ఇరవై నాలుగు గంటల పది మైళ్ళు*
x

ఇరవై నాలుగు గంటల పది మైళ్ళు*

ఇల్లు (సీక్వెల్ కవిత-11)ఇరవై నాలుగు గంటల పది మైళ్ళుయుగాలుగా ఆ స్త్రీలు వంటింట్లో పని చేస్తూనే ఉన్నారు.

తాతమ్మ..నానమ్మ.,అమ్మమ్మ, అమ్మ!

మూల్గుతూ… గొణుగుతూ… రహస్యాలేవో గుస గుస లాడుతూ

కొన్నిసార్లు కొట్లాడుకుంటూ!

బట్టలు నాని పోయేంత చెమటలు కక్కుతూ…

చేతుల్లో ఎప్పుడూ కప్పులూ సాసర్లు.. కత్తులు కత్తిపీటలు..

కూరగాయలు పట్టుకుంటూ పడేస్తూ అవి వేళ్ళకి అంటేసుకుంటుంటే

భయంతో పీకి పడేస్తూ ఆడ వాళ్ళు !

ఒళ్ళు నొప్పులకు మూవ్ ఆయింట్మెం టులు రాసుకుంటూ మూవ్ అవుతూ

నెలసరి రక్త స్రావాలకి మందులు మింగుతూ భరించలేక

వంటింట్లోనే నులకమంచాలు వేసుకుని…

రెండు నిమిషాలు పడుకుని మళ్ళీ లేచి పనులు చేసుకుంటూ ఆడవాళ్లు!

**

వాళ్ళ కళ్ళు పండు మిరపకాయలంత ఎర్రగా

వాళ్ళ ఊపిరి...నాలుగు బర్నర్లలో వచ్చే మంట లంత వేడిగా..ఆవిరి..ఆవిరిగా

వాళ్ళ పాద ముద్రలతో వంటింటి నేల ఒక ఆర్ట్ పీస్ లా!

****

వాళ్ళ యాప్రాన్ ల నిండా మసాలాలు..నూనెలు

ఉప్పుకారాల.. గోధుమ పిండి మరకలు

వాళ్ళ నుంచి ఎప్పుడూ వంటింటి వాసన

ఎన్ని అత్తర్లు రాసుకున్నా వదలని వంటల వాసన !

వాళ్ళు వంటింట్లోంచి లోపలికి.. బయటకి..పెరట్లోకి.. వాకిట్లోకి

బెడ్ రూమ్ .,లివింగ్ రూముల్లోకి రోజంతా

నడుస్తూనడుస్తూ నడుస్తూ భర్తలు డాబుతో..

విసుగుతో చేసే టీలు..భోజనాల..స్నాక్స్ ఆర్డర్లు మౌనంగా వింటూ..

సప్లై చేస్తూ పళ్ళ బిగువున కోపం అణుచుకుంటూ ...

నడుస్తూ..చాలా సార్లు పరిగెడుతూ...పడుతూ..లేస్తూ..

పాకుతూ., ఈడ్చుకుపోబడుతూ..ఆడవాళ్లు !

****

సరే మరి...ఇక్కడ చూడండి ..!

నలుగురు మగవాళ్ళు… లివింగ్ రూమ్ లో,

ఎంత విశ్రాంతిగా ..హాయిగా కూర్చుని ఉన్నారో.

ముత్తాత ,తాతయ్య…నాన్న…

వీడియో గేమ్ ఆడుతున్న మనవడు

పెద్ద వాళ్లేమో న్యూస్ పేపర్లు చదువుతూ

టీవీ లో క్రికెట్ చూస్తూ, కవిత్వం చదువుతూ

రాజకీయాలు మాట్లాడుతూ తీరిగ్గా ఎలా 'టీ' చప్పరిస్తున్నారో ?

ఎంత స్థిరంగా.. ప్రశాంతంగా.. "మెన్ ఆఫ్ ద నైట్ "

మగ పెర్ఫ్యూమ్ సువాసనలతో.. నలగని ఇస్త్రీ బట్టలతో!

***

ఈ మగవాళ్ళు వంటింట్లో శబ్దాలు చేసే ఆడవాళ్ళని చూస్తూ

'ష్ష్..నిశ్శబ్దం ' అంటూ హేళనగా నవ్వుతారు.

"ఆకలేస్తుంది ఎంతసేపు?

ఈ ఆడవాళ్ళకి భర్తలకి సమయానికి తిండి పెట్టటమే రాదు...

ఒట్టి బధ్ధకస్థులు కొంచెం కూడా కదలరు " అంటూ తీసిపడేస్తారు.

మధ్య మధ్యలో,

విశ్రాంతి తీసుకుని ఉన్న తమ కాళ్ళ తిమ్మిరి పోవడానికి

ఇంటి ముందరి లాన్ లో అలా

నాలుగడుగులు నజాకత్ గా వాకింగ్ చేసొస్తుంటారు..

సాయంత్రమైందంటే..డిన్నర్ లో ఏం వండాలో ఆడవాళ్లకు చెప్పి,

కమ్యూనిటీ వాక్ లలో గంభీరంగా రాజకీయాలు మాట్లాడుతారు .

***

ఆ మగాళ్లు ... మంచి ఉతికిన బట్టలు వేసుకొని, షేవ్ చేసుకున్న నున్నని గడ్డాలు.. చెంపలతో ఎంతో శుభ్రంగా...

తాజాగా బలిసిన బ్రాయిలర్ కోళ్ళల్లా ఉన్నారు !

****

సరే...ఇక ఇటు చూడండి ! ఇక్కడో చిన్న పాప ఉంది..బహుశా మనవరాలు !

బార్బీ బొమ్మని టేపుతో విసుగ్గా కొలుస్తూ..నిశ్శబ్ధంగా వంటింటికీ ..

.లివింగ్ రూమ్ కి మధ్య ఉన్న తేడాను జరుగుతున్న వ్యవహారాలన్ని గమనిస్తున్నది.

ఆడవాళ్లు ఎందుకంత గాభరాగా ...

భయంగాచెమటలు కక్కుతూ ఇల్లంతా ఉరుకులు పరుగులు పెడుతున్నారు

మగవాళ్లేంటి అంత విశ్రాంతిగా కూర్చుని ఉన్నారు?

వాళ్ళు చేసేదంతా ఆడవాళ్లు వండేది తినడం, పడుకోడం, లేవడం

మళ్ళీ తినడం ..పడుకోవడం..లేవడం !అప్పుడప్పుడు మాట్లాడ్డం !

వాళ్ళు మాట్లాడేది ఎప్పుడూ ఒకటే వెటకారపు మాట ..

"ఈ ఆడవాళ్లు ఇళ్లల్లో ఉండి పనేమీ లేకుండా సుఖంగా ఉంటున్నారని

పరమ బధ్ధకస్తులనీను చురుగ్గా కదలరని"!

అర్థం కాని పాప కోపంతో ..దుఃఖంతో ఎర్రబడిపోయింది !

చురుకుగా కదలరా ఆడవాళ్లు...మరి మగాళ్ల సేవలో ఆ ఉరుకులు...

పరుగులు ఏమిటి ..దానికో లెక్కేలేదా?

ఇక ఇలా కాదని...

ఆడవాళ్లు ఇంట్లో నడిచే దూరాన్ని వాళ్ళ వెంబడి పడుతూ టేప్ తో కొలుస్తున్నది...

వాళ్ళ పని గంటలు అంచనా వేస్తున్నది కొంత కాలంగా !

ఏదో తెలుస్తున్నది పాపకి.

ఆడవాళ్లు ఎందుకంత బలహీనంగా ఉన్నారు...

మగవాళ్ళెందుకు అంత బలంగా ఉన్నారు?

ఆడవాళ్లు తినకుండా ...మగాళ్ళకి బాగా తిండి పెడుతున్నందుకా ?

వాళ్ళున్న గదుల్లో ఉందా ఆ రహస్యం..శక్తీ ఎక్కడుంది...ఎక్కడుంది?

పాప వెతుకుతున్నది ఆ గదుల్లో.

అమ్మ ...నానమ్మ చేతులు ఇనుప పని ముట్లుగా ఎందుకు, ఎలా మారిపోయాయి?

ఎందుకు....ఆడవాళ్ళ పాదాలు అంతగా పగుళ్లు వారి పోయాయి ?

ఎందుకు వాళ్ళచర్మం అలా పాలిపోయింది ?

ఎందుకు..ఎందెందుకు..ఎందుకు ..అయ్యో ఎందుకు ??

**

ప్రశ్నలు...ఎంతకీ ఒడవని ప్రశ్నలు !

ఇక ఇలా కాదని ఆ పాప ఒక రోజంతా ఆడవాళ్లు పన్లు చేస్తూ

ఇంట్లో తిరిగే దూరాన్ని కొలిచింది.

అర్థ రాత్రి మేను వాల్చే సమయానికి పది మైళ్ళుగా రికార్డు చేసింది పాప !

అర్థం అయ్యింది పాపకి.

ఇరవై నాలుగుగంటలలో ఇంట్లోనే పది మైళ్ళు నడిచే స్రీలు బద్దకస్థులా ?

కోపంతో చేతిలో బొమ్మ కింద పడేసింది.

వంటింట్లోకి వెళ్ళింది..

"హే, నానమ్మా.. అమ్మమ్మా.. అమ్మా ...

మీరెందుకు మీ స్థానాలు మార్చుకోరు రండిటు "...?

అంటూ ..వాళ్ల వేళ్ళు పట్టుకొని లివింగ్ రూంలోకి లాక్కొచ్చింది.

ఆ మగాళ్లను దబాయించి లేపి..ఆడవాళ్ళని లివింగ్ రూంలో కూర్చోపెట్టింది..

ఇక లేస్తే ఊరుకోనన్నది.

ఆ మగాళ్ళకి వంటింటి దారి చూపించి..వాళ్ళ చేతుల్లో టేపు పెట్టింది...

అప్పుడు ఆ పాప తనకు తాను ముత్తమ్మగా మారిపోయింది.

అప్పుడామే తన వెయ్యేళ్ళ కిందటి పురాతన మైన ఇంటి వాకిటి అరుగు మీద

జుట్టు విరబోసుకుని కూర్చుని ఉంది...తన అనాది దాహాన్ని

పక్కనే పారుతున్న సెలయేటి నీటిని నేరుగా ప్రవాహంతో

సహా నోటిలోకి మళ్లించుకుని గుటకలు గుటకలు గా మింగుతూ తీర్చుకుంటూ ఉంది..

మధ్య మధ్యలో దాహం ..దాహం అంటూ తల్లడిల్లుతున్నది గాండ్రిస్తున్నది.

ఆమె ఒక అద్భుతమైన సుగంధం తో పరిమళిస్తున్నది...

విమెన్ సెంట్ గా పిలవబడే ఎన్నో యుగాల వంటింటి వాసనని

ఆమె తన చర్మం నుంచి వదుల్చుకున్నది !

ఆమె వెన్నెల్లో పర్చుకునే ఒక సౌగంధికా వృక్షంలా స్థిరంగా నిలబడింది !

సెలయేరు పక్కనే ఆమె ఒక ఇల్లు కడుతున్నది.

విశాలమైన ఇల్లు..అందులో తనకి ఒక ప్రత్యేకమైన గది కవిత్వం రాసుకో డానికి..

పాడుకోడానికి,కలలు కనడానికి...నిమ్మళంగా నిద్రపోడానికి ..

ఒక పక్క కడుతూనే...మరో పక్క అక్కడే ఒక పురుషుడు కడుతున్న

వంటిల్లుని కూలుస్తోంది .

నిరాయామానంగా ఇది జరుగుతూనే ఉంది.

ఆమెది ఒక అనాది ప్రయత్నం !

యుగాలుగా ఆమె వంటిల్లుని కూలుస్తూనే ఉంది...

అలసటతో కుప్పకూలుతూ. .

ఆఖరికి ఇక మట్టి శిల్పం గా మారిపోయింది...కొన్నిసార్లు మరణిస్తుంది.

కానీ చాలా సార్లు బతికి వస్తుంది...వంటిల్లు లేని ఇల్లు కడుతూనే ఉంటుంది ...

అలిసి మళ్ళీ లేచే ఆమెని చూసి మగవాళ్ళు వణికారు..

ఎర్రబడ్డ కళ్ళతో ఆ మగాళ్లని చూస్తూ హుంకరుంచింది ఆమె !

ఆగ్రహంతో ఊగిపోతూ ఇక వాళ్ళ స్థానాలు మారిపోవాల్సిందేనని..

ఇక ముందు వాళ్ళు..ఆ మగవాళ్ళు

నడవ బోయే దూరాలను వాళ్ళనే కొలుచుకోమని..

వాళ్ళ పనికి కూడా జీతాలుండవని..

ఇల్లు ఇలా కూడా ఉండాలని..ఉండి తీరాలని ఆజ్ఞాపించింది ..

ఆ తరువాత మళ్ళీ తను చిన్న పాపగా మారిపోయి

బార్బీ బొమ్మని చేతుల్లోకి తీసుకుని ఆడుకోవడానికి వెళ్ళిపోయింది !


(*స్త్రీలు ఒక రోజులో అంటే 24 గంటల్లో ఇంటి పనుల్లో పడి ఇంట్లోనే 10మైళ్ళు నడుస్తారని సర్వేల్లో తేలిన విషయం)

Read More
Next Story