కిటికీ అందుకే మూసుకోకు (‘ఇల్లు’ సీక్వెల్ కవిత-8)
x

కిటికీ అందుకే మూసుకోకు (‘ఇల్లు’ సీక్వెల్ కవిత-8)

నీలోంచి చీకటిని తీసుకుని వెలుతురుని వెన్నెలని నింపి ఊపిరిని అందించే మొత్తం భూగోళాన్ని చూపించే కిటికీ ముందు నిమిత్తమాత్రుడిలా నిలబడు అంతే !


-గీతాంజలి


*****
అవును..తలుపులు మూసుకు పోయినప్పుడు కిటికీలు తెరుచుకుంటాయి !

అప్పుడు..నీ సమస్త దుఃఖాలను కిటికీ కావల పారబోధ్ధువు గానీ !

కిటికీ మౌనంగా నిన్ను స్వీకరిస్తుంది.

లోపల బందీగా ఉన్న నీకోసం కిటికీ హృదయంలా తెరుచుకుంటుంది...

ఆకాశంలో నక్షత్రాల ముగ్గుల్ని చూపిస్తూ..

గాలి చెప్పే కథల్ని .. దూరాలనుంచి పాటల్ని గుంజుకుని నీకు వినిపిస్తూ...

కిటికీకి అల్లుకున్న మాధవీలత పూల సుగంధాలని నీ ఊపిరికి అందిస్తూ...నిన్ను నిద్రపుచ్చుతుంది.

కిటికీకి నువ్వు ఎవరైతేనేం...రోజూ చూసే అలిసిన మనిషివి ..ఆస్రితుడివిఅంతే !

***

కిటికీలు..ఎన్నెన్ని రహస్యాలని దాచుకుని మూసుకుంటాయని?

ఇంటి లోపలికి, బయటికివెళ్లే మనుషుల్ని గురుంచి..

రోడ్ల మీది మనుషుల జీవితాల గురుంచి, కిటికీలెప్పుడూ చాడీలు చెప్పవు.

మనుషుల దుఃఖానికి సజీవ సాక్షులు కదా కిటికీలు ?

నిశ్శబ్దం గా రెక్కలు కొట్టుకుంటూ అల్లాడిపోతాయి !

తలుపులు, కిటికీలు పరస్పరం మాట్లాడుకుంటాయి ..చర్చించుకుంటాయి.

తనల్ని తెరుచుకుంటూ వెళ్లే మనుషుల కథల్ని తలుపులు కిటికీలకు చెబుతుంటాయి !

మూసుకున్నా..తెరుచుకున్నా ..కిటికీలు ఎన్నడూ నిద్రపోవు..

మనిషి కలవరపడి లేవకుండా ...

నిదురపోని కిటికీలు మనుషుల కలలకు పహారా కాస్తాయి.

చాలా సార్లు..తలుపులు వేసుకుని మనుషులు గదుల లోపల ఏం చేస్తుంటారో అని ఆలోచిస్తాయి కిటికీలు !

హింస, క్రోధం ద్వేషాలతో ..పశు వాంఛలతో.. మోహ కాంక్షలతో పెనవేసుకు పోతారో

...గాయపరుచుకుంటారో అని ఆందోళనగా.. కిటికీ కాస్త వారగా తెరుచుకుని చూస్తూ కలవరపడి పోతుంది.

చీకటిలో...గది లోపలి మనుషులు కౄర జంతువులుగా మారి పోవటాన్ని చూస్తూ

కిటికీ కూడా నొప్పితో హృదయం పగిలేలా దుఃఖిస్తుంది.

చూడలేక ఇక కళ్ళు మూసుకుంటుంది !

***

కిటికీని ఎప్పుడూ మూయకు..పరదాలు కూడా వేయకు.

కిటికీ వేసే బొమ్మలు చూసావా ఎప్పుడైనా...

పూటకో బొమ్మ గీస్తుంది కదా కిటికీ ?

ఇంటి బయటి నిలువెత్తు చెట్లని..పక్షుల్ని..మనుషుల చలనాల్ని..

రంగులని దుఃఖాల్ని..నవ్వుల్ని..పువ్వుల్ని...ఎండల్ని ..వాన కారు మబ్బుల్ని...

ఉరుముల మెరువుల్ని, సంధ్య వాలే నీడల్ని..సూర్య చంద్రులని,

తొలి ప్రేమ మైకంలో..ఉండి ఉండి నవ్వుకుంటూ ఈల పాట పాడుకుంటూ..

దూసుకు పోయే సైకిల్ కుర్రవాణ్ణి .. గస పోస్తూ పిల్లల కోసం ఇంటికి పరుగులెత్థే అమ్మలని..

అలిసిపోయి ఇంటివైపుకు నీరసంగా అడుగులేసే నాన్నలని.,

జానపద గీతం పాడుతున్నట్లే...మోరెత్తి పాడుతూ.. మామిడిపండ్లు..

వేసవి మల్లెలు అమ్ముకునే నూర్జహాన్ని.,డిగ్రీ ఆపిన మహేశుని.,

సీతాకోక చిలుకల వెంట పరిగెత్థే పిల్లలని..

చెత్త కుండీలో రొట్టెముక్క కోసం వెతుక్కునే ఆకలిని..

బస్సు కిందపడి ప్రాణాలు విడిచిన నిరుద్యోగాన్ని.,

ఇల్లాలిని నడి బజారుకీడ్చి చితక బాదే తాగుబోతుని,

ఇంటిలోపలి.. కలతల్ని.. కనుల చాటున విరిగిన కలల్ని

అన్నం దొరకని మెలకువల్ని..నిద్ర పట్టనివ్వని రాత్రుళ్ళని

పుస్తకాలు దొరకని చదువుల్ని.,

ఇంకా లోలోపలి గదులలో సున్నితమైన ప్రేమల్ని., రాక్షస రతుల్ని...

ఎన్నెన్ని బొమ్మల్ని వేస్తుంది.. చూపిస్తుంది కిటికీ !

***

నీ రహస్య ప్రేమ లో ఆమెనో/అతడో నీకిక దక్కరని అర్థమైఊయినప్పుడు...

ఏకాంతంలో నీకు పొగిలి పొగిలి ఏడవాలనిపించినప్పుడు...

మనసులో చీకటి కమ్మినప్పుడు ,.ఎక్కడికో పారిపోకు ! కిటికీ దగ్గరికెళ్లు..

అప్పుడేం చేస్తుందనుకున్నావు కిటికీ ? తన రెక్కలని చాపి చందమామని అలా తెంపి నీ గుండెల్లో పెట్టేస్తుంది !

నీ దేహాన్నంతా వెన్నెల చందనంతో నింపేస్తుంది...

నీ గాయాలకు తన చల్లటి పొట్టను చుట్టుకున్న చీర మడతల్లో

రహస్యం గా దాచుకున్న లేపనాల సంచీని మురిపెంగా చూపిస్తుంది.

***

అందుకే ..నిద్ర పోయే ముందు కిటికీ తెరిచి పెట్టుకో...

గాలే వస్తుందో..అలక తగ్గిన ప్రేయసే వచ్చి రహస్యంగా నీ పెదవులు ముధ్ధాడి పోతుందో...

అసలు కిటికీనే ప్రేయసిగా మారిపోయి చంద్రుడి మీది తన యుగాల మోహాన్ని నీ రాత్రిలోకి...

నీ గదిలోకి పరిచి పోతుందో మరి ? చూడు...కిటికీ అందుకే మూసుకోకు.

***

కిటికీ..మనుషుల అసహాయ అరుపుల్ని..పగిలిపోయిన మాటల్ని..గొంతు మింగిన ఆర్తనాదాలని...

మొఖాల్లో వికృతంగా మారే రంగుల్ని...విచిత్ర ముఖపు ముడుతల్ని,

విరిగి ముక్కలవుతున్న దేహ కదలికల్ని మౌనంగా చూస్తుంది...వింటుంది.

మనుషుల సమస్త విశ్వాసాలు వీగిపోవడాన్ని ..

విలువలు రక్తసిక్త మవడాన్ని నిర్ఘాంత పోతూ చూస్తుంది.

కిటికీ ఇంట్లోని దేహ రాజకీయాల్ని చతురతతో అంచనా వేస్తుంటుంది.

ఉన్నట్లుండి జడ్జీ గా మారిపోయి తీర్పులు కూడా చెబుతుంది

నిన్నో..అమ్మనో ,చెల్లినో ఓదారుస్తుంది.

కిటికీ మనుషుల సమస్త వికారాలకు..ఆకారాలకు సాక్షిగా నిలబడి చూస్తుంది.

***

కిటికీ తనంత తానుగా ఎప్పుడూ మూసుకోదు.

నువ్వు మూస్తేనే తప్ప !

కిటికీ ఎప్పుడూ నీకోసమే చేతులు చాచి..తల వొంచి..

తనలోకి రమ్మని నీకోసం హృదయాన్ని తెరిచి నిలుచుంటుంది.

కిటికీ నీ నిద్రకు నక్షత్రాలను కాపలా పెడుతుంది..

నీ పడక గదికి రోజొక చందమామని కానుకగా ఇస్తుంది !

***

ఇక వంటింటి కిటికీకి అమ్మ నిత్య చలన శీలి... అమ్మ ఒక నేరం చేయని జీవిత ఖైదీ !

వంటింటి కిటికీ ఎప్పుడూ అమ్మని వదలదు..

తన చిత్రాల్లో అమ్మనొక వంటింటి ఖైదీగా బంధిస్తూనే ఉంటుంది !

అమ్మని కిటికీనే బంధిస్తుందా.. అమ్మనే తనకు తాను బంధీ అవుతుందా..ఏమో?

అమ్మనలా ఖైదు చేసే పోలీసు ఎవరా అని కోపంగా ఇంట్లోకి కళ్ళు విప్పార్చి

వెతుకుతూనే ఉంటుంది వంటింటి కిటికీ !

వంటింటి పొయ్యి సెగల్లో అమ్మ నిత్యం చెమట వానవ్వడాన్నే చూపిస్తుంది.

వంటిల్లెలా.. అమ్మకి గాలి ఆడని చీకటి అండా సెల్ గా మారిందో..

కన్నీళ్ల రంగుతో చిత్రిస్తుంది కిటికీ !

అమ్మకి గాలాడాలని తన రెక్కలని మరింత విశాలం చేసుకుంటుంది కిటికీ !

అమ్మ చేతిలో కూరగాయలు కోసే కరకు కత్తి ..

వంటిల్లు దాటాక మాత్రం వాకిట్లో అరుగు మీద కూర్చుని

సున్నితంగా మల్లెపూలు అల్లడాన్ని...

నెమలీకైపోవడాన్నే చూపిస్తుంది.

***

కిటికీ ఊరికే అలా గోడ గుండెల్లోకి తనను తాను ప్రతిష్టించుకోదు.

కిటికీ నీకు కనిపించే ఒట్టి ఖాళీతనం కాదు.

కిటికీ ఒక భూగోళం...కిటికీ మనిషి సమస్తం ..కిటికీ ఒక తెరిచిన పుస్తకం !

కిటికీ మొత్తానికి చందమామని నుదుటి బొట్టుగా పెట్టుకున్న అమ్మ మొఖం !

కిటికీ పనేమీ లేకుండా వొట్టిగా ఉండదు ! నిశ్శబ్దంగా నిన్ను చూడ్డానికో...

ప్రపంచాన్ని నీకు చూపించడానికో..గది గదిలో తనని తాను కొలువు తీర్చుకుంటుంది.

పడక గది కిటికి.. భోజనాల గది కిటికీ,లివింగ్ రూమ్ కిటికీ

వంటింటి కిటికీ ..అన్ని కిటికీలు రాత్రిపూట సమావేశమై రకరకాల కబుర్లతో...

కన్నీళ్లతో..నవ్వులతో..వెక్కిరింతలతో.. వెక్కిళ్ళతో గుసగుసలు పోతుంటాయి.

ఒక దాన్ని మరొకటి ఓదార్చుకుంటుంటాయి.

కిటికీ అంటే ఏమనుకున్నావు...

కిటికీ ఒకసారి ఇంటికి కన్ను...మరోసారి ఇంటికి చెవి !

తీరుబడిగా నీ కష్టాలని చెవి వొగ్గి మరీ వింటూ ఉంటుంది.

కిటికీ ఇంటి మొత్తాన్ని కాపలా కాసే పహారాదారు !

కిటికీ ఇంటి మొత్తాన్ని మనుషులతో సహా కౌగలించుకుంటుంది.

కిటికీ..మనుషుల్ని ఎంతగా మోహ పరుస్తుందంటే..తన లోలోపలికి లాక్కుంటుంది .

తన ముందు నిలబడి హృదయం విప్పమంటుంది.

దుఃఖంతో ఉక్క బోసిన మనుషుల చెమటను తుడుస్తుంది !

నీ నిశ్శబ్ద గానంలో కిటికీ నీతో కలిసి పాడుతుంది.

గుర్తు తెచ్చుకో నీ ఒంటరి రాత్రుళ్ళని.,

ఒక్కోసారి అమ్మకంటే ఎక్కువగా కిటికీకె కదా నువ్వు నీ కన్నీళ్లను పంచుకునేది ?

అందుకే..కిటికీనెప్పుడూ మూయకు !

కిటికీనే కదా అని చిన్న చూపు చూడకు !

కిటికీ ముందు వినమ్రంగా నిలబడు !

నీకు సూర్య చంద్రుల్ని చూపించి

నీలోంచి చీకటిని తీసుకుని వెలుతురుని, వెన్నెలనినింపి

ఊపిరిని అందించే ..

మొత్తం భూగోళాన్ని చూపించే కిటికీ ముందు

నిమిత్తమాత్రుడిలా నిలబడు అంతే !

Read More
Next Story