ఇల్లు ( సీక్వెల్ కవిత-7)
‘తలుపు’ ని డీకోడ్ చేసిన కవిత. ఎన్ని అందమైన అనుభవాల్ని, వికారాల్ని, ఆవేశాల్ని, ఆక్రోశాల్ని, ఎడబాట్లను, తడబాట్లను తలుపులు దాచుకున్నాయో చెప్పే గీతాంజలి కవిత
ఇల్లు (సీక్వెల్ కవిత -7)
-గీతాంజలి
తలుపుల్ని సున్నితంగా తట్టటం నేర్చుకో!
ఇల్లు సరే...
ఇంట్లోకి పోవడానికో, బయటకు రావడానికో తలుపులు కదా ఉండాల్సింది !
ఇంటి పెద్దర్వాజా! అచ్ఛం ఇంటి పెద్ద తాతలాగో,అమ్మమ్మ లానో!
ఎంతమంది మనుషుల రాకపోకలకు సాక్ష్యం ఈ దర్వాజా ?
అరుగు మీద తెల్లారి ఎండలో పొగలు కక్కే చాయ్ తాగుతూ
చేతిలో సియాసత్, హిందూ అకబార్లతో తాత, నాన్న !
పువ్వుల్లా నవ్వుతూ ఇంట్లోకి వచ్చే వాళ్ళతో
కన్నీళ్లు తుడుచుకుంటూ ఇంట్లోంచి బయటకి వెళ్లే వాళ్ళతో
తలుపు కూడా నవ్వుతూ ఏడుస్తుంటుంది.
కొన్ని తలుపులుంటాయి సంకెళ్ళల్లాంటి గొళ్లాలు
కొన్నింటివైతే ,కడ్డీ ల్లాంటి గొళ్లాలు
మరికొన్ని
అచ్ఛం దృఢమైన కఠినమైన,ఇంటి పెత్తందారు చేతి వేళ్ళలా !
ఆ తలుపులు సున్నితంగానూ, క్రూరంగానూ ఉంటాయి.
రంగులతో తీగలూ లతలతో అందమైన
తలుపులు
తలుపుల రంగు రుచి వాసనలకి చెక్కతనమే కాదు
మనిషి తనం కూడా ఉంటుంది..
అన్నీ తనని తగులుతూ వచ్చి పోయే మనుషులనుంచి అంటించుకున్నవే.
కోపం, ప్రేమ, విరహం అహంకారం ...
అన్నింటినీ ఆవాహన చేసుకుంటాయి ఈ తలుపులు-
బహుశా ఇల్లు మొత్తం కూడా !
తలుపులు మొత్తానికి మానవ హృదయమంత విశాలమైనవి
కురచయినవి కూడా.
ఇంట్లోకి రానిచ్చేవి అవే
ఇంట్లోంచి వెళ్లగొట్టేవీ అవే
నిన్ను ఇంట్లో ఉపిరాడకుండా బంధించేవి అవే
స్వేచ్చగా వదిలేవీ అవే !
కళ్ళున్నా హృదయం లేని తలుపులు కొన్నుంటాయి
తలుపులకి చాలా సార్లు సొంత కళ్ళేమీ ఉండవు
అమ్మ నాన్నల పిల్లల ముసలి వాళ్ళ కళ్ళతో ఇంట్లోపలికి
బయటకూ చూస్తూ ఉంటాయి..
తలుపుల తలపులు కూడా వాళ్ళవే!
పుట్టింటి కొచ్చిన ఆడపిల్ల అమ్మా అనే కంటే ముందు తలుపులనే కదా తట్టేది ? తలుపులు కూడా అమ్మలాగే రెక్కలు చాపి బిడ్డను కౌగిట్లో పొదువుకుంటుంది.
ఈ తలుపులు అమ్మ కోసం ఒకలా... ప్రేయసి కోసమైతే మరోలాగా పసివాడికోసం మురిపంగా
అమ్మానాన్నల కోసం ఆరాటంగా తెరుచుకుంటాయి.
పోస్టుమాన్ తెచ్చిన ప్రేమ లేఖ పక్షి రెక్కలా సున్నితంగా తలుపు తడితే
ఆరాటంగా పరిగెత్తే కాళ్లతో తెరుచుకోవూ తలుపులు?
ఇంకా కొన్ని తలుపులు దయలేనివి...
ప్రేమ దొరకినవి, ఇనుమంత కఠినమైనవి
తెరుచుకోనే తెరుచుకోవు, బిగుసుకు పోతాయి.
ఇంకొన్ని తలుపులకు కులమూ...మతమో ఉంటాయి
మురికితో జిడ్డు కారే జంధ్యంతో
అంటరానితనం పాటిస్తాయి.
అవే తలుపులు ఇల్లు మృత్యువు వాసన వేసినప్పుడు మూసుకుని
తెరుచుకుని తల టప టపా బాదుకుని ఘొల్లుమంటాయి
అవే తలుపులు...
ఇంటికావల నిరీక్షిస్తున్న ప్రియుడి ఆనవాలు పసి గడతాయి
యుగాల తరువాత వస్తానని కబురందించిన ప్రేయసి కోసం
తలుపులు కొసప్రాణంతో తెరుచుకు నే ఉంటాయి.
అప్పుడిక మూసుకున్న తలుపులు కూడా
ప్రేయసీ ప్రియుల యుగళ గీతాన్ని గాలిలో వినిపిస్తాయి.
తలుపుల చాటున నిరీక్షిస్తున్న ప్రేయసి రహస్యాన్ని తలుపులు చెప్పకనే చెప్తాయి .
ఎంతమంది తట్టారో కదా నిన్ను తెరుచుకోమని..లోనకి రానిమ్మని.
తలుపుల లోపలి ఇంటి నుంచి వినిపించే సంగీతాన్ని అర్థం చేసుకున్నప్పుడే
ఇల్లు నిన్నైనా నన్నైనా ప్రేమించేది !
ఎంతటి మహారాణివో కదా నువ్వు ఓ నా దర్వాజా...నీ ఇష్టమే కదా లోనకి రానివ్వడం ...రానివ్వకపోవడం ?
ఇంటి శ్వాసను ఆపేసే ఊపిరితిత్తువి కదా నువ్వు...ఇంటికి ఊపిరి అందించినా నువ్వే..!
నువ్వు ఎన్ని ముఖాలు మోస్తావని...ముఖాలు రంగు మారడాన్ని చూస్తావని ?
ఇక...ఇంట్లోని దుర్మార్గాన్ని చూడలేక దుఃఖంతో కళ్ళు మూసుకుంటాయి తలుపులు.
ఇంటి లోపలో..బయటో ఏం చూస్తాయో మరి తలుపులు...
ఒక నిరంతర గాయాన్నో వేదననో మనుషులతో పాటు!
పొలం పని నుండో...బడి నుంచో ఎండిన రెల్లు గడ్డిలా వచ్చే అమ్మకి
పసిపిల్లల్లా తెరుచుకుని కాళ్ళకి చుట్టేసుకునే తలుపులు !
నాన్నని సమాధి చేసి ..ఇల్లు చేరుకున్న నిన్ను కౌగలించుకున్న తలుపులు.
ఇంటి రహస్యాల్ని కన్నీళ్ళని ధభాలున మూసేసే తలుపులు.
వాకిలి ముందరి దృశ్యాలని..అమ్మలక్కలు చెప్పుకునే ముచ్చట్లను తన కళ్ళతో ఆవాహన చేసుకుని...ఇంటికి రోజొక కలని ఇస్తాయి తలుపులు.
తులసి మొక్కలా నవ్విన నానమ్మని చూస్తూ గంధపు చెక్కల్లా విచ్చుకున్న తలుపులు.
ఇంతకీ ఈ తలుపులు ఇంటికేం అవుతాయి ?
ఏం చుట్టరికం ఉంది ?
ఇంటిని పొదువుకునే అమ్మల రెక్కల్లా ఈ తలుపులు...ఏంటవి ?
మరి..చాలా సార్లు ఇళ్లేందుకని తలుపుల్ని బిగుతుగా మూసేస్తాయి?
తలుపులకి అందెల్లాంటి గొళ్ళం ఎందుకు మూగబోతుంది ?
తాళం ఎందుకు తుప్పు పడుతుంది ?
ఎటు పోతాయి ఆ చేతులు ...తలుపులని తట్టే చేతులు.. తాళం తీసే చేతులు ?
తలుపుల లోపల పెట్టె పాదాలు...
తలుపుల లోపలి మనుషులు...తలుపుల ఆవలి మనుషులు ?
తలుపులు తీస్తేనే కదా మల్లెలైనా మనుషులైనా లోపలికి వచ్చేది
దీర్ఘమైన పాటని టక్కున ఆపేసి నట్లుండే పిల్లల నవ్వుల్ని...
వాళ్ళ మట్టి దేహ పరిమళాల్ని శ్వాసిస్తూ తలుపులు మెల్లిగా తెరుచుకుంటాయి.
అక్కడే ..
ఎక్కడో మోహం తగ్గిన తలుపోకటి ఆమె కో
అతనికో శాశ్వతంగా మూసుకుపోతుంది.
తలుపులంతే....దయలేని తలుపులు అంతకంటే ఏం చేస్తాయి ?
అవే తలుపులు...
ఇంటి లోపల ఏడుస్తున్న మనుషుల్ని చొరవతో బయటకు పంపేస్తాయి
పంపలేక పోతే దుఃఖిస్తాయి.
బిగుసుకుపోయిన తనని తెరవమని..లోపల ఉన్న లోకాన్ని చూడమని నిన్ను ఆహ్వానిస్తాయి...
ఇంటిలోపల ప్రేమనో..ద్వేషాన్నో
చిన్న నీటి చెలమనో
చిరునవ్వులనో .. డాబా పైని ఆకాశాలనో...మిలా మిలా మెరిసే నక్షత్రాలనో..
మొత్తంగా చంద్రుడినో...
తోటలోనిని సౌగంధికా పుష్పాలనో
నిన్ను మూసేసే నిలువెత్తు గోడలనో...
నీకు శ్వాసనందించే తెరిచిన కిటికీలనో పుస్తకాన్నో..కలాన్నో...
లోపలి తలుపులు తెరిచే తాళం చెవులనో జీవితాంతం పొయ్యి వెలిగించాల్సిన అగ్గిపెట్టెనో
చీకటిని వెలిగించే దివ్వెలనో..
నిన్ను లోపలే సమాధి చేసే మాయలనో కట్టు కథలనో
వేటినో ఎన్నుకోమంటాయి తలుపులు !
ఇంటి లోపల నీపై జరిగే కుతంత్రాలు చూడడానికి వెయ్యి కళ్లిస్తాయి తలుపులు !
జాగ్రత్త సుమా!
తలుపులెప్పుడూ నీకు ఛాయిస్ ఇస్తూనే ఉంటాయి.
గడపలోపలికి రమ్మనో...అవతలకి పొమ్మనో !
ఇళ్లు కూడా తలుపులకి చెబుతూనే ఉంటాయి
ఆమెని లేదా అతన్ని లోనకి రానియ్యమనో పోనియ్యమనో.
తలుపు తట్టాలే కానీ ఇల్లు నీలోనే ఉంది
నీ దైన నీ లోపలి ఇల్లు నీ చుట్టూ ఉన్న కనిపించని అన్ని పంజరాలని తెంచేస్తుంది !
నువ్వు తలుపులు తీయాలంతే.
జాగ్రత్త!
తలుపుల్ని గాయపరచకు...
కాలితో తన్ని అవమానించకు తలుపులకి కూడా జంట ఆత్మలుంటాయి.
అప్పుడు తలుపులు కోపంగా మూసుకుంటాయి.
హృదయమిచ్చిచూడు
ప్రేమతో
తెరుచుకుంటాయి
కనపడదు కానీ తలుపులు వియోగ దుఃఖంతో వణికి పోతుంటాయి.
తమను తెరిచే చేతుల కోసమో..తాళాల కోసమో ప్రార్థిస్తూ ఏడుస్తుంటాయి..ఎదురుచూస్తుంటాయి.
తలుపుకు చెవి వొగ్గి వినడం నేర్చుకో !
మూసుకున్న తలుపుకొక కథ ఉంటే..
తెరుచుకున్న తలుపుకి మరొక కథ ఉంటుంది.
బహుశా..వెలుగు చీకట్ల కథ !
గుర్తు పెట్టుకో...
తలుపుకు ప్రాణం ఉంటుంది, సున్నితంగా తట్టటం నేర్చుకో !