నేడు జాతీయ ఆక్యుపంక్చర్ దినోత్సవం
x

నేడు జాతీయ ఆక్యుపంక్చర్ దినోత్సవం

తిరుపతిలో డాక్టర్ బికె బసు 113వ జయంతి సభ విశేషాలు


భారత దేశంలో ఆక్యుపంక్చర్ (Acupuncture) ను ప్రవేశపెట్టిన డాక్టర్ బిజోయ్ కుమార్ బసు (Dr Bijoy Kumar Basu) జన్మదినాన్ని జాతీయ ఆక్యుపంక్చర్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. చైనాపై జపాన్ దురాక్రమణ సందర్భంగా అక్కడి ప్రజలకు వైద్య సేవలు అందించడానికి వెళ్ళిన ఐదుగురు సభ్యుల భారత వైద్యబందంలో డాక్టర్ బిజోయ్ కుమార్ బసు ఒకరు.

చైనా సంప్రదాయ ఆక్చుపంక్చర్ వైద్య విధానాన్ని భారత దేశంలో ప్రవేశ పెట్టి, అబివృద్ధి చేసిన డాక్టర్ బిజోయ్ కుమార్ బసు జయంతి సదర్శంగా మార్చి 1వ తేదీ జాతీయ ఆక్యుపంక్చర్ వైద్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

ఆక్యుపంక్చర్ అనేది చైనా సంప్రదాయ వైద్య విధానం. చైనా ప్రభుత్వం ఈ వైద్య విధానాన్ని అబివృద్ధి చేసింది. ఈ వైద్య విధానంలో మందులు వాడవలసిన అవసరం లేదు. కేవలం సూదుల ద్వారా ఎముకలు, కీళ్ళ నొప్పులు, స్త్రీల సమస్యలు, పక్షవాతం వల్ల వచ్చే నష్టాలను తగ్గించడం వంటి మొత్తం 338 వ్యాధులకు చికిత్స చేస్తారు.

చైనాపైన జపాన్ 1937 లో దురాక్రమణ చేయడంతో అక్కడి ప్రజలు, ముఖ్యంగా సైనికులు పెద్ద ఎత్తున చనిపోతున్నారు. చైనా విముక్తి కోసం పోరాడుతున్న చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకులు వైద్య సహాయం కోసం భారత కాంగ్రెస్ పార్టీని అర్థించారు. ఆ సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్న సుభాస్ చంద్రబోస్ పిలుపు మేరకు భారత దేశం నుంచి అయిదుగురు సభ్యుల వైద్య బృందం ‘ఇండియన్ మెడికల్ మిషన్ (ఐఎంఎం)’ చైనా వెళ్ళింది. ఆ బృందంలో డాక్టర్ ద్వారకానాథ్ కోట్నీస్, ఎం. డాక్టర్ అటల్, డాక్టర్ బిజోయ్ కుమార్ బసు, డాక్టర్ ఎం చోల్కర్, డాక్టర్ డి. ముఖర్జీ ఉన్నారు. ఒక్క కోట్నీస్ తప్ప మిగతా వాళ్లంతా వెనక్కు వచ్చారు. కొట్నీస్ మాత్రం అక్కడి కమ్యూనిస్టు పార్టీలో చేరిపోయి తన సేవలు కొనసాగించారు.


డాక్టర్ ద్వారకానాథ్ కోట్నీస్ 1938 నుంచి అక్కడే అనేక మందికి వైద్య సేవలు అందించి, వారిని బతికించి, 1942లో 32 ఏళ్ళ వయసులో అక్కడే ప్రాణాలు విడిచాడు. భారత చైనా దేశాల స్నేహానికి చిహ్నంగా డాక్టర్ కోట్నీస్ నిలిచిపోయాడు. కొట్నీస్ ఒక చైనా నర్సును వివాహమాడారు.ఒక కుమారుడుకూడా పుట్టాడు. తర్వాత కొద్దిరోజుల్లోనే అనోగ్యంతో చనిపోయాడు.

డాక్టర్ బిజోయ్ కుమార్ బసు 1943 వరకు అయిదేళ్ళ పాటు వైద్య సేవలు అందించి భారతదేశానికి తిరిగి వచ్చినప్పటికీ ‘ఇండియన్ మెడికల్ మిషన్ (ఐఎంఎం)’ స్ఫూర్తిని కొనసాగించాడు.

డాక్టర్ బిజోయ్ కుమార్ బసు 1958లో తిరిగి చైనా వెళ్ళి, అక్కడ ఏడాది పాటు ఆక్యుపంక్చర్ వైద్యవిధానాన్ని నేర్చుకున్నాడు. ఆక్చుపంక్చర్ వైద్య విధానంలో అభివృద్ధి చేసిన పద్ధతులను నేర్చుకోవడానికి చైనా ప్రభుత్వ ఆహ్వానం మేరకు 1973లో తిరిగి ఆ దేశం వెళ్ళాడు. భారతదేశానికి తిరిగి వచ్చాక ఆక్యుపంక్చర్ వైద్య విధానాన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చాడు.

డాక్టర్ బిజోయ్ కుమార్ బసు డాక్టర్ కోట్నీస్ మెమోరియల్ కమిటీని ఏర్పాటు చేశాడు. ఆక్యుపంక్చర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాను స్థాపించి, దాని కోసం తన ఇంటిని బెంగాల్ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చాడు. ఆక్యుపంక్చర్ వైద్యాన్ని, దాని వైద్యులను తొలిసారిగా బెంగాల్, మహారాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. ఆరోగ్య పరిరక్షణలో ఆక్యుపంక్చర్ వైద్య విధానాన్ని గుర్తిస్తూ ఫెడరల్ మినిష్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్(ఆరోగ్య పరిశోధనా విభాగం) 2019లో ఆదేశాలు జారీచేసింది.

భారత దేశంలో లక్షమంది ఆక్యుపంక్చర్ వైద్యులు సేవలందిస్తున్నారు. డాక్టర్ కోట్నీస్ ఇప్పుడు లేక పోవచ్చు. కానీ, రోగులకు సేవలందించిన ఆయన స్ఫూర్తిని మాత్రం నేటికీ కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆక్యుపంక్చర్ వైద్య విధానం విస్తరించడం ద్వారా భారత-చైనా దేశాల మధ్య స్నేహాన్ని పెంపొందించడానికి ఈ వైద్య విధానం ఒక వారధిలా పనిచేస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

తిరుపతిలో బికే బసు ... 113వ జయంతి సభ



భారతదేశంలో ఆధునిక ఆక్యుపంక్చర్ వైద్యానికి ఆధ్యుడు బికే బసు అని ఆయన త్యాగనిరతి, ఆదర్శం కారణంగా తమలాంటి వాళ్ళు ఈ వైద్యంలో కొనసాగుతున్నామని తిరుపతి లో ఈ సాయంకాలం జరిగిన డాక్టర్ బసు 113వ జయంతి సభలో ప్రసంగిస్తూ ప్రముఖ ఆక్యుపంక్చర్ వైద్యులు డాక్టర్ ఎంఎస్ బాలాజీ అన్నారు.

వేమన విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో డాక్టర్ బికే బసు 113వ జయంతి సభను శనివారం నాటి సాయంత్రం యశోద నగర్ లోని కార్యాలయంలో నిర్వహించారు.

ఈ సభకు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ రవీంద్ర అధ్యక్షత వహించారు. సభలో సీనియర్ జర్నలిస్టు రాఘవ, బాలోత్సవం అధ్యక్షులు టెంకాయల దామోదరం, వేమన విజ్ఞాన కేంద్రం ప్రధాన కార్యదర్శి నాగార్జున, తదితరులు ప్రసంగించారు.

డాక్టర్ బికే బసు 40 ఏళ్ల వయసులోనే చైనా విప్లవంలో గాయాల పాలవుతున్న సైనికులకు సేవలు అందించటానికి డాక్టర్ నార్మన్ బెతూన్, డాక్టర్ కోట్నిస్ వంటి మరికొందరు డాక్టర్లతో కలిసి చైనా సైనికులకు సేవలందించడానికి వెళ్లారని వక్తలు గుర్తు చేశారు.

ఆయన స్ఫూర్తితో తిరుపతిలో ఆక్యుపంక్చర్ వైద్యాన్ని కొనసాగిస్తున్నామని వేమన విజ్ఞాన కేంద్రంలో ఆయన పేరిట ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించామని, ప్రస్తుతం వారానికి ఒకరోజు ఉచిత వైద్య శిబిరం కొనసాగుతున్నదని వివరించారు. ఈ శిబిరంలో వైద్యం పొందిన అనేకమంది దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడి స్వస్థత పొందారని తెలిపారు. వైద్యాన్ని వ్యాపారంగా మార్చేస్తున్న ప్రస్తుత తరుణంలో బికే బసు లాంటి వ్యక్తులు కరువవుతున్నారని, సామాన్యునికి వైద్యం అందుబాటులో లేదని కార్పొరేట్ శక్తులు వైద్యాన్ని వ్యాపారంగా మార్చేశాయని ఇలాంటి రోజుల్లో బీకే బసు లాంటి వైద్యులు దేశానికి విస్తారంగా అవసరం ఉందని ఈ సందర్భంగా వక్తలు ఉద్గాటించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగరానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Read More
Next Story