అలిశెట్టి యాదిలో...
x

అలిశెట్టి యాదిలో...

అలిశెట్టి ప్రభాకర్ (1956 జనవరి 12 -1993 జనవరి 12) అణుశక్తి నింపుకున్న కవిత్వం తెలుగు జాతికి అందించాడు. ఆయనకు నివాళిగా ఈ కవిత



-మొహమ్మెద్ .ఇక్బాల్

.

గొర్రెలన్నీ పుర్రెలూపుకుంటూ కసాయి కత్తిదగ్గరకెళ్ళి రక్తం ధారబోసినట్టు

బతికున్న శవాలన్నీ పోగయి ఓటరు కుండీలో తమ ఆశలు,ఆశయాలును సమాధి చేస్తున్నాయి

చెత్తకుండీలన్నీ గుమ్మి గూడి కంపుకు కళ్లెమేస్తామని ప్రమాణం చేసినట్టు

హక్కులెరగని దేహాలన్నీ ఏకమై ఓట్లను నాయకులకు తాకట్టు పెడుతున్నారు

చెరువులోని చేపలన్నీ వలకు చిక్కడానికి దండయాత్ర చేసినట్టు

ఓటరు మహాశయులందరు దండుకట్టి నాయకుల

పాద ధూళిని ముద్దడటానికి పాకులాడుతున్నారు

ఆకలి తీరని జంతువులు నిస్తేజంతో సింహానికి దాసోహమయినట్టు

అంగీ ,లాగు లేని ఆకలితీరని పేదోళ్లు ఇంకా పాచి అన్నానికి పరమాన్నమ్మనుకొని జలగలను గద్దెనెక్కిస్తున్నారు

కప్పలు బావినే సముద్రంగా భావించినట్టు

పురుగన్నానికి అలవాటు పడ్డ పేగులు ఇదే పెరుగన్నంగా భావిస్తున్నాయి

పుర్రెల పురుగు పురిగొలిపే వరకు నిదురోతున్న అస్థిపంజరాలు

ఇకనైనా మేల్కోండి ...

మట్టిపాలైన చెమట చుక్కల్ని మసిక బట్టలతో ఒడిసిబట్టండి

నేల పాలై నేటికీ కనిపిస్తున్న నెత్తుటి మరకలను మననం చేసుకోండి

నిర్జీవంగా నిద్రిస్తున్న ఐదు జ్ఞానేంద్రియాను మేల్కొలపండి

అణిచివేస్తె నిప్పుకణికలై ఎగిసిన చరిత్రకు పునర్జీవం పోయండి

ఈ మట్టిపై పీతికంపులో పురుగులలా కాదు

పీతిగంపలో పూలలా కాదు

ఏ సంకెళ్లు లేని "రవి"లా జీవన కొనసాగించండి .


Read More
Next Story