చుక్క నెత్తురు చిందకుండా గంగవరం పోర్టు కార్మికుల సమ్మెని   ఆపారా?
x

చుక్క నెత్తురు చిందకుండా గంగవరం పోర్టు కార్మికుల సమ్మెని ఆపారా?

తలకు 27 లక్షల రూపాయల నష్ట పరిహారంగా ఇచ్చి వారిని శాశ్వతంగా ఉద్యోగాల నుండి తొలగించడానికి ఒప్పందం కుదిరిందని తెల్సింది.


-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)


గంగవరం పోర్టు కార్మిక సమ్మె విరమణ వార్త తెల్సింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గంగవరం, దిబ్బపాలెం వంటి నిర్వాసిత గ్రామాల ప్రజల నుండి ఒకటిన్నర దశాబ్దం క్రితం ఐదున్నర వందల మంది పోర్టు వర్కర్లని రిక్రూట్ చేసిన విషయం తెల్సిందే. ఓవైపు నిర్వాసిత ప్రజల RR ప్యాకేజి వంటి సమస్యలు, మరోవైపు పైన పేర్కొన్న తాత్కాలిక కార్మికుల ఉద్యోగ భద్రత, జీత భత్యాల వంటి సమస్యలు కలిసి సమరశీల సంఘటిత సమ్మెకి దారితీసింది.

సమ్మెకు కారణాలు


గంగవరం పోర్టు నిర్మాణం జరిగినపుడు వారు తమ భూముల్ని కోల్పోయారు. ఇళ్లు కోల్పోయారు. చేపల వృత్తిని కోల్పోయారు. అక్కడ అడ్డుగోడలతో తమ ఇష్టమైన సముద్రాన్ని కోల్పోయారు. ఆనాడు తమ ప్రాణార్పణలతో సాధించుకున్న కనీస ఫలాలు, ఫలితాలు అనుభవించడంలో విఫలమయ్యారు. కనీసం RR ప్యాకేజి సైతం నేటికీ అమలు కాలేదు. పైగా పర్యావరణం దెబ్బతిని రకరకాల జబ్బులు, రోగాల బారిన పడుతున్నారు. ఇది ఒక ఎత్తు! వారి బిడ్డలైన పోర్టు కార్మికుల విషాధ చరిత్ర మరో ఎత్తు!

చేపలవృత్తిని కోల్పోయారు. పొట్టచేత పట్టుకొని యువత సుదూర ప్రాంతాలకు వలస వెళ్ళింది. మిగిలిన కొద్ది శాతం యువకుల్ని UN-SKILLED వర్కర్లుగా నాసిరకం జీతాలతో నియామకం చేసింది. దాంతో ఓ 550 మంది కార్మికులు 14 ఏళ్ళ క్రితం గంగవరం పోర్టులో అడుగు పెట్టారు. వారికి నాడు నిర్ణయించిన ₹3600 బేసిక్ జీతం నేటికి మారలేదు. నాటి యాజమాన్యం నియమించిన వర్కర్లు తమ కంపెనీ వర్కర్లు కాదనే వైఖరిని నేడు ఆదానీ కార్పోరేట్ కంపెనీ తీసుకుంది. నిటి సమరశీల సమ్మెకి దారి తీసిన మూల కారణమిదే!


ఒప్పందం ఏమిటి?

తలకు 27 లక్షల రూపాయల నష్ట పరిహారంగా ఇచ్చి వారిని శాశ్వతంగా ఉద్యోగాల నుండి తొలగించడానికి ఒప్పందం కుదిరిందని తెల్సింది. దీనితో ఆదానీ కార్పోరేట్ కంపెనీకి ఆ స్థానిక కార్మికుల "ప్రమాదం" శాశ్వతంగా తొలగిపోయింది. అందుకై విశాఖ జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు గత రెండు రోజుల నుండి చాలా రకాల అష్టకష్టాలు పడినట్లు కూడా తెల్సింది. ఔను, ఆదానీ కోసం కదా!

ఈ ఒప్పందం ఎవరు చేశారు? నష్టపరిహారం కార్మికుల వరకు పరిమితమా? ఒప్పందంలో నిర్వాసిత గ్రామాల బాధిత ప్రజల RR ప్యాకేజీ వంటి సమస్యలు వున్నాయా? ఈ వివరాలేవీ తెలియదు.

వివరాలు తెలియకుండా సమగ్ర వ్యాసం రాయడం సాధ్యం కాదు. ఒకటి మాత్రం నిజం. ఇదే నిజమైతే, స్థానిక ప్రజల మీద ఆదానీ కార్పెరేట్ కంపెనీ యుద్ధమిది. స్థానికత పై యుద్ధమిది. తరతరాలుగా నివసిస్తున్న ఏ గ్రామాల్ని వెళ్లగొట్టి గంగవరం పోర్టు నిర్మాణం జరిగిందో, ఆ మూలవాసులకు పోర్టులో స్థానం మిగలనివ్వని కార్పోరేట్ల వ్యూహాత్మక విధానంలో భాగమిది. ఈ వ్యూహం వెనక కార్పొరేట్లకు నిర్దిష్టమైన అవగాహన ఉంది. స్థానికతకు బలం ఉంటుంది. సంఘటిత శక్తి వుంటుంది. కార్మికవర్గ సమీకరణకు అదో ఆయుధం వంటిది. దానిని లేకుండా చేసే పెట్టుబడిదారీ వర్గాల వ్యూహంలో ఇదొక భాగమే.

అనేక వరస ఓటములు, ఎదురు దెబ్బలు, చేదు అనుభవాలు, రాజకీయ పరాభవాల క్రమంలోనే కార్మికవర్గం తన స్వంత వర్గ చైతన్యం పొందుతుంది. సమ్మె చేసిన కార్మికవర్గానికి ఈ ఒప్పందం రాజకీయ ఓటమిని మిగిలించింది. అదే సమయంలో ఆర్ధిక ఫలితాన్ని చేకూర్చింది.

స్ధానిక ప్రజల నుండి రిక్రూటైన గంగవరం పోర్టు కార్మికవర్గం తన ఉనికినే కోల్పోతుంది. అదే సమయంలో దానికి తాత్కాలిక ఆర్ధిక ఫలితం లభిస్తుంది. ఆ రాజకీయ ఓటమి వల్ల పొందే నష్టంతో పోల్చితే, ఆర్ధిక ఫలితం నూరో వంతు కూడా ఉండదు. ఐతే ఆర్థికవాద ధోరణుల నుండి కార్మికవర్గం బయటపడాల్సి ఉంది. ఇలాంటి ఓటముల నుండి గుణపాఠాలు తీసుకొని మున్ముందు పురోగమించి తీరుతుందని ఆశిద్దాం.




Read More
Next Story