దాశరథి జనధర్మ మరొక జ్ఞాపకం
ఎన్నాళ్లకు తెల్లవారె
ఎన్నాళ్లకు కన్నుదూరె
తెలుగు వెలుగు వెలుగు తెలుగు
తెలుగు తెలుగు తెలుగు తెలుగు
అని అంటున్నవాడు మహాకవి దాశరథి.
‘‘పోలీస్ యాక్షన్’’ (Police Action) అనే దాడి జరిగింది. నిజానికి ఇది పోలీస్ ఆక్షన్ కాదు, నిజాం పాలనలో ఉన్న తెలంగాణ పై సైన్యం నడిపినది భారత ప్రభుత్వం. భారతదేశానికి స్వాతంత్య్రం ఆగస్టు 15, 1947న వచ్చింది. ఎంత గొప్ప పండుగ. కాని తెలంగాణకు స్వాతంత్య్రం 1948 సెప్టెంబర్ 17, 18 మధ్య లభించింది. రాజకీయ ఖైదీలకు ముక్తి కలిగింది. సహచరులతో బాటు దాశరథి జైలు నుండి బయటకు వచ్చినవాడు స్వతంత్ర భూమిని కళ్లారా చూచినాడు. ఎగిరి గంతుచేసినాడు అంటూ, తెలుగు వెలుగు రచించారు. ఎంత ఆనందం. కాదా మరి. కన్న కలలు ఫలించినవి. అంతకన్న ఆనందం ఇంకేముంటుంది అని సాహితీ వేత్త కోవెల సంపత్కుమార సంతోషాన్నివెల్లడించారు.
దాశరథి వరంగల్లు వారు. ‘‘గూడూరు పేరుతో చాలా ఊళ్లున్నాయి. వాటిలో ఒకటి మానుకోట (మహబూబాబాద్), అది తాలూకాలో ఉన్నది. ఈ తాలూకా వరంగల్లు జిల్లాకు చెందింది, తెలంగాణాలో పేరు ప్రతిష్టలు గల పండితులు శ్రీ దాశరథి వేంకటాచార్యులు, వారిది ఈ గూడూరు. సంస్కృత ద్రావిడ భాషలలో మంచి ప్రావీణ్యం శ్రీఆచార్యుల వారిది. ఉభయ వేదాంతాలలో నిష్కృష్టంగా పాండిత్యంగల ఉత్తమ సాహిత్యకుడు’’ అని కోవెల సంపత్కుమార రచించారు. అది 1968 లో ఈ సంచికలో చాలా వివరమైన శ్రీ దాశరథి పై వ్యాసం అచ్చు చేసారు. మనం సాధారణంగా దాశరథి అంటాం కాని, గౌరవంగా ‘‘శ్రీదాశరథి’’ అని సంపత్కుమార సంబోధించారు.
దాశరథి కృష్ణమాచార్యులు ప్రముఖ సాహితీవేత్త. వారి సోదరుడు, మరో సుప్రసిద్ధుడు దాశరథి రంగాచార్యులనే వేదాలను అనువదించిన రచయిత. ఈ మహా రచయితలు ఇద్దరూ దాశరథి వేంకటాచార్య కుమారులే. ఒక్క సారి వినబడితే చాలు, ఆ కఠినమైన సంస్కృత కంఠపాఠం క్షణాల్లో చేయడమే దాశరథి కృష్ణమాచార్యుల శక్తి. కాదంబరీ వంటి చాలా జటిల గద్య గ్రంథాన్ని కూడా కంఠస్థం చేసారు. ఉర్దూ పాఠ్య భాగాల్లో చదువుకున్నారు. మీర్జా గాలిబ్ కవితా మాధుర్యాన్ని అర్థం చేసుకుని, ముగ్ధుడైన సాహితీ మూర్తిగా ఎదిగిన వారు దాశరథి. కేవలం 15 ..18 సంవత్సరాల కాలంలోనే దాశరథి గాలిబ్ కవిత్వాన్ని అనువదించడం ఆశ్చర్యం. అప్పుడే గార్ల గ్రామం జాగీరులో రైతు ఉద్యమాన్ని ప్రవేశించారు దాశరథి. వరంగల్లు వాడే అయినా. బడి చదువు కోసం పక్కన ఉన్న ఖమ్మంతో సంబంధం ఉంది. అక్కడ హైస్కూల్ ను ఉస్మానియా హైస్కూల్ అంటారు.
జనధర్మ పత్రిక వ్యవస్థాపన చేసిన సంపాదకుడు ఎం ఎస్ ఆచార్య వారి కుటుంబం నెల్లికుదురు గ్రామంలో ఉండేవారు. దాశరథివారి గార్ల గ్రామం ఈ నెల్లికుదురు చాలా దగ్గరి ఊళ్లు. వారు సుపరిచితులు. విశేషమేమంటే దాశరథి శతజయంతి, జనధర్మ ఆచార్య గారి శతజయంతి కూడా 2024. దాశరథి వలెనే తెలంగాణ విముక్తికోసం పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడు ఎం ఎస్ ఆచార్య.
సి నారాయణ రెడ్డి, దాశరథి సుప్రసిద్ధ సినీ రచయిత. అద్భుతమైన కవులు కూడా. ఆ ఇద్దరికీ మంచి మిత్రుడు నేరెళ్ల వేణుమాధవ్ ప్రముఖ (మిమిక్రీ) ధ్వన్యనుకరణ సామ్రాట్.
దాశరథి ఆటోగ్రాఫ్
జనధర్మ పత్రిక సంపాదకుడుగా మానాన్న గారు కీర్తిశేషులు ఎం ఎస్ ఆచార్య వరంగల్లులో ప్రచురిస్తున్న రోజుల్లో దాశరథి గారు ఎన్నో సార్లు వారిని కలిసే అవకాశం, జనధర్మ ప్రెస్ లో కూడా స్వయంగా వారితో చూడడం మాట్లాడడం జరిగింది. నేను 1976లో కాకతీయ యూనివర్సిటీ ఏర్పాటు కావడానికి ముందు ఉస్మానియా యూనివర్సిటీ పిజి సెంటర్ లో, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సాయంకాలం న్యాయశాస్త్రం చదువుకునే వాడిని. అక్కడ ఒక సాహితీ సభకు దాశరథి, సి నారాయణ్ రెడ్డి గారు వచ్చారు, అది మా అదృష్టం. నా అభిమాన కవి వరేణ్యులు వారు. నా వెంట ఉన్న ఒక రూల్ నోట్ బుక్ లో మీ ఆటోగ్రాఫ్ అడుగుదామని అడగలేదని అని అనుమానిస్తున్నాను. ఎందుకంటే అది కేవలం నోట్ బుక్, ప్రత్యేకమైన ఆటోగ్రాఫ్ పుస్తకం నాకు లేదు. ఎవరినైనా అడిగి తెచ్చుకునే అవకాశం లేదు. ఏమనుకోకుండా మీ హస్తాక్షరి ఇస్తారా అని అడిగాను ఇద్దరినీ. ఆయన ‘తప్పకుండా’ అన్నారు. గొప్ప అసామన్యుడు అసాధారణమైన వ్యక్తి అయినా ఎంత సామన్యునిగా వారి సంతకం ఇచ్చేసారు. నేను జాగ్రత్తగా తెచ్చుకున్నాను.
మన కవులు, రచయితలు, పండితులు
జనధర్మ పత్రికలో ప్రతివారం ఆచార్య కోవెల సంపత్కుమారాచార్యులు ‘‘మన కవులు రచయితలు పండితులు’’ అనే శీర్షికతో వ్యాసాలు రాసేవారు.
అందులో 25 ఎంపిక చేసుకుని పుస్తకంగా ప్రచురించారు. అందులో మాడభూషి శ్రీరంగాచార్యుల సాహితీ వైభవాన్ని వివరించారు. (మా ముత్తాతగారు అంటే ఎం ఎస్ ఆచార్య, వారి తండ్రి ప్రసన్నరాఘవాచార్యులు, వారి తండ్రి శ్రీరంగాచార్యులు) అందులో సంపత్కుమార వ్యాసం ప్రచురించారు.
ఆ తరువాత శ్రీ దాశరథి పేరుతో వివరమైన వ్యాసాన్ని సంపత్కుమార రచించారు. అది 25 వ్యాసాలతరువాత మన కవులు రచయితలు పండితులు పుస్తకంగా జనదర్మ ప్రచురణమైంది. ఆ తరువాత రెండో పుస్తకంగా వేయాలనుకున్నారు కాని చేయలేదు. కాని జనధర్మ వార పత్రికలో 16.5.1968 నాడు మూడవ, ఆరవ పేజీల్లో ప్రచురించేవారు.
చైతన్య గంగా స్రవంతి
1976లో ద్విదశాబ్ది ఆంధ్రప్రదేశ్ ఉత్సవాలు జరుగుతూ ఉన్నదశలో కవిసమ్మేళనంలో నేను పాల్గొనే భాగ్యం వచ్చింది. దాశరథి కవిసమ్మేళనానికి అధ్యక్షులు. ఆ మహానుభావుడి ముందు ఏమైనా మాట్లాడగలనా, కవిత్వం చెప్పగలనా అని భయపడేవాడిని. నా పేరు పిలిచారు. భయం అణచి దడదడను దాచుకుంటూ అంతకుముందే రాసుకున్న కవిత్వాన్ని చెప్పగలిగాను. తరువాత ఏమంటారోఅని మరోఆందోళన. దాశరథి నాకు మాటలు ప్రశంసా వాక్యాలు నన్ను కొండంత ఉత్సాహం ఇచ్చింది. ఎంతో ఆనందం దొరికిన క్షణం అది. నా కవితలో ‘చైతన్యగంగా స్రవంతి’ అని నేను గంగానదిని చైతన్యంతో పోల్చడం వారికి చాలా నచ్చింది. ‘‘ఈ యువకవి చైతన్యంతో గంగా స్రవంతిని’’ అంటూ దీవెనలు శుభాకాంక్షలు అందించారు. మరిచిపోలేని అద్భుత క్షణాలు అవి.
‘మా నిజాం రాజు జన్మజన్మాల బూజు’ అనీ ‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ అని నినాదాలను మాటలు తూటాలై, మంత్రాలై, దుర్మార్గులపైన గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. ఆ ఉద్యమ కవిత్వాలు ఇప్పటికీ నా జీవితానికి స్ఫూర్తిదాయకంగా వెలుగుతూ ఉంటున్నాయి.