హైదరాబాద్‌లో వాలెంటైన్స్  హంగామా:  ప్రేమ ఆఫర్లు, లవ్ ఈవెంట్స్
x
వాలెంటైన్స్ డే వేడుకలకు హైదరాబాద్ ముస్తాబు

హైదరాబాద్‌లో వాలెంటైన్స్ హంగామా: ప్రేమ ఆఫర్లు, లవ్ ఈవెంట్స్

నగరంలో జరుగుతున్న లవ్ ఈవెంట్లకు ప్రేమజంటలు తరలివస్తున్నాయి.


ఫిబ్రవరి నెలలో చలి సాయంత్రాలు… కొవ్వొత్తుల వెలుగులు… గులాబీల సువాసనలు… ప్రేమికుల చిరునవ్వులతో హైదరాబాద్ నగరం మురిసిపోతోంది. వాలెంటైన్స్ వీక్ సందర్భంగా హోటళ్లు, రిసార్టులు, రూఫ్‌టాప్ రెస్టారెంట్లు ప్రత్యేక ఈవెంట్లతో సిద్ధమై ప్రేమజంటలను ఆహ్వానిస్తున్నాయి. రోజ్ డే నుంచి వాలెంటైన్స్ డే వరకు నగరమంతా ప్రేమ సందడితో కళకళలాడుతోంది.

ప్రేమకు హైదరాబాద్ సిటీ రెడీ! గులాబీలు, గిఫ్ట్‌లు, క్యాండిల్ లైట్ డిన్నర్లు, లైవ్ మ్యూజిక్‌తో హైదరాబాద్ వాలెంటైన్స్ మూడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రోజ్ డే నుంచి కిస్ డే దాకా యువజంటల సందడితో హోటళ్లు, రిసార్టులు హౌస్‌ఫుల్ అవుతుండగా, నగరమంతా ప్రేమ పండుగలా మారింది.

మర్చిపోలేని మధుర అనుభవాలు

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు నగరంలోని హోటల్ గదులు,రిసార్టులు, ఓయో రూమ్స్ బుకింగ్ అయిపోయి కిటకిటలాడుతున్నాయి.ఫిబ్రవరి 14వతేదీ ...ప్రేమికుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరం ప్రేయసీప్రియుల కోసం వివిధ వినూత్న ఈవెంట్లతో సిద్ధమైంది. క్యాండిల్ లైట్ వాలెంటైన్స్ డే స్పెషల్, అందమైన పార్టీలు, వర్క్ షాప్ లు, రెస్టారెంట్లు సమాయత్తం అయ్యాయి.నగరంలోని మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్టుమెంట్స్ లో మర్చిపోలేని మధుర ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకునేందుకు జంటలను ఆహ్వానిస్తున్నారు. సిగ్నేచర్ రూఫ్ టాప్ రెస్టారెంట్ మజ్జోలో కొవ్వొత్తుల వెలుగుల్లో గులాబీల మధ్య ప్రత్యక్ష సంగీత ప్రదర్శనను అస్వాదించవచ్చు.

వినూత్న ఈవెంట్లతో ప్రేమజంటలకు ఆహ్వానం

లైవ్ మ్యూజిక్, ఫైర్ షో, ప్రపోజల్ డెక్ రొమాన్స్ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.ప్రేయసీప్రియులు బహుమతులను ఇచ్చి పుచ్చుకోవడమే కాకుండా హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి షెరాటన్ హోట్ ఏడో అంతస్తులో నక్షత్రాల కింద స్టార్ లైట్ విందు, లైవ్ ఫ్లూట్ ప్రదర్శనతో మరపురాని మధుర అనుభూతిని పొందాలనుకునే జంటలకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి రా రమ్మని ఆహ్వానిస్తున్నారు ఈవెంట్ల నిర్వాహకులు. ఈవెంట్ అనుభవాన్ని పాప్ అప్ డిన్నర్లు, జంటలతో కలిసి నృత్య రాత్రులు, ప్రీ వాలంటైన్స్ బాల్, ప్రేమికుల దినోత్సవ ఆటలు,సంధ్యా కన్వెన్షన్ లో ఇష్క్ ఏ ఖవ్వాలీ పేరిట మ్యూజిక్ ఫెస్టివల్, బ్రాడ్ వే వాలెంటైన్స్ వర్క్ షాప్ పేరిట పలు ప్రాంతాల్లో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ , హైదరాబాద్ బౌల్డర్ హిల్స్ లో సంగీత విభావరి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

వాలెంటైన్స్ వీక్ 2026

వాలెంటైన్స్ వీక్ 2026 సందర్భంగా రోజ్ డే నుంచి కిస్ డే దాకా హైదరాబాద్ నగరంలో ప్రేయసీ ప్రియులు వినూత్నంగా జరుపుకుంటున్నారు.ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే, వాలెంటైన్ డే దాకా వారంరోజుల పాటు ప్రేమికులు ఖుషీఖుషీగా వినూత్నంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఫిబ్రవరి 7వతేదీ నుంచి14 వరకు వాలెంటైన్స్ వీక్‌ను రోజువారీ నేపథ్య కార్యక్రమాలతో జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా గులాబీలు, చాక్లెట్లు, టెడ్డీ బేర్లు, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా ప్రేమను వ్యక్తీకరిస్తున్నారు. ఫిబ్రవరి 7 వతేదీన రోజ్ డే వాలెంటైన్స్ వీక్ ప్రారంభాన్ని సూచిస్తుంది.

వారం రోజుల పాటు ప్రేమను వ్యక్తీకరిద్దాం

ప్రేమ భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి ప్రేయసీప్రియులు వివిధ రంగుల గులాబీలను బహుమతిగా ఇస్తారు.ఫిబ్రవరి 8ప్రపోజ్ డే చాలామంది తమ ప్రేమను ప్రకటించడానికి ఈ రోజును ఎంచుకుంటారు.ఫిబ్రవరి 9 వతేదీన చాక్లెట్ డే సందర్భంగా చాక్లెట్లు మార్చుకోవడం ఆనందాన్ని సూచిస్తుంది.టెడ్డీ డే నాడు టెడ్డీ బేర్‌ను బహుమతిగా ఇవ్వడం భావోద్వేగ సాన్నిహిత్యాన్ని సూచిస్తుంది. ప్రామిస్ డే నమ్మకం, నిబద్ధతపై దృష్టి పెడుతుంది. జంటలు తమ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ఒకరికొకరు తమ అంకితభావాన్ని పునరుద్ఘాటించడానికి అర్థవంతమైన వాగ్దానాలు చేస్తారు.హగ్ డే అనేది వెచ్చని ఆలింగనం . హగ్ అనేది ప్రేమ భావోద్వేగ మద్దతును వ్యక్తీకరించడానికి మార్గం.కిస్ డే అనేది సాన్నిహిత్యం, ఆప్యాయతను సూచిస్తుంది.వాలెంటైన్స్ డే అనేది వాలెంటైన్స్ వీక్ గొప్ప ముగింపు.

వాలెంటైన్స్ డే ఈవెంట్లు ఎన్నెన్నో...

ది వెస్టిన్ హైదరాబాద్ మైండ్‌స్పేస్‌లో ఎపిక్ వాలెంటైన్స్ వీకెండ్ నిర్వహిస్తున్నారు.గులాబీ రేకులతోపాటు కొవ్వొంతులు వెలిగించిన టేబుళ్లపై వాలెంటైన్స్ డే డిన్నర్ ఏర్పాటు చేశారు.వాలెంటైన్స్ డే బ్రంచ్ పేరిట వెల్‌నెస్ వంటకాలు, ఆహ్లాదకరమైన విందులతో వెస్టిన్ క్లాసిక్ బ్రంచ్. మనోహరమైన సంగీతం, స్వాగత పానీయాలు, పోలరాయిడ్ జ్ఞాపకాలతో ఫోటో బూత్ ఈవెంట్. అమోర్ & వినోలో పూల్ సైడ్ క్యాండిల్-లైట్ డిన్నర్, సిగ్నేచర్ డ్రింక్స్, రొమాంటిక్ సీటింగ్, ఫోటో బూత్, ప్రత్యేకమైన జంట గెట్‌అవే ఆఫర్‌లున్నాయి..

ప్రేమయాత్రలకు ప్రేమజంటలు

వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమ జంటలు విహార యాత్రతలకు వెళుతుండటంతో ఈ ఏడాది పర్యాటక కేంద్రాల్లోని హోటళ్లు, రిసార్టులు, ఓయో రూమ్స్ అడ్వాన్సు బుకింగ్ అయ్యాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా 175 శాతం హోటల్ బుకింగ్ లు పెరిగాయని ట్రావెల్ సంస్థ క్లియర్ ట్రిప్ వెల్లడించింది. పర్యాటక కేంద్రాల్లో ఓయో రూముల్లో గడిపేందుకు ప్రేమజంటలు ఆసక్తి చూపిస్తున్నారు. ఓయో రూమ్స్ ప్రేయసీప్రియులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ నగరం నుంచి ప్రేమ జంటలు గోవా, ముంబయి, బెంగళూరు నగరాలకు వెళ్లారు. కొందరైతే థాయ్ లాండ్, సింగపూర్ దేశాల పర్యటనలకు వెళ్లారు. వాలెంటైన్స్ డే సందర్భంగా అంతర్జాతీయ ప్రయాణాలు 20 శాతానికి పైగా పెరిగాయని పిక్ యువర్ ట్రైల్ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్ నగరంలోని పార్కులు, రిసార్టులు ప్రేమజంటలతో కళకళలాడుతున్నాయి.

ప్రేమజంటలకు స్పెషల్ ఆఫర్లు

హైదరాబాద్ నగరంలో వాలెంటైన్స్ డే సందర్భంగా పలు బంగారం దుకాణాలు ఆఫర్లు ప్రకటించాయి. ప్రియుడు ప్రియురాళ్లకు బహుమతిగా ఇచ్చేందుకు వీలుగా డైమండ్ రింగులు, బంగారపు ఉంగరాలు, గాజులపై డిస్కెంట్లు ప్రకటించాయి. కొన్ని దుకాణాల వారైతే ఎగ్జిబిషన్ ఆఫర్ పేరిట డైమండ్ల కొనుగోలుపై 20 శాతం ఆఫర్ ఇస్తున్నట్లు తెలిపాయి. హోటళ్లు, విమానయాన సంస్థలు కూడా ధరలు తగ్గించాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా ఓటీటీల్లోనూ పలు కొత్త సినిమాలు విడుదలయ్యాయి.

వాలంటైన్స్ డే పేరిట సైబర్ మోసాలు

వాలెంటైన్స్ వీక్ సోషల్ మీడియాను ప్రేమపూర్వక సందేశాలతో నింపుతున్న నేపథ్యంలో సైబర్ నేరస్థులు రంగంలోకి దిగారు. సైబర్ నేరగాళ్లు ఉత్తేజకరమైన ప్రేమ నేపథ్య సందేశాలు, లింక్‌లు, ఆశ్చర్యకరమైన బహుమతి ఆఫర్‌లను డిజిటల్ మోసానికి మార్గంగా మార్చుకున్నారు.వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఇ-మెయిల్స్, ఇతర ప్లాట్‌ఫామ్‌లతో సహా వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తిరుగుతున్న అనుమానాస్పద సైబర్ మోసాల సందేశాలు గణనీయంగా పెరుగుతున్నాయని సైబర్ క్రైమ్ అధికారులు గుర్తించారు.

భజరంగ్ దళ్ హెచ్చరిక జారీ

ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి భజరంగ్ దళ్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని భజరంగ్ దళ్ ప్రకటించింది. హైదరాబాద్ నగరంలోని పార్కులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో తమ కార్యకర్తలు నిరసన తెలుపుతారని భజరంగ్ దళ్ తెలిపింది. పాశ్చాత్య పద్ధతులు మాని, భారతీయ సంస్కృతిని ప్రోత్సహించాలని కోరింది. ప్రేమ వేడుకల పేరిట ప్రేమ జంటలు అనుచితంగా ప్రవర్తిస్తే తాము చర్యలు తీసుకుంటామని భజరంగ్ దళ్ హెచ్చరించింది. మరో వైపు వాలెంటైన్స్ డే సందర్భంగా నగర పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. శాంతికి భంగం కలిగించే , చట్టవిరుద్ధ చర్యలపై పోలీసులు నిఘా వేశారు.
ప్రేమ, ఉత్సాహం, జాగ్రత్తల నడుమ హైదరాబాద్‌లో వాలెంటైన్స్ వీక్ ప్రేమికుల హృదయాల్లో మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోనుంది.గులాబీ రంగులో ముస్తాబైన హైదరాబాద్… ఈ వారం ప్రేమే ప్రధాన ఆకర్షణగా మారింది.
Read More
Next Story