
ఇది 'ఇండియన్ స్టార్ టార్టాయిస్' కష్టాల కథ
అందం,అదృష్టం తెస్తుందనే అంధ విశ్వాసం ఈ జాతి తాబేళ్లు అంతరించిపోయేందుకు కారణం.
నక్షత్ర తాబేళ్లు (Indian star tortoise (Geochelone elegans): ఇవి ఆంధ్రప్రదేశ్,తమిళనాడు,కర్ణాటక, కేరళ, తెలంగాణ,, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, , గుజరాత్ వంటి రాష్ట్రాలతో సహా పశ్చిమ , ఆగ్నేయ భారతదేశంలోని పొడి వాతావరణంతో కూడిన పొద అడవులలో కనిపిస్తాయి.
ఈ నక్షత్ర తాబేళ్ళ సంఖ్య భారతదేశం లో వీపరీతంగా తగ్గడానికి, ఇతర దేశాలకు అక్రమ రవాణా విపరీతంగా పెరగడానికి కారణాలను పరిశీలిస్తే:
1.హిందూ మత విశ్వాసం & ఆధ్యాత్మిక నమ్మకాలు
భారతదేశంలో, ఈ తాబేళ్లు అదృష్టాన్ని ,ఐశ్వర్యాన్ని తెస్తాయని నమ్ముతారు. అదే కాకుండా క్షీరసాగర మధన సమయంలో మహా విష్ణువు కూర్మావతారాన్ని ధరించి
దేవతలు , రాక్షసులు అమృతాన్ని పొందేందుకు సహాయపడే కీలక పాత్ర పోషించారని హైదవ మత విశ్వాసం , నక్షత్ర తాబేళ్ళని పెంచుకొవడం మూలాన అదృష్టమ్ , ఐశ్వర్యం కలిసి వస్తుందని విశ్వసించడంతో ఈ నక్షత్ర తాబేళ్ళని పెంచుకోవడానికి జనాలు ఎక్కువ ఆసక్తి చూపుతుండటంతో వీటికి డిమాండ్ మరింత పెరిగింది.
2.అంతర్జాతీయ పెంపుడు జంతువుల మార్కెట్
భారతీయ నక్షత్ర తాబేళ్లు ఆకర్షణీయమైనవిగా ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ నక్షత్ర తాబేళ్లకు అధిక డిమాండ్ , అవి ఇతర దేశాలలో పెంపుడు జంతువులుగా పెంచుకోవడాని అధిక సౌలభ్యత ఉండటంతో ఎక్కువ ప్రజాదరణ పొందాయి.
ముఖ్యంగా ఆగ్నేయాసియా, యూరప్ , అమెరికా లాంటి దేశాలలో ఇ నక్షత్ర తాబేళ్ళకు అధిక డిమాండ్.
3.ఆహార వినియోగం
భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో భారతీయ నక్షత్ర తాబేళ్లను ఆహార వనరుగా పరిగణిస్తారు. గంగా, యమునా , చంబల్ నదుల వెంబడి అక్రమంగా పట్టుబడిన నక్షత్ర తాబేళ్లను ప్రధానంగా పశ్చిమ బెంగాల్‌లో ఆహారంగా వినియోగిస్తారు , పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా దక్షిణాసియా దేశాలకు, ముఖ్యంగా థాయిలాండ్ , మలేషియాకు అక్రమంగా రవాణా చేస్తారు.
4. అక్రమ రవాణా – పెరుగుతున్న ముప్పు
ఈ నక్షత్ర తాబేళ్లకు అంతర్జాతీయంగా అధిక డిమాండ్ ఉండటం మూలాన వీటి అక్రమ రవాణా గణనీయంగా పెరిగింది. ప్రతి సంవత్సరం వేలాది తాబేళ్లు భారతదేశం, శ్రీలంక , పాకిస్తాన్ నుండి అక్రమంగా రవాణా అవుతున్నాయి.
5. అక్రమ రవాణా మార్గాలు, పద్ధతులు
స్మగ్లర్లు తరచుగా భారతదేశంలోని వాటి సహజ ఆవాసాల నుండి తాబేళ్లను సేకరించి, చెన్నై వంటి వాణిజ్య కేంద్రాలకు రవాణా చేసి అక్కడినుంచి అక్రమంగా దేశం దాటిస్తుంటారు. తరచుగా కూరగాయల డబ్బాలు లేదా సామానులో దాచిపెట్టి రవాణా చేస్తుంటారు.
6. సహజ నివాస నాశనం
నక్షత్ర తాబేళ్లు సహజ ఆవాసాలను ద్వంసం చేయడం వలన , వేట కారణంగా వాటి సంఖ్య గణనీయంగా తగ్గి వాటి మనుగడకు తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది.
ఈ తాబేళ్ల విక్రయాల ఖచ్చితమైన సంఖ్యను గుర్తించడం కష్టం. కానీ పెంపుడు ప్రాణులుగా వీటికి డిమాండ్ ఉండటం వలన వీటి భవిష్యత్తుకు ప్రమాదం ఏర్పడిందని స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి ఏడాదీ వేల కొద్దీ తాబేళ్లు అడవి నుంచి అక్రమంగా తీసుకురాబడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు , మదనపల్లె జిల్లాలు , కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని అడవుల నుండి హక్కే పక్కే అనబడే గిరిజన తెగ వారు స్టార్ తాబేళ్లను పట్టుకుని, స్మగ్లర్లకు తక్కువ ధరకు విక్రయిస్తారు.
స్మగ్లర్స్, వీరికి ఒక తాబేలుకు వాటి బరువునుబట్టి రు 1౦౦ నుంచి రు. 2౦౦ చెల్లిస్తుంటారు. స్మగ్లర్లు అంతర్జాతీయ మార్కెట్ లో నక్షత్ర తాబేళ్లను వాటి బరువు ఆధారంగా అమ్ముతుంటారు. ఒక కిలోగ్రాము బరువు వున్న తాబేలు రు. 14,4౦౦ నుండి రు.22000 వరకు ధర పలుకుతుంటాయి. అంతర్జాతీయ పెంపుడు జంతువుల వ్యాపారం అవసరాలను తీర్చడానికి కొన్ని వేల సంఖ్యలో భారతదేశం నుండి అక్రమంగా రవాణా అయిపోతున్నాయి .
నక్షత్ర తాబేళ్ళ సహజ నివాసాలను (Natural Habitat) నాశనం చేయడం వలన, ఆహారం కోసం సేకరించడం, పెంపుడు జంతువుల వ్యాపారం వంటి మానవ కార్యకలాపాలు నక్షత్ర తాబేళ్లు సంఖ్యను బాగా తగ్గించాయి. అక్రమ వ్యాపారం , అక్రమ రవాణా వలన ఈ నక్షత్ర తాబేళ్లు అంతరించిపోతున్న స్థితికి చేరుకొన్నాయి , వీటి పరిరక్షణ కొరకు ఆందోళన పడే స్థాయికి రోజురోజుకు దగ్గర అవుతున్నాయి.
టైమ్స్ ఆఫ్ ఇండియా లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం, గత ఏడాదిలోనే దక్షిణ భారతదేశంలోని తమిళనాడులోని చెన్నై విమానాశ్రయంలో సుమారు 4,000 తాబేళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవల, భారత అధికారులు అక్రమ వన్యప్రాణుల వ్యాపారం నుండి ముప్పును ఎదుర్కొంటున్న జాతి అయిన భారతీయ నక్షత్ర తాబేళ్లను చురుగ్గా జప్తు చేస్తున్నారు , జప్తు చేసిన వాటిని వైల్డ్లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ద్వారా వన్యప్రాణుల విభాగాలకు అప్పగించి, వాటి సహజ ఆవాసాలలోకి వదిలివేస్తారు.
ఇటీవలి పట్టుబడిన అక్రమ రవాణా కేసులు
1.జూలై 2024లో, చెన్నై విమానాశ్రయంలో మలేషియాకు వెళ్తున్న ప్రయాణీకుడి నుండి 138 నక్షత్ర తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు.
2.జూలై 2024లో కస్టమ్స్ అధికారులు మూడు అక్రమ రవాణా ప్రయత్నాలను అడ్డుకుని 1,343 నక్షత్ర తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు.
3. చెన్నై నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఫ్లైయర్ నుండి 427 నక్షత్ర తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు.
4.దక్షిణ పశ్చిమ బెంగాల్‌లో BSF జనవరి 2024 నుండి దాదాపు 600 భారతీయ నక్షత్ర తాబేళ్లను స్వాధీనం చేసుకుంది.
5.ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో 195 భారతీయ నక్షత్ర తాబేళ్లతో ఒక స్మగ్లర్‌ను అరెస్టు చేశారు.
అంతర్జాతీయ వాణిజ్య నిషేధం & రక్షణ చర్యలు
2019లో, భారతీయ నక్షత్ర తాబేళ్ల అంతర్జాతీయ వాణిజ్యాన్ని CITES (Convention on International Trade in Endangered Species) Appendix I కింద నిషేధించారు. అయినప్పటికీ, అక్రమ రవాణా ఆగడం లేదు.
ఇది కఠిన చట్టాలను ప్రభుత్వాలు అమలు చేయాల్సిన అవసరాన్ని , నక్షత్ర తాబేళ్ల డిమాండ్‌ను అరికట్టే ప్రయత్నాలను హైలైట్ చేస్తుంది.
భారతీయ నక్షత్ర తాబేలు ఇప్పుడు IUCN రెడ్ లిస్ట్‌లో అంతరించి పోవడానికి దగ్గరలో ఉన్న జాతి"గా గుర్తించబడింది. అక్రమ వ్యాపారం వల్ల ఈ తాబేళ్లకు భారీ ముప్పు ఉన్నందున, వీటిని అత్యధిక స్థాయిలో రక్షించేందుకు సీట్లు అనుబంధం-I లోకి చేర్చబడింది.
శేషాచల అడవుల్లో నక్షత్ర తాబేళ్లకు రక్షణ
బాలపల్లి రేంజ్ ఆఫీసర్ టి. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ శేషాచల అడవుల్లో నక్షత్ర తాబేళ్లు పెరగడానికి అనువైన వాతావరణము ఉండటం వలన వీటి సంఖ్య గణనీయంగానే ఉందని తెలిపారు. , భారతదేశంలో నక్షత్ర తాబేళ్లను అక్రమ రవాణా చేయడం గాని, స్వంతంగా పెంచుకోవడం గాని నేరమని గుర్తుచేశారు. 1972 వన్యప్రాణి (రక్షణ) చట్టం ప్రకారం, దీనికి గానూ జైలు శిక్షతో పాటు భారీ జరిమానాలు కూడా విధించబడుతాయని ఆయన హెచ్చరించారు.
వన్యప్రాణుల (రక్షణ) చట్టం, 1972 యొక్క షెడ్యూల్ I కింద రక్షించబడిన భారతీయ నక్షత్ర తాబేళ్ల అక్రమ రవాణా లేదా అక్రమ వ్యాపారం చేస్తే మూడు నుండి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష , కనీసం రూ.25,000 వరకు జరిమాన విధించబడుతుందని ఆయన అన్నారు.
ప్రకృతి ఔత్సాహికులు భూమన్ మాట్లాడుతూ, నక్షత్ర తాబేళ్లను అక్రమ రవాణా నుంచి కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ బాధ్యతను కేవలం ప్రభుత్వ సంస్థలకే పరిమితం చేయకూడదని, అందరూ చొరవ చూపాలని సూచించారు. స్మగ్లర్లు అమాయక , నిరక్షరాస్య గిరిజనులను వాడుకొని తాబేళ్లను అక్రమంగా రవాణా చేయడం అత్యంత విచారకరమని అన్నారు.
ముగింపు
నక్షత్ర తాబేళ్లు ఇప్పుడు అంతరించిపోతున్న జాతిగా మారాయి. అక్రమ రవాణాను అరికట్టడానికి కఠిన చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా, ప్రజల్లో అవగాహన పెంచి, వన్యప్రాణుల పరిరక్షణకై ప్రభుత్వాలు మరింత కఠిన చర్యలు తీసుకోవాలి. "ప్రకృతిని కాపాడితేనే మన భవిష్యత్తు" – భారతీయ నక్షత్ర తాబేళ్లను రక్షించడంలో మన బాధ్యత గుర్తించాలి."
ఇది కూడా చదవండి
43 యేళ్ల కిందట ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశ ప్రకటన వెలువడింది ఈ రోజే...