనే ప్రాచీన గ్రంథంలో పాలు పెరుగుగా తోడుకున్న తరువాత మిగిలే నీటిలో పళ్ళు, చక్కెర, యాలకుల పొడి, వేయించిన చింతగింజల పొడి వేసి చేసే ఒక పానీయం ప్రస్తావించబడింది. వేయించిన చింతపిక్కల పొడిని ఒకప్పుడు కాఫీలో కల్తీగా కలిపేవారు. హోటళ్ళలో టొమాటో, చిల్లీసాస్‌లతో పాటు భోజనాల బల్లపై ముదురు గోధుమ వన్నె 'టామరిండ్ సాస్' కూడా తప్పనిసరిగా ఉంచుతారు. ఆవడ (పెరుగువడ)ల మీద డ్రెస్సింగ్‌గా 'టామరిండ్ సాస్' వేసుకుంటే బాగుంటుంది. ఇలా చరిత్ర పూర్వ యుగాల్లోనే ఆఫ్రికా నుంచి భారతదేశంలోకి ప్రవేశించిన చింత క్రమంగా ఇక్కడి ప్రజల ఆహారాల్లో ప్రముఖ స్థానం పొందగలిగింది.

ఇక భారతదేశంలో ఈ మొక్క చాలా సాంఘిక ప్రయోజనాలు నిర్వర్తించింది. షేర్ షా సూచి (1540-45) పాతరోడ్లను పునరుద్ధరిస్తున్న సమయంలో, ముఖ్యంగా పెషావర్ నుంచి కలకత్తా వరకు ఉన్న రోడ్డును పునరుద్ధరిస్తున్నపుడు బాటసారులు విశ్రాంతి తీసుకునేందుకు రోడ్డు ఇరువైపులా చింతచెట్లను నాటించారు. అపుడు చింతపండు చిరుతిండిగా వాడేవారు.

చింతచేసే మేలు...

చింత ఆకుల్ని మేకలు, పశువులు ఇష్టంగా మేస్తాయి. పచ్చి రొట్ట ఎరువుగానూ వీటిని వాడుకుంటారు. లేత చింతచెట్ల నుంచి ఆఫ్రికాలో ఓ రకమైన నార తీస్తారు. చింతపూలు చక్కటి బంగారు రంగు తేనెనిస్తాయి. అయితే ఆ పూలలోని సహజమైన పుల్లదనం కారణంగా ఆ తేనె కూడా రవ్వంత పులుపుగా ఉంటుంది. చింత ఆకుల నుంచి తీసే ఎరుపు, పసుపుల మిశ్రమపు రంగును అద్దకపు పరిశ్రమలో వాడతారు. చింతపండును, చింత గింజల్ని, చింత గింజల పొడిని కూడా విదేశాలకు ఎగుమతి చేస్తారు. చింతచెట్టు నుంచి శ్రేష్ఠమైన కలప వస్తుంది. అయితే చింత చెట్లను ప్రధానంగా వాటి పళ్ళకోసం పెంచుతారు. కనుక సాధారణంగా ఎవ్వరూ కలప కోసం చింత చెట్లు నరకడం చేయరు. దృఢమైన ఈ కలపను స్థానికులు వ్యవసాయ పనిముట్ల తయారీకి వాడుకుంటారు.

చింత విత్తనాలలోని తెల్లటిపప్పు నుంచి తీసే నూనెను దీపాలు వెలిగించడానికీ, పెయింట్లు, వార్నిష్‌ల తయారీలోనూ వాడతారు.

అనాదిగా వైద్యంలో చింతకు చాలా ప్రాధాన్యం ఉంది. చింత మీద చాాలా శాస్త్ర ప్రయోగాలు జరిగాయి. ఈ వైద్యగుణాలు ఈ ప్రయోగాలలో రుజువయ్యాయి.

చింత పప్పులో స్రావాల్ని అరికట్టే గుణం ఉంది. అవి నీళ్ళ విరేచనాలు, రక్త గ్రహణిలను అరికడతాయి. సెగగడ్డలకు ఈ పప్పును ఉడికించి, మెత్తగా నూరి ఆ ముద్దను మలాం పట్టీగా వేస్తారు. చింతాకు పసరు అజీర్తి కారణంగా వచ్చే జ్వరాల్ని పోగొడుతుంది. కంటిలోని పొరలు వాచినప్పుడు తాజా చింతపూల గుజ్జును కళ్ళ మీద పట్టీగా వేస్తే తగ్గుతుంది. బెరడు నుంచి కాచే కషాయం ఉబ్బసానికీ, జ్వరాలకూ దివ్యౌషధం. చింతగింజల పొడిని జిగురుగా ఉడికించి నూలు, జనపనార వస్త్రాలకు పట్టించే సైజింగు పౌడర్ (గంజి పొడి)గా వాడతారు. ఇది గంజి పొడిగా సాధారణంగా వాడే మొక్కజొన్న పిండి కంటే ఎంతో చవకైనది కూడా. చింతగింజల పొడి నుంచి 'టామిండ్' అనే కాగితపు జిగురు కూడా తయారుచేస్తారు. వస్త్ర, కాలికో పరిశ్రమలలో దీన్ని వాడతారు.

చింతపప్పును కొందరు బియ్యంతో కలిపి నేతిలో వేయించి, దంచి పొడిచేసి, దానికి పంచదార, నెయ్యి చేర్చి, రవ్వలడ్డూలా చేసుకుతింటారు. చింతపండు గుజ్జు భారతీయ వైద్యంలో కడుపులో నుంచి గాస్ వెడలించేదిగానూ, సుఖ విరేచనకారిగానూ, అజీర్తి రోగాన్ని పోగొట్టేదిగానూ ప్రసిద్ధి పొందింది. నోరు పూసినా, గొంతు పూడి, బొంగురుపోయినా, చింతపండు గుజ్జును కషాయంగా కాచి దానితో పుక్కిలిస్తే ప్రయోజనం. గడ్డలు, వాపులు తగ్గడానికి చింతపండు గుజ్జుతో మలాం పట్టీ వేస్తారు.

చింతపండు గుజ్జులో ప్రధానంగా టార్టారిక్ యాసిడ్ ఉన్న కారణంగా దాన్ని వస్త్రాల అద్దకం పరిశ్రమలోనూ, తోళ్ళు ఊనే టానింగ్ పరిశ్రమలోనూ వాడడమే గాక, లోహపు సామగ్రిని శుభ్రపరచి, మెరుగుపెట్టేందుకూ ఉపయోగిస్తారు. చింతపండు గుజ్జును రసాయన ప్రక్రియకు లోనుచేసి గాఢపరచి, చెడకుండా ఉండేట్లు చేస్తారు. 'టామ్‌కాన్' పేరిట మార్కెట్లో లభించే ఈ గాఢపరచిన గుజ్జు నెలల తరబడి నిల్వ ఉంటుంది. చింతపండు దొరకని పాశ్చాత్య దేశాల్లో ఎప్పుడు పడితే అప్పుడు వాడుకునేందుకు అనువుగా ఉంటుంది.

మన ప్రాచీనులు చెప్పిన కొన్ని నిత్యసత్యాలను ఆధునికులు కాలం చెల్లినవని భావిస్తూ వాటిని 'పాత చింతకాయ పచ్చడి' అనడం పరిపాటి. కాని జాడీలో నిల్వవున్న పాత చింతకాయ పచ్చడి పచ్చిమిర్చితో నూరి తిరగమోత వేస్తే అమోఘంగా ఉంటుంది.

మన్రో చింత తోపులు

ఈ చింతవల్ల చాలా ప్రయోజనాలున్నాయి. చింత చెట్టులో వెస్టయ్యేదేదీ లేదు. చింతాకు, చింతకాయలు, చింత పిచ్చలు, చింత వేర్లు, చింతబెరడు ఇలా ప్రతిదీ ఉపయోగపడేది. జీవనాధారం కలిగిస్తుంది. ఈస్టియా కంపెనీ పాలన రోజుల్లో రాయలసీమ జిల్లాల్లో సెటిల్ మెంట్ ఆఫీసర్ గా పనిచేసిన థామస్ మన్రో (1761 మే 27-1827 జూలై 6) కరువు కాటకాల్లో ఈ చెట్లు పేదలకు ఉపాధికల్పిస్తాయని భావించాడు. చింత వనాలు ను అక్కడక్కడ నాటించారు. వీటిని ఇప్పటకీ మన్రోతోపులు అనిపిలుస్తారు.

( with inputs from ఫేస్ బుక్ రైతురాజు ముక్తేవి రవీంద్రనాథ్)


Read More
Next Story