అమ్మా... ఎక్కడివే నీకిన్ని చేతులు?
x

అమ్మా... ఎక్కడివే నీకిన్ని చేతులు?

గీతాంజలి 'ఇల్లు' సీక్వెల్ కవిత- 21


ఎంత అందమైన ఇల్లు? రంగు రంగుల ఇల్లు?దృఢమైన ఇల్లు?

ఇటుకల బదులు అమ్మ చేతులు !
వందలు, వేలుగా.. ఇంటిని నిలబెడుతూ..
పగుళ్లను అతక బెడుతూ...
ఒంటరై దు:ఖిస్తున్న ఇంటి తలని నిమురుతూ !
ఇల్లా అది? ఇటుకలా అవి?
రాతి పునాదులా అవి ?
అమ్మ చేతులు కావా అవి?
అమ్మ భుజాల
అమ్మ వెన్నెముకల
స్థిరమైన పాదాల
గుండె... గూడు ఎముకలుకావూ...
ఒట్టి ఇల్లా అది మరి?
అమ్మ రక్తమాంసాలు
అమ్మ దేహపు చెమటధారలు
నిలిపిన ఇల్లు కాదా అది?
**
పుట్టినింటి నుంచి.. మెట్టినింటికి వచ్చిన
లేత కొమ్మల్లాంటి అమ్మ చేతులు..
గిడసబారి విరిగిన కొమ్మల్లా అయిపోయాయి.
అరచేతి రేఖలు... ఎండు గడ్డిపోచల్లా అరిగిపోయాయి.
శ్రమైక చేతులు అమ్మవి
ఎండిన బీడు భూముల్లా పగుళ్లుబారాయి.
ఆ చేతులతో.. రైతుగా పొలంలో కలుపు లేరి
దుక్కిదున్ని... కూలీగా మట్టి తట్టలెత్తి
రాళ్లు కొట్టి
సఫాయి కార్మికురాలిగా అర్థరాత్రి ప్రమాదపు ఘడియల్లో
రోడ్లూ ఊడ్చి...
పూట పూట గంపెడన్ని బాసాండ్లు తోమి.
ఇంటిని సాదిన తల్లీ..
ఇంటి నిండా నీ చేతులే కదా?
ఎక్కడివే అమ్మా.. నీకిన్ని చేతులు?
** **
కూరగాయలు కోస్తున్నప్పుడు
కొడవలితో పంట కోస్తున్నప్పుడు గాట్లు పడ్డ నీ చేతులు.
ముళ్ళూ, రాళ్ళూ గుచ్చి ఎర్రమందారాలైన చేతులు!
వంట చేస్తున్నప్పుడు
వేడి నూనె కాలి బొబ్బలెక్కి మచ్చలైన చేతులు.
నాన్న పోతే అమాంతం ఇంటిని
కూలీతట్టై నెత్తిన మోసిన చేతులు!
ఇంటినిలా సాదిన అమ్మా
ఇంటి నిండా నీ చేతులే కదా?
** **
అమ్మా...
రాత్రెప్పుడో అలసి, నొప్పైన చేతి వేళ్ళ మెటికల్ని విరిచి..
నిద్రలోకి ముడిచేస్తావా..
తెల్లారగట్ల సూర్యుడు లేవకముందే లేచి..
చేతులు పైకి చాపి..
తల్లీ ఏం మంత్రం చదువుతావో కానీ...
పనిలోకి దిగక ముందే
వంద చేతులు
ఒంటినిండా మొలిపించుకుంటావు.
***
వాకిట్లో పెరట్లో
కిటికీల్లో... తలుపుల్లో
గోడల్లో నేలలో
స్నానం గదిలో, మురికిబట్టల్లో
పొయ్యిలో మంటల్లాంటి చేతులు !
పండగల నూనెల్లో సల సలా మరిగి వేగిన చేతులు.
ఎంగిలి గిన్నెల్లో
ఇంటి బూజుల్లో
నేల నిండిన దుమ్ముల్లో
ఉడికే అన్నం గిన్నెలో
పొంగే పాలలో
కాలే పొయ్యిలో
చకా చకా ఉరుకుతూ కదలాడేవి
అమ్మా నీ చేతులే కదా?
ఎక్కడివే అమ్మా నీకిన్ని చేతులు ?
***
కూలిపోతున్న ఇంటిని
గుండెకు హత్తుకుని కాపాడిన చేతులు.
మాకు కథలు చెప్పిన నవ్వించిన చేతులు
చిచ్చికొడ్తూ జోలపాడిన చేతులు కావా అవి?
స్పర్శించే నవ్వించే చేతులు
చలికాలం వెచ్చని రగ్గైయ్యే చేతులు.
వెచ్చని కౌగిలైన చేతులు.
మాట్లాడే చేతులు, జ్వరపడ్డ చేతులు
దారి చూపే చేతులు...
మా జ్వరాల్ని స్పర్శించి నిమిరిన చేతులు.
మురిపెంతో ముద్దులు పెట్టే పెదవుల్లాంటి చేతులు...
అమ్మా నీ చేతులు
కన్నీళ్లు తుడిచిన చేతులు
అమ్మా నీ చేతుల్లో ఎన్ని జ్ఞాపకాల పొరలు?
నాన్న చేతుల దెబ్బల నించి నన్ను
దాచి పెట్టిన చేతులు
నా గాయాలకు మందురాసిన చేతులు
***
ఇంటినీ నన్ను
నీ కన్నీళ్లతో కడిగి శుభ్రం చేసిన చేతులు.
ఒక్క మాట మాట్లాడక..నానమ్మ...
తాతయ్యల మలమూత్రాలని ఎత్తిపోసిన చేతులు!
మమ్మల్ని నాన్నను పెంచీ పెంచీ పెద్దవైన ...
సాగి పొడవైపోయిన చేతులు .
బక్కవై ఎముకలు తేలిన ముసలివైన చేతులు.
పట్టు కోల్పోయిన చేతులు
వదిలి వేయబడ్డ చేతులు.
పట్టు కోరుకుంటున్న చేతులు.
ఆసరా కోసం చేతి కర్రని పట్టలేక వణికిపోతున్న చేతులు.
అమ్మా వయసైపోయిన చేతులు !
***
అమ్మా మా కోసం..పంట పొలంలోలా...
నీ దేహంలోంచి మళ్లీ మళ్లీ మొలకెత్తే నీ చేతులు దేవతలు కావా?
తల్లీ...మమ్మల్ని సాదిన దేవత రెక్కలు కావా
నీ చేతులు ?
ఎక్కడివే అమ్మా నీకిన్ని చేతులు?
అమ్మా నీ చేతులే లేకపోతే... ఈ బతుకెక్కడిదమ్మా మాకు?
**
రాత్రిపూట డైరీలో
రహస్యంగా నీ కన్నీళ్ల బాధలు గాధలు పాటలు
కవిత్వం రాశాక ...
అమ్మమ్మకి మెట్టినింటి కష్టాల కన్నీటి ఉత్తరాలు రాశాక..
ద్వంసమైన నీ కలల చిట్టా రాశాక...
వెక్కిళ్లతో
ముడుచుకు పడుకునే చేతులు.
****
అమ్మా ... ప్రేమ స్వచ్ఛత నిజాయితీలకి పుట్టిల్లు కావా నీ చేతులు?
మా ఎన్ని తప్పుల్ని క్షమించిన చేతులు.
నాన్నకి తాతయ్యకి నానమ్మకు
సేవలు చేసిన చేతులు.
నాన్న చెప్పినట్లు వింటూ
నిస్సహాయంగా ముడుచుకు పోయిన చేతులు.
మరోసారి చూపుడు వేలెత్తి ప్రశ్నించిన చేతులు.
పిడికిలి బిగించిన చేతులు !
కొట్టబోయే నాన్న చేతుల్ని
ఆపి హెచ్చరించిన చేతులు
నాన్నకి మానవత్వం నేర్పిన చేతులు !
** **
పెదవులై నన్ను ముద్దు పెట్టుకున్న చేతులు.
కన్నులై దయతో చూసిన చేతులు .
జ్వరంతో కాగిన నా దేహాన్ని చల్లార్చిన చేతులు.
అమ్మా.. నీ చేతులు !
వాకిట రంగుల ముగ్గులైన చేతులు.
బంతిపూల బతుక మ్మలను మోసిన చేతులు!
తోటను పెంచిన చేతులు.
ధృడమైన గుంజలై ఇంటిని పట్టి నిలిపిన చేతులు.
****
పుట్టిన రోజులకి ప్రేమ పాయసం కాచిన చేతులు.
అవిశ్రాంత చేతులు ..
బీటలు వారిన చేతులు
ఇంటిల్లిపాదికి పరుగులు పెడుతూ సేవలు చేసిన చేతులు .
అమ్మా...
పాదాలకి కూడా చేతులు మొలిపించుకుని
పరిగెత్తుతూ చేశావు కదమ్మా?
అందరికీ రెక్కలు మొలిపించుకుని
ఎగిరే పక్షి వేగంతో
కదులుతూ పని చేసిన చేతులు.
కృంగిన భుజాలతో
నొప్పులతో ఒంకరపోయిన వేళ్ల చేతులు
వణుకుతున్న చేతులు !
కట్టెల పొయ్యిలోని కర్రల్లా పొగ చూరిన చేతులు.
అన్నం వాసన వేసే చేతులు!
***
నాన్న చేతులు
ఇరవైనాలుగు గంటలూ పెన్నునో పుస్తకాలనో
మైకునో పట్టుకున్నప్పుడు...
పుస్తకాన్నిపెన్నుని ముడిచి
ఇంటిల్లిపాదికీ అన్నం కంచం అయిన నీ చేతులు !
అమ్మా...ఇంటి తలుపుల తాళం చెవుల గుత్తులు కావా నీ చేతులు?
చీకటైన ఇంట్లో దీపం వెలిగించే చేతులు !
దీపమైన నీ చేతులు!
అమ్మా నీ చేతులు ఙ్ఞానాన్నిచ్చిన పుస్తకాలు కదా!
తొలి అక్షరాలు దిద్దించిన గురువులు కదా నీ చేతులు?
నా పసి కళ్ళకి తొలిసారి వేలెత్తి చందమామని
చూపించిన చేతులు.
అమ్మా ఎంత అద్భుతమైనవే నీ చేతులు?
ఎంత సౌందర్యమే అమ్మా నీ చేతుల్లో?
ఎంత అనంతమైన కారుణ్య సముద్రమే అమ్మా నీ దోసిలిలో?
***
ముళ్లనీ, పూలని ఒకేసారి చూపించిన చేతులు.
మాంత్రిక చేతులు
మాయ చేసే చేతులు...
ఏం చేస్తావో తెలీదు కానీ
నీ చేతులు పడ్డ వెంటనే
ఒళ్లంతా నీ మమకారపు వెన్నలా
చల్లగా మైకంగా పాకుతుంది!
ఎంత భరోసానే అమ్మా నీ చేతులవి?
***
అవును కానీ అమ్మా ఒకటి చెప్పు!
అమ్మమ్మ తన చేతుల్ని నీకిచ్చేసినట్లుగా..
నేను పెద్దయ్యే కొద్దీ నీ చేతుల్ని కొంచెం ...
కొంచెంగా నాకిచ్చేస్తూ వచ్చావా ?
చేతుల్ని మొలిపించుకునే
అమ్మమ్మ నేర్పించిన సూర్యోదయపు మంత్రాన్ని
నా చెవుల్లో కూడా రహస్యంగా గుస గుసలాడావా ?
చూడు ఇప్పుడు నీ చేతులు నాకొచ్చేసాయి!
చూడెంత ధృఢంగా ఉన్నాయో?
నా చేతులు...అచ్చం నీ చేతుల్లా లేవూ ?గరుకుగా..మోటుగా
మచ్చలతో... కత్తి గాట్లతో.
గల గల మనే గాజుల దుఃఖ రాగాలతో..
ఇంటి కోడలి చేతుల్లా
అమ్మా చూడు ఇప్పుడు ఇల్లంతా నా చేతులే అమ్మా!
నీకులా నా వొళ్ళంతా నా చేతులే అమ్మా!
నీకులా నాకూ చేతులు మొలిపించుకోవడం వచ్చేసిందే అమ్మా !
నా చేతులు నా కోసం కాదమ్మా ...
ఇప్పుడు నా చేతులు నావి కావమ్మా!
***
నా చేతుల్ని నా భర్త చేతుల్లో పెట్టి
వియోగ దుఃఖంతో ఒణికిన నీ చేతులు !
ఎన్నడూ చెయ్యెత్తి కొట్టద్దని హెచ్చరించిన చేతులు!
నా పెళ్లి పట్టు చీరై నన్ను ఆసాంతం
చుట్టుకున్న చేతులు.
ఇప్పుడు మనవలు మనవరాళ్లకు
రంగు రంగుల స్వెటర్లు
అల్లుతున్న చేతులు .
క్షణం నిలబడని చేతులు .
అమ్మా.. అమ్మా..ఎక్కడివే నీకిన్ని చేతులు?
నన్నూ అన్నను అక్కనూ నీ చేతిని
పిడికిళ్ళు బిగిస్తూనొప్పులు భరిస్తూ కన్నావు కదా..
బహుశా అప్పుడే..
ఆ క్షణాల్లోనే
పిల్లలతో పాటు ప్రతీ సారీ
వందల చేతులని కూడా
ప్రసవిస్తూ పోయావా అమ్మా?
అమ్మా ...చెప్పవే నీకిన్ని చేతులెక్కడివే ?
***
రా...అమ్మా
ఇప్పుడు రా
నా చేతుల్లోకి రా
పసిపాపలా రామ్మా!
రా..నా అక్కువ లోకి
నా కౌగిలిలోకి!
రా అమ్మా విశ్రాంతి తీసుకుందువు కానీ!
రా అమ్మా... ఒక్కసారి నీ చేతుల్ని
పాదాలని ముద్దులతో ముంచెత్తనీ.
నీ చేతుల్ని పూల రెక్కల్లో పెట్టి చూసుకోనీ !
నీ చేతులను
పశ్చాత్తాపంలో కారిన నా వెచ్చని కన్నీళ్ళలో ముంచి
నీ చేతుల నొప్పులన్నీ తగ్గించుకుంటాను!
నాకు మొలిచిన వంద చేతులతో నీకూ సేవలు చేసుకుంటాను.
రా అమ్మా...
నీకు చందమామను చూపిస్తూ
గోరు ముద్దలు తినిపించుకుంటాను!
రా అమ్మా పరుగున నా ఇంటికి వచ్చేయ్!


Read More
Next Story