సేద్యం పతనం,  భూములు మాయం...
x

సేద్యం పతనం, భూములు మాయం...

ప్రొఫెసర్ జ్యోతిరాణి తోట పుస్తకం ‘భూ పరాయీకరణ’ పుస్తకపరిచయం


"భూ పరాయీకరణ" అన్న ఈ చిన్న పుస్తకం కాకతీయ యూనివర్శిటీ అర్థశాస్త్ర విభాగం విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్. తోట. జ్యోతీరాణి గారు వివిధ సందర్భాల్లో రాసిన వ్యాసాల సంకలనం. అఖిల భారత ఖేత్ మజ్దూర్ కిసాన్ సభ (AIKMKS) అనుబంధ రైతుకూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్ )ఈ పుస్తకాలను తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ మీముందుకు తెస్తున్నది.

అభివృద్ధి ముసుగులో పెట్టుబడిదారీ వర్గం విశాల ప్రజానీకానికి చెందాల్సిన భూములు, అడవులు, నదులు, సముద్ర సంపద, గాలి, నీరు, మొత్తంగా ఉత్పాదక వనరులన్నింటినీ కొల్లగొడుతూనే వుంది. దీనివల్ల గ్రామాల్లో గానీ, గ్రామాలను తనలో కలిపేసుకుని విస్తరించిన మహానగరాల్లో గానీ భవిష్యత్తు సామాజిక అవసరాల కోసం కొద్దిపాటి స్థలాలు కూడా మిగిలేలా లేవు. వున్నటువంటి సాముదాయిక భూములను, స్థలాలను, ఉమ్మడి వనరులన్నింటినీ నిర్ధాక్షిణ్యంగా కొల్లగొట్టడం ద్వారానే దోపిడీ వర్గం తన సంపదలను అంతకంతకూ పెంచుకుంటున్నది. పేద, మధ్యతరగతి, ఇతర పీడిత వర్గాలకు చెందిన వ్యక్తిగత ఆస్తిగా వున్న చిన్న కమతాల భూమి వ్యవసాయేతర అనుత్పాదక రంగాలకు ఎటువంటి ప్రణాళికా లేకుండా కారుచౌకగా మళ్లించబడుతున్నది. క్రమంగా రైతుల చేతి నుంచి పంట భూములతోపాటు అన్నిరకాల భూములు పరాయీకరణ చెందడం పెరిగింది. దీంతో ఈ భూముల ఉత్పాదకతతో పెనవేసుకున్న అన్ని సెక్షన్ల ప్రజల జీవితాలు దుర్భరమవుతున్నాయి.
అనేక రూపాలలో సాగే భూ పరాయీకరణ పర్యవసానాలు, ప్రభావాలు మొత్తంగా వ్యవసాయ రంగం పైన, ఉత్పాదకత పైన, స్థూల జాతీయోత్పత్తి పైనా తీవ్రంగా వున్నాయి. ఆహార పదార్థాల లభ్యత, రూపం మార్చుకుంటున్న పేదరికం, తీవ్రంగా పెరుగుతున్న అన్నిరకాల అసమానతల రూపంలో ఈ ప్రభావాలను మనం చూడొచ్చు. దశాబ్దాలుగా ఏ పార్టీ అధికారంలో వున్నప్పటికీ వారు చేపడుతున్న గనుల విధానం, ఇంధన వనరుల సేకరణ విధానం, భూసేకరణ విధానం, వ్యవసాయ, పారిశ్రామిక విధానాలు, ఎగుమతుల - దిగుమతుల విధానాలు దేశ ప్రజల ప్రయోజనాలకు అనుకూలంగా ఏనాడూ లేవు. ఈ విధానాలు కోట్లాదిమంది ప్రజల జీవన సంక్షోభాన్ని పెంచుతూనే వున్నాయి.

నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానాల ద్వారా, ప్రపంచీకరణ విధానాల ద్వారా పాలకులు దేశ స్వావలంబన అన్న పదాన్ని ప్రశ్నార్ధకం చేశారు. ప్రజల జీవన భద్రతను విశ్వ వ్యాపార సంక్షోభాల గొలుసుతో పీటముడి వేసి గాలిలో దీపంలా మార్చేశారు. రైతాంగానికి అనివార్యమైన పరిస్థితులు కల్పించడం వల్ల కూడా ఈ భూ పరాయీకరణ ఇంకా ఇంకా పెరుగుతున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే కోట్లాదిమందికి దీర్ఘకాలిక ఉపాధిని కల్పిస్తూ వస్తున్న వ్యవసాయ రంగాన్ని, దాని అనుబంధ పరిశ్రమలను, మార్కెట్ ను సామ్రాజ్యవాదులకు అప్పగించడంలో భాగంగానే ఈ భూ పరాయీకరణ నిరాటంకంగా సాగుతున్నది. దశాబ్దాలుగా సామ్రాజ్యవాద, బడా కార్పొరేట్ గుత్త పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను చేపడుతున్న భారత పాలకులే ఈ దుస్థితికి కారణం అన్న వాస్తవాన్ని ఈ పుస్తకంలోని వ్యాసాలు తెలియజేస్తాయి.
దేశంలో ఎగుమతి ఆధారిత, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నిర్మించాలని ఒకవైపు చెబుతూనే, సామ్రాజ్యవాద విధానాలకు, ప్రధానంగా అమెరికా వంటి దేశాలకు లొంగి, అత్యంత దారుణంగా దిగుమతి సుంకాలను తగ్గిస్తున్నారు. విదేశాల నుంచి టన్నుల కొద్దీ ఆహార పదార్థాలు, నూనె పదార్థాలు, పత్తి వంటి పారిశ్రామిక ముడిసరుకులు దిగుమతి అవడం వల్ల రైతాంగంపై పడుతున్న ప్రత్యక్ష ప్రభావాన్ని చూస్తూ గాలికి వదిలేస్తున్నారు. వ్యవసాయ రంగం రోజురోజుకీ కునారిల్లుతున్నా కూడా, గుత్తాధిపత్యంలోకి చేరిన కార్పొరేట్ రంగానికి లాభదాయకం కనుక పాలకవర్గాలు ఈ విధానాలను అమలుచేస్తున్నారు.
దేశంలో ప్రజలకు ఉపాధి లేకపోవడం, ఆహార పదార్థాల దిగుమతులపై ఆధారపడాల్సి రావటం - ఇవన్నీ ఒక వైపు సాగుతుండగా, జిడిపి పెరుగుదలను సాంకేతికంగా అంకెలుగా చూపిస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. రోజురోజుకీ దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పతనం, విదేశీ అప్పులకు భారత ప్రభుత్వం చెల్లించే వడ్డీలు, రకరకాల రూపాల్లో చెల్లిస్తున్న రాయల్టీలు మన విదేశీ మారక నిల్వలను దారుణంగా ఖర్చు చేస్తున్నాయి. ఈ ప్రభావం అత్యవసర ముడిసరుకులు, ఇంధన వనరుల దిగుమతులపై పడుతున్నది. అంతకంతకూ బహుళ జాతి కంపెనీలపై ఆధారపడే దుస్థితి పెరుగుతూ వున్నది.
దేశంలో పెరుగుతున్న ఉత్పాదక సంక్షోభం, దానికి ప్రధాన కారణమైన వ్యవసాయ రంగ సంక్షోభం వల్ల రైతాంగం కోల్పోతున్న సంపద లెక్కించలేనంతగా మారింది. పాలకుల విధానాల ఫలితంగా రైతాంగంలో వ్యవసాయంపై ఏర్పడుతున్న నిరాసక్తత కూడా భూ పరాయీకరణకు పరోక్షంగా సహకరిస్తున్న అంశమే. ఎక్కడ సాగు భూములు, విలువ కలిగిన భూములు వుంటాయో అక్కడే ఈ భూ పరాయీకరణ ఎక్కువగా జరగడం పెట్టుబడిదారీ వర్గం యొక్క అసలు లక్ష్యాన్ని విప్పి చెబుతున్నాయి.

ప్రొఫెసర్ జ్యోతిరాణి, ఆర్థికవేత్త

చట్టబద్ధంగానే లక్షల ఎకరాల భూములు ప్రైవేటు యాజమాన్యాల ఎస్టేట్లుగా, వ్యవసాయ క్షేత్రాలుగా మారిపోతున్నాయి. చివరికి ప్రయివేటు ఫారెస్టులు, జంతు ప్రదర్శనశాలలుగా మారిపోతున్నాయి. ప్రైవేటు యాజమాన్యాల పరిశ్రమల అవసరాల పేరుతో, విస్తరణ పేరుతో రోజురోజుకీ లక్షల ఎకరాల భూముల్ని రైతాంగం నుంచి గుంజుకోవడానికి పాలకవర్గమే భూసేకరణ పేరుతో ఒక దళారీగా మారి పెట్టుబడిదారీ కార్పొరేట్ శక్తులకు సేవ చేస్తున్నది. ఈ పరిణామాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతాంగాన్ని అణిచివేస్తున్నది. సంవత్సరాల తరబడి రైతాంగం ఢిల్లీ, పంజాబ్ కేంద్రం గానూ, కర్ణాటక దేవనహళ్లి వంటి కొన్నిచోట్ల అనేక పోరాటాలు సాగించి విజయం సాధించడం మనం చూసాం.
రకరకాల పద్ధతుల్లో కంపెనీ వ్యవసాయాన్ని ముందుకు తెచ్చి రైతులకు ప్రత్యామ్నాయంగా చూపిస్తున్నారు. మార్కెట్, నిల్వ వ్యవస్థలను పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకొని రైతాంగాన్ని నష్టాల పాల్జేసి, తమంతట తాముగా భూములను కార్పొరేట్ శక్తులకు అమ్ముకోవడం లేదా లీజుకు ఇవ్వక తప్పదని చెబుతున్నారు. ఇది తీవ్రమైన ఆహార సంక్షోభానికి దారితీస్తుందని, అనేక విధాలుగా విదేశాలపై ఆధారపడే క్రమాన్ని పెంచుతుందని తెలిసి కూడా పాలకవర్గాలు ఈ చర్యలను చేపడుతున్నాయి.
పెట్టుబడిదారీ అభివృద్ధికి, దాని సహజ సంక్షోభానికి, పేద దేశాలలో జరిగే భూ పరాయీకరణలకు ప్రత్యక్ష సంబంధం వుంటుంది. మన దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ పెట్టుబడిదారీ సంక్షోభం తీవ్రమవుతున్న ప్రతి సందర్భంలో భూములను పెట్టుబడిగా మార్చుకునే క్రమం, తద్వారా పెట్టుబడిదారీ సంక్షోభం నుంచి బయటపడే ప్రయత్నాలూ మనకు కనిపిస్తుంటాయి. అడుగడుగునా లక్షల ఎకరాల భూములను అత్యంత క్రూరమైన పద్ధతుల్లో స్వాధీనం చేసుకునే ఈ పెట్టుబడిదారీ వర్గం తన అనుకూల మేధావుల చేత దున్నేవానికే భూమి, వ్యవసాయ విప్లవం అన్న నినాదాలను, భూమిలేని పేద రైతుల కోసం భూమి పంచాలని అడగడాన్ని ఎగతాళి చేయిస్తూ వుంటుంది.
అభివృద్ధి పేరిట పాలకులు పరిశ్రమల కోసం, పెద్దపెద్ద నీటి ప్రాజెక్టుల కోసం, గనుల కోసం అంటూ గ్రామాలకు గ్రామాలను విస్తాపనకు గురిచేసి, ప్రజల జీవితాలను విధ్వంసం చేసిన దుస్థితిని మనం చూశాం. కార్పోరేట్ శక్తుల దోపిడీకి అనుకూలమైన అటవీ చట్టాలను, ఇతర చట్టాలను పార్లమెంటులో చేసుకుని లక్షల ఎకరాల ఫారెస్టు భూములను వారికి కట్టబెడుతున్నారు. ఇటీవలి కాలంలో సోలార్ ప్లాంట్ల కోసం పంట భూములను సైతం వదలకుండా "ఇర్రివోకబుల్ పవర్ అఫ్ అటార్నీ" లీజుల పేరుతో భూములపై అనేక విధాలుగా హక్కును పొందుతున్న పరిస్థితి వుంది. పెట్టుబడిదారీ శక్తులు రైతుల నుంచి భూమిని అతి తక్కువ ధరలకు సేకరించటం ద్వారా లేదా కౌలు పద్ధతిలో తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాయి. వ్యవసాయ రంగం నుంచి భూమిని ఇతర కార్పొరేట్ అవసరాలకు మళ్ళిస్తున్న క్రమంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పాలకులు ఇచ్చిన హామీలకు, కల్పించిన ఉద్యోగాలకు పొంతనే లేదు.
పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థ అభివృద్ధికి సంబంధించిన సమస్త అంశాలు భూకబ్జాల మీదనే - అంటే సాగు భూములు, బంజరు భూములు, అడవులు, ఖనిజాలు, సమిష్టి ఆస్తి వనరులను ఆక్రమించుకోవడంతోనే ముడిపడి వుంటుంది. ఈ క్రమంలోనే లక్షలాది ఎకరాల భూములను అభివృద్ధి పేరిట, సెజ్ ల పేరిట స్వాధీనం చేసుకోవడం వలన లక్షలాదిమంది రైతులు, రైతు కూలీలు, ఆదివాసీలు భూముల నుండి, జీవనోపాధుల నుండి పరాయీకరించబడ్డారు. జీవన విధ్వంసానికి బలవుతున్నారు. ఈ అభివృద్ధి నమూనా వల్ల ఏర్పడిన వాతావరణ సమస్యకు పరిష్కారంగా పాలకులు సోలార్ ఎనర్జీ ఉత్పత్తి పేరుతో లక్షలాది ఎకరాల ప్రభుత్వ, ప్రవేటు ను కార్పొరేటు దిగ్గజాలకు అప్పజెబుతున్నారు. గనులను ప్రైవేటీకరించి లాభాల కోసమే పనిచేసే గుత్త పెట్టుబడులకు అప్పజెప్పడం వలన మెజారిటీ ప్రజల జీవితాలు సంక్షోభంలోకి నెట్టివేయబడటమే గాక గోతులతో నిండిన డొల్ల భూములే మిగులుతాయి. 86 శాతం చిన్న రైతులే వున్న వ్యవసాయ రంగం నుండి వీళ్ళని వెళ్లగొట్టడానికి స్వేచ్ఛా మార్కెట్ పేరుతో వ్యవసాయ మార్కెట్ మొత్తాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెబుతున్నారు. ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తూ ప్రభుత్వ బ్యాంకుల నుంచి తీసుకున్న లక్షల కోట్ల రుణాలను రద్దు చేస్తున్నారు. పాలకుల ఈ దోపిడీ విధానాల వల్ల మెజారిటీ ప్రజల జీవన సంక్షోభం రోజురోజుకీ తీవ్రమవుతున్నది. ఈ అంశాలన్నింటినీ ఈ పుస్తకంలోని వ్యాసాలు స్పష్టంగా వివరిస్తాయి.
ఉత్పాదక శక్తుల చేతుల నుంచి భూమి కార్పొరేట్ల చేతికి పరాయీకరణ కావడం ఎన్ని రూపాల్లో జరుగుతుందో, దాని పర్యవసానాలేమిటో, లక్షలాది ఎకరాల భూముల నుండి రైతులను విస్తాపనకు గురి చేయడం వల్ల వారి జీవితాలు ఎలా సంక్షోభంలోకి నెట్టబడుతున్నాయో ఈ వ్యాసాల్లో ఆధారాలతో సహా ప్రొఫెసర్ తోట. జ్యోతీరాణి గారు స్పష్టంగా విశ్లేషించారు. అనేక సందర్భాల్లో రాసిన ఈ వ్యాసాలు జనశక్తి, క్లాస్ స్ట్రగుల్ (ఇంగ్లీషు) పత్రికల్లో అచ్చయ్యాయి. ఈ పుస్తకాన్ని అన్ని వర్గాల ప్రజల మధ్యకు తీసుకెళ్ళడం, ప్రచారం చేయడం ద్వారా రైతాంగ పోరాటాలకు ఉపయోగపడుతుంది.

- రైతుకూలీ సంఘం(ఆంధ్రప్రదేశ్, AIKMKS అనుబంధం) ఈ పుస్తకం గురించి విడుదల చేసిన పరిచయ వాక్యాలు



Read More
Next Story