
అయామ్ సారీ నాన్నా!
డా. మల్లంగి గోపీ కృష్ణ ‘మండే’ పోయెమ్
ఐసియులో రాత్రి భరించలేని
నీరవ నిశ్శబ్దంగా ఉంది..
మానిటర్ల బీప్ బీప్‌లతో
అది మరింత చిక్కబడుతోంది!
నిదురకాయలేక సిస్టర్ల కళ్ళు
మాటిమాటికీ వాలిపోతున్నాయి..
సహకరించని వాళ్ళ వేళ్ళు
కేస్‌షీట్లలో నోట్సు వ్రాస్తున్నాయి!
బాధను చెప్పుకొనే శక్తిలేని పేషంట్లు
మౌనంగా మూలుగుతున్నారు..
అయిపోతున్న సెలైన్ బాటిళ్ళను
సిస్టర్లు నిశ్శబ్దంగా మారుస్తున్నారు!
మిషన్లను కాపాడేందుకు
సెంట్రల్ ఏసీ పనిచేస్తూనే ఉంది..
చలితో వణికుతూన్న పేషంట్లు
రగ్గులు పైకి లాక్కొంటున్నారు!
మధ్యలో పేషంట్లకుటుంబీకులు
లోనికివచ్చి చూసివెళ్తున్నారు..
మనవాళ్ళు బ్రతికేవున్నారని
బయటకెళ్ళి చెబుతున్నారు!
రాజులా బ్రతికిన నాన్న
నిస్సహాయంగా నన్నే చూస్తున్నాడు..
పెదవిదాటలేని మాటల మూలంగా
కళ్ళతోనే తనునన్ను ప్రశ్నిస్తున్నాడు!
పొడిచే సూదులతో జల్లెడైన ఒళ్ళు
ఇక ఓర్చుకోలేనంటుంది..
అడ్డంగావున్న ఆక్సిజన్‌మాస్కుతో
ఊపిరితీసుకోవడం కష్టంగావుంది!
నరాలు దొరకలేదని సిస్టర్లు
చేతులుకట్టేసి పొడుస్తున్నారు..
చావకముందే చూపించే ఈనరకం
ఇక చాలు అని నాకనిపిస్తోంది!
ఎనిమిదిపదుల వయసులో
ఎందుకని ఇలా శిక్షిస్తున్నావు..
ఇంటికి తీసుకెళ్ళమని అడిగినా
చూపెందుకు తిప్పుకొంటున్నావు!
అన్నీవున్న అనాధలా నాకిక్కడ
ఐసియులో ఉండాలనిలేదు..
ఇంట్లో మీఅందరిమధ్య కూర్చొని
శెలవు తీసుకోవాలనివుంది!
జీవితాంతం నామాటవిన్న నువ్వు
ఇప్పుడెందుకని దిక్కరిస్తున్నావు..
జీవన చరమాంకంలో ప్రశాంతతను
ఎందుకు నువ్వు దూరంచేస్తున్నావు!
నాన్న కళ్ళల్లోని ఒక్కప్రశ్నకూ
నాదగ్గర సమాధానంలేదు..
నాన్నను ఇంటికితీసుకెళ్ళే సాహసం
ఆక్షణంలో నాలో అస్సలులేదు!
నాకళ్ళముందే ఆయన మగతలోకి
జారుకోవడం నేను చూస్తున్నాను..
మరలిరాలేని మహాప్రస్థానయాత్రకు
నిస్సహాయ సాక్షీభూతమయ్యాను!
అంతా అయిపోయాక నన్నునేను
నేటికీ క్షమించుకోలేకపోతున్నాను..
ప్రశ్నించే నాన్న చివరిచూపునుండి
నేను తప్పించుకోలేకపోతున్నాను!
నేను తప్పించుకోలేకపోతున్నాను!
నేను తప్పించుకోలేకపోతున్నాను!
నాన్నా...
సారీ నాన్నా...
అయామ్ రియల్లీ సారీ నాన్నా...

