స్నానాల గది ! (ఆదివారం కవిత)
ఇల్లు సీక్వెల్ కవిత -12 ఆయనకు అంతగా పట్టని ఈ చిన్న గది ఒక్కొక్క సారి శరణాలయమై అమెను అక్కున చేర్చుకుని ఓదారుస్తుంది... స్నానాల గది మీద గీతాంజలి కవిత
ఇంట్లో అన్ని గదుల్లో కంటే స్నానాల గది ఉంది చూశారూ
అది చాలా ప్రత్యేక మైంది !
'గంగేచ, యమునేచ,గోదావరీ, సరస్వతీ, నర్మదే సింధు కావేరి,జల అస్మిన్ సన్నిధం కురు' ...
స్నాన మంత్రంతో ఇంటి పెద్ద మనుషులు చేసే ఆధ్యాత్మిక గంగా స్నానంతో ..
మనసు తనువు ఆ స్నానాలగది మొత్తం ఇల్లు అన్ని పాపాలూ శుభ్రమై పోతాయి..
అది వాళ్ళ లెక్క శాస్త్రం !
ఇంట్లో అందరూ అన్నీ గదుల్ని ఎంతో ప్రేమిస్తారు.. స్నానాల గదిని తప్ప..
ఇంటి కోడళ్లు మరింత తక్కువగా ప్రేమిస్తారు.
ఎందుకంటే..
శుభ్రం చేయడానికి
అన్ని గదులతో పాటు స్నానాల గది కూడా తనని అమ్మల చేతుల్నే కోరుకుంటుంది.
కోడి కూయగానే...వాకిలిని ,పెరడును శుభ్రం చేసి అమ్మ స్నానాల గది వైపుకి వెళుతుంది
సింక్,కమోడ్ లోపలా బయటా నిర్వేదంగా తోముతుంది.
స్నానాల గది నిండా అంటిన వెంట్రుకలని..
షాంపూ పాకెట్లను ఎత్తి డస్ట్ బిన్ లో పడేస్తుంది.
ఆసిడ్ తో మండే పాదాలపై చల్లని నీళ్లు పోసుకొని తలారా స్నానం చేస్తుంది.
ఆమె బయటికొచ్చాక అంతా ఒక్కోరు లోపలికి వెళతారు.
***
కొన్ని స్నానాల గదులైతే చెప్పలేము!
రాత్రి పీకల దాకా తాగి చేసుకున్న వాంతులు..
చలికాలపు ఉపిరితిత్తుల తెమడలు
ఉమ్ములు ఎదిగిన మగపిల్లల,మొగుళ్ల వీర్యపు చెడ్డీలు రుధ్ది రుధ్ది కడగలేక
ఉతక లేక అమ్మలు దుఃఖపు వాంతులు చేసుకుంటారు
ఇంట్లో మంచాన పడ్డ ముసలి వాళ్ళ మల మూత్రాల లోబట్టల వాసన
అమ్మల ఊపిరితిత్తుల లో పేగులలో ఉండలు చుట్టేసి...
అమ్మలిక చేతులతో అన్నం తినలేరు.
అమ్మ ఒక హోమ్ స్కేవెంజర్ గా మారిపోయి మురికి మురికి అయిపోతుంది.
బాధ్యతని నెత్తి కెత్తుకోని నాన్న మాత్రం పెరట్లో
అప్పుడే ఉతికి ఆరేసిన దండెం మీది తెల్లని కొత్త పంచెలా మెరిసిపోతాడు.
అమ్మని హోమ్ స్కేవెంజర్ చేసి స్నానాల గదిలోకి పంపినందుకు ఏమాత్రమూ సిగ్గు పడడు.
చెయ్యక చస్తావా. ఆదర్శ అమ్మ,భార్య,కోడలు ఆదర్శ గృహిణి పతివ్రత మథర్ థెరిసా
కిరీటం దక్కించుకోవాలిగా అని పక పక నవ్వుతాడు.
కావలిస్తే...శుభ్రపడడానికి..స్నాన మంత్రాన్ని దేశంలో ఉన్న అన్ని పవిత్ర నదుల పేర్లని
జపించుకోమని అనుమతి ఇస్తాడు.
అందుకే యుగాలుగా స్రీలు స్నానాల గదుల్లో నీళ్లు..
కన్నీళ్లు కలుపుకొని స్నానం చేస్తూ స్నాన మంత్రం జపిస్తుంటారు
తరువాతి తరానికి అందిస్తుంటారు
పదే పదే చేసే స్నానం,మడి, తడి వారి చేతుల,పాదాల చర్మాన్ని ఫంగస్ తో నింపేస్తుంది.
దురదలతో చంపేస్తుంది.
తన లోపలకొచ్చి శుభ్రమై వెళ్లిపోయిన మనుషుల్ని...
తనని శుభ్రం చేసి మలినమై..దీనంగా నిలుచునే అమ్మని జాలిగా చూస్తూ...
ఆమె ఒంటిమీద నీళ్ళని గుమ్మరిస్తుంది స్నానాల గది.
అప్పుడు ఆమే, స్నానాల గది ఇద్దరూ రెండు నదులుగా మారిపోతారు.
ఆమె అప్పుడొక కొత్త నది!
అది కూడా తనని శుభ్రం చేయమని అమ్మనే వేడుకుంటుంది మరి !
అయినా...భూగోళంలో ఎక్కడైనా స్నానాల గది బాధ్యత స్త్రీలదే.!
వంట గది పడక గదులకి హిప్నటైజ్ అయినట్లు...
స్నానాల గదికి కూడా మంత్రించినట్లు వెళ్ళిపోతారు స్రీలు
వీధులని బయట ఇళ్లల్లో లావట్రీ లను శుభ్రం చేసే..
గంగమ్మకి ఏసోబుకి అమ్మ ఎందుకంత ప్రేమగా అన్నం పెడుతుందో ఇంట్లో ఎవరికీ అర్థం కాదు.
అమ్మకి స్నానాలగదికి తప్ప !
*****
అమ్మమ్మ ఊర్లో పొద్దున్నే ఐదు గంటలకే
కట్టెల పొయ్యి ఉన్న స్నానాల గదుల్లో గంగాళాల్లో నీళ్లు కాగుతూ ఉంటాయి
.శ్రాద్ధ భోజనాలు మడి వంటలు చేయడానికి మడిస్నానానికి
మడి చీరలతో వరుస కట్టి ఎదురు చూస్తుంటారు ఆడవాళ్ళు..
తమకి నీళ్లు తోడిపోసే మాదిగ ఎల్లమ్మనే దూరం.. దూరం అనుకుంటూ!
కొన్నిసార్లు అసలు నీళ్ళే కాగవు.. మంచు లాంటి చల్లని నీళ్లతో వణికి పోతూ ..
ఏ పెద్దల మెప్పు కోసమో..
భయంతోనో చలికాలపు చన్నీటి స్నానాలు చేస్తుంటారు ఆడవాళ్లు!
మంచు శిల్పాలై పోతుంటారు!
జీవిత మంతా ఉబ్బసంతో ఆయాస పడుతూనే ఉంటారు.
*****
కొన్ని స్నానాల గదులు ఓదార్పు శిబిరాలుగా మారిపోతాయి.
మూసిన తలుపుల వెనకాల శృంగారం దాంపత్యం, సరసం పేరుతో
హింసల కొలిమైన దేహానికి మందు రాసుకోడానికి...
అత్తో ఆడబిడ్డో మామనో పెట్టే బాధలని తట్టుకోలేక..
అలవికాని దుఃఖాన్ని బయటకు వినపడనివ్వకుండా పెదవంచున భరించడానికి
నెలసరి నొప్పి భరించలేక ఆడపిల్ల ఏడ్చేది కూడా స్నానాల గది లోనే కదా!
స్నానాల గది శరణాలయంగా మారిపోయి ఆమెను అక్కువ చేర్చుకుంటుంది.
స్నానాల గది హృదయం విశాలమైనది.
ఆమెదే కాదు.. గుండెల మీద వాలి ఏడవడానికి అమ్మలు దొరక్క
తన వొళ్లో దూరి ఏడ్చే ఇంటి కోడళ్ల కన్నీటిని తుడుస్తుంది స్నానాల గది !
స్నానాల గది కళ్ళు చాలా పెద్దవి...
వాళ్ళ ఒంటి మీది సిగరెట్టు మచ్చలను నిర్ఘాంతపోయి చూస్తూ బాధతో మూల్గుతుంది
ఇంట్లో ఎవరి రహస్య దుఃఖాన్నైనా తనవొళ్ళో తీర్చుకోనిస్తుంది !
****
స్నానాల గది చాలాసార్లు సంగీత కచేరీలు చేస్తుంది.
స్నానాలగది చేసే ముషాయిరాలో ఓహ్హ్.. ఎంతమంది గాయకులు వస్తారని?
రఫీ, గులాం ఆలీ, నూర్జహాన్, అక్తర్ బేగం, ముబారక్ బేగం ఫరీదా ఖానం..
జానకి, లీల, జిక్కి! రోజొక పాటో కొన్ని గజళ్లు పాడి పోతారు...
స్నానాల గది వాళ్ళ కోసమే ఎదురు చూస్తుంది..
బహుశా కొత్త గజల్ ని కూడా అందిస్తుంది వాళ్లకి.
'హుయీ శ్యామ్ ఉన్ కా ఖయాల్ ఆగయా.'..అంటూ
అతడో/ఆమెనో దాచుకోలేని ప్రేమతో పాడుకునే భగ్నగీతాలను
తల్లడిల్లే హృదయంతో వింటుంది..తానూ పాడుతుంది.
స్నానాలగది అప్పుడు ఒక రేడియోగా మారిపోతుంది
వాళ్ళ కన్నీళ్ల మొఖాలను చల్లని నీళ్లతో కడిగి బయటకి పంపిస్తుంది.
వాళ్ళు తన లోపలకొచ్చి రహస్యంగా చదువుకునే ప్రేమలేఖలనో..
విడుపు లేఖ లనో ..తానూ వింటుంది..
రాసిన మనిషి ప్రేమలో తానూ పడుతుంది బహుశ !
పిల్లలు పరీక్షల ముందు కాపీ చీటీలు దాచుకునేది కూడా నవ్వుతూ చూస్తుంది స్నానాల గది!
***
ఒళ్ళంతా నలుగంటి అమ్మ చేయించే బాలింత స్నానాలు..
అమ్మమ్మ కాళ్ళ మధ్యలో చేయించే పసిపాపల స్నానాలు
లాలి పాటలంటే స్నానాల గదికి ఎంతో ఇష్టం.
పసి పాప సంగీత రోదన స్నానాల గదిని గొప్ప శ్రోతని చేస్తుంది
పాప కేరింతలతో పసి సువాసన తో స్నానాల గది పులకరిస్తుంది.
***
ప్రేమించిన వాడిని తలుచుకుంటూ ప్రియు రాలు గంటలకొద్దీ చేసే స్నానం
ఆ స్నానాలగదినే మోహం లో పడేస్తుంది.
***
స్నానాల గదికీ ఒక తలుపు ఉంటుంది.
కన్నీటి మొఖాలను దాచుకొమ్మని ప్రేమగా తెరుచుకుంటుంది
స్నానాల గది ఇంట్లోని ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది..వాళ్ళని వింటుంది..
ఓదారుస్తుంది కన్నీళ్లు తుడుస్తుంది.
బుద్ధి చెబుతుంది వాళ్ళ రహస్యాలని దాచిపెడుతుంది.
వాళ్ళకి కావలిసినంత తన్హాయిని ఇస్తుంది పాటలను.. కవిత్వాన్ని ఇస్తుంది.
వాళ్ళ తనువు మనస్సులను శుభ్రపరుస్తుంది
తెగని వారి ఆలోచనలకి దిశ చూపిస్తుంది.
***
కొన్నిసార్లు..
స్నానాలగది తనకి తాను మృత్యు స్థానంగా కూడా మారిపోతుంటుంది.
మనుషులు విడిచే ఆఖరి శ్వాసని అందుకునేది స్నానాల గదే!
తన వొళ్లో ప్రాణాలు విడిచే ఇంటి పెద్ద మనుషుల కోసం తానూ దుఃఖిస్తుంది.
స్నానాల గది తనని విడిగా పెట్టే సమస్తమైన ఇంటిని ప్రేమగా చూస్తుంది.
చివరాఖరికి తనని శుభ్రం చేసే అమ్మ పాదాల మీద పడి మోకరిల్లుతుంది-
దుర్గంధాన్ని పోగొట్టే సుగంధ సౌరభాలను తనలో నింపినందుకు ఒక చిన్న దీపం వెలిగించినందుకు.
***
ఉదయం అయితే చాలు మళ్ళీ అమ్మలు చదివే గంగా యమునా కావేరీ...
స్నాన మంత్రంతో స్నానాల గది మారుమ్రోగి పోతుంటుంది !
వాళ్ళు నిశ్శబ్దంగా మనసులో చదువుకున్నా స్నానాల గదికి వినిపిస్తుంది.
కావలిస్తే స్నానాల గది తలుపుకు చెవి వొగ్గి వినండి...
దుఃఖంతో కంపించే గొంతు...తబలా మీద వేళ్ళతో ఆగి, ఆగి మ్రోగి నట్లుండే వెక్కిళ్ళ శబ్దం..
స్నానాల గది చెప్పే మనుషుల కథలూ...
'కభీ తన్హాయియో మే హమారీ యాద్ ఆయేగీ' అంటూ పాడుకునే విరహ గీతాలు...
వినపడక పోతే అది స్నానాల గది ఎలా అవుతుంది ?
అది ఒక్క స్నానాల గది మాత్రమేనా ?
తన ముందు మనిషి వేసే ఏ కాంకిక నాటకానికి ఏకైక ప్రేక్షకురాలు!
మనిషి బహుముఖాలుగా విడిపోయి
తనలో తాను మాట్లాడుకునే వెర్రి ప్రేలాపనలు వినే శ్రోత!
మనుషుల సమస్త ఉద్వేగాలను మోసే
భరించే ఒక రహస్య మయ మార్మిక తావు!
నీ నుంచి నువ్వు దాక్కునే ఒక ఒక గుహ!
నీకు పాటని అందించే ఒక మైక్ !
ఒంటరి మనుషుల ఏకాంత దుఃఖాల ఎడారి మంటలను చల్లార్చే ఒక చెలమ !
స్నానాల గది నీకు ఒక్క స్నానం మాత్రమే చేసి పంపియ్యదు..నీకో సరి కొత్త దేహాన్ని ఇచ్చి పంపిస్తుంది .
అందుకని..అమ్మ ఒక్కతే కాదు..నువ్వూ... ఇంట్లో అందరూ స్నానాల గదిని శుభ్రం చేయాలి.. స్నానాలగది రుణం తీర్చుకోవాలి !
లేకపోతే...స్త్రీలందరూ నదుల్ని తవ్వుకోడానికి ఇళ్లోదిలి వెళ్ళిపోతారు !
( ఇళ్లల్లో పురుషులు పాడు చేసే బాత్రూమ్ కడిగేటప్పుడు ఎంత అసహ్యం,బాధ కలుగుతాయో ఆ మధ్య గ్రామాల్లో దళిత స్త్రీలు ఆధి పత్య కులాల స్త్రీలు ఒక స్వచ్ఛంద సంస్థ చేసిన ఇంటర్వ్యూలో చెప్పారు .ఆ ఇంటర్వ్యూ ఒక పత్రికలో కూడా వచ్చింది.)