ఇకబెనా ఆర్ట్ తో మానసిక ప్రశాంతత!  ఈ ఆర్ట్ తో పూలు ఎండవట!!
x
Ikabena artist Hema Patkar

ఇకబెనా ఆర్ట్ తో మానసిక ప్రశాంతత! ఈ ఆర్ట్ తో పూలు ఎండవట!!

కొన్ని గంటల్లో వాడిపోయే పూలను రోజుల తరబడి కంటికి ఇంపుగా కనిపించేలా చేయవచ్చా, అదెలా సాధ్యం?


కళలు 64 అంటారు గాని అంతకుమించే ఉండొచ్చు.. పాటలు పాడడం ఒక కళ. నాట్యం చేయడం ఒక కళ. చెట్టు మీద ఉండాల్సిన ఆకులు, పూలను... నేల మీదకు తెచ్చి రంగవల్లిక ఆవిష్కరించడం ఓ కళ... అలాగే కాన్వాస్‌ మీద ఆవిష్కరించడం మరో కళ. అదే పూలు, లతలను వస్త్రం మీద కుట్టడం ఓ కళ. తాజా పూలను కుండీలో అమర్చడమూ ఓ కళ. అన్ని కళలకు ఉన్నట్లే ఈ కళకు కూడా కొన్ని నియమాలున్నాయి. ఈ కళను సాధన చేయడం ధ్యానంతో సమానం అంటారు ఇకబెనా కళాకారులు. ఇకబెనా అనేది జపాన్‌కు చెందిన పూల అలంకరణ విధానం. జీవితానికి అన్వయిస్తూ సూత్రబద్ధంగా చేసే అమరిక. జపాన్‌ కళకు భారతీయ సొగసులద్దిన ఇకబెనా కళాకారిణి స్థూబాకి హేమా పాట్కర్‌.

తూమ్మలూర్ లో ఇకబెనా ప్రదర్శన...


ఇకబెనా ఆర్టిస్టునని గర్వంగా చెప్పుకునే హేమా పాట్కర్ ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా తుమ్మలూర్‌ ఉంటున్నారు. మ్యాక్‌ ప్రాజెక్ట్‌లో ఇకబెనా పూల ప్రదర్శన పెట్టారు. కంటికి ఇంపుగా కనిపించే రంగురంగుల పూలు అమర్చారు. మనసుకు స్వాంతన ఇచ్చే పూల అమరిక ఎంతో ముచ్చటగొలుపుతోంది. కొన్ని గంటల్లో వాడిపోయే పూలను రోజుల తరబడి కంటికి ఇంపుగా కనిపించేలా చేయడమే ఇకబెనా ఆర్ట్‌. ఇకబెనా కళ ధ్యానంతో సమానమంటారు. ఇకబెనా అనేది జపాన్‌కు చెందిన పూల అలంకరణ విధానం. దానికో చరిత్ర కూడా ఉందంటారు. ఈ కళలో హేమా పాట్కర్‌కు 30 ఏళ్ల అనుబంధం ఉంది.

బౌద్ధం నుంచి రూపుదిద్దుకున్న కళ...

ఇది బౌద్ధం నుంచి రూపుదిద్దుకున్న కళ. బుద్ధుని ప్రతిమ ఎదురుగా ఒక పాత్రలో నీటిని పెట్టి అందులో కొన్ని పూలను సమర్పించడం నుంచి ఆ పూల అమరిక మరికొంత సూత్రబద్ధతను ఇముడ్చుకుంటూ ఎన్నో ఏళ్లకు ఇకబెనా ఫ్లవర్‌ అరేంజ్‌మెంట్‌ అనే రూపం సంతరించుకుంది. పూలను చూస్తే మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రకృతి ఒడిలో జీవించడం అన్నివేళలా సాధ్యం కాదు, కాబట్టి ప్రకృతిని ఇంట్లోకి ఆహ్వానించడం అన్నమాట.

మనిషి జీవన చక్రమేనా ఈ కళ..

అలా బౌద్ధ చైత్యాల నుంచి ఈ సంస్కృతి బౌద్ధావలంబకుల ఇళ్లలోకి వచ్చింది. ఈ పూల అలంకరణ ప్రకృతికి, మనిషి జీవితానికి మధ్య ఉండాల్సిన అనుబంధానికి ప్రతీక. ఒక త్రికోణాకారంలో పైన స్వర్గం, కింద భూమి, మధ్యలో మనిషి... ఈ మూడింటికి ప్రతిరూపంగా ఉంటుందీ అమరిక. మనిషి జీవన చక్రం ఇమిడి ఉంటుంది. పై నుంచి కిందకు... ఒకటి విచ్చుకోవాల్సిన మొగ్గ, ఒకటి అర విరిసిన పువ్వు, మరొకటి పూర్తిగా విచ్చుకున్న పువ్వు... ఈ మూడు పూలు భవిష్యత్తు, వర్తమానం, భూత కాలాలకు సూచికలన్నమాట. ఫ్లవర్‌ అరేంజ్‌మెంట్‌ ప్రాక్టీస్‌ ధ్యానం వంటిదే. రోజూ కొంత సమయం ఫ్లవర్‌ అరేంజ్‌మెంట్‌లో గడిపితే ధ్యానం తర్వాత కలిగే ప్రశాంతత కలుగుతుందంటారు హేమా. ఇటీవలే హేమా పాట్కర్ మాస్కోలో జరిగిన అంతర్జాతీయ ఇకబెనా ప్రదర్శనలో పాల్గొని వచ్చారు.

Read More
Next Story