అక్కడ సంస్కాృతిక విధ్వంసం కనిపించదు, అంతా పరిరక్షణే...
x

అక్కడ సంస్కాృతిక విధ్వంసం కనిపించదు, అంతా పరిరక్షణే...

డా. జతిన్ కుమార్ ( హైదరాబాద్ ) ఈ మధ్య చైనాలో పర్యటించారు. సాంస్కృతిక అంశాలను పరిరక్షించుకోవడంలో ఆ దేశం చాలా శ్రద్ధ తీసుకోవడం గమనించారు. ఆయన పర్యటన విశేషాలు


డాక్టర్ . యస్. జతిన్ కుమార్

డిసెంబర్ 12, 2023న చైనా- జియాంగ్సీ ప్రొవిన్సు నాన్ చాంగ్ నగరం వేదిక గా ”చైనా దక్షిణ ఆసియా దేశాల మైత్రి సంఘాల 8వ ద్వివార్షిక సమావేశం” జరిగింది. జియాంగ్సీ ప్రావిన్షియల్ ప్రజా ప్రభుత్వము, దక్షిణ ఆసియా ప్రాంత దేశాల మధ్య మైత్రీ, సహకారం కొరకు ఏర్పడిన సంస్థ [ఆర్గనైజేషన్ ఫర్ సౌత్ ఏషియన్ రీజినల్ ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్—ఓఎస్ఏఆర్ఎఫ్సీసీ] సంయుక్తంగా 2023 డిసెంబర్ 11 నుంచి 15 వరకు ' మానవాళి భవిష్యత్తు కోసం పొరుగు దేశాల మధ్య సత్సంబంధాలు' అనే కీలక అంశం (థీమ్) తో ఈ ఫోరమ్ ను నిర్వహించాయి. "చైనా- దక్షిణాసియా దేశాల మధ్య మంచి సంబంధాలు వృద్ధిచెందడానికి, నేరుగా “ప్రజల నుండి ప్రజలకు” స్నేహపూర్వక మార్పిడిని మరింతగా ప్రోత్సహించడానికి ఈ సమావేశం నిర్వహించారు. ఈ ఫోరం లో భారత చైనా మిత్ర మండలి సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ జతిన్ కుమార్ పాల్గొన్నారు. ఫోరంలో ఒకరోజు చర్చలు, రెండు రోజులు క్షేత్ర పర్యటనలు నిర్వహించారు.

ఈ పర్యటన లో ప్రాచీన నాగరికత, సంస్కృతులకు పుట్టినిల్లు అయిన యాంగ్జీ నదీ పరీవాహక ప్రాంతంలోని అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల నిర్మాణం, పర్యాటక ప్రాంతాలను సాంస్కృతిక కేంద్రాలను సందర్శించే అవకాశం కలిగింది. చైనా విప్లవ సమయంలో జియాంగ్ సీ ప్రాంతం కమ్యూనిస్టు విప్లవ కేంద్రంగా వుండేది. ఇక్కడి జీన్ గాంగ్ కొండలు, లుషాన్ పర్వతాలు విప్లవ పురిటి కందుకు ఊయల లూపాయి. చైనాలో మొట్టమొదట కమ్యూనిస్టు అధికారానికి పురిటిగడ్డ, తొలి చైనా సోవియట్ గా ఆవిర్భవించిన రియూ జిన్ ర్ర్ రాష్ట్రం లోనే వుంది. చైనా జైత్ర యాత్ర కు అదే ఆరంభ స్థలం. ఇక సమావేశం జరిగిన నాన్ చంగ్ నగరం పీపల్స్ లిబరేషన్ ఆర్మీకి జన్మస్థలం

చేపలకు ప్రసిద్ధి, ప్రపంచం లోనే వరికి పుట్టినిల్లు గా పేరొందిన [వాన్నియన్ కౌంటీ] జియాంగ్సీ ప్రావిన్స్ లో కొన్ని ప్రాంతాలను చూసాము. జియాంగ్సీ ప్రొవిన్స్ జనాభా సుమారు 4.5 కోట్లు. మూడు వైపులా కొండలు పచ్చని చెట్లతో చుట్టబడి వుంది. ఇక్కడ విస్తీర్ణం లో 65% అడవి భూమి. ఇక్కడి నాన్ చాంగ్, జింగ్ దేఛన్, గాన్ ఝవు నగరాలు జాతీయ స్థాయిలో సాంస్కృతిక కేంద్రాలు గాను, చారిత్రా త్మక ప్రదేశాలుగాను ప్రసిద్ధి చెందినవి. తూర్పు పడమరలను ఉత్తర దక్షిణాలను కలిపే సంగమ క్షేత్రం గా ఇది కీలక స్థానంలో నెలకొనివుంది. ఈ రాష్ట్రం లో ఐదు పెద్ద విమానాశ్రయాలు వున్నాయి. చైనా లోని అతిపెద్ద మంచినీటి సరస్సు పోయాంగ్ సరస్సు ఈ రాష్ట్రంలోనే వుంది. ఈ సరస్సీమను అంతర్జాతీయ వెట్ లాండ్ వ్యవసాయ క్షేత్రం గా అభివృద్ది చేశారు. ఈ రాష్ట్రం 170 రకాల ఖనిజాలకు నెలవు. ఆసియా ఖండం లో అతి పెద్దైన రాగి గనిని ఈశాన్యంలోని దిషింగ్ నగరంలో అభివృద్ది చేశారు. దక్షిణ ప్రాంతం ప్రపంచ తగరం రాజధానిగా[టంగస్టన్ క్యాపిటల్ ] ప్రగతి పధంలో పరుగులిడుతోంది. చైనాలో భుజించటానికి అవసరమైన సగభాగం చేపలు, మూడింటి రెండు వంతులు బియ్యం ఇక్కడి నుండే సరఫరా అవుతాయి. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన 18 సౌందర్య సీమలు, 47 జాతీయ వన ఉద్యానవనాలు అభివృద్ది చేసి ఈ సహజ సౌందర్యాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దారు. సహజ వనరులను వినియోగించుకుంటూ ఒక ప్రాంతాన్ని ఎలా ఆధునికం చేయ వచ్చో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు.



చైనా చరిత్రలో యాంగ్సీ నది చాలా ప్రసిద్ధమైనది. ప్రపంచంలోని అతి పొడవైన నదులలో ఇది మూడవ స్థానంలో వుంది. పశ్చిమాన టిబెట్ పర్వత సానువుల్లో పుట్టి దాదాపు 700 ఉపనదులను కలుపుకుంటూ 3900 మైళ్ళు ప్రవహించి తూర్పున షాంఘై నగరం దగ్గర తూర్పు చైనా సముద్రంలో సంగమిస్తుంది. ఈ నది పరీవాహక ప్రాంతం సుమారు 700,00 చదరపు మైళ్ళ మేరకు విస్తరించి వున్నది . దాదాపు మూడవ వంతు చైనా జనాభాకు కావలసిన మంచినీరు, ఆహారము సమకూరుస్తుంది. ఈ నది ద్వారా జరిగే రవాణా, వాణిజ్యము, విద్యుదుత్పత్తి తోను , పర్యాటక కేంద్రం గాను ఈ నదీ ప్రాంతం చైనా ఆర్ధిక వ్యవస్థకు ఎంతగానో బలం చేకూరుస్తుంది. చైనా జి. డి . పి లో 40% కి ఈ నది ఆధారం.

ప్రపంచం లోని అన్ని ప్రాంతాలలోను నదీ ప్రవాహ పరిసరాలు నాగరికతలకు నెలవుగా, మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లాయి. చైనాలోని యాంగ్సీ నది ప్రాంతం కూడా చైనా నాగరికతకు, సంస్కృతికి కొలువై వుంది. జీవన విభిన్న తకు , వికాసానికి, సమ్మిళిత తత్వానికి ఉదాహరణ గా వుంది. మేము పర్యటించిన జియంగ్సి ప్రోవిన్సు లో యాంగ్సీ నది దక్షిణ ఒడ్డున వున్న జియు జియాంగ్ నగరం చూసాము. అది వైవిధ్య భరిత మైన సంస్కృతుల సంగమ ప్రదేశం. ప్రస్తుత జనాభా 52 లక్షలు.కానీ ఇది మెరుగైన రవాణా సౌకర్యాలు, ఆరు లైన్ల రోడ్డులు, విశాలమైన వీధులు, వింత వస్తుశాలలు, నిత్య విద్యుత్ కాంతులు, హైటెక్ జోనులుగా అభివృద్ది చెంది వున్నది, విశేషమేమంటే ఇది పర్యావరణ హితం [ఏకొ సిటీ ]గా ఈ అభివృద్దిని సాధించటం. ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. విప్లవ కాలంలో ఈ పట్టణం యాంగ్జీ నదిని దాటడానికి ప్రారంభ బిందువు కావడం వల్ల అనేకమందికి ఈ పేరు పరిచితమే.

2200 సంవత్సరాల నాడు స్థాపించబడిన ఈ నగరం లో కన్ఫూష నిజం, బౌద్దమ్, తావో ఇజం పరిడవిల్లి ఒక గొప్ప సంస్కృతికి ఆలవాలమయ్యింది, చైనా సాంస్కృతిక కిటికీ గా వ్యవహరించే ఈ ప్రదేశంలో 1500 సంవత్సరాల నాటి పురాతన కళలు, సంగీతం మరియు సాహిత్యాల సేకరణ భద్ర పరచబడింది. పద్యాలు పూచిన ఈ భూమిని కవిత్వ భూమి అనికూడా అంటారు. విద్యా సుగంధమూ చాలా ఎక్కువే. ఇక్కడ చైనా సాంస్కృతిక మూలా ధారాల అధ్యయనం కోసం ఎంతో కృషి జరుగుతోంది. అనేక రకాల జీవన విధానాలకు, సంప్రదాయ ఆచార వ్యవహారాలకు సామాజిక రాజకీయ భావజాలాలకు, పుట్టినిల్లు కావటంతో వాటి నన్నిటిని జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. చైనా జానపద సాహిత్యానికి, ప్రకృతి వర్ణనలకు, చిత్రకళకు పట్టుగొమ్మ కావటం తో వాటిని సేకరించారు . తరతరాలుగా సంకలించిన 16000 పద్య కావ్య ఖండాలను పరిశీలించి వాటిలో 21 కృతులను ప్రాధమిక, మాధ్యమిక తరగతుల పిల్లలకు బోధిస్తున్నారు. తెల్ల జింకల గుహ అకాడమీ, డాంగ్ లిన్ దేవాలయము వెయ్యి సంవత్సరాల సాంస్కృతిక విశేషాలకు ప్రతినిధిత్వం వహిస్తున్నాయి. లుషాన్ కొండలు కోన లు ఆరు సంస్కృతుల సమాగమ స్థానమై పాశ్చాత్య, ప్రాచ్య సంస్కృతుల పాఠశాలలుగా అలరారుతున్నాయి. ఐక్యరాజ్య సమితి నుండి ప్రపంచ సాంస్కృతిక ప్రదేశంగా గుర్తింపు పొందాయి. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి జీవితాన్నిసాఫల్యం చేసుకున్న అనేక తరాలుగా వాసి కెక్కిన కవులు, కళాకారులు, ఆలోచనాశీలుర పేర అధ్యయన కేంద్రాలు నెలకొల్పి వారిని సముచితంగా గౌరవిస్తున్నారు. ఈ స్మారక కేంద్రాలు, గ్రంథాలయాలలో వున్న అధునాతన పద్దతులు, సౌకర్యాలు, ఊహాతీతంగా వుంటాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ గతాన్ని గౌరవించదని, దోపిడిని నిర్మూలించటం పేరిట రాచరికపు రోజులలోని సంస్కృతిని, ఆ సాంస్కృతిక చిహ్నాలను నిర్మూలించింది అని జరిగే ప్రచారం ఎంత అసత్యమో ఈ ప్రాంతాన్ని చూస్తే అర్థమవుతుంది. మనదేశంలో మావో ఆలోచన విధానం అన్న పేర తప్పుడు అన్వయాలతో, ప్రాచీన విగ్రహాలను కూలగొట్టడం, సాం స్కృత్తిక మూలాలను తృణీకరించడం, ప్రజలలో వున్న విశ్వాసాలను అవమానపరచడం జరుగుతోంది. కొందరు అతివాదులు అలా చేస్తుంటారు. అందువల్ల వీరు ప్రజల నుండి వేరు పడిపోవడమే జరుగుతోంది. కానీ చైనాలో గతం మొత్తాన్ని నెట్టివేయడంకాక, ప్రజల జీవన విధానంలో పాతుకుని పోయివున్న విశ్వాసాలను గౌరవిస్తూ, కొన్ని ఉత్తమ మానవ విలువలని, నైతిక జీవనంలో అలవరచు కోవాల్సిన, అనుసరించవలసిన అంశాలను ప్రాచీన తత్వవేత్తల ప్రవచనాలనుండి ఎత్తి చూపుతూ, తర తరాల జీవన వారసత్వాన్ని పొదివి పట్టుకుని క్రమక్రమంగా ఆధునికం చేస్తూ సామాజిక ఆలోచనా క్రమం లో కావలసిన పరివర్తన తెస్తున్నారు. అందుకే దీన్ని వారు చైనా లక్షణాలతో కూడిన సోషలిజం అని నిర్వచిస్తున్నారు. కాని మన వామపక్ష మేధావులు సోషలిజం అంటే ఒకటే. దానికి చైనా లక్షణాలు అంటూ వేరే వుండవు అని పెడార్ధాలు తీస్తున్నారు. చివరకు చైనా అనుసరిస్తున్నది సోషలిజమే కాదని తృణీకరి స్తున్నారు.

ఈ ఆధునిక సంస్కరణల పర్వంలో చైనాలో ప్రపంచ వాణిజ్యానికి తెరిచి పెట్టిన తొలి ఐదు నగరాలలో ఇది ఒకటి. అందువల్ల ప్రాచీన సాంస్కృతిక సారానికి తోడు గా, ఎర్ర సాంస్కృతిక పట్టు; సంపద తోపాటు పెరిగిన అధునాతన జీవన శైలి, వ్యాపార సంస్కృతి కూడా అలవడి ఈ ప్రాంత జీవితం, పురోగతి నిత్య నూతనంగా వుంటుంది.



మనం ప్రత్యేకంగా గుర్తించవలసిన అంశం ఒకటి, ఇక్కడ ఏ పురాతన సాంస్కృతిక చిహ్నాన్ని నేల కూల్చలేదు. బౌద్ద దేవాలయాలు, ఇతర ప్రధాన మందిరాలను, పూజా స్థలాలను సాంస్కృతిక చిహ్నాలుగా సంరక్షించటమే కాదు వాటికి అవసరమైన పునర్నిర్మాణ పనులు నిర్వహిస్తూ, చారిత్రక నిర్మాణ శైలిని, అప్పటి కట్టడపు వస్తువులనే వాడి ప్రాచీన సంపదను యధా రూపంలో నిర్వహిస్తున్నారు. ప్రజల పూజాది కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతున్నాయి. ప్రజల మత విశ్వాసాలలో ప్రభుత్వ జోక్యం లేదు. దేవుడి మీద ఆధారపడవలసిన జీవన దుస్థితిని తగ్గించి ,భౌతిక జీవన అవసరాలను తీర్చి జీవన ప్రమాణాలను మెరుగు పరచడంతో నూటికి 75% ప్రజలు మత ప్రమేయం లేకుండా జీవిస్తున్నారు.

దీనికి దగ్గర్లోనే వున్న జింగ్ ధే జెన్ నగరం ప్రపంచ పింగాణి పరిశ్రమకు రాజధాని నగరం గా గుర్తించబడినది. 2000 సంవ త్సరాల నుండి ఇక్కడ పింగాణి పరిశ్రమ గృహ పరిశ్రమగా నెలకొని వుంది. ప్రస్తుతం చైనా ప్రభుత్వ భారీ పద్ధకాలతో ఈ ప్రాంత భౌగోళిక, నైసర్గిక, ఆర్ధిక వాతావరణ మంతా అనూహ్యగా అభివృద్ది చెందింది. తవ్వి భద్రపరిచిన పురాతన వస్తువులు, 2000 సంవత్సరాల పురాతన సిరామిక్ వస్తువులు, ప్రపంచ ప్రసిద్ధ పింగాణీ వస్తువులను జింగ్డెజెన్ నగరంలోని 32,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన చైనా సిరామిక్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. 12 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన సాన్బో సిరామిక్ లోయ, రెండు చ. కిమీ . విస్తరించిన టావో జిచువాన్ సిరామిక్ ఆర్ట్ అవెన్యూలో ఆధునిక పరిశ్రమగా ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేసిన కథలు ప్రతిధ్వనిస్తున్నాయి. నలుమూలల నుండి పింగాణి కళాకారులు ఇక్కడకు వచ్చి నూతన పద్దతులు నేర్చుకుని వైవిధ్యభరి తమయిన తమ కళాత్మక ఉత్పత్తులను ప్రపంచమంతా ఎగుమతి చేస్తుంటారు.

పింగాణీ తయారీ యూనిట్లను ప్రోత్సహించడం ద్వారా,170 రకాల ఖనిజాల పుష్కలమైన వనరులను వెలికితీయడం ద్వారా ప్రజా ప్రభుత్వం ఈ ప్రాంతానికి కొత్త ఊపునిచ్చింది. అదే సమయంలో కొత్త పర్యావరణ పద్ధతుల ద్వారా 63% అటవీ ప్రాంతాన్ని పరిరక్షిస్తూనే అభివృద్ధి సాధించడం ఒక అద్భుతమైన, ఆదర్శవంతమైన మార్గం. గణాంకాల ద్వారా కూడా అభివృద్ధిని అంచనా వేయవచ్చు. ప్రావిన్స్ యొక్క వార్షిక జిడిపి (కేవలం 4.6 కోట్ల జనాభా) 2022 లో 3.21 ట్రిలియన్ యువాన్లకు అంటే 39.85 లక్షల కోట్లు రూపాయలకు) చేరుకుంది; విదేశీ వాణిజ్య ఎగుమతులు 508.84 బిలియన్ యువాన్లు (దాదాపు రూ.6338 కోట్లు) చేరుకున్నాయి. 2022లో భారత్ జీడీపీ 3.38 ట్రిలియన్ డాలర్లు కాగా, చైనా జీడీపీ 17.9 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.

ప్రావిన్స్, కౌంటీ, టౌన్ షిప్ స్థాయి లలో చైనా యొక్క ప్రణాళిక మరియు వేగవంతమైన అభివృద్ధిని, గ్రామీణ ప్రాంతాలలో కల్పించిన మౌలిక సదుపాయాల అభివృద్ధిని చూసి ఈ పర్యటనలో పాల్గొన్న వివిధ ఆసియా దేశాల ప్రతినిధులు ఎంతో హర్షించారు. అక్కడి ప్రభుత్వ ప్రజానుకూల నిబద్దతను ప్రశంసించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ఉత్పాదక పద్ధతులను ఆధునీకరించడం ద్వారా చైనాలో జీవన ప్రమాణాల పెరుగుదలను సాధించారు.

చైనా, దక్షిణాసియా రెండూ గొప్ప, అద్భుతమైన నాగరికతలను కలిగి వున్నాయి. అవి మానవ సమాజం ఆధునికం కావడానికి గణనీయమైన సహకారం అందించాయి. వివిధ రూపాల్లో ప్రజల మధ్య సాంస్కృతిక మార్పిడిని నిర్వహించాలని, బంధాలను పటిష్టం చేయాలని, సంప్రదాయ స్నేహాన్ని పెంపొందించుకోవాలని, చైనా, దక్షిణాసియా ప్రజల మధ్య అవగాహన, సుహృద్భావాన్ని పెంపొందించడానికి ప్రజలు పూర్తి పాత్ర పోషించాలని” ఫోరం విడుదలచేసిన సంయుక్త ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.” అభివృద్ధి చెందుతున్న దేశాలు, చైనాల మధ్య సమిష్టి కృషి ద్వారా "శాంతి, సుస్థిరత మరియు శ్రేయస్సు" సాధించాలని ఈ ఫోరం ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. మన దేశం కూడా ఈ సంయుక్త ప్రస్థానంలో భాగం పంచుకోవాలని, మన గొప్ప సంస్కృతిని, ధర్మాన్ని ఆధునిక సమాజ జీవన అవసరాల కనుగుణంగా సముచితమైన మార్పులతో విశ్వవ్యాప్తం గావించాలని కోరుకోవటం అత్యాశ కాదు.

Read More
Next Story