ప్రజలంటే ఓట్లు కాసే చెట్లేనా...
x

ప్రజలంటే ఓట్లు కాసే చెట్లేనా...

డబ్బు, కులం, గుండాగిరీ రాజకీయ నాయకులకు ఆభరణాలుగా మారాయి


-రమణాచారి


అధికారం కోసం, పదవులు దక్కించుకోవడం కోసం రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న దిగజారుడు పనులు పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థకు కళంకం తెచ్చిపెడుతున్నాయి. చట్టాలను చుట్టాలుగా చేసుకొని ప్రవర్తిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉన్నది. చట్టాలు అమలు అవుతున్న తీరు వివాదాస్పదం అవుతున్నది.న్యాయ స్థానాలలో తీర్పులు వెలువరించడంలో జరుగుతున్న కాలాతీతం కారణంగా అమాయకులు బలవుతున్నారు.

ఉదాహరణకు ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జి. ఎన్. సాయిబాబు పదేళ్లపాటు జైలులో క్రూర నిబంధాన్ని అనుభవించి నిర్దోషిగా విడుదల అయ్యాడు. తర్వాత అనారోగ్యంతో అకాల మరణం పొందాడు. తాను పోగొట్టుకున్న జీవిత కాలాన్ని తిరిగి ఎవరు ఇవ్వగలరు ? స్వార్థపరులు, దోపిడీదార్లు మాత్రమే ప్రయోజనం పొందుతున్నారు. ఈ విషయం చాలా కాలంగా ప్రజా బాహుళ్యంలో చర్చనీయాంశంగా నలుగుతూనే ఉన్నది. ఇది వ్యవస్థలో ప్రమాదకర పరిణామం.

ప్రస్తుత సందర్భానికి వస్తే, పదవీకాలం ముగిసేంత వరకు శాసన సభ్యుల అనర్హత పిటిషన్ పై విచారణ ప్రక్రియ కొనసాగాలా? ప్రజా స్వామ్య సూత్రాలు ఏం కావాలి? అన్న సుప్రీం కోర్టు న్యాయమూర్తి బి. ఆర్. గవాయ్ సూటి ప్రశ్న సహేతుకమైనది. నిజాయితీగా మనం అందరం కూడా చర్చించాల్సిన విషయం కూడా . ఒక పార్టీ( TRS/ BRS )గుర్తు పై గెలిచి, వేరొక పార్టీ లోనికి మారిన సందర్భం లో వారిని అనర్హులుగా ప్రకటించాలని ఆపార్టీ నాయకులు స్పీకర్ ను కోరారు. స్పీకర్ సరిగా, సకాలంలో స్పందించకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ విషయంలో తగు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను కోర్టు ఆదేశించింది. కానీ గడువు ప్రకటించలేదు. దీన్ని ఆసరాగా తీసుకొని స్పీకర్ నిర్ణయం వాయిదా పడుతూ వచ్చింది. కోర్టు పలుమార్లు ఒత్తిడి తెచ్చినా ఫలితం కానరాలేదు. ఇప్పుడు కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ విషయం ప్రాధాన్యత సంతరించుకున్నది.

కేంద్రంలో పి. వి. నరసింహారావు నాయకత్వంలోని (కాంగ్రెస్) ప్రభుత్వం డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసి( జె. ఎం. ఎం. ముడుపుల కేసు) ఐదేళ్ల కాలం ప్రభుత్వాన్ని కొనసాగించారన్న విషయం ఆనాడు పార్లమెంట్లో పెద్ద దుమారమే లేపింది. ఆ తర్వాతకాలంలో మెజారిటీ శాసనసభ్యులు పార్టీ నుండి బయటకు వచ్చి, ఇంకొక పార్టీకి అనుబంధంగా కలిసిపోవడం సర్వసాధారణమైంది. మహారాష్ట్రలో ఎకనాథ్ షిండే ప్రభుత్వం ఆ ప్రాతిపదికననే ఏర్పడింది. ఇలా ప్రభుత్వాలు పడిపోవడం, కొత్త ప్రభుత్వాలు అధికార పగ్గాలు చేపట్టడం చాలా రాష్ట్రాలలో జరిగింది. ఇది దేశవ్యాప్తంగా ఆనవాయితీగా అమలవుతున్న అమలు అవుతున్న దుర్నీతి.

గతంలో మెజారిటీ కాంగ్రెస్ శాసనసభ్యులు టిఆర్ఎస్ ప్రభుత్వం లో చేరారు. ఒక గుర్తుపై ఎన్నికలలో గెలిచిన వారి పరిస్థితి ఇలా ఉంటే, ఆశయాలను సిద్ధాంతాల ను నమ్మి ఓటు వేసి గెలిపించిన ప్రజల పరిస్థితి గందరగోళంగా మారుతున్నది. ఈ విషయంలో ఏదైనా నిర్ణయమైన తీసుకొని ముందడుగు వేయలేని నిస్సహాయ పరిస్థితి ఓటు వేసి గెలిపించిన ప్రజలది. రీ- కాల్ ఓటు అధికారం ప్రజలకు లేకపోవడమే ఇందుకు కారణం. అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో, ప్రజల దౌర్భాగ్య పరిస్థితి. ఇది నిజంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. నోటుకు ఓటు కేసు కూడా ఇందులో అంతర్భాగమే. ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలు మిళితమై ఉన్న అంశంగా దీనిని మనం అర్థం చేసుకోవచ్చు.

ఆనాటి కాలంలో గ్రామ స్థాయిలో కుల సంఘాల పెద్దలను ఆకట్టుకొని , సారా పంపిణీ,ఉప్మా పంపిణీ చేయడంద్వారా ఓటర్లను ఆకట్టు కోవడం జరుగుతుండేది. ప్రస్తుత పరిస్థితులలో డబ్బు పంపిణీ ప్రాధాన్యత సంతరించుకున్నది లేదా రూపాంతరం చెందింది . మరో ముందడుగు పడి ప్రజలు డిమాండ్ చేసే పరిస్థితి కూడా వచ్చింది. ఒకప్పుడు రహస్యంగా ఉన్నది, ఇప్పుడు అంతా బహిరంగంగానే జరుగుతున్నది.

అధికారం అందలం దక్కించుకోవడం కోసం, రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పోటీపడి మరీ డబ్బు, లిక్కర్ విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. దీనిని ఎవరు కూడా తప్పుగా పరిగణించడం లేదు. ప్రాథమిక స్థాయిలో ఓట్ల కొనుగోలు దగ్గర నుండి మొదలైన ఈ విధానం యదేచ్చగా శాసనసభల, పార్లమెంటు ఎన్నికలకు ఎగబాకింది. పదవులు దక్కించుకోవడం కోసం, అధికారంలోకి రావడం కోసం, అధికారాన్ని నిలుపుకోవడం కోసం నేతలు తొక్కుతున్న అడ్డదారులకు అంతూ పొంతూ లేదు.

రాజకీయ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో, డబ్బుతో ఓట్లను సులభంగా కొనుగోలు చేయడంద్వారా విజయాన్ని సాధించవచ్చనే ఆలోచనలో నేతలు ఉన్నారు. ఎన్నికల సంఘం ఎన్ని నిబంధనలు రూపకల్పన చేసినా ఆచరణకు నోచుకోవడం లేదు. బహిరంగంగా జరుగుతున్న విచ్చలవిడి డబ్బు, మద్యం పంపిణీని అరికట్టలేని పరిస్థితి. రాజకీయ పార్టీలు చేస్తున్న వాగ్దానాలు ప్రజలను భ్రమలలో ముంచివేస్తున్నాయి. సరైన అవగాహన లేక, తాత్కాలిక ప్రయోజనాలకు ఆశపడి ప్రజలు ఓటును అమ్ముకుంటున్నారు.

గెలిచినవాడు తమకు ఏమీ చేయడనే ఒక నమ్మకమే ఇందుకు ప్రధాన కారణం కావచ్చు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా, పదవీకాలం మొత్తం అవే విధానాలకు/ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారనే నమ్మకం లేకపోవడం కూడా ఓటు అమ్ముకోవడానికి ప్రజలకు ప్రేరణగా మారాయి. రాజకీయ నేతలలో లోపిస్తున్న అనైతికత ప్రవర్తన కూడా మరో కారణం .

ప్రస్తుత పరిస్థితుల్లో నీతి మంతులు,నిజాయితీ పరులు ఎవరైనా ఎన్నికలలో పోటీ చేయడం, గెలుపొందడం సాధ్యమయ్యే పని కూడా కాదు. ప్రచార ఆర్భాటపు,పటాటో పాలకే కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. అభ్యర్థికి సంబంధించి ఎన్నికల సంఘం విధించిన ఖర్చుల నిబంధనల ఉల్లంఘన యదేచ్ఛగా కొనసాగుతుంది. రాజకీయ పార్టీలు చేస్తున్న వాగ్దానాలు అమలు చేయలేకపోతే అనర్హులుగా ప్రకటించే పరిస్థితి లేదు. చట్టాలలో ఉన్న లొసుగులను, ముసుగులుగా వాడుకుంటూ సుదీర్ఘకాలం పబ్బం గడుపుకుంటున్నారు . అందువలన రాజకీయ నాయకుల ఆటలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి.

ఒక్కసారి అధికారంలోకి వస్తే చాలు తర తరాలకు సరిపోను డబ్బు సంపాదించుకోవచ్చనే పేరాశ పెరిగిపోయింది. ఈ అవినీతి కారకలాపాలపై నియంత్రణ కోల్పోవడం ప్రస్తుత వ్యవస్థలో కనిపిస్తున్న అతిపెద్ద లోపం. ఒక్క మాటలో చెప్పాలంటే, నిజాయితీ, నైతిక విలువలు గల వారికి ఎన్నికలలో స్థానమే లేదు. ప్రజాసేవ అన్నది అపహాస్యమైన, చేతకాని వాడి మాటగా మిగిలింది. డబ్బు, కులం, గుండాగిరీ రాజకీయ నాయకులకు ఆభరణాలుగా మారాయి. ఈ సందర్భాలలో కేవలం ప్రజలను నిందించడం సరికాదు. పాలనా వ్యవస్థలోని అన్ని స్థాయిలలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. కాదు.. కాదు భాగమయ్యింది అనడమే సరయినది.

చదువుకున్నవారి చూపు అంతా ప్రజలకు ఇచ్చే ఉచితాల పైనే కేంద్రీకరించ బడుతుంది. అదాని, అంబానీ లాంటి బడా పారిశ్రామిక వేత్తలు బ్యాంకులకు ఎగ్గొడుతున్న లక్షల కోట్ల రూపాయలే వారికి పెట్టుబడిగా, కోటీశ్వరులుగా మారుస్తున్నాయన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ప్రస్తుతం వారే దేశరాజకీయాలను ప్రభావితం చేస్తూ, శాసిస్తున్నారని అర్థం చేసుకోలేక పోతున్నారు . ఇలా వెనకబడుతున్నంతకాలం అవినీతి బంధు ప్రీతి, ఆశ్రిత పక్షపాతం రాజ్యమేలడం ఖాయం. ఏం చేస్తాం? అని కాకుండా ఏం చేద్దాం? ఎలా చేద్దాం? అంటూ పరిష్కారానికి అడుగులు వేయడం పౌరుల బాధ్యత. వారికి అండగా నిలబడి తోడ్పడు అందించడం పౌర సమాజ కర్తవ్యం . ప్రశ్నించేవాడు లేకపోతే, దోచుకునే వాడితే రాజ్యమౌతుంది. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలుగా ఉండి ధర్మాన్ని నాలుగు కాళ్ళపై నిలబెట్టాల్సిన వ్యవస్థలన్నీ అవినీతి రాజకీయ నాయకులకు అండగా మారాయన్న అపవాదు బహుళ ప్రచారంలో ఉంది. అప్రజాస్వామిక వ్యవస్థ పరిఢమిల్లుతున్న కాలమిది.ప్రజలు కేవలం ఓట్లు కాసే చెట్లుగా మిగలడం వల్లనే ఈ దుర్గతి దాపురించింది. ఈ పరిస్థితి నుంచి బయటపడేమార్గమాలోచించాలి.

Read More
Next Story