ఇల్లే మనుకుంటుంది చెప్పు? (ఆదివారం కవిత)
x

ఇల్లే మనుకుంటుంది చెప్పు? (ఆదివారం కవిత)

జీవితం ఇంటి చుట్టూ తిరుగుతూంటుంది. జీవితాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తుంది. ఇట్లాంటి ఇంటి ఎనాటమీ చూపెట్టే కవితలు




ఇల్లే మనుకుంటుంది చెప్పు ?


గీతాంజలి【ఇల్లు సీక్వెల్ కవిత-5 】


వెళ్ళు..అలా ఇంటి వైపుకి !

దారి మరిచిపోయావా...కావలిస్తే గూగుల్ మాప్ పెట్టుకో...కానీ వెళ్ళు !
వెళ్ళు.. వెతుక్కుంటూ వెళ్లు !
యుగాల క్రితం నువ్వెళ్ళి ఉండిపోయిన వాషింగ్టన్ డీసీ నుంచి నీకు పురాజ్ఞాపకం లాంటి నీ ఊర్లో ఇల్లు దొరికితే మంచిదే ! పోనీ వర్చ్యువల్ గా నన్నా ముట్టుకో రాదు నీ ఇంటి ఆత్మని?
అనాథల్ని చేసిన అమ్మానాన్నలను ? పోనీ వాళ్ళ సమాధులను ?
ఇల్లు నీ గురుంచి ఏమనుకుంటుంది చెప్పు ?
పోనీ ..ఇంటికి నువ్వేమిచ్చావో అదైనా చెప్పు !
అమ్మ నాన్న వదిలిన చివరి ఉపిరిని అందుకుని నీకోసం శ్వాసిస్తున్న ఇల్లు కదా..అది ?
నీకోసం చూసిన కడసారి చూపుల కనురెప్పలని దుఃఖంతో మూసి.. తాను అందుకుని తన కళ్ళల్లో నింపుకున్న ఇల్లు కదా...
తానే అమ్మైన ఇల్లు కదా...
వెళ్లు.. అలా నీ ఇంటివైపు ..!
ఇల్లంటే ఏమనుకున్నావు ?
బడి నుంచి రాగానే ఆకలితో నువ్వెతుక్కున్న అమ్మ చేతి ముధ్ద .
అన్నం పెట్టలేనప్పటి అమ్మ నైరాశ్యం .
చాలా సార్లు..ఇల్లంటే నీకోసం ఉడుకుతున్న అన్నం గిన్నె.
పెరట్లో నీకోసం కాచిన సీతాఫలం.
ఎండాకాలం ఎండిపోయిన నీ ఒంటి మీద.. బీర పువ్వులా బోసినవ్వుతో నానమ్మ కుమ్మరించిన చేద బావి నీటి చల్లదనం ఇల్లు .
చలికాలం సల సల కాగే గంగాళంలో నీళ్ళైన ఇల్లు !
ఆటలో నీ మోకాలి గాయానికి మలాము అధ్ది దగ్గర తీసిన నాన్న కౌగిలి నీ ఇల్లు.
అత్తారింటి వలపోతల్ని రాసిన అక్క ఉత్తరపు వెక్కిళ్లు కాదూ ఇల్లు ?
ఇల్లంటే..నీ చదువుకోసం రెండెకరాల సాగుభూమిని కలతబారిన మనసుతో అమ్మిన నాన్న దుఃఖం !
ఆస్తమా దగ్గుతో డస్సిపోయే ముత్థవ్వ ఎండిన గాలితిత్తులలో.. చిరుగాలి నింపిన కిటికీ ఇల్లు .
ఇల్లంటే నీతో పాటు పెరిగిన కొట్టంలో ఆవు,మేకా, గొర్రె ,కోడి..వాకిట్లో నీ దోస్తులు..అక్కా..చెల్లెళ్ళు జమిలిగ పాడిన బృంద గానం కాదూ...
ఇల్లంటే...రాత్రిపూట వెన్నెల్లో మిద్దె మీద రహస్యంగా వొణుకుతున్న వేళ్ళతో .. నీకే వినపడే గుండె చప్పుడు తో రాసుకున్న తొలి ప్రేమలేఖ కదా !
ఆమెను తలుచుకుంటూ నువ్వు పాడుకున్న ప్రణయ రాగం కదా ఇల్లు ?
ఇల్లంటే వసారాలో వెక్కిళ్ళు పెడుతూ నువ్వు బట్టీ పట్టిన.. నీకెన్నటికీ రాని తొమ్మిదో ఎక్కం !
నీ వాకిట్లోకొచ్చి నీ మీద నెమలీకల్తో ఊదు ఊదిన జహంగీర్ పీరా ప్రేమ మంత్రం ఇల్లు !
ఇల్లంటే అమ్మ చేతులకి పూసిన నిండు బతుకమ్మ!
వెళ్ళు... అలా నీ ఇంటి వైపు !
పీరు సాబు చేతిలోని అగర ధూపాన్ని ఇంటి చుట్టూ తిప్పోసారి.. పాడు బడి చితికిన ఇంటిని గాఢంగా హృదయానికి హత్తుకో. ఇంటికి అలాయ్ బలాయ్ చెప్పోసారి.
అమ్మ లాంటి బతుకమ్మను ఇంటి ముందు గొబ్బెమ్మల్లో జతనంగా విడువు ! చిట్లిన పెద్దర్వాజకి మామిడాకులు కట్టు !
మరిక కదలబారు !
ఊరేమీ అనుకోదు.. ఇల్లేమీ నవ్వదు ! అలా ఇంటి వైపు వెళ్లు...ఇంటినోసారి పలకరించు. ఇంటి ముఖాన్ని గోముగా నీ అరచేతులతో నిమురు...ఇంటి కన్నీళ్లు తుడువు. మరిచిపోయినందుకు క్షమాపణ అడుగు !
ఏడుపోస్తే ఏడ్చేసేయ్..
కన్నీళ్లతో ఇంటి గుమ్మా న్ని కడుగు !
వెళ్లు.. నిన్ను పెంచిన ఇంటి రుణం తీర్చుకో !
లేక పోతే..ఇల్లు నీ గురుంచి ఏమనుకుంటుంది చెప్పు ?


Read More
Next Story