పోలీసులు వస్తే వూర్లో పండగ సందడి ఉంటుందా?
x
విద్యార్థులతో కలసి భోజనం చేస్తున్న ‘ఈగిల్’ ఐజి ఆకె రవికృష్ణ (మధ్యన). కుడి వైపున జిల్లా ఎస్పీ బిందు మాధవ్.

పోలీసులు వస్తే వూర్లో పండగ సందడి ఉంటుందా?

కర్నూలు జిల్లా కపట్రాళ్లలో నిన్న అదే జరిగింది. ఇలా...


ఊరికి పోలీసులు వస్తే, పండగ సందడి ఉంటుందా? అవునంటే ఎవరూ నమ్మరు. ఎందుకు? పోలీసుల రాక ఎపుడూ ఏదో ఒక అవాంఛనీయ పరిణామాన్ని సూచిస్తుంది. అయితే నిన్న కర్నూలు జిల్లా, దేవనకొండ మండలంలోని కపట్రాళ్లలో పోలీసుల రాకతో పండగ వాతావరణం వచ్చింది. కారణం, ఒకప్పుడు జిల్లాలో ఎస్ పిగా పని చేసి ఇపుడు ఈగిల్ ఐజిగా నియమితుడయిన 2006 బ్యాచ్ ఐపిఎస్ అధికారి ఆకె రవికృష్ణ మళ్లీ కొత్త నినాదంతో ఈ వూరు రావడం. అపుడాయన ఈ ‘ఫ్యాక్షన్ ఖూనీ రాజకీయాలు వద్దురాబాబూ’ లని బుజ్జగించేందుకు వచ్చారు. ఇపుడాయన ‘డగ్స్ వద్దు బ్రో’ అంటున్నారు. పోలీసులు ఇలా అభివృద్ధి గురించి మాట్లాడటం కొత్తగా వింతంగా ఉంటుంది కదూ. ఎస్ పిగా ఉన్నపుడు రవికృష్ణ జిల్లాకు చూపించింది అదే.

రవికృష్ణ కర్నూలు జిల్లాకు మంచి మిత్రుడు. గతంలో జిల్లాలో 2015లో ఎస్ పి గా ఉన్నపుడు ఆయన చేసిన పనులను ప్రజలు మర్చిపోరు. అలా జిల్లాకు మొత్తంగా మిత్రుడయ్యారు. ఫ్యాక్షన్ ఖూనీలకు పేరు మోసిన కప్పట్రాళ్ల గ్రామాన్ని అప్పట్లో ఆయన దత్తత తీసుకున్నారు. కపట్రాళ్ల అంటే గ్రామకక్షలకు మారు పేరు. పాలెగాళ్ల ప్రాంతం. ఆవూరి ప్రజలు ఈ కక్షల కార్పణ్యాల మధ్యలో నలిగిపోతున్నారు. అందువల్ల ఆయన గ్రామానికి ఉన్న ఆ రక్తపు మరక చెరిపేయాలనుకున్నారు. ఆ గ్రామాన్ని దతత్తతీసుకుని పరివర్తన బాట పట్టించారు. ఖూనీలు, ఖూనీ రాజకీయాలవల్ల ఇన్నాళ్లు గ్రామం ఎం కోల్పోయిందో చూపించారు. ఊరికి మంచినీటి వసతి కల్పించారు. పాఠశాలను మెరుగుపరిచారు. ఒక బ్యాంకును కూడా రప్పించారు. ఆయన చేసినపనులతో కపట్రాళ్ల అపకీర్తి పోయి ఆదర్శ గ్రామంగా మారింది. దీనికి గుర్తింపుగా ఆయనకు అవార్డు కూడా వచ్చింది.



ఐపిఎస్ ట్రెయినింగ్ లో ఉన్నపుడే కపట్రాళ్ల మీద ఆయన కన్నుబడింది.ఈ ట్రయినింగ్ లో ఉన్నపుడు ఈ గ్రామాన్ని సందర్శించి, గ్రామచరిత్ర తెలుసుకుని విస్తుపోయారు. ఈగ్రామాన్ని దారికి తీసుకురావాలనుకున్నారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా వచ్చినపుడు ఆ పని పూర్తి చేశారు. వందేళ్లకు పైబడి ఉన్న జిల్లా ఫ్యాక్షన్ రాజకీయాల చరిత్ర రాస్తే, చివరి చాప్టర్ పూర్తిగా ఆకె రవికృష్ణ కే కేటాయించాల్సి ఉంటుంది. ఎందుకంటే, కథని సుఖాంతం చేసిన కృషి ఆయనదే అని ఒక స్థానికుడు చెప్పారు.

ఇపుడాయన ఇటీవల డగ్స్ నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన ఈగిల్ (Elite Anti-Narcotics Group for Law Enforcement) ఐజిగా నియమితులయ్యాక ఈ గ్రామాన్ని మళ్లీ సందర్శించారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ సాధన కోసం ఏర్పాటు చేసిన ఈ సంస్థ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఆయన కప్పట్రాళ్లను ఎంచుకున్నారు. అలా కపట్రాళ్ల చరిత్ర పుటల్లోకి ఎక్కేందుకు మరొక అవకాశం కల్పించారు.

శనివారం దేవనకొండ మండలం , కప్పట్రాళ్ళ గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలలో " మెగా టీచర్స్ పేరెంట్ " మీటింగ్ నిర్వహించారు. ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అనే కార్యక్రమం పై అవగాహన కల్పించారు. కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ తో ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అనే పోస్టర్లు ఆవిష్కరించేందుకు ఆయన ఈ వూరు వచ్చారు. ఈ పోస్టర్స్ ఆవిష్కణలో “డ్రగ్స్ మిమ్మల్నే కాదు, మీ కుటుంబాలని నాశనం చేస్తుంది”, “బాల్యాన్ని బలి తీసుకుంటున్న డ్రగ్స్ మత్తులో పిల్లల పై అఘాయిత్యాలు “, “డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కోంటున్న విద్యార్దులు “ అనే సందేశం ఉంది.

ఈ సందర్భంగా ఈగల్ ఐజి ఆకే రవి కృష్ణ గారు మాట్లాడుతూ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా “ మెగా టీచర్స్-పేరెంట్స్ " మీటింగ్ కార్యక్రమాన్ని ఈ రోజు 40 వేల పాఠశాలలో చేస్తున్నదని, సుమారు కోటి మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారనిచెబుతూ కప్పట్రాళ్ళ గ్రామాన్ని డగ్స్ నిర్మూలన కార్యక్రమంలో భాగస్వామిని చేసేందుకు తాను ఇక్కడకు వచ్చానని చెప్పారు. ఈ గ్రామం ప్రపంచ స్ధాయిలో మొదటి స్ధానంలో నిలవాలని గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆయన పిలుపు నిచ్చారు.ఈ లక్ష్యం నెరవేరడం పిల్లలతోనే సాధ్యమని అన్నారు.





"2015 లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రామాలను దత్తత తీసుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ పిలుపు మేరకు పూర్వపు కర్నూలు ఎస్పీ గా పని చేసే సమయంలో కప్పట్రాళ్ళ గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. దత్తత తీసుకున్న తర్వాత ఈ గ్రామం మా కుటుంబం లో భాగమయింది. రాష్ట్రంలో గంజాయి , డ్రగ్స్ ఎక్కడ ఉండకూడదని ఒక క్యాబినేట్ సబ్ కమిటిని ఏర్పాటు చేశారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని వారి ఆదేశాల మేరకు విద్యార్ధులతో కలిసి ఈ క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపెయిన్ లో భాగంగా ఈ రోజు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో డ్రగ్స్ వద్దు బ్రో అనే పేరుతో పోస్టర్స్ ను విడుదల చేయడం జరిగుతున్నది,’’ అని అన్నారు.



ఈ మెగా టీచర్స్-పేరెంట్స్ మీట్ కార్యక్రమంలో పోలీసుశాఖ కూడా భాగం కావాలని ఎడ్యూకేషన్ మినిష్టర్ నారా లోకేష్ సూచించారని, అలా డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమంగా మీ ముందుకు వస్తున్నదని రవికృష్ణ అన్నారు.

"యువత తప్పు ద్రోవ పడకూడదు. విద్యార్దులు చదువుకోవాలి, సాధించాలంటే ఎక్కడ ఉన్నా సాధించవచ్చు. పుస్తకాలు బాగా చదవాలి. 10 వ తరగతిలో 100 శాతం ఫలితాలు ఈ స్కూల్ విద్యార్ధులు సాధించాలి. కుటుంబాలు గుంటూరు, తెలంగాణ ఎక్కడికైనా వలస వెళితే వారి కుటుంబాల పిల్లల కొరకు సీజనల్ హాస్టల్ ఏర్పాటు చేస్తాము. ప్రభుత్వ సహాకారంతో హస్టల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాము. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. కప్పట్రాళ్ళ గ్రామంలో అందరూ కలిసి మెలిసి ఒకే తాటి పై ఉండాలి. విద్యార్ధులు ఉన్నత చదువులు చదువుకోవాలి," అని అన్నారు.

జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ మాట్లాడుతూ డ్రగ్స్ అనర్థాలపై అవగాహన తీసుకురావడమే తమ క్యాంపెయిన్ ముఖ్య ఉద్ధేశ్యమని అన్నారు.

కప్పట్రాళ్ళ గ్రామంలో పిల్లలు అందరూ చక్కగా చదువుతున్నారన్నారని ఆయన ప్రశంసించారు. ఇక్కడ లైబ్రరీ ఉండడంతో గొప్ప వ్యక్తుల పుస్తకాలు చదివితే అవి మానసిక వికాసానికి ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు.

ఆకే రవికృష్ణ గారు దత్తత గ్రామమైన కప్పట్రాళ్ళ గ్రామానికి వస్తుండడంతో గ్రామ ప్రజలు అందరూ ఎంతో సంతోషంగా ఉండడం కనిపించిందని వ్యాఖ్యానించారు. ఇలాంటి గ్రామ దత్తత కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని సర్వీస్ లో తాము కూడా ఇలాంటివి చేస్తామని అన్నారు.

"రాష్ట్రంలో ఈరోజు నుండీ డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ ప్రారంభమయ్యింది. ప్రజల జీవితాలు, ఆరోగ్యాలతో చెలగాటమాడే డ్రగ్స్, గంజాయిను సమిష్టిగా నిరోధించాలి. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్, గంజాయిని కట్టడి చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ పేరుతో యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. గంజాయి, డ్రగ్స్ విస్తరించడంలో కీలకపాత్ర పోషించే ఫెడ్లర్స్, ట్రాన్సుపోర్టర్స్, కంజూమర్స్ పై దృష్టిపెట్టి నియంత్రించడమే లక్ష్యంగా ఉంటుంది. ఎక్కడైనా గంజాయి సాగు, డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగం, తదితరాల గురించి సమాచారం టోల్ ఫ్రీ నంబర్ 1972 కు అందించాలి. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాము," అని బిందు మాధవ్ కోరారు.




అనంతరం రవికృష్ణ, బిందు మాధవ్ కప్పట్రాళ్ళ గ్రామ పాఠశాల విద్యార్దులతో కలిసి సహా పంక్తి భోజనం చేశారు. న్యూట్రి గార్డెన్ ఆవిష్కరణ చేశారు. నూతన వధూవరులకు సంప్రదాయ పద్దతిలో వడి బియ్యంతో పోసి పట్టు వస్త్రాలను వధూ వరులకు అందజేశారు. గ్రామంలోని ముద్రాయిని చెరువు కుంట పూడిక, సుందరీకరణ కు భూమి పూజ చేశారు. గ్రామంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకును సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడారు. గ్రామంలోని ఉద్యాన వన పండ్లతోటలను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ఈగల్ ఎస్పీ నగేష్ బాబు, తానా సంస్ధ పొట్లూరి రవి , వాల్మికి సంఘం స్టేట్ చైర్మన్ బొజ్జమ్మ , పత్తికొండ డిఎస్పీ వెంకట్రామయ్య , దేవనకొండ సిఐ వంశీనాథ్, ఎంపిటిసి రూపమ్మ, అవోపా నాగేశ్వరరావు, సర్పంచ్ చెన్నమ నాయుడు , కప్పట్రాళ్ళ గ్రామ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రశాంతి, దేవి యాడ్స్ విజయభాస్కర్, వ్యవసాయ అధికారి అక్బర్ భాషా, గ్రామా జ్యోతి కోఆర్డినేటర్ నారాయణ , కోరమాండల్ ఫర్టీ లైజర్, కప్పట్రాళ్ళ గ్రామ ప్రజలు, పాఠశాల విద్యార్దులు ఉన్నారు.


Read More
Next Story