‘తరవాణి’ కమ్మనైన తెలుగు పానీయం, తరవాణి అంటే ఏంటో తెలుసా?
x

‘తరవాణి’ కమ్మనైన తెలుగు పానీయం, తరవాణి అంటే ఏంటో తెలుసా?

మండువేసవిలో ఇంటికి ఎవరైనా వస్తే కుండలోనుంచి చల్లటి తరవాణి ఇచ్చేవారు. నిప్పులు చెరిగే ఎండలో వచ్చిన వారికి తరవాణి అమృత ప్రాయంగా అనిపించేది.


పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలో వున్న మావూరు కవిటం, మా ఇల్లు, మా పలపదొడ్డి ఒక అంతులేని జ్ఞాపకాల నిధి. వాటి గురించి రాస్తున్నకొద్దీ అలనాటి జ్ఞాపకాలు దొంతరు దొంతర్లుగా కళ్ళముందు ప్రత్యక్షం అవుతాయి. ఆ రోజులే వేరు. ఆ నాటి పరిస్థితులే వేరు.

ఆ నాటి మనుషులు, వారి అభిమానాలే వేరు. అలాంటి చోట పుట్టిన వారు, వాటిని చవిచూస్తూ పెరిగిన వారు మాత్రమే ఆ మధుర స్మృతుల్ని అర్థం చేసుకోగలరు. ఆ అరుదైన జ్ఞాపకాల అనుభూతుల్లో కొన్నింటినైనా మీతో పంచుకోడానికి ప్రయత్నిస్తాను.
మా వూరిలో పాడి పంటలు ఎంతో సమృద్ధిగా వుండేవి.
ఏ ఇంటిలోనూ లేమి కనిపించేది కాదు. వున్నంతలో అంతా సంతోషంగానే కనిపించేవారు. రేపు ఎలా అన్న దిగులు వారిలో కనిపించేది కాదు. స్తోమతల్లో , కుటుంబ సభ్యుల సంఖ్యలో కాస్త తేడాలుండచ్చేమో గానీ ఎవరిలోనూ పొరపొచ్చాలు వుండేవికావు. ఏ కుటుంబంలోనైనా వయసు మీరిన వారు కాలం చేస్తే మిగతా వారు వారికి ఎంతో కొండంత అండగా నిలిచేవారు. ఎంతో ధైర్యం చేప్పేవారు. అన్ని పనులు భుజాన వేసుకుని మేమున్నామంటూ ధైర్యం చెప్పేవారు.
ఎవరింట్లోనైనా పెళ్ళిళ్ళు పేరంటాలు వస్తే ఇంక వారి సంబరాలు అంబరాన్ని తాకేవి. తమ ఇంట్లోనే జరుగుతున్నట్టుగా ఎంతో హడావుడిగా వుండేవారు. ఆ రోజుల్లో సాధారణంగా అన్నీ ఉమ్మడి కుటుంబాలే. తాతలు బామ్మలు, కొడుకులు కోడళ్ళు, మనుమలు మనవరాళ్ళతో ఇళ్ళు ఎంతో సందడిగా, నిత్యకోలాహలంగా కళకళలాడుతూ కనిపించేవి. అంతేకాదు, ప్రతి బాధ్యతనీ ఇంట్లో పెద్దా చిన్నా సమిష్టిగా పంచుకునే వాళ్ళు. అందుకు నిలువెత్తు నిదర్శనం మా ఇల్లు.



గానుగ


ఇందుకు ఒక ఉదాహరణ చెబుతాను. అది కొబ్బరి కాయల్ని కొట్టి గానుగలో నూనె ఆడించడం. అందుకోసం వందల సంఖ్యలో కొబ్బరి కాయల్ని కొట్టేవాళ్ళం. మా ఇంట్లో అదొక యజ్ఞంలా సాగేది.

పలపదొడ్డి లో కొబ్బరి చెట్లు ఉండేవి. అలాగే మా ఇంటి ఆవరణలో కూడా కొబ్బరి చెట్లు వుండేవి.ఇప్పటికీ వున్నాయి. కాయలు బాగా ముదిరాకా చెట్లనుంచి తీయించేవారు. ఒక 10,12 రోజులు బాగా ఆరాక వాటిని పలప దొడ్డి ఇంట్లో అటక మీద భద్రం చేసేవారు. అలా వేసవి కాలం వచ్చేవరకు పోగు పడిన కాయల్ని అటక మీద నుంచి దింపి తొక్క వలిపించి కాయలను ఇంటికి తెచ్చేవారు.
ఆ కాయలన్నీ కోబ్బరి నూనె కోసమే.
వలిచిన కొబ్బరి కాయలు వందల సంఖ్యలో పెద్ద గుట్టగా పాలేళ్ళు పోసేవారు. త్వరత్వరగా పనులు ముగించుకుని పెద్దాచిన్నా ఇంటి వీధి అరుగుల మీదకు చేరుకునేవాళ్ళం. ఒక అరుగు మీద మధ్యలో పెద్ద ఇత్తడి బిందె పెట్టేవారు. అది కొబ్బరి నీళ్ళకోసం. కిలుము ఎక్కకుండా ఆ బిందె లోపల కళాయి పూత వుండేది.
ఇంక యుద్ధ ప్రాతిపదికన అరుగు అంచులమీద కొబ్బరికాయల్నికొట్టి కొబ్బరి నీళ్ళు ఆ బిందెలో వంపే వాళ్ళం. అయినా నీళ్ళు కింద వలికేవి. అవి ధారగా కారకుండా అరుగుల మీద కొబ్బరి పీచులు పరిచేవారు.
మేము, అదేనండీ, మా పిల్ల గ్యాంగ్, పోటీలు పడి కొబ్బరి కాయల్ని కొట్టే వాళ్ళం. మా దృష్టి అంతా ఆ బిందె మీదే వుండేది. గ్లాసు గ్లాసు గా ఆ కొబ్బరి నీళ్ళు ఎప్పుడు తాగుతామా అని వుండేది. పెద్దవాళ్ళు చూడకుండా చిన్నచిన్న కొబ్బరి ముక్కల్ని నోట్లో వేసుకునే వాళ్ళం.
మా చిన్నతనాల్లో పెద్దల్తో సమానంగా కొబ్బరి కాయల్ని కొట్టడం ,కొబ్బరి నీళ్ళు తాగడం, కొబ్బరి ముక్కల్ని నమలడం ఎంతో సరదాగా వుండేది. కొబ్బరి కాయలు కొట్టే ప్రహసనం అయిన తరువాత కొబ్బరి చెక్కల్ని గుడ్డ తో తుడిచి, ఎండలో పెట్టేవారు.
చెక్కల్ని తుడవాలి లేకపోతే రంగు మారిపోతాయి.
కాకులు ఎత్తుకు పోకుండా వల కప్పేవారు. లేకపోతే తాడుకి రెండు నల్ల గుడ్డలు కట్టే వారు. అవి గాలికి కదులుతోంటే భయపడి కాకులు వచ్చేవి కావు. రెండుమూడు రోజులు ఎండిన తర్వాత చెక్కల లోంచి కొబ్బరిని వేరు చేసి సన్నగా ముక్కలుగా తరిగి మళ్ళీ ఎండపెట్టే వారు. ముక్కలు పెళుసుగా మారాక గానుగ కి పంపేవారు.

గానుగకి పంపేవరకూ మా చిరుతిండికి ఢొకా వుండేదికాదు. కాకుల కన్నా మేమే ఎక్కువగా కొబ్బరి ముక్కల్ని ఎత్తుకు పోయి తినేవాళ్ళం. "తినకండిరా వెధవల్లారా, తెగతింటే దగ్గు పట్టుకుంటుంది" అని పెద్దలు కేకలేసేవాళ్ళు.
గానుగ ఆడాక ఆ కొబ్బరి నూనె ఎంతో తాజాగా కమ్మని వాసన వేసేది.
రెండు మూడు రోజులు కొబ్బరి నూనెతోనే వంటలు చేసే వారు. నర్సాపురం లోని మా అత్తయ్యకీ, మా అమ్ముమ్మా వాళ్ళకీ కొబ్బరినూనె పంపించే వాళ్ళు. గానుగ ఆడాక వచ్చే ఆ కొబ్బరి పిండిని కూడా మేము వదిలే వాళ్ళం కాదు. సాధారణంగా ఆ పిండిని నానపెట్టి, పాలిచ్చే గేదెలు ఆవులు కీ పెట్టేవారు.
అసలు గానుగ అంటే ఏమిటో, అది ఎలావుంటుందో ఈ కాలం కుర్రకారుకి తెలుసా? ఆ మాటకి వస్తే అసలు బస్తీ భాయీలు ఎంత మంది గానుగని చూసి వుంటారు? నాకు సందేహమే సుమండి?!
కానీ మేము ప్రత్యక్షంగా చూసాం . మా చిన్నతనాల్లో మా సరదా కొద్దీ గానుగ దగ్గర గంటలకొద్దీ పడివుండేవాళ్ళం. ఎద్దు గుండ్రంగా తిరుగుతూంటే ఆ కాడ మీద కూచునే వాళ్ళం. అప్పటి మా అనుభవాలే వేరు. అలాంటి రోజులు మళ్ళీ రావు. గానుగ అన్నది ఒక పెద్ద చెక్క రోలు. దానికి ఒక పొడుగాటి చెక్క పొత్రం వుంటుంది.
పొత్రం చివర సూదిగా సన్నని భాగం, దాని చివర బోర్లాగా ఒక ఇనుప కప్పు వుంటుంది. దాని నుంచి ఒక ఇనుప రాడ్ కింద వున్న ఒక బల్ల కి కనెక్ట్ చేసి ఉండేది. ఆ బల్ల గానుగ రోలు వైపు Y ఆకారంలో ఉండి దానికి ఇంకొక వైపు ఎద్దును కట్టడానికి వీలుగా వుండేది.
ఆ రోలు నిండా కొబ్బరి ముక్కలు పోసేవారు.ఆ తర్వాత ఎద్దుని అదిలిస్తే అది ఆ పాకలో గుండ్రంగా తిరుగుతూంటే కొబ్బరి ముక్కలు రోకలి కింద బాగా నలిగి రోలులో వున్న రంధ్రం లోనుంచి కొబ్బరి నూనె ధారగా కింద బాల్చీలోకి కారేది. రోలులోవున్న మొదటి ధపా నలిగిన కొబ్బరి ముక్కల్ని అటూ ఇటూ తిప్పేవారు.అవికూడా నలిగి ముక్కల్లో ఇంకా మిగిలివున్న నూనె చుక్కలు చుక్కలుగా కింద వున్న పాత్రలో పడేది. బాగా నలిగిన కొబ్బరి పిండి రోలులో అచ్చుల్లా కట్టేది. ఆ అచ్చుల్ని బైటికి తీసి కొత్త కొబ్బరి ముక్కల్ని వేసి గానుగ తిప్పేవారు. ఇదీ టూకీగా గానుగ పనిచేసే విధానం. ఇప్పుడు ఎద్దులకు బదులు మోటారు అమర్చి గానుగల్ని నడుపుతున్నారు.
ఇదే విధగా నువ్వుల్ని కూడా ఆడి నువ్వుల నూనె తీసేవాళ్ళు.రోలులో కట్టే అచ్చుల్ని తెలగ పిండి అంటారు.ఇదొక ముఖ్యమైన వంటకం కూడా. దీనిలో చాలా విలువైన పొషక పదార్థాలు వుంటాయి. ప్రొటీన్లు చాలాఎక్కువ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. తెలగపిండి రుచి ఎంతో కమ్మగా వుంటుంది. అనేక కూరల్ని తెలగ పిండితో కలిపి వండుతారు. ఆనపకాయ, బీరకాయ , పొట్లకాయ, గోరుచిక్కుడు కాయ తెలగపిండితో కలిపి వండుతారు. వాటి రుచే వేరు. తింటేకానీ ఆ రుచి తెలియదు. బాలింతలకు పాలు పడటానికి వెల్లుల్లి తో తెలగపిండి కూర పెడతారు. ఇతర రాష్ట్రాలలోని పట్టణ వాసులకు ఇవి అరుదైన వంటకాలనే చెప్పాలి.
చెన్నైలో మా పై ఫ్లాట్ లో కాపురం వుంటున్న తమిళ పొన్ను ని ఈ తెలగపిండి గురించి అడిగితే "అంకుల్, మేము ఎప్పుడూ రుచిచూడలేదు కానీ మా పాటి (బామ్మ) దీని గురించి చెబుతూ వుండేది. ఒకసారి దీనితో చేసిన పొరియల్ని(కూర)
తిన్నట్టు జ్ఞాపకం. అయినా ఇవన్నీ పల్లెటురివాళ్ళు తింటారు అంకుల్" అంది నవ్వుతూ .

తెలుగు వాళ్ల కమ్మనైన సమ్మర్ డ్రింక్

ఇది ఇలా వుండగా, పట్టణాల సంగతి పక్కన పెడితే , పల్లెటూళ్ళలో సైతం దాదాపుగా అంతరించి పోతున్న ఒక అరుదైన పానీయం గురించి మీకు జ్ఞాపకం చేయాలి. దానిపేరు
" తరవాణి".
ఆ పేరు ఎప్పుడైనా విన్నట్టుగా అనిపిస్తోందా? మా చిన్నతనాల్లో దాదాపుగా అందరి ఇళ్ళల్లోనూ వేసవి కాలంలో తరవాణిని తయారు చేసేవారు. అదొక అద్భుతమైన పానీయం.
మండువేసవిలో ఇంటికి ఎవరైనా వస్తే కుండలోనుంచి చల్లటి తరవాణి ఇచ్చేవారు. నిప్పులు చెరిగే ఎండలో వచ్చిన వారికి తరవాణి అమృత ప్రాయంగా అనిపించేది. ఎక్కడి అలసట అక్కడ మాయమయ్యేది. అంత అద్భుత పానీయం ఈ తరవాణి.
ఇంతకీ ఈ తెలుగు వారి అమృత పానీయాన్ని ఎలా తయారు చేస్తారో, దాని గొప్పదనం ఏమిటో చెబుతాను.
వుడుకుతున్న అన్నం నుంచి వార్చిన గంజిని కుండలో పోసి, రుచి కోసం తగినంత వుప్పు కలిపి, సువాసన కోసం దబ్బాకులు వేసేవారు . మా పెరటిలో వంటింటి గుమ్మం పక్కనే ఓ దబ్బచెట్టు వుండేది. దాని ఆకుని నలిపి వాసన చూస్తే ఎంతో అద్భుతమైన సువాసన వేసేది. వేసవిలో చల్లటి మజ్జిగ లో కూడా ఈ దబ్బాకుల్ని తుంపి వేసేవారు. ఆ మజ్జిగ ఎంతో సువాసనలు వెదజల్లుతూ తాగుతూంటే ఎంతో బావుండేది. ఈ చెట్టు కు కాసే దబ్బ కాయలతో వూరగాయ పెడతారు. పెరుగు అన్నంలో ఆ దబ్బకాయ పెచ్చు నంచుకు తింటూంటే భలే రుచిగా వుండేది. అది ఎంతో పులుపు చిచ్చు. దబ్బకాయలో సి విటమిన్ పుష్కలంగా వుంటుంది.
మా చిన్నతనాల్లో దబ్బకాయతో పులిహోర కూడా చేసేవాళ్ళు. దాని రుచి ఎంతో మజాగా వుండేది. నేను తరవాణి తయారీ గురించి మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళి పోతున్నాను సారీ.
సరే ఆ కుండలో దబ్బాకులు వేసి వంటింట్లో ఓ మూల కుదురుమీద కుండ పెట్టి, దాన్ని మూతమూసి వాసెన కడతారు. కుండ లోపల వున్న గంజి క్రమేపీ పులుస్తుంది.ఫెర్మెంట్ అవుతుందన్నమాట.
తరవాణి, పూర్తిగా, విటమిన్లు ముఖ్యంగా బి విటమిన్ కలిగిన ఆహారం. బియ్యం కడిగిన నీళ్ళు అన్నం ఉడుకు తోండగా వార్చితే వచ్చే గంజి టూకీగా దీనికి కావలసిన పదార్థాలు.
బియ్యం పైపొర లో విటమిన్ బి ఉంటుంది.
తరవాణీ బహుశా ముందు గా మెదలు పెట్టేటప్పుడు కుండ లో ఒక వారం రోజులు కదపకుండా ఉంచేవారని విన్నాను. రాత్రి మిగిలిన అన్నాన్ని ఆ కుండలో వేసేవాళ్ళు.
మర్నాడు ఆ అన్నాన్ని గట్టిగా పిండి దానిలో ఏదో వూరగాయ లేదా పెరుగు కలుపుకుని చద్దెన్నం తినేవారు.ఆ తరువాత కుండలో పైకి తేరిన తేటని తాగేవాళ్ళు.ఆ పలుచని నీళ్ళలాంటి ఆ తేటే "తరవాణి".
మండు వేసవిలో ఓ గ్లాసుడు ఈ తరవాణి తాగితే ఎంతో చలవ చేస్తుంది. ఆ తరవాణి కుండని అలా రోజుల తరబడి వుంచితే లోపల ద్రవం బాగా ఫెర్మెంట్ అవుతుంది.
నాటి తరవాణి ఒకవిథంగా ఈనాటి బీర్ లాంటిది అని చెప్పవచ్చేమో. ఈసారి వేసవిలో నేను మావూరు కవిటం వెళ్ళినప్పుడు ఎవరైనా ఇళ్ళలో తరవాణి ని ఇంకా తయారు చేస్తున్నారేమో కనిపెట్టాలి.ఎవరింట్లోనైనా వుందని తెలిస్తే మాత్రం అస్సలు మొహమాట పడను సుమండీ! మీకు అంతగా దాని మజా తెలుసుకోవాలని వుంటే రండి మా వూరు కవిటం తీసుకు వెడతాను!


Read More
Next Story