‘శ్రామిక మహిళ - అవగాహన సదస్సు’ రిపోర్టు
x

‘శ్రామిక మహిళ - అవగాహన సదస్సు’ రిపోర్టు

‘వారానికి 95 గంటలు మహిళలు పనిచేస్తే 45 గంటలు మాత్రమే పురుషులు పనిచేస్తున్నారు.’

తెలుగు సాహిత్యంలో మధ్యతరగతి మహిళ మీద వచ్చినన్ని రచనలు శ్రామిక మహిళ పైన రాలేదనే చెప్పాలి. అసంఘటిత రంగంలో పని చేస్తున్న మహిళల సమస్యలు అనేకం ఉన్నాయి. వాటిని సాహిత్యంలోకి తీసుక వచ్చి పాఠకులకు తెలియ పరచివలసిన బాధ్యత రచయితలదే.. అందులో భాగంగా హస్మిత ప్రచురణ సంస్థ ఆ బాధ్యతను తీసుకుంది. సాధారణంగా ప్రచురణ సంస్థలు ప్రచురణకు సిద్ధంగా ఉన్న రచనలను మాత్రమే ప్రచురిస్తాయి. మిగిలినవాటి కన్నా హస్మిత ప్రచురణ సంస్థ భిన్నమైంది. నాణ్యమైన ప్రచురణలు తీసుకురావడం కొరకు ముందుగా రచయితలకు సదస్సును ఏర్పాటు చేయడం ఆ సంస్థ ప్రత్యేకత. సంస్థ అధినేత భండారు విజయ స్వయంగా రచయిత కావడం దానికి కారణం. తదుపరి ప్రాజెక్టుగా శ్రామిక రంగంలో పనిచేస్తున్న మహిళల వెతలను కథలుగా మలచడానికి పూనుకుంది. అలాంటివాళ్ళ జీవితానుభవాలను కథల్లోకి తీసుక రావాలంటే నాలుగు గోడల మధ్య కూర్చొని రాస్తే సరిపోదు. వాళ్ళ జీవితాలగురించి తెలుసుకోవాలి. ఆయా రంగాలలో వాళ్ళతోకలిసి పనిచేస్తున్న అనుభవజ్ఞుల చేత ప్రసంగాలను "శ్రామిక మహిళ - అవగాహన సదస్సు" పేరిట ఏర్పాటు చేసింది. ఆ సదస్సు ఈ నెల ఇరవై ఏడున బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని ఐలమ్మ హాలులో ఉదయం పదిగంటలనుంచి సాయంత్రం ఆరుగంటలదాకా కొనసాగింది.




మొదటి సెషన్ కు డా. సమతారోష్ని అధ్యక్షత వహించారు. ఆమె మాట్లాడుతూ తాను డాక్టరునే అయినా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళల పట్ల సహానుభూతి ఉందని, సాహిత్య రంగంలో తన స్నేహితురాలు విజయ చేస్తున్న కృషికి ఆమెను అభినందించి, తనను ఆ సదస్సుకు ఆహ్వానించి అధ్యక్ష స్థానాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసారు.

సంస్థ అధినేత భండారు విజయ మాట్లాడుతూ.. ఒంటరి మహిళ మీద తీసుక వచ్చిన కథాసంకలనం స్వయంసిద్ధ, గత ఏడాది తీసుకు వచ్చిన మాతృత్వంలోని భిన్న కోణాలను ఆవిష్కరించిన యోధ కథా సంకలనం చాలా నాణ్యతతో వచ్చాయని అప్పుడు కూడా ఆయా అంశాల పైన ఇలాగే సదస్సులు ఏర్పాటు చేసానని చెప్పారు. అందుకు సహకరించిన రచయిత్రులుదరికీ ధన్యవాదాలు తెలియ జేస్తూ భవిష్యత్తులో రాబోయే శ్రామిక మహిళ కథా సంకలనానికి కూడా రచయిత్రులందరూ సకాలంలో తమ కథలను అందించాలని విజ్ఞప్తి చేసారు. టీ బ్రేక్ తరువాత రెండో సెషన్ ప్రారంభమైంది.



రెండో సెషన్ కు ఆశాలత అధ్యక్షత వహించారు. 40 ఏళ్ళు ఉద్యమంలో పనిచేసిన అనుభవం ఆమెది. ప్రస్తుతం మహిళా రైతులు, మహిళా రైతు కూలీల మీద పనిచేస్తుంది. ఆమె మాట్లాడుతూ.. ఈ సందర్భంగా 120 ఏళ్ళకు పూర్వం క్లారాజెట్కిన్ చేసిన ఉద్యమం గుర్తుకొస్తుందని చెప్పారు. వ్యవసాయ రంగంలో సంక్షోభం రావడం వలన పురుషులు నగరాలకు వలస పోయారు. మహిళలు వ్యవసాయం చేస్తున్నారు. ఎక్కడైతే శ్రమ ఉందో అక్కడ మహిళలు పనిచేస్తున్నారు. వారానికి 95 గంటలు మహిళలు పనిచేస్తే 45 గంటలు మాత్రమే పురుషులు పనిచేస్తున్నారు. శ్రమ దోపిడీ, ఆర్థిక దోపిడీతో పాటు లైంగిక వేధింపులు ఉన్నాయని కానీ అవి బయటకు రావడం లేదు. మహారాష్ట్రలో తాము చేసిన ఒక సర్వేలో.. చెరకు పండే ప్రదేశాలకు యువ జంటలు పని కోసం వలస వెళతారు. ఆ జంటలోని స్త్రీ ఖచ్చితంగా గర్భసంచి తీసేస్తేనే అక్కడ పని చేయడానికి అనుమతిస్తారు. పని కొరకు యువతులు హిస్టరీక్టమీ ( గర్భసంచిని తొలగించడం) ఆపరేషన్ చేయించుకుంటారని చెప్పినప్పుడు ఒక్కసారిగా ఒళ్ళు జలదించింది. ఇలాంటి అంశాలేకదా సాహి త్యంలోకి రావాలనిపెంచింది.

టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి పదవీ విరమణ పొందిన ఫ్రొఫెసర్ వింధ్య ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ఆమె స్త్రీవాద పరిశోధకురాలు. స్త్రీల మానసిక ఆరోగ్యం మీద కూ డా చాలా పరిశోధన చేసింది. అందుకుగాను జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఆమెను వరించాయి. వింధ్య మాట్లాడుతూ.. చాలా మంది స్త్రీలు చేసే పనికి జీతం ఉండదు. ముఖ్యంగా గృహిణిలను "ఏం పని చేస్తున్నార"ని ప్రశ్నించినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే సమాధానం ఖాళీగా ఉన్నామని, ఏం పని చేయడం లేదనే చెపుతారు. కొంతవరకు చదువుకున్న స్త్రీలు కూడా ఇలాంటి సమాధానమే ఇస్తారు. మరి స్త్రీలు చేస్తున్న ఇంటి చాకిరీకి వెల కట్టేదెవరు? పితృస్వామ్య సమాజం పురుషుడు చేస్తున్న శ్రమకు మాత్రమే వెల కట్టింది. స్త్రీలు చేసే ఇంటి చాకిరీ బాధ్యతల్లో భాగమైంది. తమకు తెలియకుండానే చాలా మంది స్త్రీలు కూడా దీనిని నమ్ముతున్నారు.

1975లో ఈ విషయాలతో కూడిన మొదటి రిపోర్టు వచ్చింది. ఇది ఫెమినిస్టు ఐడియాలజీకి పునాది వేసింది. ఇంటి చాకిరీ నుంచే ఫెమినిస్టు ఎకానమీ మొదలైంది. 1988లో "శ్రామిక శక్తి "అనే రిపోర్టు వచ్చింది. ఇది అసంఘటిత రంగంలో పని చేస్తున్న మహిళను రికార్డు చేసింది. 1999 లో "Time use"సర్వేలు మొదటిసారిగా జరిగాయి. దీని వల్ల స్త్రీ పురుషులు ఏయే పనులు చేస్తున్నారనేది తెలుస్తుంది. 2019లో కూడా ఇలాంటి సర్వేలో జరిగాయి. వీటి వల్ల ప్రత్యేకంగా స్త్రీలు చేసే పనులు తెలిసాయి. మనదేశంలో 90% శాతం జనాభా అసంఘటిత రంగంలోనే పని చేస్తున్నారు. అందులో స్త్రీలు 53 % ఉన్నారు. ఉద్యోగాలు పెంచడం కాకుండా ప్రభుత్వాలు పని నాణ్యత, ఉత్పత్తి పైన దృష్టి పెట్టాలన్నారు.



జండర్ ఆధారిత శ్రమ విభజన పరిశీలించినప్పుడు స్త్రీ, పురుషులు చేసే పనులు వేరు వేరు. హోం ఎకనామిక్స్ స్త్రీలు చదువుకోవడానికి మొదటి సారిగా ప్రవేశపెట్టిన కోర్సు హోం సైన్సు. ఇంటిపనినే ఒక శాస్త్రంగా తయారు చేసి, స్త్రీలను మళ్ళీ దానికే పరిమితం చేయడం అన్నమాట. ఇందులో మార్పులు రావడం చాలా కష్టం. ఇది కూడా నాతోపాటు పలువురిని ఆశ్చర్యపరచిన విషయం.

( I LO ) ఇంటర్ నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం ౪౯ దేశములో వేతనం లేని శ్రామిక మహిళ ( unpaid labour woman ) కనబడదు. మన దేశంలో మాత్రమే ఇది లేదు. సామాజిక ఉత్పత్తిలో స్త్రీలు భాగమైనప్పుడే దేశం ఆర్థికంగా పురోగతి సాధిస్తుందని ఎంగెల్స్ చెప్పాడు. అందుకొరకు మహిళలు ఇంటా, బయటా, రెండు షిప్టులే కాదు, ఎమోషనల్ గా మూడో షిఫ్టులో కూడా పని చేస్తారనీ, ముఖ్యంగా దళిత స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్ష కులం, వర్గం, జెండర్ నుంచి వస్తుందన్నారు.

స్త్రీవాద పరిశోధనలో భాగంగా స్త్రీల మానసిక ఆరోగ్యం మీద చేసిన పరిశోధనలో ప్రధానంగా రెండు రకాల మానసిక జబ్బులను గుర్తించినట్లు చెప్పారు. అవి : - 1 తీవ్రమైన మానసిక జబ్బులు. 2. సాధారణ మానసిక జబ్బులు. మొదటి రకం శారీరక, జన్యుపరమైననవి. అవి స్త్రీ పురుషులఇద్దరికీ వచ్చే అవకాశముంది. అల్జీమర్స్ మొదలైనవి. రెండో రకం సామాజికమైనని. ఇవి స్త్రీలకు మాత్రమే వస్తాయి. అవి నాలుగు రకాలు. 1 ఆందోళన,(Anxiety )2. దీర్ఘకాలిక ఆందోళన, (Stress), 3. కుంగుబాటు(Depression), 4. అపరాధ భావం (Guilty) అనేవి. ఇలా సుదీర్ఘమైన వింధ్య ప్రసంగంలో చాలా విషయాలు ప్రస్తావించి, శ్రామిక మహిళకు సంబంధించి, ఒక సైద్ధాంతికమైన పునాదిని వేసారు.

ఏ ఐ టి యు సి పూర్వ జాతీయ కార్యదర్శి డా. బి.వి. విజయ లక్ష్మి మాట్లాడుతూ.. ట్రేడ్ యూనియన్ లో పనిచేయడం కోసం తాను బ్యాంకు మేమేజర్ ఉద్యోగం నుండి స్వచ్ఛంద పదవీ విరమణ పొందినట్లు చెపుతూ.. అంగన్ వాడి, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చేది జీతాలు కాదని గౌరవవేతనం(Honorarium )మాత్రమేనని తెలిపారు. మహిళల్లో ఎవరైనా శ్రామిక మహిళ కాని వారున్నారా? అంటూ ప్రశ్నించారు. స్త్రీలు పనిచేయడమంటూ మొదలు పెడితే అద్భుతంగా పనిచేస్తారు. స్త్రీ లు పనిచేయక పోతే మానవ వనరులు వ్యర్థమవుతాయన్నారు. పని ప్రదేశంలో తీవ్రమైన మానసిక, లైంగిక వేధింపులకు గురవుతున్నారు. రచయితలు ఆయా కార్మికుల దగ్గరికి వెళ్ళి విషయ సేకరణ చేసినప్పుడు మరింత నాణ్యమైన కధలు రాయగలిగే అవకాశముందని సూచించారు.



సెషన్లో చివరగా POW సంధ్య మాట్లాడుతూ అక్టోబరు విప్లవంలో మహిళల పాత్రను ప్రస్తావిస్తూ ఆహారం,శాంతి కొరకు చేసిన పోరాటాన్ని గుర్తు చేసారు. 1935 లో సామాజిక భద్రతా చట్టం వచ్చింది. కానీ నేటికీ ఆ భద్రత లభించడము లేదనడానికి బోలెడన్ని సంఘటనలు ఉన్నాయి. 60 ఏళ్ళు అసంఘటిత రంగంలో పని చేశాక కూడా ఒక తల్లి అనాథ అయిన పరిస్థితి ఉందని, ఈనాడు కుటుంబాలలో ఎంత మంది కొడుకులు తల్లులను పోషిస్తున్నారని ప్రశ్నించారు. దేశంలో ఓట్ల కొరకు కులాలు కావాలి కానీ ఆ కుల వృత్తులు కనుమరుగైన నేపథ్యంలో వాళ్ళకు ప్రభుత్వాలు సామాజిక భద్రతను కల్పించడం లేదన్నారు.

మొదటి రెండు సెషన్స్ గిరిజ పైడిమర్రి నిర్వహించారు.

భోజనానంతరం మళ్ళీ సదస్సు ప్రారంభమైంది. అధ్యక్షులుగా ఉన్న కొండవీటి సత్యవతి అందరితో ముందుగా రాజ్యంగా ప్రమాణం చేయించి సెషన్ మొదలు పెట్టారు. తరువాత ఇళ్ళల్లో పనిచేసేవారితో (Domestic workers ) పని చేస్తున్న లిజి మాట్లాడుతూ.. ఎంతో పోరాటం తరువాత 2002 లో ఈ చట్టం వచ్చింది. కానీ అమలు విషయంలో అంతంతమాత్రమే. గ్రామాలలో వ్యవసాయ పనులు లభించక చాలా మంది నగరాలకు వలస వచ్చి, ఇళ్ళల్లో పని చేసుకుంటున్నారు. పని ప్రదేశంలో భద్రత లేదు. లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఆ కేసులు బయటకు కనిపించవు. అంటూ తమ దృష్టిలోకి వచ్చిన హృదయ విదారకమైన రెండు మూడు సంఘటనలు వివరిస్తూ చివరగా రచయిత్రులు బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడే నాణ్యమైన కథలు వస్తాయని చెప్పి ముగించారు.

మకాం ( మహిళా కిసాన్ మంచ్ ) లో పని చేస్తున్న ఉషా సీతాలక్ష్మి మాట్లాడుతూ .. రాజ్యాంగానికి భిన్నంగా మహిళా రైతుల పరిస్థితి ఉంది. వ్యవసాయ రంగంలో వాళ్ళు చేసే శ్రమ, ఉత్పత్తి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ రంగంలో 72% మహిళలు పనిచేస్తున్నారు.

వ్యవసాయ రంగంలో వచ్చిన సంక్షోభం వల్ల పురుషులు నగరాలకు వలస పోయినప్పుడు ఉన్నపాటి కొద్ది పొలంలో స్త్రీలు వ్యవసాయం చేస్తున్నారు. మహిళలకు భూమితో ఉన్న సంబంధాన్ని విడగొట్టి, మూడు ఎకరాలు, అంతకంటే ఎక్కువ భూమి ఉన్నవాళ్ళనే రైతులుగా గుర్తిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు కూడా భూ యజమానులకే అందుతున్నాయి. ఇలాంటి సందర్భంలో శ్రమ చేయడము ఒక్కటే మహిళా రైతులకు మిగిలింది. అంతగా కష్టపడుతున్నా రైతుగా పురుషుడినే గుర్తిస్తుంది మన సమాజం అన్నారు.

చేనేత కార్మికులతో పనిచేస్తున్న ముళ్ళపూడి సుధారాణి మాట్లాడుతూ.. దేశం మొత్తం మీద సుమారు 35 లక్షల మగ్గాలున్నాయి. చేనేత అస్తిత్వాన్ని కాపాడుతోంది మహిళలే. దారం నుంచి ఒక చీర తయారు కావడానికి 25 సెట్స్ ఉంటాయి. అందులో 50 % శ్రమ మహిళలే చేస్తారు. సెన్సెస్ లో మాత్రం పురుషులే ఉన్నారు. మార్కెటింగ్ చేయడంలో పురుషులదే ప్రధాన పాత్ర.

సపాయి కర్మచారీ ఆందోళన్ ( SKA) సంస్థలో గత 25 ఏళ్ళుగా పనిచేస్తున్న సరస్వతి మాట్లాడుతూ .. ఈ పనిని ఎక్కువగా దళితులు చేస్తున్నారు. ఆ అశుద్ధాన్ని ఎత్తిపోసేది మహిళలే. ప్రమాద వశాత్తు డ్రైనేజీలో పురుషుడు మరణిస్తే ఆ కుటుంబ భారమంతా మహిళపైనే పడుతుంది. అలాంటి సందర్భంలో 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని సుప్రీం కోర్టు చెప్పినా అది వాళ్ళలో చాలా మందికి అందలేదు. ఇంటింటి చెత్త సేకరించే కుటుంబంలో జన్మించిన జయ కష్టపడి డిగ్రీ చదువుకొని కూడా అదే వృత్తిలో కొనసాగుతోంది. కారణం ఆ వృత్తిలో ఉన్న సాధకబాధకాలను సమాజానికి తెలియజేయడానికి. హైదరాబాదులో రోజుకు 4500 మెట్రిక్ టన్నుల చెత్త జనరేట్ అవుతున్నది.చెత్త అమ్మాయ్ అని పిలవకూడదని, తమకు ఒక పేరుందని దయచేసి పేరుతో పిలిచి తమను గుర్తించాలని, ఎంత మందికి తమ ఇండ్లలో చెత్త సేకరించే వాళ్ళ పేర్లు తెలుసు? అని ప్రశ్నించింది. చెత్తను తీసుకవెళ్ళే వాహనాల అనుమతి పురుషులకే ఇస్తారని, డ్రైవింగ్ తెలిసినా ఆ పని మహిళకు ఇవ్వరు. జయ

స్వానుభవంతో ఉద్వేగంతో మాట్లాడిన మాటలు అందరి హృదయాలను కదిలించాయి.

కుమ్మరి వృత్తి కులంలో జన్మించి చిన్నప్పటినుంచీ కుండల తయారీ విధానాన్ని చూస్తూ పెరిగిన నాంపల్లి సుజాత స్వయంగా రచయిత్రి. ముందుగా ఆ వృత్తికి సంబంధించి ఆమె రాసిన కవితను వినిపించారు. ఆమె మాట్లాడుతూ.. కుమ్మరి వృత్తిలో మహిళల శ్రమ అధికంగా ఉంటుంది. సూర్యుని చుట్టూ భూమి తిరిగినట్లు, శ్రమ చుట్టూ మహిళ తిరుగుతుందన్నారు. మట్టిని వెన్నముద్దలాగా మెత్తగా తయారు చేసి ఇచ్చే పని స్త్రీలు చేస్తారు. అప్పుడే నిరాటంకంగా కుండలు తయారవుతాయి. ఆ తరువాత అతికించడం, వాయికట్టడం మహిళలే చేస్తారు. వాయికట్టడం అంటే 1000 డిగ్రీల వేడిలో కుండలను కాల్చడం. అప్పుడే అవి గట్టిపడతాయి. కళాత్మక మైన ఐరేణి కుండలను అలంకరించడం కూడా మహిళలే చేస్తారు. గంటలతరబడి వీధిలో కూర్చొని వాటిని అమ్మే బాధ్యత కూడా స్త్రీలదే..

భవన నిర్మాణ, బీడీ కార్మికుల గురించి అనురాధ మాట్లాడుతూ.. గ్రామాలలో ఉపాధి కోల్పోయి నగరాలకు వచ్చి భవననిర్మాణ కార్మికులుగా స్థిరపడుతున్నారు. వెల్ ఫేర్ అసోసియేషన్ లో పేర్లు నమోదైన 27 లక్షలలో 40 % మహిళలు నమోదయ్యారు. పది లక్షల మహిళల గుర్తింపు కార్డులు ఇంకా రెన్యువల్ కాలేదు. సంక్షేమ పథకాలున్నా అవి సరిగా అమలు కావడం లేదు. అడ్డమీద కొన్నిగంటలు పడిగాపులు పడవలసిన పరిస్థితి. రాష్ట్రం లో 12 లక్షల బీడీ కార్మికున్నారు. ఉత్తర తెలంగాణలో 7,8 నియోజక వర్గాలలో మహిళా కార్మికుల ఓట్లున్నాయి. బీడీ కార్మికులలో 98 % మహిళలున్నారు. అందులో 4 లక్షలు ఆదివాసీ మహిళలు. బీడీకి కావలసిన ఆకు సేకరణ వాళ్ళ ప్రధాన వృత్తి. ఈ రంగంలో విపరీతమైన శ్రమ దోపిడీ ఉంటోంది. యజమాని నాసిరకం ముడిసరుకు ఇస్తే 1000 బీడీలకు బదులు 800 తయారైతే వాళ్ళ కిచ్చే డబ్బులో కోత పెడతారు. ఈ రకంగా ఆర్థిక దోపిడీ కూడా ఉంటుంది. ఈ శ్రమలో తల్లితో పాటు పిల్లలూ కష్టపడతారు.

మేదర వృత్తి గురించి రచయిత్రి లక్షీ సుహాసిని మాట్లాడారు. "వెతలు తీరని వెదురు మహిళా కార్మికులు"అనే పేరుతో తానొక పరిశోధనా పత్రం సమర్పించినట్లు చెప్పారు. తరువాతి కాలంలో ఎరుకలు, యానాది వాళ్ళు కూడా బుట్టలు అల్లుతున్నారు. అయితే మేదర వాళ్ళు చెట్లు నరకరు. 20,30 కుటుంబాలు కలిసి ఒక లారీ లోడు తెచ్చుకుని పంచుకుంటారు. ఒక వెదురు బొంగుతో ఐదు చాటలు తయారు చేయవచ్చు. అందరూ పనిని సమానంగా పంచుకుంటారు. పురుషులు వెదురు చీరుతారు. నిలబడి ప్రశాంతంగా అల్లే తడికలు పురుషులు చేస్తారు. గంటల తరబడి కూర్చొని గర్భవతులు, బాలింతలు బుట్టలు అల్లుతారు. వృద్ధ మహిళలు విసరకర్రల లాంటి చిన్న వస్తువులు అల్లుతారు. తెల్లవారు జామునే 3,4 గంటలకు బయలుదేరి ఊరూరూ తిరిగి వాటిని అమ్మేపని మహిళలే చేస్తారు. కాలానికి అనుగుణంగా పెళ్ళి వేడుకలలో ఉపయోగించే బుట్టలను మహిళలు అలంకరిస్తున్నారు.

చైతన్య మహిళా సంఘం నుంచి జయ మాట్లాడుతూ.. గ్రామాలలో నేటికీ కులాన్ని వృత్తిని విడదీసి చూడలేము. ఇప్పటికీ కొన్ని చోట్ల కులవృత్తులు మనుగడలో ఉన్నాయి. ఆదిమ సమాజంలో మొదటి డాక్టర్, ఇంజనీర్, శాస్త్రవేత్త మహిళనే. అప్పట్లో పశువుల పెంపకం మహిళలు చేసేవారు. గ్రామాలలో రజక స్త్రీ ఇంటింటికీ వెళ్ళి మురికి బట్టలు సేకరిస్తుంది. వాటిని చాకి రేవుకు తీసుకు పోయి, విడి విడిగా స్త్రీపురుషుల బట్టలను సోడా వేసి ఉడక పెడుతుంది. అప్పుడు పురుషడు పురుషుల బట్టలను మాత్రమే ఉతుకుతాడు. మహిళలు స్త్రీల బట్టలు ఉతకడంతోపాటు అన్నింటిని ఆరవేయడం, తరువాత వాటిని విడి విడిగా మడతబెట్టి, ఇంటింటికీ వెళ్ళి లెక్క తప్పకుండా తిరిగి ఇవ్వడంలో రజక స్త్రీ తెలివితేటలు కనిపిస్తాయి. ఈనాటికీ శుభ, అశుభ కార్యాలు రజక స్త్రీల ప్రమేయం లేకుండా జరగడం లేదు. గౌడ వృత్తిలో తాటిచెట్ల మీదకు ఎక్కడానికి వాడే మోపు మహిళలు తయారు చేస్తారు. ప్రమాదంలో పురుషుడు చనిపోతే కుటుంబ భారమంతా స్త్రీల పైన పడుతుంది. ఈ మధ్య తక్కువ సంఖ్యలో యువతులు కూడా తాటి చెట్లు ఎక్కి కల్లు తీస్తున్నారు. కల్లును మహిళలే అమ్ముతారు. ఆ క్రమంలో కల్లు తాగిన పురుషుల చూపులను, మాటలను, కొన్నిసార్లు చేపలను ఎదుర్కోవలసి ఉంటుంది. మంగలి వృత్తిలో వైద్యసదుపాయం లేని మారుమూల గ్రామాలలో ఈనాటికీ మహిళలే మంత్రసానులుగా పురుడు పోస్తున్నారు.

బ్రహ్మచారి ( నిధి కలం పేరు ) మాట్లాడుతూ.. కంసాలి, కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి ఈ ఐదు కులాలను ఒకటిగా చెపుతారు. కమ్మరి, వడ్రంగి వ్యవసాయానికి సంబంధించిన వృత్తులు. కమ్మరి వృత్తిలో మహిళల శ్ర మ ఎక్కువగా ఉంటుంది. కొలిమి దగ్గర చక్రం తిప్పడం. కాల్చిన ఇనప కడ్డీని సుత్తితో కొట్టటం మహిళలు చేస్తారు. 1990 తరువాత సరళీకరణ విధానాలు అమలులోకి వచ్చాక యంత్రాలు ప్రవేశించడం వలన చాలా చేతి వృత్తులు కనుమరుగయ్యాయి.

మత్స్యకార వృత్తిగురించి బాలకృష్ణ మాట్లాడుతూ.. పురుషులు తీసుకువచ్చిన చేపలలో కొన్ని రకాలను ఎండబెట్టి భద్రపరచడం, రిటైల్ మార్కెట్ మహిళలు చేస్తారు. వినియోగ దారులకు చేపలను శుభ్రపరచి ఇవ్వడంలో మహిళల శ్రమ ప్రత్యేకంగా కనిపిస్తుంది. గృహ పెత్తనం మహిళదే అంటూ " ఇల్లు చేపల మార్కెట్ లాగా ఉంది." అనే సామెతను చెప్పారు. కానీ ఈ విషయంలో మహిళగనక ఉపన్యసించి ఉంటే సరైన కోణంలో మాట్లాడేది అనిపించింది.

అసంఘటిత రంగంలో మహిళల శ్రమశక్తి అనే విస్తారమైన అంశాన్ని చర్చించడానికి ఒకరోజు సరిపోదని వక్తలు, శ్రోతలు అందరూ అభిప్రాయ పడ్డారు. చివరగా రచయిత్రి శాంతి ప్రబోధ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెపుతూ.. ఆయా రంగాలలో పనిచేస్తున్న మహిళా కార్మికుల పట్ల ఒక అవగాహన కలిగిందని, వాళ్ళ దగ్గరకు వెళ్ళి మరింత సమాచారాన్ని సేకరించి కథలు రాయవలసిన బాధ్యత మహిళా రచయిత్రుల పైన ఉందని, ఆ పనిలో లీనమవుదామంటూ ముగించారు.



~


Read More
Next Story