రైల్వే స్టేషన్‌లో యాచకుడు.. రైతుగా ఎలా మారాడు?
ఆత్మగౌరవం ఎంత మార్పు తీసుకువచ్చిందో
‘ బాంచన్ దొరా ... జర పనియ్యండి...’ అని అడిగిన.
‘ కుంటోడ్నివి నువ్వేం పని చేస్తవ్‌రా, పోయ్ అడుక్కో పో..’ అన్నారు దొరలు .
వారికో దణ్ణం పెట్టి, నాంపల్లి టేషన్ కాడ నాలుగేండ్లు బిచ్చమెత్తి బతికినా... తరువాత సికింద్రాబాద్ స్టేషన్‌కి షిప్ట్ అయి మరో రెండేళ్లు అలాగే అందరి ముందు చేతులు చాచి బతికా...’ అని ఆగాడు యాద్గిరి.
అలా ఎంత కాలం ఇతరుల ముందు చేయి చాచి బతకాలి. సొంత గ్రామానికి వచ్చి ఎక్కడో గుట్టల కింద ముళ్ల పొదలతో బంజరు గా పడి ఉన్న తాతల నాటి తన నేలను వెతికి సాగులోకి తెచ్చాడు. ఆ విశేషాలే ఈ కథనం.
ఇద్దరం మామిడి చెట్ల కింద జొన్నరొట్టెలు తింటున్నాం. టిఫిన్ బాక్స్‌లో ఉన్న చికెన్ కర్రీ వడ్డించి ‘ మీరు వస్తున్నారని తెలిసి మా ఇంటామె చేసింది. తినండి సార్ ? మా దగ్గర కల్లు బాగుంటది తెప్పిద్దాం అనుకున్నా మీరు తీసుకుంటారో లేదో అని ఆగాను.’’ అని అన్నాడు . ఇద్దరం వరి పొలంలో పారుతున్న నీళ్లతో చేతులు కడుక్కున్నాం.
ఆ దృశ్యాన్ని కట్ చేస్తే...
ఇప్పుడు సిద్దిపేట శివారులో నాలుగెకరాలు భార్యతో కలిసి, కుంటుతూ వ్యవసాయం చేస్తున్నాడు. వరి పంటలను యంత్రాలతో హార్వెస్ట్ చేస్తున్నాడు. నాలుగెకరాల్లో వరి,మామిడి పండ్లు పండిస్తున్నాడు. పండ్ల వ్యాపారులకు పెట్టుబడి అయ్యాడు, నలుగురు కూలీలకు బతుకు తెరువయ్యాడు, ఊరికి విజయ కేతనమయ్యాడు. అదెలా జరిగిందో చదవండి...
ఇరవై ఆరేళ్ల క్రితం, మెదక్ జిల్లా ఖాతా గ్రామంలో చుట్టూ కరవు. వర్షాలు లేవు, వ్యవసాయం లేదు, పంటలు లేవు, బతకడానికి పనులు లేవు. ఇద్దరు పసి బిడ్డలు, భార్యకు అన్నం ఎలా పెట్టాలో కట్కూరి యాద్గిరికి అర్ధం కాలేదు. అవిటి తనం వల్ల అతడికి ఎవరూ పనిచ్చేవారు కాదు. అంగవైకల్యం అతడి జీవనోపాధికి శాపమయింది. ఊరుని వదిలేసి హైదరాబాద్ చేరుకొని యాచకుడిగా మారాడు. ఆరేళ్లు అలాగే బతికేశాడు... కానీ, ఏ పని చేయకుండా, ఎంత కాలమిలా అందరి ముందూ చేతులు చాచాలని, మానసిక సంఘర్షణకు లోనయ్యేవాడు.
ఏదో ఒకటి సొంతంగా పనిచేసుకోవడంలోనే తృప్తి ఉందని భావించాడు.
వెంటనే తన స్వగ్రామం ‘ఖాతా’ (నంగునూరు మండల్, సిద్ధిపేట ) కు వచ్చేశాడు.
భూమి కోసం వెతికాడు...
ఏనాడో తన తల్లికి సర్కారిచ్చిన రెండెకరాల భూమి ఉందని విన్నాడు, కానీ అది ఎక్కడ ఉందో కూడా తెలియదు. అధికారుల చుట్టూ తిరిగి, ఆ నేల సరిహద్దులు తెలుసుకున్నాడు.
కానీ దానిని చూడగానే అతడి భార్య గాబరా పడిరది. కొండరాళ్లతో ముళ్లకంపలతో దారీ తెన్ను లేక బంజరుగా పడి ఉన్న ఆ నేలను ఎలా చదును చేయాలో తోచక ఆ భార్యాభర్తలు ఆందోళన చెందారు. దానికి తోడు చుట్టుపక్కల వారు వారిని నిరాశపరిచారు. కాలు,చెయ్యి బాగున్నోళ్లే పొలం పనులు చేయలేకున్నారు, అవిటోడి ఎలా దున్నుతాడు అని హేళన చేశారు.
ఇవన్నీ తట్టుకోలేక ... అసలా భూమిని అమ్మేసి కిరాణా షాపు పెట్టుకుందామని యాదగిరి ప్రయత్నం చేశాడు. కానీ ఆ భూమిని కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఎందుకంటే, అది సాగుకు ఏమాత్రం అనువుగా లేదు,సాగునీరు లేదు.
అయినప్పటికీ యాదగిరి నిరాశ పడలేదు.
అదే సమయంలో ఆ ఊర్లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులు మొదయ్యాయి. సాధారణ కూలీగా జాబ్ కార్డు పొంది వికలాంగుల సంఘంలో చేరి వందరోజులు పని చేసి కొంత ఆదాయం పొందాడు. దాంట్లో కొంత పొదుపు చేసి, తన బంజరు నేలను తన భార్య పిల్లల సాయంతో చదును చేశాడు. 70 మామిడి మొక్కలను నాటి, కుండలతో నీళ్లు పోసేవాడు. కొమ్మలు విస్తరించ కుండా కట్ చేసి ఆకులను చెట్ల మొదళ్లలోనే వేసి సేంద్రియ ఎరువుగా మార్చేవాడు. ఒక బోరు వేస్తే పడలేదు. బావిని తవ్వడం మొదలు పెట్టాడు, సగం పని అయ్యాక రాయి తగలడంతో సగంలోనే ఆపేశాడు. అతని తపనను గుర్తించిన జిల్లా నీటియాజమాన్య సంస్థ ఆ బావిని మరింత లోతు తవ్వడానికి సాయపడ్డారు. ఎట్టి కేలకు బావిలో నీళ్లు పడ్డాయి. అక్కడే యాదగిరి జీవితం మలుపు తిరిగింది. నాలుగేళ్లలో మామిడి మొక్కలు, పండ్ల తోటలుగా మారాయి. మామిడి మొక్కలతో పాటు యాదగిరి బతుకు కూడా చిగురించింది.
అంతర పంటలుగా కూరగాయలు పండిస్తూ, రెండు పాడిప శువులను పెంచాడు. డ్రిప్ ఇరిగేషన్ చేస్తూ నీటిని పొదుపుగా వాడుతున్నాడు.
ఆదాయం పెరిగింది. పొదుపుగా ఖర్చు పెడుతూ పైసా,పైసా కూడబెట్టి రెండు ఎకరాలు కొన్నాడు. చిన్న పొదరిల్లు వంటి సొంత ఇంటిని సమకూర్చుకున్నాడు.
తన తోటను, పక్కనే ఉన్న పొలం అంతా చూపించాడు. పండిన ధాన్యాన్ని ట్రాక్టర్‌లోకి లోడ్ చేస్తూ ...
‘‘ ఈ బంజరు నేలను చూసి మొదట్లో భయపడ్డాకానీ, కొంత ధైర్యం కూడగట్టుకొని దానిని సాగులోకి తెచ్చాను. డ్రిప్ కోసం అధికారుల చుట్టూ ఎన్నోసార్లు తిరగాల్సి వచ్చింది. చివరికి నా పట్టుదలను,అవిటి తనాన్ని చూసి, మామిడి మొక్కలకు, బావికి, డ్రిప్‌కు ప్రభుత్వమే సాయం చేసింది. గత అయిదేళ్లుగా మామిడి పంట వస్తుంది. వరి రెండు పంటలు పండుతుంది. ఏడాదికి ఖర్చులన్నీ పోను 3 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. ఇద్దరు బిడ్డలు డిగ్రీ పూర్తి చేసి, సాగులో సాయం చేదోడుగా ఉన్నారు. ఇపుడు ఎవడి ముందూ తలవంచకుండా బతుకుతున్నాను.
నన్ను, నా అవిటి తనాన్ని హేళన చేసినోళ్లే ఇపుడు గౌరవంగా చూస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుండి ఎందరో అధికారులు, మీ లాంటి జర్నలిస్టులు నా వ్యవసాయాన్ని అధ్యయనం చేయడానికి వస్తున్నారు.’’ అన్నాడు చెమర్చిన కళ్లతో.
యాద్గిరి భార్య కూడా వికలాంగురాలే... పొద్దుపొడవక ముందే భార్యతో, చంకలో కర్రతో మోపెడ్ పై పొలం వైపు దూసుకు పోతుంటాడు. అతని లక్ష్యం, పోరాట పటిమకు వరి కంకులు వంగి సలాం చేస్తుంటాయి.