
మంచం ప్రాపంచిక దుఃఖాన్ని పాడే ఒక పియానో !
‘ఇల్లు’ గీతాంజలి రాజకీయ కవితలు
అనగనగా ఒక ఇంటి మంచం!
అనేకానేక మంచాలకు
అది ఏకవచనం!
కమ్మగా నిద్ర పుచ్చే మంచాలు!
నిదురే పోనివ్వని మంచాలు!
ఆడవాళ్ళని అణిచేసే మంచాలు!
మనుషుల్ని మృత్యువు కాటేస్తే ఖాళీ అయిన మంచాలు!
చంపేసే మంచాలు!
చచ్చిపోయే మంచాలు!
పట్టె మంచాలు, పందిరి మంచాలు,
డబుల్ కాట్ మంచాలు,నవారు మంచాలు,
నులక మంచాలు. ఓహ్.. ఎన్నెన్ని రకాల మంచాలని?
***
మంచానికో కథ!
ఆడవాళ్ళ కథ
మగవాళ్ళ కథ
ముసలి వాళ్ళ కథ
పడుచు వాళ్ళ కథ
పిల్లల కథలు!
వాళ్ళ కలల కథలు
వాళ్ళ కలలు కన్నీరైన కథలు!
కొన్ని అందమైన కథలు
మరి కొన్ని భగ్న కలల కథలు!
మరి కొన్ని నొప్పి కథలు.
అన్నీ మంచాలు చెప్పే కథలే!
ఇన్ని కథలకు మంచాలే సాక్ష్యాలు!
***
ఒకసారి ఏ ఇంట్లోకయినా వెళ్ళి .,
ఏ మంచాన్నైనా కదిలించి చూడండి.
ఎన్నెన్ని స్వరాలు,
రాగాలు వినిపిస్తాయో వినండి!
***
ముత్తవ్వల కాలం నుంచి
మనవరాలి కాలం వరకూ
ప్రణయ గీతాల నుంచీ
దుఃఖ రాగాల వరకూ,
సోది కథలు,జాంబవంతుడి కథలు,
సూఫీ సూక్తులు, రూమీ రుబాయిలు,
గజళ్ళు,షేర్, షాయరీలు,
విప్లవ గీతాలు,దాశరథి పద్యాలు,
వేమన శతకాలు...
మౌనగీతాలు
మంచం ఒక సంగీత సర్వస్వం
***
మంచం
తన మీద నిదురించిన ముత్తాత,తాత,
నాన్నల గురించి ,
ముత్తమ్మ నానమ్మ అమ్మమ్మ,
అమ్మల గురించి
అలవోకగా కథలు కథలుగా చెబుతుంది.
మంచం ఒక ఎన్ సైక్లోపీడియా
***
పిల్లల బాల్యాన్నంతా
పేదరాశి పెద్దమ్మల,బొమ్మరిల్లు,
చంద మామల కథలన్నీ
చెప్పినిద్ర పుచ్చిన మంచాలు.
మంచం స్టోరీ టెల్లర్!
***
ఆరు బయటి నులక మంచాలు
డాబా మీది వెన్నెల మంచాలు,
కోయిల పాటలుగా,కోళ్ళ కూతలుగా,
కలలు,కన్నీళ్లుగా తెలవారే మంచాలు!
***
మంచం రైతు అవడాన్ని విన్నారా ఎపుడైనా?
భూమికి పూసిన మంచు మొక్కల్లా,
జాబిలి కింద రేయి రేయంతా
పొలాలకి కాపలా కాసే మంచాలు!
ఆరుగాలం
పంటల్ని పండించే
రైతులైపోయే మంచాలు!
మంచం ఊరికి ఉపమానం
***
కొన్ని మంచాలుంటాయి!
అడవిలో మోదుగు చెట్ల నీడల్లో
అన్నల,అక్కల కలలు కనే మంచాలు!
విప్లవ గీతాలు పాడే మంచాలు!
అన్నల,అక్కల అమరత్వాన్ని మోసే
స్థూపాల్లాంటి మంచాలు!
అన్నల స్పర్శ తో పులకించి
కన్నీటితో లాల్ సలాం చేసే కామ్రేడ్ మంచాలు!
***
యుగాలుగా ఇంటి మగవాళ్ళు
ఆ ఇంటి ఆడవాళ్ళ మీద
చేసిన రాక్షస రతిని,
ఆ తల్లులు కార్చిన రక్త కన్నీటిని
వాళ్ళ ఒంటి మీది గాయాలతో సహా
విల విల్లాడుతూ చెప్పే మంచాలు!
మంచం మనుషుల్ని సజీవంగా మోసే పాడే!
***
కిటికీ నుంచి చంద్రుడి వెన్నెలని గుంజుకుని,
మల్లెలను పరుచుకుని,
అతగాడి ప్రేయసికి స్వాగత రాగాలు పలికే మంచాలు.
ప్రేమే సాధనంగా సున్నితమైన శృంగారంతో
అంగప్రవేశం కాకుండా హృదయ ప్రవేశం చేసిన
అందమైన మనసున్న భర్తల గురించి చెబుతాయి
ఆమెతో పాటు తామూ పరవశులైన మంచాలు.
***
ఆమె రాత్రుళ్ళు నిద్ర మేల్కొని,
రాసే కవిత్వాన్ని,కథల్ని
సరిచేస్తుంది మంచం.
నిద్ర రాక ఆమె వినే గజళ్లని,
రాగాలనీ తానూ పులకింతగా
వింటూ ఉంటుంది మంచం.
ఆమె..హృదయం లేని తన ప్రేమికుణ్ణి
తలచుకుని కార్చే వెచ్చని కన్నీళ్ళని
లాలనగా తుడిచి నిద్ర పుచ్చుతుంది మంచం!
***
అమ్మలు పిల్లల ఆకలి శైశవ రోదనలనీ,
పాలిచ్చి నిద్రపుచ్చే జోలపాటలకి
తానూ శిశువై నిద్రపోతుంది మంచం!
***
కొన్ని మంచాలు, పట్టు పరుపులతో
మెరిసిపోతూ ప్రణయో ద్వేగంలో
మునకలేసిన ప్రేయసీ ప్రియుల
శృంగార కథలు సిగ్గుపడుతూ చెబుతాయి.
***
కుక్కి మంచాలు,నులక,
నవారు మంచాలు,
నేల మీది ఈత చాపల మంచాలు,
వొట్టి దుప్పటి మంచాలు,
ముక్కిపోయిన బీద పరుపులతో
ఆకలి కథలు, అప్పుల కథలు,
నిరుద్యోగపు, కన్నీటి కథల్ని
నిద్రకి వెలివేసి మరీ చెబుతాయి
***
కొన్ని మంచాలు వైద్యానికి
డబ్బందని రోగిష్టి కథలు చెబుతాయి
మృత్యువు కథలు చెబుతాయి.
శవాల కథలు చెబుతాయి.
మనుషులు ప్రాణంకోసం
అల్లాడుతూ విడిచిన చివరి
ఊపిర్ల కథలు చెబుతాయి.
***
అమ్మలు ప్రసవపు నొప్పులతో
కనలేక పెట్టిన గావు కేకలతో లోకం లోని
అన్ని రకాల మంచాలూ
కుల,మత,వర్గ తేడా లేకుండా
తామూ కన్నీళ్ళు పెడతాయి!
***
కానీ,
అన్నిటికంటే రుక్సత్ బేగం మంచం,
తాజ్ మహల్ అవసరం లేని
నూర్జహాన్ మంచాలు మాత్రం
పన్నెండో కాన్పుల దాకా ..
గర్భ సంచి పగిలిపోయేదాకా
కనలేక పొర్లి పొర్లి ఏడుస్తుంటే,
కన్నాక,కనలేక వాళ్ళు చచ్చి పోతుంటే..
ఆ బాలింత తల్లుల,
చచ్చిపుట్టిన పిండాల
మృతదేహాలు మోయలేక
మరీ ఎక్కువగా విలపిస్తాయి.
***
ప్రతి ఏడాదీ,కడుపులో
ఒక నిత్య గర్భంతో, చేతుల్లో ఒక శిశువుతో
సంవత్సరం పొడుగూతా,
జలపాతాల్లా పాలు కార్చుకునే రొమ్ముల్ని..
ప్రతీ ఏడాది శిశువుతో పాటు
రక్తాన్ని కార్చుకునే గర్భాశయాల్ని,
రొమ్ములు,గర్భ సంచీలునున్నందుకు
సముద్రాల్ని రెండు కళ్ళల్లో మోస్తూ ఉండే
ఆ స్త్రీలని, ఓహ్.. ఆ నిస్సహాయ స్త్రీలని మోసి,
మోసి కృంగి పోతాయి మంచాలు..
లెక్కలేనన్నిమంచాలు!
రక్త శిక్తాలైన మంచాలు!
వాళ్ళ కోసం ఆసుపత్రులైన మంచాలు!
మంచం వేదనకు సర్వనామం
***
సీత కోసం మాత్రం? మగ పిల్లాడే కావాలని
అబార్షన్ల మీద అబార్షన్లు చేస్తుంటే..
ఆడపిండాలని హత్యలు చేస్తుంటే..
అవే మంచాలు ఆపలేక ,
కోతల, కుట్ల, వాతల దేహాల్ని
చూడలేక మంచాలు ఏడుస్తాయి.
*. భర్త, పెళ్లి,దాంపత్యం పేరుతో
ఇష్టం లేకపోయినా భార్యలని రేప్ చేస్తుంటే
మంచాలు తామూ భయంతో
పారిపోవాలని చూస్థాయి.
***
మేల్ మెనోపాస్ కి చేరుకున్న వాడి ముసలి తనం,
వడలి పోయిన అంగాల్ని
వయాగ్రాలతో కత్తులుగా మార్చుకుని
ఎండిన ఆమెల వృధ్ధ యోనుల్ని
చీల్చి మంటలు రేపుతుంటే,
మౌనంగా వద్దంటూ విలపిస్తాయి
ముసలి మంచాలు!
***
చీకటి రాత్రుళ్లలో ఇళ్లనుంచి
బయలుదేరే వందల
మర్యాద పూర్వకమైన పురుషాంగాలకి,
తమ దేహపు పుండుని,అప్పచెప్పే వేశ్యా తల్లుల రక్తంలో
మగ సుఖరోగ క్రిముల వ్యభిచారపు పాకులాటను
అసహ్యించుకుంటాయి మంచాలు!
వొట్టి పురుషాంగాల,అత్యాచారాల వాసన వేసే
మంచాలు అభ్యంగన స్నానం కోసం తపిస్తాయి.
అవే మంచాల మీద విటుల
రాక్షస రతిలో అలసిన తల్లులని
నిద్రపుచ్చుతాయి మంచాలు!
***
పుట్టింటికి వచ్చిన ఆడపిల్ల
మెట్టింటి కడగళ్ళ కన్నీళ్లను పీల్చి
ఓదారుస్తూ కన్నతల్లులవుతాయి మంచాలు.
మొగుడి దెబ్బల నొప్పిని తామూ
ఆమె చర్మంలా అనుభవిస్తూ
బాధతో మూల్గుతాయి మంచాలు!
***
మంచాలు తమ మీద
అనాదిగా స్త్రీల యోనుల ,
గర్భ సంచీల,రొమ్ముల మీద
మనసు మీద,ఆత్మ గౌరవాల మీద
జరుగుతున్న దాష్టీకాలకి నివ్వెరపోతూ
మౌన కన్నీటి సాక్ష్యాలుగా
నిస్సహాయమైపోతుంటాయి.
ఆగ్రహంతో రగిలిపోతుంటాయి!
***
అందుకే మంచాలు ఒక్క శృంగార రసోద్వేగ
సుఖపు కేరింతలని, విరహదుఃఖానందాన్ని,
కవిత్వాన్నీ, గజళ్లని,
కమ్మని నిద్రనీ మాత్రమే కాదు!
లోకంలోని దరిద్రాన్ని,ఆకలి కేకలని,
స్త్రీల ఆర్తనాదాలని పాడే
విశాలమైన
ఒక వెదురు సంగీత సాధనం!
మంచం ప్రాపంచిక దుఃఖాన్ని మోసే
ఒక పియానో!
***
మనుషుల అక్రమ దంపతీ సంబంధాలు
క్రమమై పోవడాన్ని,
నిజమైన ఆత్మైక ప్రేమ సంబంధాలు
అక్రమమైపోవడాన్ని
వేదనతో పరిశోధిస్తాయి
మంచాలు !
***
మంచం చేయించిన మగవాడు
ఎదురు తిరుగకుండా
ఆమెల నోళ్లనే కాదు,
తన సుఖానికి యోనుల్ని కూడా
బిగుతుగా కుట్టుకుంటాడు!
మగాడి కోసం యోనులనే కాదు,
రొమ్ముల్ని కూడా సిలికాన్ ద్రవాలతో నింపి
సైజు పెంచే మగ కార్పొరేట్ ఆసుపత్రుల వ్యాపారాన్ని
చూస్తూ నివ్వెర పోతాయి మంచాలు.
స్త్రీలు వాళ్ళకి లేబ రేటరీల్లో ఎలుకల్లా
పరిశోధక జంతువులుగా మారడాన్ని
దిగ్భ్రాంతిగా చూస్తుంటాయి మంచాలు!
***
అమ్మానాన్నల వృద్ధాప్యాన్ని
పెంచలేని పిల్లలు అమాంతంగా
వాళ్ళని ఇంటి మంచాల నుంచి,
వృద్ధాశ్రమాల మంచాల్లోకి విసిరేసి నప్పుడు
వద్దు వద్దంటూ కన్నీటితో నివ్వెరపోతాయి
ఆ వృద్ధ మంచాలు!
తాము కూడా వృద్ధులై పోయినట్లు,
వేదనతో ముడుతలు పడి
ఒంటరై పోతాయి మంచాలు!
ముసలై పోతాయి మంచాలు!
***
అందుకే మంచాలేమి
కవులు వర్ణించినట్లు
రసహృదయాలేమీ కావు
అనాదిగా స్త్రీల మీద జరిగిన
లైంగిక అత్యాచారాలని,
గర్భ సంచులు పిల్లలు,
పిండాలతో సహా ప్రసవించిన,
ప్రవహించిన రక్త కాసారాలలో
తేలిన కన్నీటి మంచాలవి!
కళ్ళున్న,హృదయం ఉన్న మంచాలవి !
***
కానీ కొన్నిసార్లు ఆ ఇళ్లలో మగవాడి
అత్యాచారాలకు బలి అయిన
తర తరాల స్త్రీలకి
మంచాలు కూడా రేపిస్ట్ భర్తల్లా
కనిపించి భయపెడతాయి.
రాత్రవుతుందంటే చాలు
ఆ స్త్రీలతో పాటు
మంచాలు కూడా వొణుకుతాయి!
అప్పుడా స్త్రీలు మంచాన్ని
వెలివేసి నేల తల్లి వొడిలో
మునుక్కుని పడుకుంటారు!
***
అందుకే..
మనవరాలు తన పెళ్లి కానుకగా అడిగిన
ముత్తాతల నాటి
అందమైన పూల తీవెల
నగిషీలున్న పట్టేమంచాన్ని ,
నానమ్మ ముక్కలు చేసి
భోగి మంటల్లో కాల్చేసి
పగలబడి నవ్వుతుంది!
హృదయం ఉన్న మంచం
విల విల్లాడుతూ దగ్ధమైపోతుంది.
***
చాలా సార్లు
మంచాలు తామూ మనుషులు
నిద్రపోవడానికి మాత్రమే కాదు,
క్రూర మృగాల్లా ఆడబిడ్డల మీద
అత్యాచారాలు చేయడానికి కూడా..
అణిచి వేయడానికి కూడా
అని అర్థం అయిన మంచాలు
హృదయం లేని మనుషుల్ని
సహించలేని మంచాలు
దుఃఖం భరించలేక
ఆత్మహత్య చేసుకుంటాయి!
మంచాల తల్లులైన చెట్లు కూడా
అడవిలో కాకుండా క్రూరమైన మనుషుల మధ్య
ఉన్నందుకు దుఃఖం తో కుమిలిపోతాయి.
ఇళ్లలోని స్త్రీలే కాదు,అనాది మంచాలు కూడా
ప్రతీ క్షణం ఒక వెరపుతో
దివా రాత్రుళ్ళు గడుపుతాయి.
Next Story