హైదరాబాద్ చరిత్రని కళ్ల ముందు నిలబెట్టే హెరిటేజ్ వాక్...
x
హైదరాబాద్ లో హెరిటేజ్ వాక్

హైదరాబాద్ చరిత్రని కళ్ల ముందు నిలబెట్టే హెరిటేజ్ వాక్...

హైదరాబాద్ హెరిటేజ్ వాక్ లో మీరు పాాల్గొనాలనుకుంటున్నారా, అయితే, ఇది చదవండి



ప్రపంచ వారసత్వ దినాన్ని పురస్కరించుకొని హైదరాబాదులోని డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్టు హైదరాబాదు హెరిటేజ్ వాక్ ను నిర్వహించింది. ఆర్క్యలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా - హైదరాబాద్ సర్కిల్, తెలంగాణా రాష్ట్ర టూరిజం డెవలెప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ , ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాదు సంస్థల సాంగత్యంతో అది ఏర్పాటైంది.

ఏప్రిల్ 18 తేదీని ప్రపంచ వారసత్వ దినంగా ( World Heritage Day) ఐక్య రాజ్య సమితి ప్రకటించింది. 1982 ఏప్రిల్ 18వ.తేదీన ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ పురాతన కట్టడాలు, స్థలాలు పరిరక్షణ సమితి సంయుక్తంగా ఆఫ్రికాలోని ట్యునీషియా ప్రాంతంలో సమావేశమయ్యాయి. ఆ సమావేశంలో పాల్గొన్న వివిధ దేశాల ప్రతినిధులు పలు అంశాలు చర్చించి, ప్రపంచ వారసత్వ సంపదను కాపాడడానికి చేయవలసిన కార్యక్రమాలు, పనులు, సలహాలు, సూచనలతో కూడిన ప్రతిపాదనలు ఐక్యరాజ్య సమితికి సమర్పించారు. అందుకే సదస్సు జరిగిన ఏప్రిల్ 18 వ. తేదీనే ఏడాది తరువాత ప్రపంచ సారస్వత దినంగా ఐక్య రాజ్య సమితి ప్రకటించడం జరిగింది.



ముందుగా డెక్కన్ హెరిటేజ్ ట్రస్టు చైర్మన్ శ్రీ ఎం . వేదకుమార్ గారు మాట్లాడుతూ.. హైదరాబాదు చారిత్రక వైశిష్ట్యాన్ని చెప్పి, వారసత్వ సంపద పరిరక్షణ కొరకు తమ సంస్థ చేస్తున్న కృషిని వివరించారు.భారతదేశంలో ఏయే ప్రదేశాలను ఐక్యరాజ్య సమితి గుర్తించిందో చెప్పి, మన తెలంగాణా రాష్ట్రంలోని రామప్ప గుడిని 2021లో వారసత్వ సంపదగా గుర్తించినట్లు తెలియజేశారు. మహబూబ్ నగర్ జిల్లాలోని ముడుమాల్ గ్రామ సమీపంలో ఉన్న ప్రాచీన గండశిలా సంపద (కిందిఫోటో) ను ఇటీవల గుర్తించినట్లు ఆ శిలలకు ఖగోళ శాస్త్రానికి సంబంధమున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారని అన్నారు.


ముడుమాల్ గండశిలలు (ఫైల్ ఫోటో)

ముడుమాల్ గండశిలలు (ఫైల్ ఫోటో)

అలాంటిది ప్రపంచం లోనే మరెక్కడా లేదట. ప్రపంచంలోనే అతి పురాతనమైన, శాస్త్రీయత కలిగిన శిలాసంపద మన తెలంగాణా రాష్ట్రంలో హైదరాబాదుకు కూతవేటు దూరంలో ఉండడం గర్వంగా ఉందన్నారు. దానిని కూడా ఐక్యరాజ్య సమితి త్వరలోనే వారసత్వ సంపదగా గుర్తిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. సందర్భంగా ఆయా సంస్థలకు చెందిన ప్రతినిధులు హైదరాబాదు చరిత్ర, వారసత్వ సంపద గురించి మాట్లాడారు. తరువాత వేదకుమార్ గారు పచ్చ జెండా ఊపి, హైదరాబాదు హెరిటేజ్ వాక్ ను ప్రారంభించారు ఏప్రిల్ 18, 2025 ఉదయం ఏడున్నర గంటలకు చార్ మినార్ నుంచి మొదలై చౌముల్లా ప్యాలెస్ దాకా ఈ హెరిటేజ్ వాక్ సాగింది.




చార్మినార్ నుంచి లాడ్ బజార్ మీదుగా మహమ్మద్ చౌక్ లేదా ముర్గీ చౌక్ మీదుగా పలు చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తూ ముందుకు సాగాము. టూరిజం శాఖ నుంచి వచ్చిన ముగ్గురు గైడులు అక్కడి సాంస్కృతిక, చారిత్రక విశేషాలను మైకులో వివరిస్తూ పోయారు.




చార్మినార్ హైదరాబాదుకు ఐకాన్ సింబల్ గా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఎత్తు 167 అడుగులు. మీనార్ ల ఎత్తు 160 మీటర్లు. ఇండో ఇస్లామిక్ వాస్తు శైలిలో నిర్మించారు.నాలుగు మీనార్ లతో 434 సంవత్సరాల చరిత్ర కలిగి హైదరాబాదు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పడానికా అన్నట్లుగా ఉన్నతమైన మీనారులతో స్థిరంగా, దృఢంగా నిలబడి ఉంది. కుతుబ్ షాహీ వంశంలో ఐదో రాజైన మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591 లో దానిని నిర్మించాడు. తరువాత ఏడాదికి 1592 దానికి నాలుగు వైపులా నాలుగు కమాన్ లు నిర్మించారు. అవి ఒక్కొక్కటి 60 అడుగుల ఎత్తు ఉన్నాయి. చార్మినార్ సమీపంలో 300 మీటర్ల వరకు ఎలాంటి భారీ వాహనాలకు అనుమతి లేదు.




లాడ్ బజారులో షాపింగ్ చేయని అమ్మాయి ఉండదు అంటే అతిశయోక్తి కాదు. కులీకుతుబ్ షా తన కూతురు పెళ్ళికి ముఖ్యంగా రాళ్ళగాజుల గృహ పరిశ్రమలు ఏర్పాటు చేసి షాపింగ్ సెంటరుగా దానిని రూపొందించాడట. ఇప్పటికీ అది పెళ్లి కూతుళ్లకు ప్రధాన షాపింగ్ సెంటరుగా ఉండడం విశేషం.

మేము పలు చారిత్రక కట్టడాలను సందర్శిస్తూ ముందుకు సాగాము. వాటిలో కొన్ని కమానులున్నాయి. బయట ప్రాంతాలనుంచి అతి థులు నగరంలోకి ప్రవేశిస్తున్నప్పుడు వాటిని భిన్నవర్ణాల పూలతో అలంకరించే వారట. దేవుడీ ఇక్బాత్ ఉల్ దౌలా మీదుగా మహమ్మద్ చౌక్ లేదా ముర్గీ చౌక్ చేరుకున్నాము. ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువుల విక్రయ కేంద్రం అది. ప్రధానంగా కోళ్ళు అమ్మేవారట. అందుకే ముర్గీ చౌక్ అనే పేరు స్థిరపడింది.

దారిలో నన్ను చాలా ఆకర్షించింది ఒక పెద్ద భవనం గోడ. అది ఏమిటని టూరిస్టు గైడ్ రైజ్ ను అడిగాను. ఫలక్నుమా ప్యాలెస్ నిర్మించిన వికారుల్ ఉమ్రా నివాస భవనమని చెప్పింది. ఆయన ఆరవ నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ బహదూర్ కు మామ. కొంత లోపలికి వెళ్ళాక మరింత లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదని రైజ్ చెప్పింది. కానీ వేదకుమార్ గారి చొరవతో టూరిజం పోలీసులు అనుమతిచ్చారు. ఇలాంటివి వ్యక్తిగతంగా వెళితే చూడడానికి సాధ్యపడదు. విశాలమైన ప్రాంగణం, సమావేశ మందిరం ఉన్నాయి. సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినప్పుడు మహిళలు చూడడానికి వీలుగా వాళ్ళ భవనం ఉంది.


చాలా భవనాలు సంరక్షణ లేక పాడుపడి ఉన్నాయి. అసఫ్ జాహీ రాజులు, కులీ కుతుబ్ షాహీ రాజులు, పైగా కుటుంబాలు నిర్మించిన పలు రాజ భవనాలు మన హైదరాబాద్ లో ఉన్నాయి. వాటిలో పైగా కుటుంబానికి చెందిన ఫలక్నుమా ప్యాలస్ ను కొన్ని షరతులతో తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్ కు ఇచ్చారు.


సామాన్యుల సందర్శనానికి దూరమైనా తెలంగాణా టూరిజం వారు ₹2700/ లతో ఒకరోజు హెరిటేజ్ టూర్ నిర్వహిస్తున్నట్లు రైజ్ చెప్పింది. అందులో భాగంగా చౌముల్లా ప్యాలెస్, ఫలక్నుమా ప్యాలెస్, గోలకొండ కోటలోని లైట్ అండ్ మ్యూజిక్ షో చూపిస్తారట. తెలంగాణా టూరిజం వారి వెబ్ సైట్ లో ఆ టూర్ బుక్ చేసుకోవచ్చు.


Read More
Next Story