‘తెలుగు రీసెర్చ్ స్కాలర్లకు ఆరుద్ర పేర అవార్డు ఇచ్చి ప్రోత్సహించాలి’
x

‘తెలుగు రీసెర్చ్ స్కాలర్లకు ఆరుద్ర పేర అవార్డు ఇచ్చి ప్రోత్సహించాలి’

“తెలుగు భాషా సాహిత్యాల పరిశోధన – పర్యాలోచన” మీద హైదరాబాద్ విశ్వవిద్యాలయం నిర్వహించిన సదస్సులో ప్రొఫెసర్ కొవ్వలి గోపాలకృష్ణ సలహా.


సాహిత్యం, పరిశోధనలు- నా పరిశీలనలు, అనుభవాలు

-డాక్టర్ కొవ్వలి గోపాలకృష్ణ


***

నా ప్రసంగం “నేటి తెలుగు సాహిత్యం, పరిశోధనలు: నా పరిశీలనలు, అనుభవాలు” అనే నేపధ్యంలో ఉంటుంది.

2024 లో వచ్చిన అంచనాల ప్రకారం ఇండియాలో 24 వేల Ph.D. లు, చైనాలో 56000, అమెరికాలో 76000 వస్తున్నాయట సంవత్సరానికి, అన్నీ విభాగాలలో కలిసి. తెలుగు లో ఎన్ని వస్తున్నాయన్న అంచనా నాకు లభ్యం కాలేదు కానీ, కాలేజీలలోనూ విశ్వవిద్యాలయాల లోనూ ఆచార్య ఉద్యోగాలకి Ph.D. అర్హత కారణంగా ఈ సంఖ్య గణనీయంగానే ఉంటుందని నా అంచనా.

పీజీ లెవెల్ లో Humanities లో ఇండియాలో ఎంతవరకు పరిశోధనల పట్ల అవగాహన ఉంటుందన్నది ఆలోచించవలసిన విషయం. నా అంచనా ప్రకారం నాకు తెలిసి, నేను వింటున్నదాన్ని బట్టి చాలా తక్కువ అని. ఈ మధ్యన 2022లో ఆచార్య నిత్యానందరావు గారు ఒక వ్యాసం రాశారు. దాంట్లో ఈ అంశం మీద కొన్ని విషయాలు ప్రస్తావించారు. విద్యార్ధుల మారుతున్న ఎక్స్పెక్టేషన్స్, విద్య ఉద్యోగానికే అన్న ఆలోచనా ధోరణి నేపధ్యంలో మంచి మార్కులతో MA పట్టా తీసుకుని ఉద్యోగం సంపాదించాలనే ఆతృత, ఆకాంక్ష తప్ప పట్టాతో పాటు విజ్ఞానం సంపాదించాలన్న తపన తక్కువ మంది విద్యార్ధులలో ఉంటోందన్నది ప్రస్తుత పరిస్థితి.
Ph.D. విద్యార్థులకి Research Readiness లేమి కారణంగా పరిశోధన కార్యక్రమంలో చేరేవారికి ఏం చేయాలో తెలియక, తెలుసుకోవాలననే కుతూహలం లేక ఎలా సతమతమవుతున్నారో, వారు పడ్డమే కాదు ఆచార్యులను కూడా ఎంత ఇబ్బంది పెడుతున్నారు అన్న విషయాలు ఆచార్య నిత్యానందరావు గారి వ్యాసాల వంటి పలు వ్యాసాల ద్వారా తెలుస్తోంది. ఈ పరిస్థితి అన్ని విశ్వవిద్యాలయాలలోనూ ఉండకపోవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న విద్యా విధానం కారణంగా ఇది సాధారణ స్థితి. ఇక్కడ కాంటెక్స్ట్ కోసం అమెరికాలో వ్యవస్థ గురించి కొంచెం చెబుతాను. ఇక్కడ high school దశనుంచి విద్యార్ధులకి research మీద కనీస అవగాహన ఉంటుంది. అందరికంటే ఎక్కువ visibility కావాలనుకునే విద్యార్ధులు లేబొరేటరీస్ లోనూ, చిన్న పరిశ్రమలలోనూ volunteers గానూ, interns గానూ చేరి ప్రత్యక్షంగా రిసెర్చ్ లో పాల్గొంటారు. ఇక్కడ BA, MA స్థాయిలో రిసెర్చ్ పేపర్ లు చదవడం, క్లాస్లో ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. అంటే, Ph.D చేరాలనుకునే విద్యార్థి తగిన మానసిక స్థితిని కలిగి ఉంటాడు. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి- నేను M.Sc చదివేటప్పుడు చివరి సెమిస్టర్ లో research ఒక అంశంగా ఉండేది. Dissertation రాయడం, ఫ్యాకల్టీ ముందు ప్రెసెంట్ చేయడం ఉండేది. ఆ విధానం ఇప్పటికీ ఉండే ఉంటుంది. నేను చేసిన పరిశోధన ఫలితాలు international జర్నల్ లో ప్రచురించబడడం వల్ల, అందులో నాకూ పేరు ఉండడంవల్ల రిసెర్చ్ పట్ల సానుకూల దృక్పథం ఏర్పడింది. విద్యార్ధులకి ఉత్సాహాన్ని ఇచ్చేలా MA విద్యార్ధులకి వేరు వేరు పత్రికలలో వ్యాసాలు, కథలు ప్రచురించే ప్రోత్సాహం ఇచ్చే ప్రయత్నం మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. Research అంటే విచారణ చేసి కొత్త విషయాన్ని ఆవిష్కరించడం కదా. ఆ కార్యక్రమం నిత్యం విద్యార్ధుల, సాహితీ వేత్తల ఆలోచనల్లో ఉండాలి.
ఆరుద్ర ఏ డిగ్రీలు ఆశించకుండా, ఏ డబ్బు ఆశించకుండా కొన్ని విశ్వవిద్యాలయాలు, పెద్ద పెద్ద సంస్థలు చేయవలసినటువంటి పరిశోధన చేసి “సమగ్ర ఆంధ్ర సాహిత్యం” అని 13 సంపుటాలని ప్రచురించి తెలుగు జాతికి అందించారు. ఆ సాహిత్యాన్ని కనీస పరిచయం చేస్తే విద్యార్ధులకి ఉత్తేజం కలగవచ్చు; తెలుగు భాష, సాహిత్య పరిశోధనల పట్ల ఆసక్తి పెరగవచ్చు. ఆరుద్ర పేరు మీద MA, Ph. D స్థాయి విద్యార్ధులకి పురస్కారాలు ఇస్తే తెలుగు సాహిత్య చరిత్రని చదివే అవకాశం కలిగించవచ్చు.
కొత్త విషయాలు తెలుసుకోడానికి కావలసినది శోధన (search), పరిశోధన (రిసెర్చ్). గూగుల్ దయవల్ల search ఎవరికీ నేర్పక్కర లేదు. రిసెర్చ్ పద్ధతులు గురు ముఖంగా, అభ్యాసంతో వచ్చే విద్య. పరిశోధనకి కావలసిన ముఖ్యమైన నైపుణ్యాలు రెండు – ఒకటి క్రిటికల్ రీడింగ్, రెండవది క్రిటికల్ థింకింగ్. ఈ రెండు నైపుణ్యాలు సాహిత్య విద్యార్ధులకి అలవడితే వారు ఉత్తమ సాహితీ వేత్తలు గా, ఉత్తమ సాహిత్య సృష్టి కర్తలుగా విరాజిల్లే అవకాశం ఉంటుంది.
నిశితంగా ఒక విషయం గురించి ఆలోచించి విశ్లేషించాలంటే, ఆ విషయం గురించిన పూర్వాపరాలు తెలుసుకోవాలి. విషయాన్ని వ్యక్తులనుంచి వేరు చేసి చూడగలగాలి. ఉదాహరణకి, పరిశోధన పత్రం రాసేముందు, ఇంత ముందు ఆ అంశం మీద ఎవరైనా పరిశోధన చేశారా అని తెలుసుకోవాలి కదా! తెలుసుకునే ప్రయత్నంలో, తారస పడ్డ పత్రాలు నిశితంగా చదివి, అందులో రాసిన అంశాలు సమంజసమైనవా కాదా, పత్రంలోని ముగింపు వాక్యాలు సబబుగా ఉన్నాయా లేవా, ఆ పత్రంలో ఏమైనా కొత్త విషయాలు ఉన్నాయా అనే అనేక విషయాలను బేరీజు వేస్తూ ఆ పత్రం యొక్క నాణ్యతని అంచనా వేయాలి. ఈ నైపుణ్యం శాస్త్రవేత్తలకైనా, సాహిత్య పరిశోధకులకైనా ఒకే రకంగా అవసరం. పీర్ రివ్యూ అనే కాన్సెప్ట్ ని విద్యార్ధులకి తెలియాలి.
క్రిటికల్ రీడింగ్: ఒక పరిశోధనా పత్రం, లేదా వ్యాసం చదివేటప్పుడు నిశితంగా చదివి విశ్లేషించాలి. రాసినవారి పేరుతో సంబంధం లేకుండా చదువుతున్న సాహిత్యాన్ని మాత్రమే విశ్లేషించే ప్రయత్నం చేయాలి. అంటే పరిశోధకుడు ఒక నిష్పాక్షిక విమర్శకుడిగా, అపరాధ పరిశోధకుడిగా లిటరేచర్ సర్వే చేయాలి. అప్పుడే, విద్యార్ధులు ఉత్తమ సాహితీవేత్తలుగా తయారవుతారు. విమర్శని, ఇతరులు ఇచ్చే అభిప్రాయాల్ని, సానుకూల దృక్పథంతో తీసుకునే తత్త్వాన్ని అలవరచుకున్న విద్యార్ధులు ఉన్నత ప్రమాణాలు ఉన్న సాహితీవేత్తలుగా రాణించగలరు. దురదృష్టవశాత్తు, విద్యావ్యవస్థలో ఇలాంటి విద్యార్ధులను తీర్చిదిద్దే అవకాశం ఎంత ఉందో తెలుసు. వస్తుగత విమర్శని, సాహిత్య విమర్శని, వ్యక్తిగత విమర్శ గా తీసుకుని వైరి వైఖరి పెంచుకునే సాహిత్య రంగంలో మనం చూస్తున్న ధోరణికి విద్యార్థి దశలో పడిన బీజాలే కారణం కాదా! క్రిటికల్ థింకింగ్, క్రిటికల్ రీడింగ్ కోర్సులను PG స్థాయిలో ప్రవేశపెట్టడం మంచిది అని నా అభిప్రాయం.
Ph. D. అనేది ఉత్తమ స్థాయిలో సాహిత్య పరిశోధనలు చేయడానికి అవసరమైన శిక్షణ పూర్తి అయిందన్న ధృవీకరణ పత్రమే గాని, అత్యుత్తమ స్థాయి పరిశోధకుడనో, సాహితీవేత్త అనో వేసే ముద్రళ్ళ కాదు అనేది మన విద్యార్థులు గమనించాలి. నేనొక ప్రొఫెసర్ గురించి విన్న వృత్తాంతం ఇక్కడ పంచుకుంటాను. ఆయన వెళ్లిన ప్రతి Ph. D viva అభ్యర్థిని గడ్డు ప్రశ్నలు అడిగి, అవమానించి కన్నీళ్ళ పర్యంతం అయ్యేలా చేసేవారట. అంతా అయిపోయాక అభ్యర్థిని పిలిచి అభినందించి, పరిశోధకులకి నమ్రత, వినయం అవసరం అని ఉద్బోధించేవారట. ఈరోజుల్లో ఎంతమంది సాహితీవేత్తలకి, విద్యార్థులకి వినయం, నమ్రత ఉన్నాయి! అది మీకే తెలుసు
తెలుగు సాహిత్యం తెలుగు ప్రాంతాలకి అవతల, ప్రపంచ వ్యాప్తంగానూ ఎందుకు గుర్తింపు పొందడంలేదు అన్న ప్రశ్న మనం చాలామంది నుంచి విన్నాం, వింటూనే ఉన్నాం. కారణాలు ఎన్నో ఉన్నా, ఇంతకు ముందు పంచుకున్న అంశాలతోపాటు, ముఖ్యంగా తెలుగు సాహిత్యం పరభాషాల్లోకి అనువదించబడి, ముఖ్యంగా ఆంగ్లంలోకి, పరిచయం అవ్వకపోవడం, అంతర్జాతీయ స్థాయిలో విషయాన్ని చెప్పలేకపోవడమేమో కూడా.
తెలుగులోకి ఉత్తమ అనువాదాలు రావాలి. తెలుగులోనుంచి ఇతర భాషలలోకి అనువాదాలు చాలా తక్కువగా ఉన్నాయి. తెలుగు సాహిత్యాన్ని వేరే భాషల్లోకి మనం తర్జుమా చేయించే అవకాశం ఉంటే గాని మన సాహిత్య విస్తృతి, నాణ్యత బయట ప్రపంచానికి తెలియదు. విద్యార్ధి దశనుంచే ప్రపంచ సాహిత్య అధ్యయనం జరగాలి. అంతే కాక చారిత్రక దృక్పథం, చారిత్రక స్పృహ అలవడాలి. విశ్వవిద్యాలయాలు ఈ విషయంలో కృషి చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా ఒక అభిప్రాయాన్ని పంచుకోవాలి. తొలి తెలుగు కథానికా రచయితగా, అత్యంత ఆదరణ గల తెలుగు నాటక కర్తగా మనకి తెలిసిన గురజాడకి సంబంధించిన ఎన్నో రచనలు, artifacts మనకు దొరకలేదంటే కారణం మనకి లేని చారిత్రక స్పృహ, ప్రభుత్వాల ఉదాసీనతతో కూడిన నిర్లక్ష్యం. ఆయనకి విదేశాల్లో రావలసిన గుర్తింపు సంగతి ఎలా ఉన్నా, భారత దేశంలోని తెలుగేతర ప్రాంతాల్లో కూడా గుర్తింపు లేకపోవడం తెలుగు సాహిత్యానికి కావాల్సిన ప్రచార అవసరం తెలియచేస్తుంది. అలాగే, 1001 నవలలు రాశారని ప్రసిద్ధి గాంచిన కొవ్వలి లక్ష్మీనరసింహారావు గారి నవలలో కేవలం 40 మాత్రమే లభ్యమవుతున్నాయి. ఆయన నవల ఆధారంగా తీసిన ప్రజాదరణ పొందిన “సిపాయి చిన్నయ్య” సినిమా కాపీ దొరకడం లేదు. విలువైన, అపురూపమైన సాహిత్యాన్ని, కళారూపాలని భద్రపరచుకోవాలన్న స్పృహ లేకపోతే మన భాష, సాహిత్యాల గొప్పతనం బయటివారికి ఎలా చెప్పగలం? తెలుగు భాషలో PhD. చేసే ప్రతీ విద్యార్ధీ తెలుగు సాహిత్య చరిత్ర, తెలుగు భాషా చరిత్ర తప్పక చదవాలి.
ప్రాచీన సాహిత్యానికి పునరాదరణ కావాలి. ఇది నేను ఏదో ఛాందసంతో చెబుతున్న మాటలు కాదు. ఎన్నో విషయాలు దాగి ఉన్న ప్రాచీన గ్రంధాలు మరుగున పడి, పేర్లు కూడా తెలియని పరిస్థితి ఉంది. అవి చదివి, అందులోని అమూల్యమైన భాష, సాహిత్యపరమైన విషయాలు మనకు అందించగల భాషా పటిమ ఉన్న వారు ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు.
అనేకార్ధ కావ్యాలు ఉన్న ఏకైక భాష తెలుగు భాషేనేమో. మనకు అచ్చులో దొరుకుతున్నవి ఒకటి రెండు కావచ్చు. ఈ కావ్యాలని ‘ప్రకాశిక’ పత్రిక ద్వారా పరిచయం చేయాలని గత మూడు సంవత్సరాలుగా చాలా ప్రయత్నం చేస్తున్నా. ‘మా భాష ప్రాచీన భాష మొర్రో ‘అని మొత్తుకుని చివరకి గుర్తింపు తెచ్చుకున్నాం. కానీ ప్రాచీన గ్రంధాలను పరిష్కరింపచేసుకుని వెలుగులోకి తీసుకొచ్చినప్పుడే ఆ గుర్తింపుకి గౌరవం దక్కుతుంది. ఈ సందర్భంగా మరో అనుభవాన్ని కూడా పంచుకోవాలి. గురజాడ రాసిన గేయసాహిత్యంలో ప్రచారంలో ఉన్నవి కొన్నే. అందులోనూ అందరూ అర్ధంచేసుకుని, అభినందించి ఆనందించేవి మరీ కొన్ని. ఛందోబద్ధంగా రాసిన కవితలు ఉన్నాయని చాలా మందికి తెలీదు, అవి పుస్తక రూపంలో అందుబాటులో ఉన్నా కూడా. ఈ గేయాలకి వ్యాఖ్యానం రాయించి, ఛందోబద్ధంగా రాసిన కవితలని పరిష్కరింపచేసి అచ్చు వేయడానికి ఎంతో కష్టం అయింది. లోతుగా పరిశీలించి, వ్యాఖ్యానించగల విమర్శకుల కొదువ వల్ల.
గురజాడ సాహిత్యంపై తులనాత్మక అధ్యయనం జరగవలసిన అవసరం ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఆచార్య సునీతారాణి గారితో ఒక పరిశోధనా వ్యాసం రాయించి ప్రకాశిక లో ప్రచురించాం. ఆచార్య దార్ల గారు ఆవిడని పరిచయం చేయడంవల్ల అది సాధ్యం అయింది. మిగతా ప్రముఖ రచయితల సాహిత్యం మీద కూడా తులనాత్మక పరిశోధనలు జరగాలి.
విద్యార్ధులు రాయడం ఎక్కువ అభ్యాసం చేయాలి. పద సంపదని పెంచుకోవాలి. రోజువారీ సంభాషణాలకి 2000, 3000 వేల పదాలకంటే ఎక్కువ అవసరం లేదు. కానీ, సాహితీ వేత్తగా ఎదగాలంటే అపారమైన పద సంపద ఉంటే కానీ, చదువరులని రంజింపచేయలేరు.
పేరాగ్రాఫ్ల విభజన, విరామ చిహ్నాలు పెట్టడం, పేజీలకు నెంబర్లు వేయడంలాంటివి పెరుమాళ్ అయ్యంగారు గారు మొదలుపెట్టారట. నా పరిశీలన బట్టి ఇప్పుడు మరో పెరుమాళ్ అయ్యంగారి అవసరం ఉంది, శిక్షణ ఇవ్వడం కోసం!
చివరిగా ఒక ప్రతిపాదన చేయాలనుకుంటున్నాను. అస్తిత్వవాద సాహిత్యంలో “పర్యావరణ” అస్తిత్వాన్ని” చేర్చాలి. పర్యావరణ కాలుష్యం కులమత మత, లింగబేధం లేకుండా అందరికీ హాని కలిగిస్తుంది. పర్యావరణ అస్తిత్వం గురించి సాహితీవేత్తలు విస్తృత సమాజం దృష్టికి తీసుకుని వెళ్ళే బాధ్యత తీసుకోవాలి.

(ఇది “తెలుగు భాషా సాహిత్యాల పరిశోధన – పర్యాలోచన” అనే శీర్షిక తో హైదరాబాద్ విశ్వవిద్యాలయం లో జరిగిన సదస్సులో, సమాపన సమావేశంలో ప్రత్యేక అతిథిగా ప్రొఫెసర్ గోపాలకృష్ణ చేసిన ప్రసంగ సారాంశం)

ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ గురించి...


ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ, పుట్టినది పశ్చిమగోదావరి జిల్లాలోని ఇరగవరం అగ్రహారం. పెరిగినది చాలా వరకు తణుకులో, తాడేపల్లిగూడెం కళాశాల నుంచి డిగ్రీ, ఉమ్మడి రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్.సి. దేశ రాజధానిలోని ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఫిల్. పిహెచ్.డి చేసారు. గత 32 సంవత్సరాలుగా అమెరికాలో నివాసం. చాలా సంవత్సరాలు వైద్య విశ్వవిద్యాలయాలలో ఆచార్యులుగా కేన్సర్ వ్యాధికి సంబంధించిన అంశాలపై పరిశోధనలు జరిపారు. ప్రస్తుతం అంతర్జాతీయ ఫార్మస్యూటికల్ కంపెనీలో కేన్సర్ మందులు రూపొందించే శాస్త్రవేత్తగా మాటల మాలలల్లడం ప్రవృత్తి. అడపా దడపా రాసిన కవితలు, కథలు, వ్యాసాలు ఒకచోట కూర్చి "మనస్వినీయం" అన్న పేరుతో ఒక పుస్తకం ప్రచురించారు.


Read More
Next Story