
అమెరికా గవర్నమెంట్ స్కూల్లో ఓ తరగతి గది
ఆ పాఠశాలలో 3500 మంది విద్యార్థులు చదువుతున్నారు. అక్కడ భోజనాలతో పాటు అన్నీ ఉచితం.
ఈ మధ్య వ్యక్తిగత అవసరాల నిమిత్తం రెండు వారాలు అమెరికా వెళ్ళాను. ఈ సందర్భంగా అట్లాంటాలో ఉన్న మిత్రురాలు రూపలతను కలిసాను. మేము ఇద్దరం హైదరాబాదులో సహోద్యోగులం. ఉపాధ్యాయులం కావడం వలన విద్యావ్యవస్థకు సంబంధించి ఆసక్తికరమైన చర్చ మా మధ్య చోటు చేసుకుంది. దానిని పాఠకులతో పంచుకుందామని ఈ వ్యాసం రచన.
అట్లాంటా జార్జియా స్టేట్ కు కాపిటల్ సిటి. జార్జియా అమెరికాలోని పెద్ద రాష్ట్రాలలో ఒకటి. నా స్నేహితురాలు దాదాపు ఇరవై యేళ్ళనుంచి అక్కడ గణిత బోధన చేస్తుంది. ప్రస్తుతం రూప అట్లాంటా నగరంలోని ఫోర్సిత్ (Forsyth) కౌంటీలోని లాంబెర్ట్ హైస్కూల్ లో పని చేస్తున్నది. కౌంటీ అంటే మన జిల్లా లాంటిది. ఆమె ఆహ్వానం మేరకు ఒక రోజు ఆ పాఠశాలకు వెళ్ళాను. అప్పటికే ఆమె విజిటర్స్ పాస్ తో నాకోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఆ పాఠశాలను 2009 లో స్థాపించారు. అది జార్జియా స్టేట్ లో ప్రథమ స్థానంలో ఉన్నది. తక్కువ సమయంలోనే ఆ స్థానానికి చేరుకున్నందుకు అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులను అభినందించాలి.
గణిత సమస్యలను వివరిస్తున్న టీచర్
నేను విరామ సమయంలో వెళ్ళాను. రెండు భోజన విరామాలుంటాయి. కారణం: ఆ పాఠశాలలో 3500 మంది విద్యార్థులు చదువుతున్నారు. అది ప్రభుత్వ పాఠశాల. భోజనాలతో పాటు అన్నీ ఉచితం. పాఠశాల పరిధిలో ఉన్న పిల్లలందరూ అడ్మిషన్ పొందవచ్చు. అందుకొరకు ఎలాంటి పరీక్షలూ ఉండవు. పాఠశాల పరిధిలో నివాసముండడమే ప్రధానం. ఏ కారణాల చేతనైన అడ్మిషన్ తిరస్కరించే అధికారం పాఠశాలకు ఉండదు. ఆ యా కౌంటీలో ఉన్న పాఠశాలలను బట్టి పాఠశాల పరిధిని ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. దాదాపు 300 మంది ఉపాధ్యాయులు ఉన్నారట. అందులో ఇద్దరు భారతీయులు. ఒకరు గుజరాతీ రూప తెలంగాణ. నేను రెండో భోజన విరామం సమయంలో వెళ్ళాను. అన్ని విధాలుగా అది తగిన సమయం. ముందుగా పాఠశాల మొత్తం తిరిగి చూసాము. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉన్నాయి. బయటి వ్యక్తులు ఎవ్వరూ లోపలికి ప్రవేశించలేరు.
300 గదులతో, పెద్ద పెద్ద వరండాలతో ఉన్న విశాలమైన భవనం. క్రీడా సాంస్కృతిక ప్రాంగణాలతోపాటు భోజనాల హాలు, స్టేషనరీ గదులు, గ్రంథాలయం ఉన్నాయి. సాంస్కృతిక ప్రాంగణంలో పాఠశాలేతర కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మన బతుకమ్మ పండుగను అక్కడ నిర్వహిస్తామని రూప చెప్పింది. పాఠశాల వరండాలలో ఆ పాఠశాల సాధించిన విజయ చిహ్నాలు ( ట్రోఫీలు, షీల్దులు ) ఉన్నాయి.పాఠశాల లోనికి ప్రవేశించగానే కొంతమంది ఉపాధ్యాయుల ఫోటోలు వారి వివరాలతో పాటు కనిపించాయి. పరిశీలించి చూస్తే 'Teacher of the year' అని ప్రతి ఫోటోకింద వారి వివరాలతోపాటు రాసి ఉంది. ఆ ఏడాదిలో అత్యుత్తమంగా పనిచేసిన టీచరుకు దక్కిన గౌరవం అది. ఆ పద్ధతి ఉపాధ్యాయులకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
స్కూలు ముందు రచయిత్రి పైడిమర్రి గిరిజ
నేను వెళ్ళినప్పుడు కొంతమంది విద్యార్థులు గ్రంథాలయంలో ల్యాప్ టాప్ లలో చదువుకుంటున్నారు. కొందరు విద్యార్థులు వరండాలో తింటున్నారు. అక్కడక్కడా కొంతమంది ఉపాధ్యాయులు కూడా వాళ్ళతో కలిసి భోంచేసున్నారు. రూపకు కూడా వారంలో రెండు రోజలు తనకు లంచ్ డ్యూటీ ఉంటుందని చెప్పింది. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు విడి విడిగా శౌచాలయాలున్నాయి. అది నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు విడిగా శౌచాలయాలు ఉండకూడదు. అలా ఉన్న చోట్ల అధికారులు ఆక్షేపించడం, వార్తా పత్రికలు, TV ఛానల్ దానిని ప్రత్యేకంగా ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి. ( నేను చూసింది కూడా అమెరికా ప్రభుత్వ పాఠశాల). ప్రాంగణమంతా తిరిగి చూసి, ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ముగించుకొని నా స్నేహితురాలి గదికి చేరుకున్నాము.
స్కూలు లోపలి భాగం
గది అన్ని సౌకర్యాలతో ఉన్నది. అక్కడ ఒక్కొక్క టీచరుకు ప్రత్యేక గది ఉంటుంది. విద్యార్థులు అక్కడికే వస్తారు. వాళ్ళకోసం కుర్చీలు, బల్లల ఏర్పాటు ఉంటుంది. మేము వెళ్ళిన పది నిమిషాలకు గంట మోగింది. అప్పుడు విద్యార్థులు ఒక్కొక్కరుగా గదిలోకి వచ్చారు. మొత్తం 24మంది. వివిధ దేశాలకు చెందిన పిల్లలున్నారు. తరగతికి అత్యధికంగా 30 మంది
విద్యార్థులు ఉంటారు. ఉన్నత పాఠశాలలో 9-12 తరగతులు ఉంటాయి. విద్యార్థులు గదిలోకి రావడానికి ముందు ఒకరిద్దరు విద్యార్థులు వచ్చి తమ సందేహాలను నివృత్తి చేసుకొని వెళ్ళారు.
ఫైర్ డ్రిల్ లో ప్లే కార్డుతో టీచర్
12. వ తరగతి విద్యార్థులకు బోధన. హాజరు తీసుకోవడంతో మొదలైంది. అంతా కంప్యూటర్ లోనే... టీచర్ పేరు పిలవగానే... మేడం, టీచర్, లాంటి గౌరవవాచకాలేవీ లేకుండా ' here ' అని చెప్పారు. ఎవరికి అనుకూలమైన పద్ధతిలో వాళ్ళు కూర్చున్నారు. ఒత్తిడిని ఎదుర్కొనడానికి కాబోలు ఒకరిద్దరు ఏవో చిరుతిళ్ళు ( చాక్లెట్స్, చిప్స్ లాంటివి )తింటున్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో బోధన సాగింది. రూప చిన్న లాప్ టాప్ ను చేతిలో పెట్టుకొని, తరగతి అంతా తిరుగుతూ, మధ్యమధ్యలో విద్యార్థు లను ప్రశ్నిస్తూ బోధిస్తూ ఉన్నది. గదిలో గోడకు ఏర్పాటు చేసిన పెద్ద కంప్యూటర్ స్క్రీన్ ను అవసరమైనపుడు ఉపయోగించుకొని వివరించింది. తెల్లవారి వాళ్ళకు పరీక్ష ఉందట. ప్రతి యూనిట్ తరువాత పరీక్ష ఉంటుంది. ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రాజెక్టులు విద్యార్థులు విధిగా చేయాలి. ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయులే గ్రేడులు నిర్ణయిస్తారు. ఇక్కడి లాగా ప్రత్యేక మూల్యాంకన విధానం ( spot Valuation ) అక్కడ లేదు. ఇంతలో బోధన మధ్యలో ఒక గంట మోగింది. అప్పుడు విద్యార్థులందరూ తరగతి గదిలో నుంచి పాఠశాల ప్రాంగణంలోకి వెళ్ళారు.
ఖాళీ తరగతి గది
ఆ రోజు Fire Drill ఉందట. అగ్నిప్రమాదం సంభవిస్తే తప్పించుకునే విధా నాన్ని చూపించడం అన్నమాట. ఇది నెలలో రెండుసార్లు ఉంటుంది. ప్రతి టీచర్ తన పేరును సూచించే ఫ్లైకార్డును పట్టుకొని తన విద్యార్థులతో పాటు తరగతికి దూరంగా విశాలమైన చోటుకు రావలసి ఉంటుంది. కార్డులో ఆకుపచ్చని రంగు చూపితే ఆ అరగతిలోని విద్యార్థులు అందరూ బయటకు వచ్చారని సంకేతం. ఎరుపు రంగు చూపితే అందరు రాలేదనే సంకేతాన్ని సూచిస్తుంది. వైస్ ప్రిన్స్ పాల్ అన్ని యూనిట్లను పర్యవేక్షిస్తారు. పది నిముషాల అనంతరం మళ్ళీ గంట మోగగానే తిరిగి తమ గదులలోకి వెళ్ళిపోయారు. బోధన కొనసాగింది.
ఫైర్ డ్రిల్ నిమిత్తం బయటకు వెళుతున్న విద్యార్థులు.
ప్రతి పీ రియడ్ వ్యవధి యాభై నిమిషాలు. వయసుతో సంబంధం లేకుండా స్థాయిని బట్టి తరగతి ఉంటుంది. అంటే పన్నెండో తరగతి వయసు విద్యార్థులకు డిగ్రీస్థాయి గణితాన్ని బోధిస్తుంది రూప. దానిని smart class అంటారట. ఇలాంటి తరగతికి ఒక్క టీచరే ఉంటుంది. కానీ కిందిస్థాయి విద్యార్థుల బోధనకు ( చదువులో వెనకబడిన ) తరగతికి ఇద్దరు, అవసరమైతే ముగ్గురు ఉపాధ్యాయులు కూడా ఉంటారట. అక్కడ ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ పెడతారు. ఇక్కడ మన విద్యావిధానంలో కార్పొరేట్ విద్యాసంస్థలు ఈపద్ధతిని కొంత అమలుపరుస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ తరగతికి ముగ్గురు ఉపాధ్యాయులను ఇవ్వడం అటుంచి ఆ ముగ్గురు చేయాల్సిన పనిని ఒక్కరిచేతనే చేయించడం జరుగుతుంది. అందువల్ల అది వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. ఇకపోతే ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విధానం అమలుచేయడం అసాధ్యం. ఎందుకంటే ఇక్కడ కొన్నిసార్లు సబ్జెక్టుకు ఒక్క టీచరు ఉండడమే కష్టం.