మహాశివరాత్రికి ఉపవాసం చేస్తున్నారా.. ఇవి తెలుసుకోండి!
x

మహాశివరాత్రికి ఉపవాసం చేస్తున్నారా.. ఇవి తెలుసుకోండి!

మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం చేస్తున్నారా. అయితే ఈ టిప్స్ మాటించి శివరాత్రి ఉపవాసాన్ని ప్రశాంతంగా శివనామ స్మరణతో పూర్తి చేసుకోండి.



రెండు తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి సంబరాలు ప్రారంభమయ్యాయి. అన్ని శైవక్షేత్రాల్లో తెల్లవారుజాము నుంచే పూజలు, అభిషేకాలు ప్రారంభమయ్యాయి. అన్ని ఆలయాల్లో భక్తుల రద్దీ కూడా భారీగానే ఉంది. ఈ రోజును కొందరు హిందువులు శివుడు, పార్వతి వివాహం చేసుకున్న పర్వదినంగా భావిస్తే మరికొందరు మాత్రం శివునికి శత్రులు దాసోహం అన్న రోజుగా భావిస్తారు. ఏది ఏమైనా మహాశివరాత్రిని దేశంలోని హిందువులందరూ అంగరంగవైభంగా నిర్వహిస్తారు. శివరాత్రి సందర్భంగా శివ భక్తులు శివునికి పూజలు చేసి, తమ పాపాలను తొలగించుకోవడానికి పలు కార్యక్రమాలు చేస్తారు. అందులో భాగంగా ఉపవాసం ఉండి రోజు మొత్తాన్ని శివనామ స్మరణలో గడుపుతారు. సాయంత్రం సమయంలో పూజ చేసుకుని అల్పాహారాన్ని తీసుకుంటారు. అయితే శివరాత్రి రోజు ఉపవాసం చేయాలని అనుకునే వారు ఈ టిప్స్ పాటిస్తే ఉపవాసం చేయడం ఇబ్బందిగా ఉండదు.

మానసిక ధృడత్వం ముఖ్యం

శివరాత్రి సందర్భంగా రోజంతా ఉపవాసం చేయాలని అనుకునే వారు ముందుగా పగలు, రాత్రి అంతా ఉపవాసం చేసే వాళ్లు ముందుగా మానసికంగా సిద్ధం కావాలి. మన లక్ష్యాన్ని సాధించడంలో మన మానసిక స్థితి కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా శివరాత్రి ఉపవాసం అంటే చాలా మహత్తరకార్యం కావున ఈ సమయంలో మనం చాలా ప్రశాంతంగా ఉండాలి. ఉపవాసం చేయడానికి ముందు రోజు అల్పాహారాన్ని తీసుకోవాలి, అలా చేయడం వల్ల తర్వాతి రోజు మన ఆహారంలో వచ్చే మార్పును మన శరీరం సులభంగా స్వీకరిస్తుంది. తద్వారా ఉపవాసం చేయడం కష్టతరంగా అనిపించదు.

సరైన పద్దితిని ఎంచుకోవడం

ఉపవాసం చేయడం అంటే చాలా మంది ఏం తినకుండా ఉండటం అనుకుంటారు. కానీ అలా కాదు. మన శరీర, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అతి తక్కువ ఆహారం తీసుకోవడమే ఉపవాసం. ఉపవాసం పేరుతో కళ్ళు గిర్రున తిరుగుతున్నా తినకుండా ఉండటం మంచిది కాదు. ఉపవాస సమయంలో ఎప్పుడైనా బాగా ఇప్పందిగా అనిపిస్తే అప్పుడు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కాస్త ఆహారం తీసుకోవచ్చు. డయాబెటీస్, లో బీపీ ఉన్న వాళ్లు రోజంతా ఏమీ తినకుండా ఉపవాసం చేయలేరు. అలాంటప్పుడే బాగా ఆకలి అయినప్పుడు ఒకటి లేదా రెండు ఫలాలు ఆరగించొచ్చు. తద్వారా మన ఆరోగ్యం క్షీణించకుండా జాగ్రత్త పడొచ్చు.

హైడ్రేటెడ్‌గా ఉండాలి

ఉపవాసం సమయంలో మన శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. రోజంతా కూడా శరీరానికి సరిపడా నీటిని తీసుకోవాలి. కేవలం నీరనే కాదు కొబ్బరి నీళ్లు, హెర్బల్ టీ, జ్యూస్‌లు కూడా తీసుకోవచ్చు. హైడ్రేషన్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కళ్లు తిరగడం, నోరు పిడసగట్టడం, గొంతు తడి ఆరిపోవడం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఇవి రాకుండా ఉండటానికైనా నీరు అధికంగా తీసుకుంటుండాలి. మన శరీరంలోని వ్యర్థపదార్థాలను బయటకు పంపడానికి కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కేవలం నీరు మాత్రమే తాగుతూ ఉపవాసం చేస్తుంటే ఆ సమయంలో మీరు తాగే నీటిని పెంచాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల మన శరీరం నిస్సత్తువకు గురికాదు.

బిజీగా ఉండటానికి ప్రయత్నించాలి

ఉపవాసం మధ్యలో పొరపాటు ఏమీ తినకుండా ఉండటానికి, ఆహారం ఆలోచన రాకుండా ఉండటానికి మిమ్మల్ని మీరు కాస్త బిజీగా ఉంచుకోండి. ఏదో ఒక పనినిలో నిమగ్నమై ఉండాలి. ఖాళీగా ఉండే బదులుగా ఏదైనా పుస్తకం చదవడం, పాటలు వినడం వంటివి చేయొచ్చు. కానీ ఇక్కడ శివరాత్ర ఉపవాసం కాబట్టి ఈ పర్వదినాన ఉపవాసం, జాగారాన్ని శివనామ స్మరణలో పూర్తి చేయాలంటారు. అందుకోసమని శివునికి సంబంధించిన పుస్తకాలు చదవడం, పాటలు వినడం, సినిమాలు చూడటం ద్వారా ఉపవాసాన్ని పూర్తి చేయొచ్చు. వీటితో పాటు పూజా కార్యక్రమాలు, భజనలు వంటి వాటిలో కూడా పాల్గొనడం ఉపయోగపడుతుంది.

ఉపవాసం సమయంలో ఇవి తినడం మంచిది

ఉపవాసం చేసే సమయంలో తేలికగా జీర్ణం అయ్యే అరటి పండ్లు, యాపిల్, నారింజ ఫలాలు తినడం మంచిది. వాటితో పాటుగా బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా పప్పులు కూడా తినొచ్చు. ఏ ఫలాలు తిన్నా కూడా అవి స్వల్ప మోతాదులోనే తినాలి. కడుపునిండా తింటే ఉపవాస నియమాలు పాటించనట్లే అవుతుంది. కాబట్టి తినే సమయంలో ఈ నియమాలను దృష్టిలో పెట్టుకోండి. అంతేకాకుండా ప్రతి రెండు మూడు గంటలకు ఏదైనా అల్పాహారాన్ని తీసుకోవడం మంచిదే.

వీళ్లు ఉపవాసం చేయకూడదు

గుండె సంబంధిత సమస్యలు, టైప్2 డయాబెటీస్, గర్భిణులు, పిల్లలకు పాలు పట్టిస్తున్న తల్లులు, తక్కువ బరువున్న వ్యక్తులు, ఆహార సంబంధి సమస్యలు ఉన్నవారు, బీపీ వంటి సమస్యలు ఉన్న వ్యక్తులు ఉపవాసం చేయకపోవడమే మంచిది. ఉపవాసం ఒక రీతిలో మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీర్ణ వ్యవస్థ మెరుగు పడేలా చేస్తుంది. కానీ ఈ వ్యాధులు ఉన్న వారు ఉపవాసం చేస్తే అది వారికి లేనిపోని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.


Read More
Next Story