
మేడి పండులా హైదరాబాద్ ఆరోగ్యం
హైటెక్ సిటీ హైదరాబాద్ ఆరోగ్యం అంతా డొల్లగా ఉంది. 20ల్లోనే 60ల వ్యాధులు యువతను కబళిస్తున్నాయి. కల్తీ ఆహారం, పెరుగుతున్న గుండెపోటులు ఆందోళన కలిగిస్తున్నాయి.
హైదరాబాద్.. మిన్నంటే భవనాలు, అంతకుమించిన ఐటీ రంగానికి పెట్టింది పేరు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో కూడా హైదరాబాద్ ఉంటుంది. కానీ ఆరోగ్యం విషయంలో మాత్రం హైదరాబాద్.. మేడిపండులా మారింది. బయటకు నిగనిగలాడుతూ కనిపించినా.. లోపల మాత్రం అన్నీ జబ్బులే ఉంటున్నాయి. యువతను సైతం వయసుపైబడితే వచ్చే వ్యాధులు, రోగాలు కబళించేస్తున్నాయి. అనేక అధ్యయనాలు కూడా హైదరాబాద్ యువత ఆరోగ్యాన్ని చూసి నివ్వెరబోతున్నాయి. కల్తీ ఆహారం, అకస్మాత్తు గుండెపోటులు, జీవనశైలి జబ్బులతో ప్రజల ప్రాణాలు పితపితలాడుతున్నాయి. తాజాగా విడుదలైన గణాంకాలు చూస్తుంటే, మన నగరం ఆరోగ్య సంక్షోభంలో కూరుకుపోయిందన్నది నగ్నసత్యం. ఆఖరికి శరీరానికి కావాల్సిన విటమిన్లు కూడా హైదరాబాద్ వాసుల లోపిస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు.
76శాతం మందికి విటమిన్ D లోపం ఉందని, దీనికి ఎక్కువసేపు గదుల్లోనే ఉండటమే కారణమని వైద్యులు వివరిస్తున్నారు. దాంతో పాటుగా సరైన డైట్ లేకపోవడం వల్ల విటమిన్లు B2/B6 వంటివి కూడా లోపిస్తున్నాయని 2023లో దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలు వెల్లడించాయి.
దేశానికే ‘హార్ట్ ఎటాక్’ క్యాపిటల్?
తెలంగాణలో మరణాల తీరును విశ్లేషిస్తే ఒళ్లు గగుర్పొడుస్తోంది. చిన్నచిన్న పిల్లలు సైతం గుండెపోటుకు బలవుతున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. ఆడుకుంటున్న పిల్లాడు.. ఒక్కసారిగా కుప్పకూలడం, ఆసుపత్రికి తీసుకెళ్తే గుండెపోటు అని వైద్యులు నిర్ధారించిన ఘటనలు ఎన్నో. ఎంసీసీడీ (MCCD) నివేదిక ప్రకారం, తెలంగాణలో సంభవిస్తున్న ప్రతి 5 మరణాల్లో 2 మరణాలకు (42 శాతం) గుండె సంబంధిత సమస్యలే కారణం.
వయసుతో నిమిత్తం లేకుండా గుండెపోటు వస్తుంది. గతంలో 60 ఏళ్లు దాటిన వారికి వచ్చే గుండెపోటులు, ఇప్పుడు 20-30 ఏళ్ల యువతను కబళిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం జీవనశైలే కారణమని వైద్యులు చెప్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, గంటల కొద్దీ గ్యాడ్జెట్స్‌తో గడపడం, నిద్రలేమి, విపరీతమైన పని ఒత్తిడి గుండె ధమనులను మూసివేస్తున్నాయి. కార్డియోవాస్కులర్ వ్యాధులు ఇప్పుడు వృద్ధుల సమస్య కాదు.. ఇది యువత జీవనశైలి సంక్షోభం.
ఎంసీసీడీ ఒక వార్నింగ్ బెల్: జగదీష్
తెలంగాణ మరణాల్లో గుండె సంబంధి వ్యాధుల శాతానికి సంబంధించి ఎంసీసీడీ విడుదల చేసిన రిపోర్ట్‌పై హైదరాబాద్‌లోని యశోధ ఆసుపత్రిలో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ జగదీష్ రెడ్డి స్పందించారు. ఇది గణాంకాలు మాత్రమే కాదని, మనకు ఇస్తున్న వార్నింగ్ బెల్ అని అన్నారు. మన జీవన శైలి మనపై చూపుతున్న ప్రభావాన్ని ఈ డేటా అద్దం పడుతుందని వివరించారు. ‘‘ఎక్కువ గంటలు కూర్చుని పని చేయడం, ఫాస్ట్ ఫుడ్, స్మోకింగ్, నిద్రలేమి, ఒబేసిటీ, తీవ్రమైనన ఒత్తిడి ఇవన్నీ కూడా మనకు తెలియకుండా మన గుండెకు డ్యామేజ్ చేస్తున్నాయి’’ అని అన్నారు.
‘‘ఇప్పుడున్న సమయంలో 30-40 సంవత్సరాల వాళ్లలో కూడా హార్ట్ ఎటాక్‌లు షరామామూలు అయిపోయాయి. యంగ్, ఫిట్‌గా ఉన్న వాళ్లు కూడా గుండె ధమనుల బ్లాకేజ్‌తో ఐసీయూలో పడుతున్నారు. గుండె సంబంధిత సమస్యలు ప్రస్తుతం వయసుతో సంబంధంలేని అంశాలుగా మారిపోయాయి. ఇది ఇప్పుడు యువతలో జీవనశైలి సంబంధిత సమస్యగా అవతరించింది’’ అని తెలిపారు.
కాలకూటవిషంలా మారుతున్న ఆహారం
ఆదాయం పెరిగినా ఆరోగ్యం మాత్రం రోజురోజుకు క్షీణిస్తోంది. ఇందుకు మరో ప్రధాన కారణం బయట తినే ఆహారం. మనం తినే ఆహారం అమృతమో కాదో తెలీదు కానీ, అది కచ్చితంగా విషమేనని నిపుణులు ఘంటాపథంగా చెప్తున్నారు. దీనికి ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన తనిఖీల్లో వెలుగుచూసిన కొన్ని స్టార్ హోటల్ల తీరే కారుణం.
హోటళ్లలో వెలుగు చూస్తున్న అపరిశుభ్రతపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ప్రతాప్ జాదవ్ ఘాటుగా స్పందించారు. ‘‘తెలంగాణ రాష్ట్రంలో అందులోనూ ప్రధానంగా హైదరాబాద్ నగరంలో 2020 నుంచి 2025 వరకు 18,283 శాంపిళ్లను తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరించగా, ఇందులో 15 శాతం అంటే 2,642 ఆహార శాంపిళ్లు కల్తీవని తేలింది. కానీ కేవలం 964 శాంపిళ్ల కేసుల్లోనే జరిమానాలు విధించారు’’అని ప్రతాప్ జాదవ్ .. గతంలో రాజ్యసభలోనే ప్రకటించారు.
నకిలీ అల్లం-వెల్లుల్లి పేస్ట్: మార్కెట్లో నిగనిగలాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వెనుక టైటానియం డయాక్సైడ్, సింథటిక్ రంగులు, కుళ్ళిన పదార్థాలు ఉంటున్నాయి.
టీ పొడిలో కొబ్బరి పీచు: మనం అమితంగా ఇష్టపడే టీ పొడిలో ఇనుప రజను, కొబ్బరి పీచు కలిపి విక్రయిస్తున్న ముఠాలు వెలుగులోకి వచ్చాయి.
కల్తీ పాలు, మాంసం: పాలల్లో డిటర్జెంట్లు, యూరియా.. మాంసానికి రసాయన రంగులు పూసి విక్రయిస్తున్నారు. ఇవి శరీరంలోకి చేరి కిడ్నీలను, కాలేయాన్ని ఛిద్రం చేస్తున్నాయి.
వీటికి తోడు స్టార్ హోటళ్ల కిచెన్స్‌లో ఉండే పరిశుభ్రత హైదరాబాద్ అనారోగ్యానికి తలమానికంగా మారుతుంది. కుల్లిపోయిన మాంసంతోనే గుమగుమలాడే బిర్యానీలు వండటం, ఎలుకలు, బొద్దింకలు పారాడిన కూరగాయలతో సలాడ్ చేయడం కనిపిస్తూనే ఉన్నాయి. ఇక వారు వాళ్లే దినిసుల నాణ్యత అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పరుగులు పట్టేసి ఉంటాయి. ఇలాంటివి చాలా ఫేమస్ హోటళ్లలో కూడా నిపించాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఆహార కల్తీపై వచ్చిన ఫిర్యాదులతోపాటు రాండమ్ గా తాము హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందాలతో అకస్మిక తనిఖీలను ముమ్మరం చేశామని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రివెన్షన్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ అండ్ ఫుడ్ సేఫ్టీ విభాగం డైరెక్టర్ డాక్టర్ సి శివలీల ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. కల్లీ ఆహార పదార్థాలు, కలుషిత, కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. తనిఖీలు చేసి శాంపిళ్లను పరీక్షించి కల్తీవని వస్తే హోటళ్లకు నోటీసులు జారీ చేశామని చెప్పారు. పలు పెద్దపెద్ద హోటళ్లు, రెస్టారెంట్లకు తాము షోకాజ్ నోటీసులు జారీ చేశామని, అవసరమైతే వాటిని సీజ్ చేస్తామని శివలీల చెప్పారు.
ఫుడ్ పాయిజనింగ్‌లో రికార్డ్
ఇండియాలో ఫుడ్‌పాయిజనింగ్ విషయంలో కూడా తెలంగాణ ఏమాత్రం తగ్గడం లేదు. దేశంలో ఫుడ్ పాయిజనింగ్ వల్ల మరణంచే ప్రతి ఆరుగురిలో ఒకరు తెలంగాణ వారే ఉంటున్నారు. ఈ విషయాన్ని మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్(MCCD) ఇచ్చిన 2023 ఏడాదికి సంబంధించి రిపోర్ట్ చెప్తుంది. 2023లో దేశవ్యాప్తంగా ఫుడ్‌పాయిజనింగ్ కారణంగా 612 మరణాలు నమోదైతే, అందులో 108 మరణాలు మన రాష్ట్రానివే. 2026లో ఇప్పటివరకు 250 మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ హాస్టళ్లలో కలుషిత భోజనం తిని ఆసుపత్రి పాలయ్యారు. సంగారెడ్డి, ఖమ్మం, మంచిర్యాల సహా పలు జిల్లాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇవి ముమ్మాలికి అధికారులు నిర్లక్షం వల్లే జరిగాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
40శాతం మందికి ఫ్యాటీ లివర్
హైదరాబాద్‌లోని ప్రతి ఐదుగురిలో ఇద్దరికి కాలేయం చుట్టూ కొవ్వు పేరుకుపోయింది. దేశవ్యాప్త సగటు 38.9% కాగా, హైదరాబాద్‌లో పురుషుల్లో 46 శాతం, మహిళల్లో 36.2 శాతం మందికి ఫ్యాటి లివర్ ఉన్నట్టు తేలింది. మరీ ముఖ్యంగా, ఏ రోజూ మద్యం ముట్టని వారు కూడా ఈ వ్యాధి బారిన పడుతుండటం గమనార్హం. వైద్యులు ఈ పెరుగుదలకు నగర జీవనశైలినే ప్రధాన కారణంగా గుర్తించారు. ‘ది లాన్సెట్ రీజినల్ హెల్త్’లో ప్రచురితమైన ఈ పాన్-ఇండియా అధ్యయనాన్ని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. హైదరాబాద్‌లో ప్రతి ఐదుగురిలో ఇద్దరికి ఫ్యాటి లివర్ వ్యాధి ఉన్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. నగరంలో 40.9 శాతం మంది పెద్దలు మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టియాటోటిక్ లివర్ డిసీజ్ (MASLD)తో జీవిస్తున్నారని ఈ అధ్యనం తెలిపింది.
80శాతం మంది ఊబకాయులే
వీటన్నింటితో పాటు ఊబకాయం కూడా తెలంగాణ యువతలో అతిపెద్ద సమస్యగా కనిపిస్తోంది. ఇటీవల ఏఐజీ ఆసుపత్రి వాళ్లు వెయ్యి మంది ఐటీ ఉద్యోగలతో చేసిన అధ్యయనంలో విస్తుబోయే నిజాలు తెలిశాయి. వారిలో 80శాతం మంది అధికబరువుతో ఉన్నారని తేలింది. 20 ఏళ్ల క్రితం నాటితో పోలిస్తే ఇప్పుడు వస్తున్న కేసులు 30సంవత్సాలు ముందుగానే వస్తున్నాయని చెప్పారు. ఈ ఒబేసిటీ కారణంగానే 20 ఏళ్ల వయసులోనే హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయని వైద్యులు వివరిస్తున్నారు.
నిద్రకూడ కరువే..
కమ్యూనిటీ ఫోరమ్ లోకల్ సర్కిల్స్ అనే సంస్థ చేసిన అధ్యయనంలో.. హైదరాబాద్ నిద్రలేమితో కూడా ఇబ్బంది పడుతోందని నిర్ధారరితమైంది. 59శాతానిక పైగా ప్రజలు కనీసం ఆరు గంటల పాటు కూడా నాణ్యమైన నిద్ర పోవడం లేదని ఈ అధ్యయనంలో తేలింది. 23శాతం మంది వీకెండ్స్‌లో ఎక్కువ గంటలు నిద్రపోతూ వీక్ డేస్‌లోని లోటును తీర్చుకుంటున్నారు. 38శాతం మందికి మాత్రం తగ్గిన నిద్రను కవర్ చేసేందుకు అవకాశమే దొరకడం లేదు. దేశవ్యాప్తంగా మొత్తం 348 జిల్లాల్లో 43000 మందితో ఈ సర్వే చేయగా.. హైదరాబాద్ నిద్రలేమి విషయం వెలుగు చూసింది.
‘సైలెంట్ కిల్లర్’ హైపర్ టెన్షన్
హైదరాబాద్‌లోని ప్రతి ముగ్గురిలో ఒకరు హై బీపీ (హైపర్ టెన్షన్)తో బాధపడుతున్నారు. విచిత్రమేమిటంటే, అందులో సగం మందికి తమకు బీపీ ఉందన్న సంగతే తెలియదు. 45 ఏళ్ల లోపు యువతలో 26 శాతం మంది ఈ సమస్యతో మృత్యువు అంచున ఉన్నారు. అపోలో ఆసుపత్రి 2025లో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయింది. ఈ హైపర్ టెన్షన్ కారణంగా గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీలు చెడిపోవడం వంటి అనేక అరోగ్య సమస్యలు వస్తున్నాయని గుర్తించారు.
తెలంగాణ, హైదరాబాద్ యువత ఆరోగ్యంపై యశోధ, సిటిజన్ స్పెషాలిటీ ఆసుపత్రుల వైద్యులు జగదీష్ రెడ్డి, సుధీర్ కోగంటి, రఘు తదితరులు చెప్తున్న మాట ఒక్కటే.. "మనం మారాలి.. లేదంటే మనల్ని కాలం మారుస్తుంది" అని.
స్ట్రెస్ మేనేజ్‌మెంట్: సోషల్ మీడియా మాయలో పడకుండా, పని ఒత్తిడిని తగ్గించుకుని కనీసం 7-9 గంటల నిద్ర ఉండాలి.
వ్యాయామం: కూర్చునే అలవాటు మానుకుని, రోజుకు 30 నిమిషాలైనా చెమట పట్టేలా వ్యాయామం చేయాలి.
ఆహారం: బయట దొరికే 'కల్తీ' ఫాస్ట్ ఫుడ్ కంటే ఇంట్లో వండిన తాజా ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు.

